కొలొస్సయులకు 2:1-23

కొలొస్సయులకు 2:1-23 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

మీ కోసం లవొదికయలో ఉన్న వారి కోసం, వ్యక్తిగతంగా నన్ను కలుసుకొనని వారందరి కోసం నేను ఎంతగా కష్టపడుతున్నానో మీరు తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. వారు క్రీస్తు అనే దేవుని మర్మాన్ని స్పష్టంగా తెలుసుకొని, సంపూర్ణ గ్రహింపు అనే గొప్ప సంపదను కలిగి ఉండి, హృదయాల్లో ధైర్యపరచబడి ప్రేమలో ఐక్యత కలిగి ఉండాలనేదే నా లక్ష్యము. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనలోనే దాచబడి ఉన్నాయి. ఇంపైన మాటలతో ఎవరూ మిమ్మల్ని మోసపరచకూడదని దీనిని మీకు చెప్తున్నాను. నేను శరీర విషయంలో మీకు దూరంగా ఉన్నా కాని, ఆత్మలో మీతో కూడా ఉండి, మీరు ఎంత క్రమశిక్షణగా ఉన్నారో క్రీస్తులో మీ విశ్వాసం ఎంత స్థిరంగా ఉందో చూసి ఆనందిస్తున్నాను. కాబట్టి, మీరు క్రీస్తు యేసును ప్రభువుగా అంగీకరించినట్టుగా, ఆయనలో వేరుపారి బలపడుతూ, మీకు బోధించబడిన ప్రకారం విశ్వాసంలో స్థిరపడుతూ, మరి ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ, ఆయనలో మీరు జీవించడం కొనసాగించండి. క్రీస్తుపై కాకుండా, మానవ ఆచార సాంప్రదాయాలు ఈ లోకసంబంధమైన మూల నియమాలపై ఆధారపడిన మోసకరమైన వ్యర్థ తత్వజ్ఞానంతో ఎవరూ మిమ్మల్ని బంధించకుండా జాగ్రత్తపడండి. ఎందుకంటే, పరిపూర్ణ దైవత్వం శరీర రూపంలో క్రీస్తులో జీవిస్తుంది. మీరు క్రీస్తులో పరిపూర్ణతలోనికి తీసుకురాబడ్డారు. సమస్త బలానికి అధికారానికి ఆయనే శిరస్సు. మానవ చేతులతో చేయబడని సున్నతిని క్రీస్తులో మీరు పొందారు. క్రీస్తు చేత మీరు సున్నతి చేయబడినప్పుడు, మిమ్మల్ని పరిపాలిస్తున్న మీ శరీర పాప స్వభావం కొట్టివేయబడింది. ఏ విధంగా అంటే, బాప్తిస్మంలో మీరు ఆయనతో పాటు పాతిపెట్టబడి, ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని క్రియలను మీరు విశ్వసించుట ద్వారా ఆయనతో పాటు మీరు కూడా మృతులలో నుండి లేచారు. మీ పాపాలను బట్టి మీ శరీరం సున్నతి పొందని కారణంగా మీరు చచ్చినవారిగా ఉండగా దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో పాటు బ్రతికించారు. ఆయన మన పాపాలన్నిటిని క్షమించారు, మనకు వ్యతిరేకంగా ఉండి, మనల్ని శిక్షకు గురి చేసే రుణపత్రాన్ని రద్దుచేశారు; ఆయన దానిని తీసివేసి, దానిని సిలువకు మేకులతో కొట్టారు. ఆయన సిలువ ద్వారా ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, వారు బహిరంగంగా సిగ్గుపడునట్లు చేసి, సిలువ చేత వారిపై విజయాన్ని ప్రకటించారు. కాబట్టి, మీరు తిని త్రాగే వాటి గురించి గాని, మతపరమైన