ఆమోసు 3:1-10

ఆమోసు 3:1-10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఇశ్రాయేలీయులారా! యెహోవా ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన కుటుంబమంతటి గురించి నేను పలికిన ఈ మాట వినండి: “భూలోకంలోని కుటుంబాలన్నిటి నుండి మిమ్మల్ని మాత్రమే ఎన్నుకున్నాను. కాబట్టి మీరు చేసిన పాపాలన్నిటిని బట్టి నేను మిమ్మల్ని శిక్షిస్తాను.” పరస్పర సమ్మతి లేకుండా ఇద్దరూ కలిసి నడుస్తారా? ఆహారం దొరకక పోతే, సింహం అడవిలో గర్జిస్తుందా? దేనినీ పట్టుకోకుండానే అది దాని గుహలో గుర్రుమంటుందా? నేల మీద ఎరపెట్టనిదే, పక్షి ఉరిలో చిక్కుకుంటుందా? ఉరిలో ఏదీ చిక్కకపోతే, ఆ ఉరి నేల నుండి పైకి లేస్తుందా? పట్టణంలో బూరధ్వని వినబడితే, ప్రజలు వణకరా? పట్టణంలో విపత్తు వచ్చినప్పుడు అది యెహోవా పంపింది కాదా? తన సేవకులైన ప్రవక్తలకు తన ప్రణాళికను తెలియజేయకుండా ప్రభువైన యెహోవా ఏదీ చేయరు. సింహం గర్జించింది, భయపడని వారెవరు? ప్రభువైన యెహోవా చెప్పారు దానిని ప్రవచించకుండ ఉన్నవారెవరు? అష్డోదు కోటలకు ఇలా చాటించండి, ఈజిప్టు కోటలకు ఇలా చాటించండి: “సమరయ పర్వతాలమీద కూడుకోండి; దానిలో జరుగుతున్న గొప్ప అల్లరిని, దాని ప్రజలమధ్య ఉన్న దౌర్జన్యాన్ని చూడండి.” “సరియైనది ఎలా చేయాలో వారికి తెలియదు,” అని యెహోవా చెప్తున్నారు, “వారు తమ కోటలలో తాము కొల్లగొట్టిన దోపుడుసొమ్మును దాచుకుంటారు.”

షేర్ చేయి
చదువండి ఆమోసు 3

ఆమోసు 3:1-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఇశ్రాయేలీయులారా! యెహోవా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఐగుప్తుదేశం నుంచి ఆయన రప్పించిన వంశమంతటి గురించి ఆయన తెలియజేసిన మాట వినండి. లోకంలోని వంశాలన్నిటిలో మిమ్మల్ని మాత్రమే నేను ఎన్నుకున్నాను. కాబట్టి మీ పాపాలన్నిటికీ మిమ్మల్ని శిక్షిస్తాను. సమ్మతించకుండా ఇద్దరు కలిసి నడుస్తారా? ఏమీ దొరకకుండానే సింహం అడవిలో గర్జిస్తుందా? దేన్నీ పట్టుకోకుండానే కొదమ సింహం గుహలోనుంచి గుర్రుమంటుందా? నేల మీద ఎర పెట్టకపోతే పిట్ట ఉరిలో చిక్కుకుంటుందా? ఉరిలో ఏదీ చిక్కకపోతే ఉరి పెట్టేవాడు వదిలేసి వెళతాడా? పట్టణంలో బాకానాదం వినబడితే ప్రజలు భయపడరా? యెహోవా పంపకుండా పట్టణంలో విపత్తు వస్తుందా? తన సేవకులైన ప్రవక్తలకు తన ఆలోచనలను తెలియచేయకుండా కచ్చితంగా యెహోవా ప్రభువు ఏదీ చేయడు. సింహం గర్జించింది. భయపడని వాడెవడు? యెహోవా ప్రభువు చెప్పాడు. ప్రవచించని వాడెవడు? అష్డోదు రాజ భవనాల్లో ప్రకటించండి. ఐగుప్తుదేశపు రాజ భవనాల్లో ప్రకటించండి. వాళ్ళతో ఇలా చెప్పండి, “మీరు సమరయ పర్వతాల మీద సమావేశమై దానిలోని గందరగోళాన్ని చూడండి. అక్కడ జరిగే దౌర్జన్యాన్ని చూడండి. సరైనదాన్ని ఎలా చేయాలో వారికి తెలియదు.” యెహోవా ప్రకటించేది ఇదే. వాళ్ళు తమ రాజ భవనాల్లో దౌర్జన్యం, నాశనం దాచుకున్నారు.

