అపొస్తలుల కార్యములు 6:1-15
అపొస్తలుల కార్యములు 6:1-15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆ రోజుల్లో శిష్యుల సంఖ్య పెరుగుతున్నపుడు, ప్రతీ రోజు ఆహారం పంచిపెట్టే విషయంలో, గ్రీకు విధవరాండ్రను పట్టించుకోవడం లేదని గ్రీకుభాష మాట్లాడే యూదులు హెబ్రీభాష మాట్లాడే యూదుల మీద సణుగుకొన్నారు. కాబట్టి పన్నెండుమంది అపొస్తలులు మిగిలిన విశ్వాసులందరిని ఒకచోటకు పిలిపించి వారితో, “మేము దేవుని వాక్య పరిచర్యను నిర్లక్ష్యం చేసి భోజన బల్లల గురించి కనిపెట్టుకొని ఉండడం సరికాదు. కాబట్టి సహోదరి సహోదరులారా, ఆత్మతో, జ్ఞానంతో నింపబడిన ఏడుగురిని మీలో నుండి ఏర్పరచుకోండి. మేము ఈ బాధ్యతను వారికి అప్పగిస్తాము. అప్పుడు మేము ప్రార్థనపై, వాక్య పరిచర్యపై శ్రద్ధ వహించగలం” అని చెప్పారు. ఈ ఆలోచన అందరికి నచ్చింది. కాబట్టి వారు విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండిన స్తెఫెను, ఫిలిప్పు, ప్రోకొరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదా మతంలోనికి మారిన అంతియొకయ నివాసియైన నికోలాసు అనే వారిని ఏర్పరచుకున్నారు. వారిని అపొస్తలుల ముందు నిలబెట్టినప్పుడు, వారు వీరిపై చేతులుంచి ప్రార్థన చేశారు. కాబట్టి దేవుని వాక్యం వ్యాపించింది. యెరూషలేములో శిష్యుల సంఖ్య అతివేగంగా పెరిగింది, యాజకులలో కూడా చాలామంది విశ్వాసానికి లోబడ్డారు. స్తెఫెను, దేవుని కృపతో శక్తితో నిండి ప్రజలమధ్య గొప్ప అద్భుతాలు సూచకక్రియలు చేశాడు. అయితే స్వతంత్రుల సమాజమందిరానికి (అలా పిలువబడేది) చెందిన కురేనీయులు అలెక్సంద్రియ, అలాగే కిలికియా ఆసియా ప్రాంతాల నుండి వచ్చిన యూదులు స్తెఫెనుతో వాదించడం మొదలుపెట్టారు. కాని ఆత్మ అనుగ్రహించిన జ్ఞానంతో మాట్లాడుతున్న స్తెఫెనుకు వ్యతిరేకంగా ఎవరు నిలబడలేకపోయారు. కాబట్టి వారు రహస్యంగా కొందరిని ప్రేరేపించి, “మోషే మీద దేవుని మీద స్తెఫెను దైవదూషణ చేయడం మేము విన్నాం” అని చెప్పించారు. ప్రజలను, యూదా నాయకులను ధర్మశాస్త్ర ఉపదేశకులను వారు రెచ్చగొట్టారు. వారు స్తెఫెనును పట్టుకుని న్యాయసభ ముందు నిలబెట్టారు. వారు అబద్ధ సాక్షులను తీసుకువచ్చి, “ఇతడు ఈ పరిశుద్ధ స్థలానికి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఆపలేదు. నజరేయుడైన యేసు ఈ స్థలాన్ని పడగొట్టి, మోషే మనకు ఇచ్చిన ఆచారాలను మార్చేస్తాడని ఇతడు చెప్పడం మేము విన్నాం” అని చెప్పించారు. న్యాయసభలో కూర్చున్న వారంతా స్తెఫెను వైపు సూటిగా చూసినప్పుడు, అతని ముఖం ఒక దేవదూత ముఖంలా వారికి కనబడింది.
