ఆమోసు 3:4-8
ఆమోసు 3:4-8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆహారం దొరకక పోతే, సింహం అడవిలో గర్జిస్తుందా? దేనినీ పట్టుకోకుండానే అది దాని గుహలో గుర్రుమంటుందా? నేల మీద ఎరపెట్టనిదే, పక్షి ఉరిలో చిక్కుకుంటుందా? ఉరిలో ఏదీ చిక్కకపోతే, ఆ ఉరి నేల నుండి పైకి లేస్తుందా? పట్టణంలో బూరధ్వని వినబడితే, ప్రజలు వణకరా? పట్టణంలో విపత్తు వచ్చినప్పుడు అది యెహోవా పంపింది కాదా? తన సేవకులైన ప్రవక్తలకు తన ప్రణాళికను తెలియజేయకుండా ప్రభువైన యెహోవా ఏదీ చేయరు. సింహం గర్జించింది, భయపడని వారెవరు? ప్రభువైన యెహోవా చెప్పారు దానిని ప్రవచించకుండ ఉన్నవారెవరు?
ఆమోసు 3:4-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేన్నీ పట్టుకోకుండానే కొదమ సింహం గుహలోనుంచి గుర్రుమంటుందా? నేల మీద ఎర పెట్టకపోతే పిట్ట ఉరిలో చిక్కుకుంటుందా? ఉరిలో ఏదీ చిక్కకపోతే ఉరి పెట్టేవాడు వదిలేసి వెళతాడా? పట్టణంలో బాకానాదం వినబడితే ప్రజలు భయపడరా? యెహోవా పంపకుండా పట్టణంలో విపత్తు వస్తుందా? తన సేవకులైన ప్రవక్తలకు తన ఆలోచనలను తెలియచేయకుండా కచ్చితంగా యెహోవా ప్రభువు ఏదీ చేయడు. సింహం గర్జించింది. భయపడని వాడెవడు? యెహోవా ప్రభువు చెప్పాడు. ప్రవచించని వాడెవడు?
ఆమోసు 3:4-8 పవిత్ర బైబిల్ (TERV)
అడవిలో ఉన్న సింహం ఒక జంతువును పట్టుకున్న తరువాతనే గర్జిస్తుంది. తన గుహలో వున్న ఒక యువ కిశోరం గర్జిస్తూ ఉందంటే, అది ఏదో ఒక దానిని పట్టుకున్నదని అర్థం. బోనులో ఆహారం లేకపోతే ఒక పక్షి ఆ బోనులోకి ఎగిరిరాదు. బోను మూసుకుపోతే, అది అందులో చిక్కుతుంది. హెచ్చరిక చేసే బూరనాదం వినబడితే ప్రజలు భయంతో వణుకుతారు. ఒక నగరానికి ఏదైనా ముప్పు వాటిల్లిందంటే, దానిని యెహోవాయే కలుగ జేసినట్లు. నా ప్రభువైన యెహోవా ఏదైనా చేయటానికి నిర్ణయించవచ్చు. కాని ఆయన ఏదైనా చేసేముందు ఆయన తన పథకాలను తన, సేవకులైన ప్రవక్తలకు తెలియజేస్తాడు. ఒక సింహం గర్జిస్తే ప్రజలు భయపడతారు. యెహోవా మాట్లాడితే, ప్రవక్తలు దానిని ప్రవచిస్తారు.
ఆమోసు 3:3-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సమ్మతింపకుండ ఇద్దరు కూడి నడుతురా? ఎర దొరకక సింహము అడవిలో గర్జించునా? ఏమియు పట్టుకొనకుండనే కొదమసింహము గుహలోనుండి బొబ్బ పెట్టునా? భూమిమీద ఒకడును ఎరపెట్టకుండ పక్షి ఉరిలో చిక్కుపడునా? ఏమియు పట్టుబడకుండ ఉరి పెట్టువాడు వదలిలేచునా? పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా? యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా? తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలు పరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు. సింహము గర్జించెను, భయపడనివాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు, ప్రవచింపకుండువాడెవడు?