షేర్ చేయి
చదువండి ఆమోసు 3

ఆమోసు 3:1-10 పవిత్ర బైబిల్ (TERV)

ఇశ్రాయేలు ప్రజలారా, ఈ వర్తమానం వినండి! ఇశ్రాయేలూ, నిన్ను గురించి యెహోవా ఈ విషయాలు చెప్పాడు. ఈజిప్టునుండి ఆయన తీసుకొని వచ్చిన ఇశ్రాయేలు వంశాల వారందరిని గూర్చినదే ఈ వర్తమానం. “భూమిమీద అనేక వంశాలున్నాయి. కాని మిమ్మల్ని మాత్రమే నేను ఎంపికచేసి ప్రత్యేకంగా ఎరిగియున్నాను. అయితే, మీరు నాపై తిరుగుబాటు చేశారు. కావున మీ పాపాలన్నిటికీ నేను మిమ్మల్ని శిక్షిస్తాను.” అంగీకారం లేకుండా ఇద్దరు వ్యక్తులు కలిసి నడవలేరు. అడవిలో ఉన్న సింహం ఒక జంతువును పట్టుకున్న తరువాతనే గర్జిస్తుంది. తన గుహలో వున్న ఒక యువ కిశోరం గర్జిస్తూ ఉందంటే, అది ఏదో ఒక దానిని పట్టుకున్నదని అర్థం. బోనులో ఆహారం లేకపోతే ఒక పక్షి ఆ బోనులోకి ఎగిరిరాదు. బోను మూసుకుపోతే, అది అందులో చిక్కుతుంది. హెచ్చరిక చేసే బూరనాదం వినబడితే ప్రజలు భయంతో వణుకుతారు. ఒక నగరానికి ఏదైనా ముప్పు వాటిల్లిందంటే, దానిని యెహోవాయే కలుగ జేసినట్లు. నా ప్రభువైన యెహోవా ఏదైనా చేయటానికి నిర్ణయించవచ్చు. కాని ఆయన ఏదైనా చేసేముందు ఆయన తన పథకాలను తన, సేవకులైన ప్రవక్తలకు తెలియజేస్తాడు. ఒక సింహం గర్జిస్తే ప్రజలు భయపడతారు. యెహోవా మాట్లాడితే, ప్రవక్తలు దానిని ప్రవచిస్తారు. అష్డోదు, ఈజిప్టులలో ఉన్న ఎత్తయిన బురుజులు ఎక్కి ఈ వర్తమానం ప్రకటించండి: “మీరు సమరయ (షోమ్రోను) పర్వతాల మీదికి రండి. అక్కడ మీరు ఒక పెద్ద గందరగోళ పరిస్థితిని చూస్తారు. ఎందుకంటే, సవ్యమైన జీవితం ఎలా గడపాలో ఆ ప్రజలకు తెలియదు. సాటి ప్రజలపట్ల వారు క్రూరంగా వ్యవహరించారు. అన్యజనులనుండి వారు వస్తువులను తీసుకొని వాటిని ఎత్తయిన బురుజులలో దాచివేశారు. యుద్ధంలో తీసుకున్న వస్తువులతో వారి ఖజానాలు నిండివున్నాయి.”

షేర్ చేయి
చదువండి ఆమోసు 3

ఆమోసు 3:1-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఐగుప్తుదేశమునుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా, మిమ్మునుగూర్చియు ఆయన రప్పించిన కుటుంబమువారినందరినిగూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి. అదేమనగా భూమిమీది సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటినిబట్టి మిమ్మును శిక్షింతును. సమ్మతింపకుండ ఇద్దరు కూడి నడుతురా? ఎర దొరకక సింహము అడవిలో గర్జించునా? ఏమియు పట్టుకొనకుండనే కొదమసింహము గుహలోనుండి బొబ్బ పెట్టునా? భూమిమీద ఒకడును ఎరపెట్టకుండ పక్షి ఉరిలో చిక్కుపడునా? ఏమియు పట్టుబడకుండ ఉరి పెట్టువాడు వదలిలేచునా? పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా? యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా? తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలు పరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు. సింహము గర్జించెను, భయపడనివాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు, ప్రవచింపకుండువాడెవడు? అష్డోదు నగరులలో ప్రకటనచేయుడి, ఐగుప్తుదేశపు నగరులలో ప్రకటనచేయుడి; ఎట్లనగా–మీరు షోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతములమీదికి కూడివచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి; అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి. వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారముచేతను దోపుడుచేతను సొమ్ము సమకూర్చుకొందురు.

షేర్ చేయి
చదువండి ఆమోసు 3