ఆమోసు 2:6-16
ఆమోసు 2:6-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా చెప్పే మాట ఇదే: “ఇశ్రాయేలు చేసిన మూడు పాపాల గురించి, వారి నాలుగు పాపాల గురించి నేను వారిని తప్పకుండా శిక్షిస్తాను, వారు నిర్దోషులను వెండి కోసం అమ్మారు, బీదలను చెప్పుల కోసం అమ్మారు. వారు నేల మట్టిని త్రొక్కినట్టు బీదల తలలను త్రొక్కుతున్నారు హింసించబడే వారికి న్యాయం జరగనివ్వలేదు. తండ్రీ, కుమారులు ఒకే స్త్రీ దగ్గరకు వెళ్లారు అలా నా పరిశుద్ధ నామాన్ని అవమానపరిచారు. తాకట్టు పెట్టిన బట్టలు అప్పగించకుండా, ప్రతి బలిపీఠం దగ్గర వాటిని పరుచుకొని పడుకుంటారు. వారు జరిమానాలతో కొనుక్కున్న ద్రాక్షరసాన్ని, తమ దేవుని మందిరంలోనే త్రాగుతారు. “దేవదారు వృక్షమంత ఎత్తుగా, అయినా నేను వారి సింధూర వృక్షమంత బలంగా ఉన్న, అమోరీయులను వారి ఎదుట ఉండకుండా నేను నాశనం చేశాను. నేను పైనున్న వారి ఫలాన్ని, క్రిందున్న వారి వేరును నాశనం చేశాను. అమోరీయుల దేశాన్ని మీరు స్వాధీనపరచుకోవాలని, నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చి, నలభై సంవత్సరాలు అరణ్యంలో నడిపించాను. “అంతేకాక నేను మీ సంతానం నుండి ప్రవక్తలను, మీ యవకులలో నుండి నాజీరులను లేవనెత్తాను. ఇశ్రాయేలీయులారా! ఇది నిజం కాదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “అయితే మీరు నాజీరులతో ద్రాక్షరసం త్రాగించారు, ప్రవచించ వద్దని ప్రవక్తలను ఆదేశించారు. “కాబట్టి ధాన్యపు మోపులతో నిండిన బండి నేలను అణగద్రొక్కినట్టు, ఇప్పుడు నేను మిమ్మల్ని అణగద్రొక్కుతాను. వేగంగా పరుగెత్తేవారు తప్పించుకోలేరు, బలాఢ్యులు ధైర్యం తెచ్చుకోలేరు, వీరుడు తన ప్రాణాన్ని రక్షించుకోలేడు. విలుకాడు నిలబడలేడు, బాగా పరుగెత్తగల సైనికుడు తప్పించుకోలేడు, గుర్రపురౌతు తన ప్రాణాన్ని కాపాడుకోలేడు. ఆ రోజున ధైర్యవంతులైన వీరులు కూడా దిగంబరులై పారిపోతారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
ఆమోసు 2:6-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా తెలియజేసేది ఏంటంటే “ఇశ్రాయేలు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. ఎందుకంటే డబ్బు కోసం వాళ్ళు నిర్దోషులను అమ్మేశారు. చెప్పుల కోసం పేదలను అమ్మేశారు. నేల మీద మట్టిని ప్రజలు తొక్కేసినట్టు దిక్కులేనివారి తలలను తొక్కేస్తున్నారు. అణగారిన వారిని అవతలికి గెంటేస్తున్నారు. తండ్రి, కొడుకు ఒకే స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకుని నా పవిత్ర నామాన్ని అవమానపరుస్తున్నారు. తాకట్టుగా ఉంచిన బట్టలను అప్పగించకుండాా ప్రతి బలిపీఠం దగ్గర వాటి మీద పడుకుంటారు. జుల్మానా సొమ్ముతో కొన్న ద్రాక్షమద్యాన్ని తమ దేవుని మందిరంలో తాగుతారు. దేవదారు చెట్టంత ఎత్తయిన వారూ సింధూర వృక్షమంత బలమున్న అమోరీయులను వారి ముందు నిలవకుండా నేను నాశనం చేశాను గదా! పైన వారి ఫలాన్నీ కింద వారి వేరులనూ నేను నాశనం చేశాను గదా! ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని రప్పించి, అమోరీయుల దేశాన్ని మీకు స్వాధీనం చేయాలని నలభై ఏళ్ళు అరణ్యంలో మిమ్మల్ని నడిపించాను. మీ కొడుకుల్లో ప్రవక్తలను నియమించాను. మీ యువకుల్లో నాజీరులను ఎన్నుకున్నాను. ఇశ్రాయేలీయులారా, ఇది నిజం కాదా?” యెహోవా వెల్లడించేది ఇదే. “అయితే నాజీరులకు మీరు ద్రాక్షమద్యం తాగించారు. ప్రవచించ వద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చారు. చూడండి. ధాన్యంతో నిండిన బండి ఎవరినైనా అణిచి తొక్కగలిగినట్టు నేను మిమ్మల్ని అణగదొక్కుతాను. చురుకైన వారు సైతం తప్పించుకోలేరు. బలమైనవారు తమ బలాన్నిబట్టి ధైర్యం తెచ్చుకోలేకపోతారు. గొప్ప వీరుడు కూడా తన ప్రాణం కాపాడుకోలేడు. విలుకాడు నిలబడలేడు. వేగంగా పరుగెత్తగలిగేవాడు తప్పించుకోలేడు. రౌతు తన ప్రాణాన్ని కాపాడుకోలేడు. ఆ రోజు అత్యంత ధైర్యండే శూరులు కూడా నగ్నంగా పారిపోతారు. యెహోవా ప్రకటించేది ఇదే.”
ఆమోసు 2:6-16 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా ఇది చెపుతున్నాడు: “ఇశ్రాయేలువారు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే, స్వల్పమైన వెండికొరకు వారు మంచివారిని, అమాయకులైన ప్రజలను అమ్మివేశారు. వారు ఒక జత చెప్పుల విలువకు పేదవారిని అమ్మివేశారు. పేద ప్రజలను మట్టికరిచేలా కిందికి తోసి, వారిపై తాము నడిచారు. బాధపడేవారి గోడును వారు ఆలకించరు. తండ్రులు, కొడుకులు ఒకే స్త్రీతో సంభోగిస్తారు. వారు నా పవిత్ర నామాన్ని పాడుచేసారు. పేద ప్రజలవద్ద వారు బట్టలు తీసుకొని, బలిపీఠాలముందు ఆరాధన జరిపేటప్పుడు వాటిమీద కూర్చుంటారు. వారు పేదవారికి డబ్బు అప్పుగా ఇచ్చి, వారి దుస్తులను తాకట్టు పెట్టుకున్నారు. ప్రజలు అపరాధ రుసుము చెల్లించేలా వారు చేస్తారు. ఆ డబ్బును వారు తమ దేవుని ఆలయంలో తాగటానికి ద్రాక్షామద్యం కొనడానికి వినియోగిస్తారు. “కాని, అమోరీయులను వారి ముందర నాశనం చేసింది నేనే. అమోరీయులు దేవదారు వృక్షమంత ఎత్తయినవారు. వారు సిందూర వృక్షమంత బలంగలవారు. కాని, పైన వాటి పండ్లను, కింద వాటి వేళ్లను నేను నాశనం చేశాను. “ఈజిప్టు దేశంనుండి మిమ్మల్ని తీసుకొని వచ్చింది నేనే. అమోరీయుల దేశాన్ని మీరు ఆక్రమించటంలో నేను మీకు సహాయం చేశాను. దీనికై నలబై సంవత్సరాలు మిమ్మల్ని ఎడారిలో నడిపించాను. మీ కుమారులలో కొంతమందిని నేను ప్రవక్తలుగా చేశాను. మీ యువకులలో కొంతమందిని నాజీరులుగా నియమించాను. ఇశ్రాయేలు ప్రజలారా! ఇది నిజం అని యెహోవా చెపుతున్నాడు. కాని, నాజీరులు ద్రాక్షామద్యం తాగేలా మీరు చేశారు. దేవుని మాటలు ప్రకటించవద్దని మీరు ప్రవక్తలకు చెప్పారు. మీరు నాకు పెద్ద భారమయ్యారు. అధికమైన గడ్డివేసిన బండిలా నేను చాలా కిందికి వంగిపోయాను. ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎంత వేగంగా పరుగెత్తగలవాడైనా తప్పించుకోలేడు. బలవంతులు బలంగా లేరు. సైనికులు తమను తాము రక్షించుకోలేరు. విల్లంబులు, బాణాలు చేతబట్టిన వారు బ్రతకరు. వేగంగా పరుగిడగలవారు తప్పించుకోలేరు. గుర్రాలు ఎక్కినవారు ప్రాణాలతో తప్పించుకోలేరు. ఆ సమయంలో మిక్కిలి బలవంతులైన సైనికులు సహితం పారిపోతారు. వారు బట్టలు వేసుకొనటానికికూడా సమయం తీసుకోరు అని దేవుడైన యెహోవా చెపుతున్నాడు.”
ఆమోసు 2:6-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మి వేయుదురు; పాదరక్షలకొరకై బీదవారిని అమ్మి వేయుదురు. దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు; దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు; తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధనామమును అవమానపరచుదురు; తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరచుకొని బలిపీఠములన్నిటియొద్ద పండుకొందురు. జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు. దేవదారు వృక్షమంత యెత్తయినవారును సింధూరవృక్షమంత బలముగల వారునగు అమోరీయులను వారిముందర నిలువకుండ నేను నాశనము చేసితిని గదా; పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేసితిని గదా, మరియు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించి, అమోరీయుల దేశమును మీకు స్వాధీనపరచవలెనని నలువది సంవత్సరములు అరణ్యమందు మిమ్మును నడిపించితిని గదా. మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను, మీ యౌవనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించితిని. ఇశ్రాయేలీయులారా, యీ మాటలు నిజమైనవికావా? ఇదే యెహోవా వాక్కు. అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి. ఇదిగో పంటచేని మోపుల నిండుబండి నేలను అణగ ద్రొక్కునట్లు నేను మిమ్మును అణగద్రొక్కుదును. అప్పుడు అతివేగియగు వాడు తప్పించుకొనజాలకపోవును, పరాక్రమశాలి తన బలమునుబట్టి ధైర్యము తెచ్చుకొనజాలక పోవును, బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొనజాలకుండును. విలుకాడు నిలువజాలకపోవును, వడిగా పరుగెత్తువాడు తప్పించు కొనలేకపోవును, గుఱ్ఱము ఎక్కినవాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును. మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహు ధైర్యముగలవాడు దిగంబరియై పారిపోవును; ఇదే యెహోవా వాక్కు.