దానియేలు 2:13-16
దానియేలు 2:13-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
జ్ఞానులను చంపమని శాసనం జారీ అయ్యింది, కాబట్టి దానియేలును అతని స్నేహితులను చంపాలని మనుష్యులు వారిని వెదకడానికి వెళ్లారు. రాజుకు ప్రధాన రక్షక భటుడైన అర్యోకు బబులోనులోని జ్ఞానులను చంపడానికి వెళ్లినప్పుడు, దానియేలు జ్ఞానంతో, యుక్తితో అతనితో మాట్లాడాడు. “రాజు దగ్గర నుండి ఇలాంటి కఠినమైన ఆజ్ఞ ఇంత త్వరగా రావడమేంటి?” అని రాజాధికారిని అతడు అడిగాడు. అప్పుడు అర్యోకు దానియేలుకు విషయాన్ని వివరించాడు. వెంటనే దానియేలు రాజు దగ్గరకు వెళ్లి, ఆ కల భావాన్ని వివరించడానికి కొంత సమయం ఇవ్వమని కోరాడు.
దానియేలు 2:13-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
జ్ఞానులను హతమార్చాలని రాజు ఇచ్చిన ఆజ్ఞను అమలు చేయడానికి సైనికులు బయలుదేరారు. ఆ క్రమంలో దానియేలును, అతని స్నేహితులను కూడా చంపాలని వెదుకుతున్నారు. బబులోనులో ఉన్న జ్ఞానులను చంపడానికి బయలుదేరిన సైనిక దళం అధిపతి అర్యోకు దగ్గరికి దానియేలు వెళ్ళాడు. అతనితో జ్ఞానయుక్తంగా మాట్లాడాడు. రాజు ఇలాంటి ఆజ్ఞ ఇంత త్వరగా ఎందుకు జారీ చేశాడని అడిగాడు. అర్యోకు జరిగిన విషయమంతా దానియేలుకు వివరించాడు. దానియేలు రాజుకు వచ్చిన కల భావం తెలియజేయడానికి తనకు కొంత గడువు ఇవ్వమని రాజు దగ్గర అనుమతి తీసుకున్నాడు.
దానియేలు 2:13-16 పవిత్ర బైబిల్ (TERV)
నెబుకద్నెజరు వివేకవంతులందరు చంపబడాలని ఆజ్ఞ ప్రకటించగా రాజు మనుష్యులు దానియేలు మరియు అతని మిత్రుల్ని చంపడానికి వెళ్లారు. అర్యోకు రాజరక్షకభటుల అధిపతి. బబులోనులోని వివేకవంతుల్ని చంపడానికి అతడు బయలు దేరాడు. కాని దానియేలు అతనితో తెలివిగా మాట్లాడాడు. దానియేలు రాజరక్షకభటుల అధిపతియైన అర్యోకుని ఇలా అడిగాడు: “రాజు ఎందుకు ఇంత కఠినమైన శిక్షను విధించాడు?” అప్పుడు అర్యోకు రాజు కలయొక్క వృత్తాంతము నంతటిని దానియేలుకు వివరించాడు. దానియేలు అది విని, సంగతి తెలుసుకొన్నాడు. అతను నెబుకద్నెజరు రాజు వద్దకు వెళ్లి, తనకు మరికొంత సమయం ఇమ్మని, అప్పుడు తను కలను, కలయొక్క అర్థాన్ని చెప్పగలనని అడిగాడు.
దానియేలు 2:13-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇట్టి శాసనము బయలుదేరుటవలన జ్ఞానులు చంపబడవలసియుండగా, వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహసంరక్షకుల యధిపతియగు అర్యోకుదగ్గరకు పోయి, జ్ఞానయుక్తముగా మనవిచేసెను –రాజు నొద్దనుండి ఈ యాజ్ఞ యింత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజుయొక్క అధిపతియైన అర్యోకు నడుగగా అర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పెను. అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్న భావమును తెలియ జెప్పుటకై తనకు సమయము దయచేయుమని రాజును బతిమాలెను.