పండుగల గురించి అనగా అమావాస్య, సబ్బాతు దిన ఆచారాల గురించి గాని మిమ్మల్ని ఎవరు తీర్పు తీర్చనివ్వకండి. ఇవి రాబోవు వాటి ఛాయారూపమే, కానీ నిజమైన స్వరూపం క్రీస్తులోనే ఉన్నది. ఎవరైనా కపట వినయం ప్రదర్శిస్తూ, దేవదూతల పట్ల భక్తి కనుపరుస్తూ మిమ్మల్ని అనర్హులుగా చేయకుండా చూసుకోండి. అలాంటివారు తాము చూసినవాటిని గురించి గొప్పగా వివరిస్తూ ఉంటారు; తమ బుద్ధిహీనమైన మనస్సు వలన వ్యర్థమైన ఆలోచనలతో అతిశయపడతారు. వారు శిరస్సు నుండి సంబంధాన్ని పోగొట్టుకుంటారు; అయితే ఆ శిరస్సు వలన మొత్తం శరీరం కీళ్ళతో నరములతో ఒకటిగా అతుకబడి, దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతుంది. మీరు క్రీస్తుతో పాటు లోకం యొక్క మూల నియమాల విషయమై చనిపోయినవారైతే, లోకానికి చెందినవారిగా, “చేతితో పట్టుకోవద్దు! రుచి చూడవద్దు! ముట్టుకోవద్దు!” అనే వాటికి మీరు ఎందుకు లోబడుతున్నారు? ఉపయోగించి నశించడానికి నియమించబడిన ఈ నియమాలు కేవలం మానవ ఆజ్ఞలు, బోధలపై ఆధారపడినవి. అలాంటి నియమాలు, వారి స్వయంకృత ఆరాధన విషయంలో, అతి వినయం విషయంలో, శరీరాన్ని హింసించుకోవడం జ్ఞానంగా అనిపించవచ్చు, కాని శారీరక ఆశలను చంపుకోవడంలో అలాంటి నియమాలకు ఎలాంటి విలువలేదు.

కొలొస్సయులకు 2:1-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఎందుకంటే మీ కోసమూ, లవొదికయ పట్టణంలోని వారి కోసమూ, నన్ను చూడని వారందరి కోసమూ నేను ఎంత తీవ్ర పోరాటం చేస్తున్నానో మీరు తెలుసుకోవాలి. వారందరూ తమ హృదయాల్లో ప్రోత్సాహం పొందాలనీ ప్రేమలో ఐక్యం కావాలనీ నా అభిలాష. అప్పుడు వారికి కలిగే వాస్తవమైన అవగాహన వల్ల తమ హృదయాల్లో సంపూర్ణ నిశ్చయత కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును అర్థం చేసుకోగలగాలి. జ్ఞానం, తెలివితేటల నిధులన్నీ క్రీస్తులో దాగి ఉన్నాయి. ఎవరైనా మీతో ఇంపుగా మాట్లాడి మిమ్మల్ని మోసం చేయకుండా ఉండాలని మీకు ఈ సంగతి చెబుతున్నాను. నేను భౌతికంగా మీకు దూరంగా ఉన్నా ఆత్మలో మీతోనే ఉన్నాను. మంచి క్రమంలో సాగే మీ ప్రవర్తననూ, క్రీస్తుపై మీకున్న బలమైన విశ్వాసాన్నీ చూసి సంతోషిస్తున్నాను. మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగానే ఆయనలో నడుస్తూ ఉండండి. ఆయనలో స్థిరంగా నాటుకుని ఉండండి. ఆయన పైనే మీ జీవితాలు కట్టుకోండి. మీకు బోధించిన రీతిగానే విశ్వాసంలో వేరు పారి ఉండండి. కృతజ్ఞతలు చెల్లించడంలో పొంగిపొరలుతూ ఉండండి. క్రీస్తుపై కాకుండా మానవ సంప్రదాయాలపైనా, ప్రాపంచిక మూల సూత్రాలపైనా ఆధారపడ్డ తత్వజ్ఞానాన్నీ, కేవలం మోసపూరితమైన వట్టి వాదాలనూ ప్రయోగించి ఎవరూ మిమ్మల్ని వశం చేసుకోకుండా చూసుకోండి. ఎందుకంటే దైవత్వపు సర్వ సంపూర్ణత ఆయన శరీరంలో నివసిస్తూ ఉంది. ప్రతి ప్రభుత్వానికీ ఆధిపత్యానికీ పై శిరస్సుగా ఉన్న ఆయనలో మీరు సంపూర్ణులు. మనుషుల చేతులతో చేసినట్టు కాకుండా దేవుడు ఆయనలో మీకు సున్నతి చేశాడు. స్వభావరీత్యా శరీరంలో ఉన్న పాపపు నైజాన్ని తీసివేయడమే క్రీస్తులో మీరు పొందిన సున్నతి. బాప్తిసంలో మీరు ఆయనతో కూడా సమాధి అయ్యారు. అయితే చనిపోయిన వారిలో నుండి ఆయనను సజీవంగా లేపిన దేవుని శక్తిపై మీకున్న విశ్వాసం వల్ల మీరు కూడా సజీవంగా లేచారు. ఒకప్పుడు మీరు చేసిన అపరాధాలవల్లా శరీరంలో మీకు సున్నతి జరగక పోవడంవల్లా మీరు చనిపోయిన వారుగా ఉండేవారు. అప్పుడు ఆయన తనతోబాటు మిమ్మల్ని బతికించాడు. మన అపరాధాలన్నిటినీ క్షమించాడు. మనకు వ్యతిరేకంగా రాసి ఉన్న రుణపత్రాన్నీ, దానికి సంబంధించిన నియమ నిబంధనలనూ ఆయన తుడిచివేశాడు. ఆయన వాటన్నిటినీ తీసివేసి సిలువకు మేకులతో కొట్టాడు. ఆయన సిలువపై ప్రభుత్వాలనూ, ఆధిపత్యాలనూ ఓడించి, వారిని నిరాయుధులుగా చేసి తన విజయోత్సవ ఊరేగింపులో బహిరంగంగా ప్రదర్శించాడు. కాబట్టి తినే విషయంలోనూ తాగే విషయంలోనూ, పండగ రోజులూ, అమావాస్య, విశ్రాంతి దినం వంటి విషయాల్లోనూ ఎవరూ మిమ్మల్ని విమర్శించకుండా చూసుకోండి. ఇవన్నీ జరగబోతున్న వాటికి నీడల్లాంటివి. వాటి నిజస్వరూపం క్రీస్తులో ఉంది. ఎవరైనా కపట వినయం ప్రదర్శిస్తూ, దేవదూతల పట్ల భక్తి కనపరుస్తూ మీరు మీ బహుమానం పోగొట్టుకొనేలా చేయకుండా జాగ్రత్త పడండి. అలాటివాడు తాను చూసిన విషయాలను అతిశయోక్తిగా చెప్పుకుంటాడు. వాడు తన శరీర సంబంధమైన ఆలోచన వల్ల కారణం లేకుండానే వాటి విషయంలో గర్విష్టి అవుతాడు. అలాంటి వాడు శిరస్సుగా ఉన్న క్రీస్తు యేసును అంటి పెట్టుకుని ఉండడు. ఆ శిరస్సు వల్లనే శరీరానికి పోషణ జరుగుతుంది. ఆ శిరస్సు వల్లనే కీళ్లతో, నరాలతో శరీరం ఒక్కటిగా ఉంటుంది. దేవుడు ప్రసాదించే ఎదుగుదలతో శరీరం అభివృద్ధి చెందుతుంది. ప్రాపంచిక మూల సూత్రాల విషయంలో మీరు క్రీస్తుతో కూడా మరణించారు కాబట్టి వాటి కిందనే ఇంకా బ్రతుకుతున్నట్టుగా ఆ నియమాలకు మీరెందుకు లోబడి ఉండాలి? “అది పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ఇది ముట్టుకోవద్దు” లాంటి మనుషుల ఆజ్ఞలను ఎందుకు లెక్క చేయాలి? ఈ ఆజ్ఞలూ, ఉపదేశాలూ అన్నీ, ఉపయోగించడం చేత నాశనమైపోయే విషయాల కోసం వ్యక్తులు చేసేవే. వీటిలో మానవ నిర్మితమైన మత విధానాల జ్ఞానమూ కపట వినయమూ శరీరాన్ని కఠినంగా అదుపులో పెట్టుకోవడం వంటివి ఉన్నాయి. కానీ శరీర కోరికలను నియంత్రించుకునే విషయంలో అవి ఎందుకూ కొరగానివి.

