కొలొస్సయులకు 3:1-19 - Compare All Versions

కొలొస్సయులకు 3:1-19 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు. పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి; ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది. మనకు జీవమై యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతోకూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయుడి. వాటివలన దేవుని ఉగ్రత అవిధేయులమీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి; ఏలయనగా ప్రాచీనస్వభావమును దాని క్రియలతోకూడ మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొని యున్నారు. ఇట్టివారిలో గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు; సున్నతి పొందుటయని సున్నతి పొందక పోవుటయని భేదము లేదు; పరదేశియని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదుగాని, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై యున్నాడు. కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అను గ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలు చుండ నియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు కృపా సహి తముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానముచేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి. మరియు మాట చేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి. భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండుడి; ఇది ప్రభువునుబట్టి యుక్తమైయున్నది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి.

కొలొస్సయులకు 3:1-19 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అయితే దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో కూడ సజీవులుగా లేపాడు కాబట్టి పైన ఉన్న వాటినే వెతుకుతూ ఉండండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. పైన ఉన్న వాటి మీదే మీ మనసు నిలపండి. భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు చనిపోయారు గానీ మీ జీవాన్ని దేవుడు క్రీస్తులో దాచి పెట్టాడు. మీ జీవం అయిన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు కూడా మహిమలో ఆయనతో ప్రత్యక్షమౌతారు. కాబట్టి ఈ లోకంలోని పాపపు వాంఛలను అంటే వ్యభిచారం, అపవిత్రత, లైంగిక విశృంఖలత, దురాశ, ధన వ్యామోహానికి మారుపేరైన విగ్రహారాధనలను చంపివేయండి. వీటి వలనే దేవుని తీవ్ర కోపం అవిధేయుల పైకి వస్తుంది. గతంలో మీరు వారితో కలసి నివసించినప్పుడు ఇవన్నీ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మీరు తీవ్ర కోపం, ఆగ్రహం, దుర్మార్గపు ఉద్దేశాలు, నిందా వాక్కులు, మీ నోటి నుండి అవమానకరమైన మాటలు, బూతులు అన్నీ వదిలి పెట్టాలి. ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు. ఎందుకంటే మీరు మీ పూర్వ నైజాన్ని దాని పనులతో సహా తీసివేశారు. ఇప్పుడు ఒక నూతన వ్యక్తిని ధరించారు. ఆ నూతన వ్యక్తిని మీలో సృష్టించిన వాడి స్వరూపంలోకి పూర్ణ జ్ఞానంతో నూతనమవుతూ ఉన్నారు. ఇలాంటి అవగాహనలో గ్రీకు వాడనీ యూదుడనీ భేదాలు ఉండవు. సున్నతి పొందిన వాడనీ సున్నతి పొందని వాడనీ భేదం లేదు. ఆటవికుడనీ, సితియా జాతివాడనీ, బానిస అనీ, స్వతంత్రుడనీ లేదు. క్రీస్తే సమస్తం, సమస్తంలో ఆయనే ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారూ పరిశుద్ధులూ ప్రియమైన వారుగా, మీరు కనికర హృదయాన్నీ దయనూ దీనత్వాన్నీ సాత్వికతనూ సహనాన్నీ ధరించుకోండి. ఒకరినొకరు సహించుకోండి. ఇతరుల పట్ల కృప కలిగి ఉండండి. ఎవరి మీదైనా ఫిర్యాదు ఉంటే ప్రభువు మిమ్మల్ని క్షమించినట్టే మీరూ క్షమించండి. వీటన్నిటికి పైగా ప్రేమను కలిగి ఉండండి. ప్రేమ ఐక్యతకు పరిపూర్ణ రూపం ఇస్తుంది. క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయాల్లో పరిపాలించనివ్వండి. ఈ శాంతి కోసమే మిమ్మల్ని ఒకే శరీరంగా దేవుడు పిలిచాడు. ఇంకా కృతజ్ఞులై ఉండండి. క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా నివసించనివ్వండి. సంపూర్ణ జ్ఞానంతో ఒకరికొకరు బోధించుకోండి, బుద్ది చెప్పుకోండి. మీ హృదయాల్లో కృతజ్ఞత కలిగి కీర్తనలతోనూ భజనలతోనూ ఆత్మ సంబంధమైన గానాలతోనూ దేవునికి పాటలు పాడండి. మాటతో గానీ చర్యతో గానీ, మీరేది చేసినా ప్రభువైన యేసు పేర చేయండి. తండ్రి అయిన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతలు అర్పిస్తూ చేయండి. భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి. ఇది ప్రభువులో తగిన ప్రవర్తన. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి. వారితో కటువుగా ఉండవద్దు.

కొలొస్సయులకు 3:1-19 TERV (పవిత్ర బైబిల్)

మీరు క్రీస్తుతో కూడా సజీవంగా లేచి వచ్చారు. ఆయన పరలోకంలో దేవుని కుడిచేతి వైపు కూర్చొని ఉన్నాడు. కనుక పరలోకంలో ఉన్నవాటిని ఆశించండి. మీరు మరణించారు. ఇప్పుడు మీ ప్రాణం క్రీస్తుతో సహా దేవునిలో దాగి ఉంది. కనుక భూమ్మీద ఉన్నవాటిని కాకుండా పరలోకంలో ఉన్నవాటిని గురించి ఆలోచించండి. క్రీస్తు మీ నిజమైన ప్రాణం. ఆయన వచ్చినప్పుడు మీరాయనతో సహా దేవుని మహిమలో భాగం పంచుకొంటారు. మీరు మీ భౌతిక వాంఛల్ని చంపుకోవాలి. అంటే, వ్యభిచారము, అపవిత్రత, మోహము, దురాశ, అత్యాశ. ఇవి ఒక విధమైన విగ్రహారాధన కనుక, వీటన్నిటినీ వదులుకోవాలి. వీటివల్ల దేవునికి కోపం వస్తుంది. మీ గత జీవితంలో ఈ గుణాలు మీలో ఉన్నాయి. కాని యిక మీరు ఆగ్రహాన్ని, ద్వేషాన్ని, దుష్టత్వాన్ని వదులుకోవాలి. ఇతరులను దూషించరాదు. బూతులు మాటలాడరాదు. మీరు మీ పాత స్వభావాల్ని, పద్ధతుల్ని వదిలి వేసారు కనుక అసత్యములాడరాదు. మీరు క్రొత్త జీవితం పొందారు. ఆ జీవితానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు మిమ్మల్ని తన ప్రతిరూపంలో మలుస్తూ, తనను గురించిన జ్ఞానాన్ని మీలో అభివృద్ధి పరుస్తున్నాడు. ఇక్కడ గ్రీసు దేశస్థునికి, యూదునికి భేదం లేదు. సున్నతి పొందినవానికి, పొందనివానికి భేదంలేదు. విదేశీయునికి, సిథియనుడికి భేదం లేదు. బానిసకు, బానిసకానివానికి భేదం లేదు. క్రీస్తే సర్వము. అన్నిటిలోనూ ఆయనే ఉన్నాడు. మీరు దేవుడు ఎన్నుకొన్న వాళ్ళు. ఆయన ప్రేమిస్తున్న పవిత్రులు. అందువల్ల మీరు సానుభూతి, దయ, వినయము, సాత్వికము, సహనము అలవర్చుకోవాలి. మీలో ఎవడైనా మీకు అన్యాయం చేసినవాడనిపిస్తే కోపగించుకోకుండా అతణ్ణి క్షమించండి. ప్రభువు మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా యితరులను క్షమించండి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రేమను అలవర్చుకోండి. అది సంపూర్ణమైన బంధాన్ని, పరిపూర్ణమైన ఐక్యతను కలుగ చేస్తుంది. క్రీస్తు కలుగచేసిన శాంతిని మీ హృదయాలను పాలించనివ్వండి. మీరు ఒకే శరీరంలో ఉండాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీలో శాంతి కలుగచేయాలని ఆయన ఉద్దేశ్యం. కృతజ్ఞతతో ఉండండి. క్రీస్తు సందేశాన్ని మీలో సంపూర్ణంగా జీవించనివ్వండి. మీ తెలివినంతా ఉపయోగించి పరస్పరం సహాయం చేసుకోండి. దైవసందేశాన్ని బోధించుకోండి. దేవునికి మీ హృదయాల్లో కృతజ్ఞతలు తెలుపుకొంటూ స్తుతిగీతాలు, కీర్తనలు పాడుకోండి. వాక్యాలు చదవండి. మాటద్వారా కాని, క్రియా రూపంగా కాని మీరేది చేసినా యేసు ప్రభువు పేరిట చెయ్యండి. ఆయన ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతతో ఉండండి. స్త్రీలు తమ భర్తలకు విధేయులై ఉండాలి. ఇది ప్రభువును బట్టి విశ్వాసులు చేయవలసిన విధి. పురుషులు తమ భార్యలను ప్రేమించాలి. వాళ్ళతో కఠినంగా ప్రవర్తించరాదు.

కొలొస్సయులకు 3:1-19 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు కాబట్టి, పైనున్న వాటిపై మీ హృదయాలను ఉంచండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి వైపున కూర్చుని ఉన్నారు. భూసంబంధమైన వాటి మీద కాకుండా, పైనున్న వాటి మీదనే మీ మనస్సులను ఉంచండి. ఎందుకంటే, మీరు చనిపోయారు, కాబట్టి మీ జీవం క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడి ఉంది. మీ జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, మీరు కూడా ఆయనతో పాటు మహిమలో ప్రత్యక్షమవుతారు. కాబట్టి మీ భూసంబంధమైన స్వభావానికి సంబంధించిన వాటిని అనగా: లైంగిక దుర్నీతిని, అపవిత్రతను, కామవాంఛలను, దుష్ట కోరికలను, విగ్రహారాధనయైన దురాశలను చంపివేయండి. వీటి కారణంగానే దేవుని ఉగ్రత వస్తుంది. ఒకప్పుడు మీరు వీటి ప్రకారం నడుచుకొని జీవించారు. కానీ ఇప్పుడైతే, మీరు కోపం, ఆగ్రహం, అసూయ, దూషణ, మీ నోటితో బూతులు మాట్లాడడం వంటి వాటిని కూడా విడిచిపెట్టండి. మీరు మీ పాత స్వభావాన్ని దాని అలవాట్లతో సహా విడిచిపెట్టారు, కాబట్టి ఒకనితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు, సృష్టికర్త స్వారూప్యంలోని జ్ఞానంలో నూతనపరచబడుతున్న క్రొత్త స్వభావాన్ని మీరు ధరించుకున్నారు. ఇక్కడ యూదులు అని యూదేతరులు అని, సున్నతి పొందిన వారని సున్నతి పొందని వారని, అనాగరికులని నాగరికులని, బానిసలని స్వతంత్రులని భేదం లేదు, క్రీస్తే సర్వం, అందరిలో ఆయనే ఉన్నాడు. కాబట్టి, పరిశుద్ధులును ప్రియమైన వారునైన దేవుని చేత ఏర్పరచబడిన ప్రజల్లా మీరు జాలిగల మనస్సు, దయ, వినయం, శాంతం, సహనం అనే వాటిని ధరించుకోండి. ఎవరికైనా ఎవరిపట్లనైనా బాధ ఉంటే, ఒకరిని ఒకరు సహించుకుంటూ ఒకరిని ఒకరు క్షమించుకోండి. ప్రభువు మిమ్మల్ని క్షమించినట్లే మీరు కూడా క్షమించండి. వీటన్నిటికి పైగా, పరిపూర్ణ ఐక్యతలో బంధించే ప్రేమను ధరించుకోండి. ఒకే శరీరంలోని అవయవాల వలె, సమాధానం కోసం మీరు పిలువబడ్డారు, కాబట్టి క్రీస్తు యొక్క సమాధానం మీ హృదయాలను పరిపాలించనివ్వండి. అలాగే కృతజ్ఞత కలిగి ఉండండి. సంగీతంతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పాటలతో సమస్త జ్ఞానంతో ఒకరికి ఒకరు బోధించుకుంటూ, హెచ్చరించుకుంటూ మీ హృదయాల్లో కృతజ్ఞతతో దేవుని గురించి పాటలు పాడుతూ, క్రీస్తు సువార్తను మీ మధ్యలో సమృద్ధిగా నివసింపనివ్వండి. మీరు మాటల్లో కాని పనులలో కాని, ఏమి చేసినా ప్రభువైన యేసు నామంలో చేయండి, తండ్రియైన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి. భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి, అది ప్రభువులో తగినది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి వారితో కఠినంగా ప్రవర్తించకండి.