అపొస్తలుల కార్యములు 6:1-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ రోజుల్లో శిష్యుల సంఖ్య పెరుగుతున్నపుడు రోజువారీ భోజనాల వడ్డనల్లో తమలోని విధవరాళ్ళను చిన్నచూపు చూస్తున్నారని గ్రీకు భాష మాట్లాడే యూదులు హీబ్రూ భాష మాట్లాడే యూదుల మీద ఫిర్యాదు చేశారు. అప్పుడు పన్నెండుమంది అపొస్తలులు శిష్యుల సమూహాన్ని తమ దగ్గరికి పిలిచి, “మేము దేవుని వాక్యాన్ని బోధించడం మాని భోజనాలు వడ్డించడం మంచిది కాదు. కాబట్టి సోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండిన వారై, మంచి పేరున్న ఏడుగురిని మీలో ఏర్పరచుకోండి. మేము వారిని ఈ పనికి నియమిస్తాం. మేము మాత్రం ప్రార్థనలోనూ, వాక్య పరిచర్యలోనూ కొనసాగుతూ ఉంటాం” అన్నారు. ఈ మాట అందరికీ నచ్చింది. కాబట్టి, వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండి ఉన్న స్తెఫను, ఇంకా ఫిలిప్పు, ప్రొకొరు, నీకానోరు, సీమోను, పర్మెనాసు, యూదామతంలోకి మారిన అంతియొకయ నివాసి నీకొలాసు అనేవారిని ఎంచుకున్నారు. వారిని అపొస్తలుల ముందుంచారు. అపొస్తలులు ప్రార్థన చేసి వారిమీద చేతులుంచారు. దేవుని వాక్కు అంతకంతకూ వ్యాపించి శిష్యుల సంఖ్య యెరూషలేములో పెరిగిపోయింది. యాజకుల్లో కూడా చాలామంది విశ్వసించారు. స్తెఫను కృపతో, బలంతో నిండి ప్రజల మధ్య అద్భుతాలనూ గొప్ప సూచక క్రియలనూ చేస్తున్నాడు. అయితే ‘స్వతంత్రుల సమాజం’ అనే చెందినవారూ, కురేనీయులూ, అలెగ్జాండ్రియా వారు, కిలికియ, ఆసియాకు చెందిన కొంత మందీ వచ్చి స్తెఫనుతో తర్కించారు గాని అతని మాటల్లోని తెలివినీ, అతనిని ప్రేరేపించిన ఆత్మనూ వారు ఎదిరించలేక పోయారు. అప్పుడు వారు ‘వీడు మోషే మీదా దేవుని మీదా దూషణ మాటలు పలుకుతుంటే మేము విన్నాము’ అని చెప్పడానికి రహస్యంగా కొంతమందిని కుదుర్చుకున్నారు. ప్రజలను, పెద్దలను, ధర్మ శాస్త్ర పండితులనూ రేపి అతని మీదికి వచ్చి అతణ్ణి పట్టుకుని మహాసభ ఎదుటికి తీసుకు పోయారు. అబద్ధ సాక్షులను నిలబెట్టారు. వారు, “ఈ వ్యక్తి ఎప్పుడూ ఈ పరిశుద్ధ స్థలానికీ మన ధర్మశాస్త్రానికీ విరోధంగా మాట్లాడుతున్నాడు. నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి, మోషే మనకిచ్చిన ఆచారాలను మారుస్తాడని వీడు చెప్పగా మేము విన్నాము” అని చెప్పారు. సభలో కూర్చున్న వారంతా అతని వైపు తేరి చూసినపుడు అతని ముఖం దేవదూత ముఖంలా వారికి కనబడింది.
అపొస్తలుల కార్యములు 6:1-15 పవిత్ర బైబిల్ (TERV)
యేసు అనుచరుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఆ రోజుల్లో గ్రీకు భాషలో మాట్లాడే యూదులు హీబ్రూ భాష మాట్లాడే యూదులతో, “మా వితంతువుల్ని ప్రతి రోజు చేసే దానాల విషయంలో సరిగ్గా చూడటం లేదు” అని తగువు పెట్టుకొన్నారు. అందువల్ల ఆ పన్నెండుమంది అపొస్తలులు అనుచరులందర్ని సమావేశ పరిచి ఈ విధంగా అన్నారు: “అన్నదానాల విషయం చూడటానికోసం మేము దేవుని సందేశం యొక్క బోధ విషయంలో అశ్రద్ధ వహించటం మంచిది కాదు. సోదరులారా! పవిత్రాత్మ సంపూర్ణంగా గలవాళ్ళను, పూర్ణ జ్ఞానం కలవాళ్ళను ఏడుగురిని మీలోనుండి ఎన్నుకోండి. ఈ బాధ్యత వాళ్ళకప్పగిస్తాం. మేము మా కాలాన్ని ప్రార్థనలకు, దేవుని సందేశాన్ని ఉపదేశించటానికి వినియోగిస్తాము.” అపొస్తలులు చెప్పింది వాళ్ళకందరికీ బాగా నచ్చింది. వాళ్ళు స్తెఫనును ఎన్నుకొన్నారు. స్తెఫను దేవుని పట్ల గొప్ప విశ్వాసం గలవాడు. అతనిలో పవిత్రాత్మ సంపూర్ణంగా ఉంది. అతణ్ణే కాక ఫిలిప్పును, ప్రొకొరును, నీకానోరును, తీమోనును, పర్మెనాసును, నీకొలాసును కూడా ఎన్నుకొన్నారు. ఈ నీకొలాసు అంతియొకయకు చెందినవాడు. పూర్వం యూదుల మతంలో చేరినవాడు. ప్రజలు వీళ్ళను అపొస్తలుల ముందుకు పిలుచుకొని వచ్చారు. అపొస్తలులు ప్రార్థించి తమ చేతుల్ని వాళ్ళపై ఉంచారు. దేవుని సందేశం ప్రచారమైంది. యెరూషలేములో శిష్యుల సంఖ్య బాగా పెరిగిపోయింది. చాలా మంది యాజకులు విశ్వసించారు. దేవునినుండి సంపూర్ణమైన శక్తిని, అనుగ్రహాన్ని పొందిన స్తెఫను ప్రజల సమక్షంలో గొప్ప అద్భుతాలు చేసాడు. అద్భుతమైన చిహ్నాలు చూపాడు. కాని స్వతంత్రుల సమాజమని పిలువబడే సమాజానికి చెందిన కొందరు యూదులు స్తెఫనుతో వాదన పెట్టుకొన్నారు. వీళ్ళలో కురేనీ, అలెక్సంద్రియ పట్టణాలకు చెందిన యూదులు, కిలికియ, ఆసియ ప్రాంతాలకు చెందిన యూదులు కూడా ఉన్నారు. కాని మాట్లాడటానికి పవిత్రాత్మ అతనికి తెలివినిచ్చాడు. కనుక అతని మాటలకు వాళ్ళు ఎదురు చెప్పలేకపోయారు. ఆ తర్వాత యూదులు కొందరిని పురికొలిపి, “ఈ స్తెఫను మోషేను, దేవుణ్ణి దూషిస్తూ మాట్లాడటం మేము విన్నాము” అని చెప్పమన్నారు. అదే విధంగా ప్రజల్ని, పెద్దల్ని, పండితుల్నికూడా పురికొలిపి పంపారు. ఆ తదుపరి స్తెఫన్ను బంధించి మహాసభ ముందుకు తెచ్చారు. తప్పుడు సాక్ష్యాలు తెచ్చి, “యితడు ఈ పవిత్ర స్థానాన్ని గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి ఎదిరిస్తూ మాట్లాడటం మానుకోడు. ఎందుకంటే, నజరేతు నివాసి యేసు ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తాడని, మోషే మనకందించిన ఆచారాన్ని మారుస్తాడని చెప్పటం మేము విన్నాము” అని వాళ్ళతో చెప్పించారు. సభలో కూర్చొన్నవాళ్ళంతా స్తెఫను వైపు శ్రద్ధగా చూసారు. వాళ్ళకు అతని ముఖం ఒక దేవదూత ముఖంలా కనిపించింది.
అపొస్తలుల కార్యములు 6:1-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయులమీద గ్రీకుభాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. అప్పుడు పండ్రెండుగురు అపొస్తలులు తమయొద్దకు శిష్యుల సమూహమును పిలిచి–మేము దేవుని వాక్యము బోధించుట మాని, ఆహారము పంచిపెట్టుట యుక్తముకాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మ తోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము; అయితే మేము ప్రార్థనయందును వాక్యపరిచర్యయందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందునవారు, విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనినవాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నీకా నోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మతప్రవిష్టుడును అంతియొకయవాడును అగు నీకొలాసు అను వారిని ఏర్ప రచుకొని వారిని అపొస్తలులయెదుట నిలువబెట్టిరి; వీరు ప్రార్థనచేసి వారిమీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను; మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజలమధ్య మహత్కార్యములను గొప్ప సూచకక్రియలను చేయుచుండెను. అప్పుడు లిబెర్తీనులదనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెక్సంద్రియుల సమాజములోను, కిలికియనుండియు ఆసియనుండియు వచ్చినవారిలోను, కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి గాని మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మ ను వారెదిరింపలేకపోయిరి. అప్పుడు వారు–వీడు మోషేమీదను దేవునిమీదను దూషణవాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతనిమీదికి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసికొనిపోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారు–ఈ మనుష్యుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాటలాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి, మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. సభలో కూర్చున్నవారందరు అతనివైపు తేరిచూడగా అతని ముఖము దేవదూత ముఖమువలె వారికి కనబడెను.