కొలొస్సయులకు 2:1-23 పవిత్ర బైబిల్ (TERV)

మీకోసం, లవొదికయలో ఉన్నవాళ్ళకోసం, నన్ను ఇంతవరకూ కలుసుకోకుండా ఉన్నవాళ్ళకోసం నేను ఎంత శ్రమిస్తున్నానో మీరు గ్రహించాలని నా కోరిక. మీ హృదయాలు ధైర్యంతో నిండిపోవాలనీ, ప్రేమతో మీరు ఐక్యము కావాలనీ నా అభిలాష. అప్పుడు మీరు సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతారు. అదే ఒక సంపద. ఈ విధంగా మీరు దేవుణ్ణి గురించి, అంటే క్రీస్తును గురించి రహస్య జ్ఞానం పొందుతారు. క్రీస్తులో వివేకము, జ్ఞానము అనే సంపదలు దాగి ఉన్నాయి. తియ్యటి మాటలతో మిమ్మల్నెవ్వరూ మోసం చెయ్యకుండా ఉండాలని మీకీ విషయాలు చెబుతున్నాను. నేను శరీరంతో అక్కడ మీ దగ్గర లేకపోయినా నా ఆత్మ మీ దగ్గరే ఉంది. మీ క్రమశిక్షణను, క్రీస్తు పట్ల మీకున్న సంపూర్ణ విశ్వాసాన్ని చూసి నా ఆత్మ ఆనందిస్తోంది. మీరు యేసు క్రీస్తును ప్రభువుగా స్వీకరించినట్లే ఆయనలో ఐక్యమై జీవించండి. మీ వేర్లు ఆయనలో నాటి, ఆయనలో అభివృద్ధి చెందుతూ జీవించండి. మీకు ఉపదేశించిన విధంగా సంపూర్ణమైన విశ్వాసంతో ఉండండి. మీ కృతజ్ఞత పొంగిపోవాలి. మోసంతో, పనికిరాని తత్వజ్ఞానంతో మిమ్మల్ని ఎవ్వరూ బంధించకుండా జాగ్రత్త పడండి. వాళ్ళ తత్వజ్ఞానానికి మూలం క్రీస్తు కాదు. దానికి మానవుని సాంప్రదాయాలు, అతని నైజంవల్ల కలిగిన నియమాలు కారణం. ఎందుకంటే, దేవుని ప్రకృతి క్రీస్తులో సంపూర్ణంగా మానవ రూపంతో జీవిస్తోంది. మీరు ఆయనలో ఐక్యత పొందారు. కనుక మీకు ఆ సంపూర్ణత లభించింది. క్రీస్తు అన్ని శక్తులకూ, అన్ని అధికారాలకూ అధిపతి. ఆయనతో మీకు కలిగిన ఐక్యతవల్ల మీరు సున్నతి పొందారు. ఈ సున్నతి మానవులు చేసింది కాదు. ఇది క్రీస్తు స్వయంగా చేసిన సున్నతి. పాపాలతో కూడుకొన్న ఈ దేహం నుండి విముక్తి పొందటమే ఈ సున్నతి. మీరు బాప్తిస్మము పొందటంవల్ల క్రీస్తులో సమాధి పొందారు. క్రీస్తును బ్రతికించిన దేవుని శక్తి పట్ల మీకున్న విశ్వాసం వలన మిమ్మల్ని కూడా దేవుడు ఆయనతో సహా బ్రతికించాడు. అంటే బాప్తిస్మము వల్ల యిది కూడా సంభవించింది. మీరు చేసిన పాపాలవల్ల, పాపాలతో కూడుకొన్న ఈ దేహం నుండి స్వేచ్ఛ పొందకుండా మీరు గతంలో ఆత్మీయంగా మరణించారు. కాని దేవుడు మీ పాపాలన్నిటినీ క్షమించి, క్రీస్తుతో సహా మిమ్మల్ని బ్రతికించాడు. ఆ పద్ధతులను గురించి, నియమాలను గురించి మనం వ్రాత మూలంగా అంగీకరించిన పత్రాన్ని, అది మనకు వ్యతిరేకంగా ఉంది కనుక, ఆయన దానిని తీసుకెళ్ళి మేకులతో సిలువకు కొట్టాడు. అధికారాలను, శక్తుల్ని పనికి రాకుండా చేసి వాటిని బహిరంగంగా హేళన చేసి, సిలువతో వాటిపై విజయం సాధించాడు. అందువల్ల అన్నపానాల విషయంలో గాని, మత సంబంధమైన పండుగ విషయాల్లో గాని, అమావాస్య పండుగ విషయంలో గాని, యూదుల విశ్రాంతి రోజు విషయంలో కాని యితరులు మీపై తీర్పు చెప్పకుండా జాగ్రత్తపడండి. ఇవి నీడలా రానున్న వాటిని సూచిస్తున్నాయి. కాని సత్యం క్రీస్తులో ఉంది. కొందరు తాము దివ్యదర్శనం చూసామని, కనుక తాము గొప్ప అని చెప్పుకొంటారు. అతి వినయం చూపుతూ దేవదూతల్ని పూజిస్తుంటారు. వాళ్ళు మిమ్మల్ని అయోగ్యులుగా పరిగణించకుండా జాగ్రత్తపడండి. వాళ్ళు ప్రాపంచిక దృష్టితో ఆలోచిస్తారు. కనుక, నిష్కారణంగా గర్విస్తూ ఉంటారు. శిరస్సు కారణంగా కీళ్ళు, నరాలు