అపొస్తలుల కార్యములు 9:36-42

అపొస్తలుల కార్యములు 9:36-42 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

యొప్పే పట్టణంలో తబితా అనే ఒక శిష్యురాలు ఉంది, గ్రీకు భాషలో ఆమెకు దొర్కా అని పేరు దానికి లేడి అని అర్థము. ఆమె ఎప్పుడూ మంచి పనులు చేస్తూ పేదలకు సహాయం చేసేది. ఆ సమయంలో ఆమె అనారోగ్యంతో చనిపోయింది, కాబట్టి ఆమె శరీరాన్ని కడిగి మేడ గదిలో ఉంచారు. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉంటుంది. పేతురు లుద్దలో ఉన్నాడని శిష్యులు విని, “వెంటనే రమ్మని బ్రతిమాలడానికి” ఇద్దరిని అతని దగ్గరకు పంపించారు. కాబట్టి పేతురు వారితో వెళ్లాడు, అతడు అక్కడ చేరుకొన్న తర్వాత అతన్ని మేడ గదికి తీసుకెళ్లారు. విధవరాండ్రందరు అతని చుట్టూ నిలబడి, ఏడుస్తూ దొర్కా తమతో ఉన్నప్పుడు ఆమె తయారుచేసిన అంగీలను ఇతర వస్త్రాలను అతనికి చూపించారు. పేతురు వారందరిని గది నుండి బయటకు పంపించి, మోకరించి ప్రార్థించాడు. చనిపోయిన ఆ స్త్రీ శవం వైపు తిరిగి, “తబితా లే!” అని చెప్పాడు. ఆమె తన కళ్లను తెరిచి పేతురును చూసి లేచి కూర్చుంది. అతడు ఆమె చేయి పట్టుకుని పైకి లేపి నిలబెట్టాడు. అప్పుడు అతడు విశ్వాసులను, ముఖ్యంగా విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవంగా వారికి అప్పగించాడు. ఈ సంగతి యొప్పే పట్టణమంతా తెలిసి, చాలామంది ప్రజలు ప్రభువును నమ్ముకున్నారు.

అపొస్తలుల కార్యములు 9:36-42 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యొప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉంది. (ఈ పేరు గ్రీకులో దొర్కా, అంటే లేడి). ఈమె ఎప్పుడూ మంచి పనులు చేస్తూ, పేదలను ఆదుకుంటూ ఉండేది. ఆ రోజుల్లో ఆమె జబ్బుపడి చనిపోయింది. ఆమె శవానికి స్నానం చేయించి మేడ గదిలో ఉంచారు. లుద్ద అనే ఊరు యొప్పేకు దగ్గరగా ఉండడం వల్ల పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, ఆలస్యం చేయకుండా తమ దగ్గరికి రమ్మని అతనిని బతిమాలడానికి ఇద్దర్ని అతని దగ్గరకి పంపారు. పేతురు లేచి వారితో కూడా వెళ్ళాడు. అక్కడ చేరినప్పుడు, వారు మేడగదిలోకి అతనిని తీసుకొచ్చారు. అక్కడ ఉన్న వితంతువులందరూ ఏడుస్తూ, దోర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలు, బట్టలు చూపిస్తూ అతని పక్కనే నిలబడ్డారు. పేతురు అందరినీ బయటికి పంపి మోకరించి ప్రార్థన చేశాడు. తరువాత ఆ శవం వైపు తిరిగి, “తబితా, లే” అనగానే ఆమె కళ్ళు తెరచి పేతురును చూడగానే లేచి కూర్చుంది. అతడామె చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. అక్కడ చేరిన విశ్వాసులనూ, వితంతువులనూ పిలిచి ఆమెను సజీవంగా వారికి అప్పగించాడు. ఇది యొప్పే ప్రాంతమంతా తెలిసింది, చాలామంది ప్రభువులో విశ్వాసముంచారు.

అపొస్తలుల కార్యములు 9:36-42 పవిత్ర బైబిల్ (TERV)

“యొప్పే” అనే పట్టణంలో, తబితా అనే శిష్యురాలు ఉండేది. ఈమెను గ్రీకు భాషలో దొర్కా అని పిలిచేవాళ్ళు. ఈమె పేదలకు సహాయం చేస్తూ ఉండేది. ఎప్పుడూ మంచి పనులు చేసేది. పేతురు అదే ప్రాంతాల్లో ఉండగా ఆమె జబ్బు పడి చనిపోయింది. ఆమె శవానికి స్నానం చేయించి మేడ మీది గదిలో ఉంచారు. లుద్ద యొప్పే పట్టణానికి దగ్గరగా ఉండింది. పేతురు లుద్దలో ఉన్నాడని, శిష్యులు యిద్దరు మనుష్యుల్ని అతని దగ్గరకు పంపి వెంటనే రమ్మని వేడుకున్నారు. పేతురు వాళ్ళ వెంట వెళ్ళాడు. అతడు రాగానే మేడ మీది గదికి తీసుకు వెళ్ళారు. అతని చుట్టూ చేరిన వితంతువులు, దొర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన రకరకాల దుస్తుల్ని చూపి విలపించారు. పేతురు వాళ్ళందర్ని గదినుండి వెలుపలికి పంపి తన మోకాళ్ళపై ప్రార్థించాడు. శవం వైపు తిరిగి, “లే, తబితా!” అని అన్నాడు. ఆమె కళ్ళు తెరిచింది. పేతురును చూసి లేచి కూర్చుంది. అతడు చేతులందించి ఆమె నిలబడటానికి సహాయం చేసాడు. ఆ తదుపరి పేతురు భక్తుల్ని, వితంతువుల్ని పిలిచి వాళ్ళకు ప్రాణంతో ఉన్న తబితాను చూపాడు. యొప్పే ప్రాంతమంతా యిది తెలిసిపోయింది. అనేకులు ప్రభువు భక్తులయ్యారు.

అపొస్తలుల కార్యములు 9:36-42 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను; ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్‌క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి యుండెను. ఆ దినములయందామె కాయిలాపడి చనిపోగా, వారు శవమును కడిగి మేడ గదిలో పరుండ బెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుటచేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, అతడు తడవుచేయక తమయొద్దకు రావలెనని వేడుకొనుటకు ఇద్దరు మనుష్యులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితోకూడ వెళ్లి అక్కడ చేరినప్పుడు, వారు మేడగదిలోనికి అతనిని తీసికొనివచ్చిరి; విధవరాండ్రందరు వచ్చి యేడ్చుచు, దొర్కా తమతోకూడ ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములును చూపుచు అతని యెదుట నిలిచిరి. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్లూని ప్రార్థనచేసి శవమువైపు తిరిగి–తబితా, లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడామెకు చెయ్యి యిచ్చి లేవనెత్తి, పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను. ఇది యొప్పేయందంతట తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి.