అపొస్తలుల కార్యములు 8:35-39

అపొస్తలుల కార్యములు 8:35-39 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అప్పుడు ఫిలిప్పు ఆ లేఖనంతో ప్రారంభించి, యేసును గురించిన సువార్తను అతనికి చెప్పాడు. వారు దారిలో వెళ్తునప్పుడు, నీళ్లు ఉన్న చోటికి వారు వచ్చారు, అప్పుడు ఆ నపుంసకుడు, “చూడండి, ఇక్కడ నీళ్లున్నాయి కదా, నేను బాప్తిస్మం పొందడానికి ఏమైన ఆటంకం ఉందా?” అని అడిగాడు. అందుకు ఫిలిప్పు, “నీ పూర్ణహృదయంతో నమ్మితే, పొందుకోవచ్చు” అని చెప్పాడు. అప్పుడు ఆ నపుంసకుడు, “యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను” అన్నాడు. అతడు రథాన్ని ఆపమని ఆదేశించాడు. వారు ఇద్దరు నీళ్లలోనికి దిగిన తర్వాత ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చాడు. వారు నీళ్లలో నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రభువు ఆత్మ అకస్మాత్తుగా ఫిలిప్పును తీసుకెళ్లాడు. తర్వాత ఆ నపుంసకుడు అతన్ని ఇంకా ఎప్పుడు చూడలేదు, కాని అతడు సంతోషంగా తన దారిన వెళ్లిపోయాడు.

అపొస్తలుల కార్యములు 8:35-39 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఫిలిప్పు ఆ లేఖనంతో మొదలుపెట్టి యేసును గూర్చిన సువార్తను అతనికి బోధించాడు. వారు దారిలో వెళ్తూ ఉండగానే కొద్దిగా నీళ్ళున్న ఒక చోటికి వచ్చారు. నపుంసకుడు “ఇక్కడ నీళ్ళున్నాయి! నాకు బాప్తిసమివ్వడానికి ఆటంకమేమిటి?” అని అడిగి రథాన్ని ఆపమని ఆజ్ఞాపించాడు. ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరూ నీటిలోకి దిగారు. అప్పుడు ఫిలిప్పు అతనికి బాప్తిసమిచ్చాడు. వారు నీళ్లలో నుండి బయటికి వచ్చినపుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును తీసుకుపోయాడు. నపుంసకుడు ఆనందిస్తూ తన దారిన వెళ్ళిపోయాడు. అతడు ఫిలిప్పును ఇంకెప్పుడూ చూడలేదు.

అపొస్తలుల కార్యములు 8:35-39 పవిత్ర బైబిల్ (TERV)

ఫిలిప్పు ప్రవచనాల్లోని ఆ వాక్యాలతో మొదలెట్టి, యేసును గురించిన శుభవార్తను అతనికి చెప్పాడు. ఆ దారిన ప్రయాణం చేస్తూ వాళ్ళు నీళ్ళున్న ఒక ప్రదేశాన్ని చేరుకొన్నారు. ఆ కోశాధికారి, “ఇదిగో! ఇక్కడ నీళ్ళున్నాయి, నీవు నాకు బాప్తిస్మమునెందుకు ఇవ్వకూడదు?” అని అడిగి, రథాన్ని ఆపమని ఆజ్ఞాపించాడు. ఫిలిప్పు, “నీవు పూర్ణ హృదయంతో విశ్వసిస్తే నేను ఇస్తాను” అన్నాడు. ఆ కోశాధికారి, “యేసు క్రీస్తు దేవుని కుమారుడని నేను విశ్వసిస్తున్నాను” అన్నాడు. ఫిలిప్పు, ఆ కోశాధికారి ఇద్దరు కలిసి నీళ్ళలోకి వెళ్ళారు. ఫిలిప్పు అతనికి బాప్తిస్మమునిచ్చాడు. వాళ్ళు నీళ్ళనుండి వెలుపలికొచ్చాక ప్రభువు ఆత్మ అకస్మాత్తుగా ఫిలిప్పును అక్కడినుండి తీసుకొని వెళ్ళాడు. ఆ కోశాధికారి ఫిలిప్పును మళ్ళీ చూడలేదు. అయినా అతడు ఆనందంతో తన దారిన తాను వెళ్ళిపొయ్యాడు.

అపొస్తలుల కార్యములు 8:35-39 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అందుకు ఫిలిప్పు నోరు తెరచి, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసునుగూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్న యొక చోటికి వచ్చి నప్పుడు నపుంసకుడు–ఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మ మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు–నీవు పూర్ణహృదయముతో విశ్వసించినయెడల పొందవచ్చునని చెప్పెను. అతడు–యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని యుత్తరమిచ్చెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మ మిచ్చెను. వారు నీళ్లలోనుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్లెను; అతడు ఫిలిప్పును మరి యెన్నడును చూడలేదు.