దేహాన్ని ఒకటిగా ఉంచి ఆ దేహానికి శక్తిని కలిగిస్తున్నాయి. శిరస్సు కారణంగా దేవుని ఆదేశానుసారం ఆ దేహం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాంటి శిరస్సుతో వాళ్ళు సంబంధం తెంచుకొన్నారు. మీరు క్రీస్తుతో మరణించినప్పుడే ఈ ప్రపంచం యొక్క ప్రాథమిక నియమాల నుండి స్వేచ్ఛను పొందారు. మరి అలాంటప్పుడు ఈ ప్రపంచానికి చెందినవాళ్ళైనట్లు, ఆ ప్రాథమిక నియమాలను ఎందుకు పాటిస్తున్నారు? “ఇది వాడకు, దాన్ని రుచి చూడకు, ఇది ముట్టుకోకు.” ఈ నియమాలు మానవుల ఆజ్ఞలతో, బోధలతో సృష్టింపబడినవి కనుక అవి వాడుక వల్ల నశించిపోయే వస్తువుల్లాంటివి. ఇలాంటి నియమాలు పైకి తెలివైనవిగా కనిపిస్తాయి. అవి దొంగపూజలకు, దొంగవినయం చూపటానికి, దేహాన్ని అనవసరంగా, కఠినంగా శిక్షించటానికి ఉపయోగపడవచ్చు. కాని శారీరక వాంఛల్ని అదుపులో పెట్టుకోవటానికి పనికి రావు.

కొలొస్సయులకు 2:1-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మీ కొరకును, లవొదికయ వారి కొరకును, శరీర రీతిగా నా ముఖము చూడనివారందరికొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొనగోరు చున్నాను. వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి. ఎవడైనను చక్కని మాటలచేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీరవిషయములో దూరముగా ఉన్నను ఆత్మవిషయములో మీతోకూడ ఉండి, మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిరవిశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది; మరియు ఆయనయందు మీరును సంపూర్ణులై యున్నారు; ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై యున్నాడు; మీరును, క్రీస్తు సున్నతియందు, శరీరేచ్ఛలతోకూడిన స్వభావమును విసర్జించి ఆయనయందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతోకూడ పాతిపెట్టబడినవారై ఆయనను మృతులలోనుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతోకూడ లేచితిరి. మరియు అపరాధముల వలనను, శరీరమందు సున్నతిపొందక యుండుటవలనను, మీరు మృతులై యుండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి, ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను; ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పెట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి. ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది అతి వినయాసక్తుడై దేవదూతా రాధనయందు ఇచ్ఛకలిగి, తాను చూచినవాటినిగూర్చి గొప్పగా చెప్పుకొనుచు, తన శరీరసంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనియ్యకుడి; ఆ శిరస్సుమూలముగా సర్వశరీరము కీళ్లచేతను నరములచేతను పోషింపబడి అతుకబడినదై, దేవునివలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. మీరు క్రీస్తుతోకూడ లోకముయొక్క మూలపాఠముల విషయమై మృతిపొందినవారైతే లోకములో బ్రదుకు చున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి–చేతపట్టుకొనవద్దు, రుచిచూడవద్దు, ముట్టవద్దు అను విధు లకు మీరు లోబడనేల? అవన్నియు వాడుకొనుటచేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవని యెంచబడుచున్నవేగాని, శరీరేచ్ఛానిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు.