కొలొస్సయులకు 1:15-18
కొలొస్సయులకు 1:15-18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కుమారుడు అదృశ్య దేవుని స్వరూపం, సృష్టంతటి కంటే మొదట జన్మించిన వాడు. ఎందుకనగా, ఆయనలోనే సమస్తం సృష్టించబడ్డాయి, అనగా: ఆకాశంలో ఉన్నవి, భూమిపై ఉన్నవి, కంటికి కనబడేవి కనబడనివి, సింహాసనాలైనా లేదా ప్రభుత్వాలైనా లేదా పాలకులైనా లేదా అధికారులైనా, సమస్తం ఆయన ద్వారానే ఆయన కొరకే సృష్టించబడ్డాయి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, సమస్తానికి ఆయనే ఆధారము. సంఘమనే శరీరానికి ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో సర్వాధికారం కలిగి ఉండడానికి ఆయనే ఆరంభం, మృతులలో నుండి లేచుటలో ప్రథముడయ్యారు.
కొలొస్సయులకు 1:15-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కుమారుడు అదృశ్య దేవుని స్వరూపం. సర్వసృష్టికీ ఆయన ప్రముఖుడు. ఎందుకంటే కంటికి కనిపించేదైనా కనిపించనిదైనా ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్న అన్నిటి సృష్టీ ఆయన ద్వారానే జరిగింది. సింహాసనాలైనా, ఆధిపత్యాలైనా, ప్రభుత్వాలైనా, అధికారులైనా, సర్వమూ ఆయన ద్వారా కలిగాయి, ఆయన కోసమే కలిగాయి. ఆయన అన్నిటికీ పూర్వం ఉన్నవాడు. ఆయనలోనే అన్నీ ఒకదానితో మరొకటి కలిసి స్థిరంగా ఉంటాయి. సంఘం అనే శరీరానికి ఆయనే తల. సర్వాధికారానికీ మూలకేంద్రం ఆయనే. అన్నిటిలో ఆయనకు ప్రథమ స్థానం కలిగేటందుకు చనిపోయిన వారిలో నుండి సజీవుడిగా లేవడంలో ఆయన ప్రథముడు.
కొలొస్సయులకు 1:15-18 పవిత్ర బైబిల్ (TERV)
క్రీస్తు కనిపించని దేవుని ప్రతిబింబం. ఆయన అన్నిటికన్నా పూర్వంనుండి అనగా జగత్తుకు పునాది వేయుటకు ముందునుండి ఉన్నవాడు. క్రీస్తు అన్నిటినీ సృష్టించాడు. పరలోకంలో ఉన్న వాటిని, భూమ్మీద కనిపించే వాటిని, కనిపించని వాటిని, సింహాసనాలను, ప్రభుత్వాలను, పాలకులను, అధికారులను, అన్నిటినీ ఆయనే సృష్టించాడు. అన్నీ తన కోసం సృష్టించుకొన్నాడు. క్రీస్తు ఆదినుండి ఉన్నాడు. ఆయనలో అన్నీ ఐక్యమై ఉన్నాయి. సంఘం ఆయన శరీరం. ఆయన సంఘానికి శిరస్సు. ఆయనే అన్నిటికీ మూలం. చనిపోయి తిరిగి బ్రతికినవాళ్ళలో ఆయన మొదటివాడు. అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత ఉండాలని దేవుడు యిలా చేసాడు.
కొలొస్సయులకు 1:15-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను.