అపొస్తలుల కార్యములు 5:27-42

అపొస్తలుల కార్యములు 5:27-42 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ప్రధాన యాజకుడు ప్రశ్నించాలని అపొస్తలులను న్యాయసభ ముందు నిలబెట్టారు. అప్పుడు ప్రధాన యాజకుడు, “ఈ పేరట బోధించకూడదు అని మీకు మేము ఖచ్చితంగా ఆదేశించాము, అయినాసరే మీ బోధలతో యెరూషలేమును నింపి ఈ మనుష్యుని హత్యచేసిన నేరాన్ని మా మీదికి తేవాలని చూస్తున్నారు” అని అన్నాడు. అందుకు పేతురు ఇతర అపొస్తలులు, “మేము మనుష్యుల కన్నా దేవునికే లోబడాలి కదా! మీరు సిలువ మీద వ్రేలాడదీసి చంపిన యేసును మన పితరుల దేవుడు సజీవంగా లేపారు. ఆయన ఇశ్రాయేలీయుల ప్రజలకు పశ్చాత్తాపాన్ని, పాపక్షమాపణను దయచేయడానికి, దేవుడు ఆయనను అధిపతిగా రక్షకునిగా తన కుడిచేతి వైపుకు హెచ్చించారు. మేము, అలాగే దేవునికి లోబడిన వారికి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ఈ సంగతులకు సాక్షులము.” న్యాయసభ వారు ఈ మాటలను విని మరింత కోపం తెచ్చుకుని వారిని చంపాలని అనుకున్నారు. అయితే న్యాయసభలోని ఒకడు, ప్రజలందరి చేత గౌరవించబడే పరిసయ్యుడైన గమలీయేలు అనే ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, వారిని కొంతసేపు బయట ఉంచమని ఆదేశించాడు. తర్వాత న్యాయసభతో, “ఇశ్రాయేలీయులారా, ఈ మనుష్యులకు మీరు ఏమి చేయాలనుకుంటున్నారో దాని గురించి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొంతకాలం క్రిందట థూదా అనే ఒకడు, తాను గొప్పవానినని చెప్పుకొన్నాడు, ఇంచుమించు నాలుగువందలమంది అతన్ని అనుసరించారు. అతడు చంపబడిన తర్వాత, అతని అనుచరులు చెదరిపోయారు, ఏమి మిగలకుండా పోయింది. అతని తర్వాత, జనాభా లెక్కలను వ్రాసే రోజుల్లో గలిలయుడైన యూదా అనేవాడు లేచి ప్రజలను తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించాడు. అతడు కూడా చంపబడ్డాడు, అతని అనుచరులు కూడా చెదరిపోయారు. కాబట్టి ప్రస్తుత ఈ పరిస్థితిలో నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే: వారిని వదిలేయండి! వారిని వెళ్లనివ్వండి. వారి ఉద్దేశాలు లేదా క్రియలు మనుష్యుల వలన వచ్చినవైతే అవే ఆగిపోతాయి. కాని అది దేవుని నుండి అయితే, వారిని మీరు ఆపలేరు; మీరు దేవునితో పోరాడుతున్నట్లే అని మీరు తెలుసుకుంటారు” అన్నాడు. అతని మాటలను వారు అంగీకరించారు, కాబట్టి అపొస్తలులను లోపలికి పిలిచి వారిని కొట్టించారు. తర్వాత యేసు పేరట మాట్లాడకూడదని వారిని ఆదేశించి పంపించారు. ఆ నామాన్ని బట్టి అవమానం పొందడానికి తగినవారిగా ఎంచడంతో సంతోషిస్తూ అపొస్తలులు న్యాయసభ నుండి బయటకు వెళ్లిపోయారు. వారు ప్రతీ రోజు మానక దేవాలయ ఆవరణాల్లో ఇంటింట సువార్తను బోధిస్తూ “యేసే క్రీస్తు” అని ప్రకటించుచున్నారు.

అపొస్తలుల కార్యములు 5:27-42 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

సౌమ్యంగానే వారిని తీసుకుని వచ్చి మహాసభ ముందుంచాడు. ప్రధాన యాజకుడు వారితో, “ఈ నామంలో బోధించవద్దని మేము మీకు కచ్చితంగా ఆజ్ఞాపించాము గదా. అయినా మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, ఈ వ్యక్తి హత్యానేరాన్ని మా మీదికి తేవాలని చూస్తున్నారు” అని చెప్పాడు. అందుకు పేతురు, మిగిలిన అపొస్తలులు ఇలా జవాబిచ్చారు, “మనుషులకు కాక, దేవునికే మేము లోబడాలి గదా. మీరు మానుకు వేలాడదీసి చంపిన యేసును మన పితరుల దేవుడు లేపాడు. ఇశ్రాయేలుకు హృదయ పరివర్తన, పాప క్షమాపణ దయచేయడానికి దేవుడాయన్ని అధికారిగా, రక్షకునిగా తన కుడి వైపున ఉండే స్థాయికి హెచ్చించాడు. మేమూ, దేవుడు తన విధేయులకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మా, ఈ సంగతులకు సాక్షులం.” వారీమాట విని తీవ్ర కోపంతో వీరిని చంపాలని చూశారు. అప్పుడు అందరి గౌరవం చూరగొన్న ధర్మశాస్త్ర బోధకుడు గమలీయేలు అనే ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి అపొస్తలులను కాసేపు బయట ఉంచమని ఆజ్ఞాపించి వారితో ఇలా అన్నాడు. “ఇశ్రాయేలీయులారా, ఈ మనుషులకు మీరేమి చేయాలని చూస్తున్నారో జాగ్రత్త సుమా. కొంతకాలం క్రితం థూదా లేచి తాను గొప్పవాడినని చెప్పుకున్నాడు. సుమారు నాలుగు వందల మంది అతనితో కలిశారు. అతడు హతుడయ్యాడు. అతనిని అనుసరించిన వారంతా చెల్లా చెదరై పోయారు. అతని తరువాత జనాభా లెక్కలు తీసే రోజుల్లో గలిలయవాడైన యూదా అనేవాడు లేచి, కొంతమందిని తన వైపుకు ఆకర్షించాడు. వాడు కూడా నశించిపోయాడు, వాణ్ణి అనుసరించిన వారంతా చెదరిపోయారు. కాబట్టి నేను మీతో చెప్పేది ఏమంటే ఈ మనుషుల జోలికి వెళ్ళకుండా వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన గానీ వారి పని గానీ మనుషుల వలన కలిగినదైతే, అది వ్యర్థమై పోతుంది. దేవుని వలన కలిగినదైతే వారిని మీరు ఓడించలేరు. మీరొకవేళ దేవునితో పోరాడే వారవుతారేమో సుమా.” వారతని మాటకు అంగీకరించి, అపొస్తలులను పిలిపించి వారిని కొట్టించి, యేసు నామంలో బోధించ వద్దని ఆజ్ఞాపించి విడుదల చేశారు. ఆ నామాన్ని బట్టి అవమానం పొందడానికి పాత్రులని దేవుడు తమను ఎంచినందుకు అపొస్తలులు సంతోషిస్తూ మహాసభ నుండి వెళ్ళిపోయారు. ప్రతిరోజూ దేవాలయంలో, ఇంటింటా మానకుండా బోధిస్తూ, యేసే క్రీస్తని ప్రకటిస్తూ వచ్చారు.

అపొస్తలుల కార్యములు 5:27-42 పవిత్ర బైబిల్ (TERV)

అపొస్తలుల్ని పిలుచుకు వచ్చి మహాసభ ముందు నిలుచోబెట్టారు. ప్రధాన యాజకుడు విచారణ చేస్తూ, “మీ యేసు పేరిట బోధించవద్దని మేము యిది వరకే ఖచ్చితంగా ఆజ్ఞాపించాము. అయినా యెరూషలేమంతా మీ బోధలతో నింపివేసారు. అంతేకాక అతని మరణాన్ని మాపై మోపాలని చూస్తున్నారు” అని అన్నాడు. పేతురు, మిగతా అపొస్తలులు యిలా అన్నారు: “మేము దేవుని ఆజ్ఞల్ని పాటిస్తున్నాము, మానవుల ఆజ్ఞల్ని కాదు. మీరు సిలువకు వ్రేలాడదీసి చంపిన యేసును మా పూర్వికుల దేవుడు బ్రతికించాడు. దేవుడు ఆయనకు తన కుడి వైపుననున్న స్థానాన్నిచ్చాడు. ఆయన్ని ఒక అధిపతిగా, రక్షకుడిగా నియమించాడు. తద్వారా ఇశ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపం పొందే అవకాశము, తమ పాపాలకు క్షమాపణ పొందే అవకాశము కలగాలని ఆయన ఉద్దేశ్యం. వీటికి మేము సాక్షులము. దేవుడు తన ఆజ్ఞల్ని పాటించిన వాళ్ళకిచ్చిన పవిత్రాత్మ కూడా దీనికి సాక్షి.” ఇది విని వాళ్ళకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు అపొస్తలులను చంపాలనుకున్నారు. కాని “గమలీయేలు” అనే పరిసయ్యుడు ఆ మహాసభలో లేచి నిలుచొని అపొస్తలుల్ని కొంతసేపు అవతలకు తీసుకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. గమలీయేలు ధర్మశాస్త్ర పండితుడు. ప్రజల గౌరవం పొందినవాడు. అతడు వాళ్ళని సంబోధిస్తూ, “ఇశ్రాయేలు ప్రజలారా! వీళ్ళను ఏమి చెయ్యాలో జాగ్రత్తగా ఆలోచించండి! ఇదివరలో థూదా కనిపించి తానొక గొప్పవాణ్ణని చెప్పుకున్నాడు. సుమారు నాలుగువందలమంది అతణ్ణి అనుసరించారు. అతడు చంపబడ్డాడు. ఆ తర్వాత అతని అనుచరులు చెదిరిపోయారు. చివరకు ఏమీ మిగల్లేదు. అతని తర్వాత జనాభా లెక్కల కాలంలో యూదా అనే వాడు వచ్చి ప్రజల్ని చేరదీసి తిరుగుబాటు చేసాడు. ఇతడు గలిలయవాడు. ఇతడు కూడా చంపబడ్డాడు. అతని అనుచరులందరూ చెదిరిపోయారు. అందువల్ల వాళ్ళ విషయంలో నా సలహా ఇది: వాళ్ళ విషయం పట్టించుకోకండి! వాళ్ళను వదిలివేయండి! వాళ్ళ కార్యము, వాళ్ళ ఉద్దేశ్యము మానవుడు సృష్టించినదైతే అది నశిస్తుంది. అలా కాకుండా అది దైవేచ్ఛ వలన అయితే మీరు వాళ్ళను ఆపలేరు. అలా చేస్తే మీరు దేవునికి ఎదురు తిరిగిన వాళ్ళౌతారు” అని అన్నాడు. సభ్యులు అతడు చెప్పినట్లు విన్నారు. అపొస్తలుల్ని పిలిపించి కొరడా దెబ్బలు కొట్టించారు. ఆ తర్వాత, యేసు పేరిట మాట్లాడవద్దని వారించి వదిలి వేసారు. అపొస్తలులు యేసు కోసం అవమానింపబడటానికి తాము అర్హులైనందుకు సంతోషిస్తూ మహాసభనుండి వెళ్ళిపోయారు. ప్రతి రోజూ మందిరంలో, ఇంటింటా “యేసే క్రీస్తు” అని ప్రకటించారు. ఈ సువార్త ప్రకటించటం మానుకోలేదు.

అపొస్తలుల కార్యములు 5:27-42 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

వారిని తీసికొనివచ్చి సభలో నిలువబెట్టగా ప్రధానయాజకుడు వారిని చూచి–మీరు ఈ నామమునుబట్టి బోధింప కూడ దని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, యీ మనుష్యుని హత్య మామీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారని చెప్పెను. అందుకు పేతురును అపొస్తలులును–మనుష్యు లకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా. మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారుమనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణహస్తబలముచేత హెచ్చించియున్నాడు. మేమును, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, ఈ సంగతులకు సాక్షులమై యున్నామని చెప్పిరి. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొనివీరిని చంప నుద్దేశించగా సమస్త ప్రజలవలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి–ఈ మనుష్యులను కొంత సేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను –ఇశ్రాయేలీయులారా, యీ మనుష్యుల విషయమై మీరేమి చేయబోవుచున్నారో జాగ్రత్తసుమండి. ఈ దినములకుమునుపు థూదా లేచి తానొక గొప్ప వాడనని చెప్పుకొనెను; ఇంచుమించు నన్నూరుమంది మనుష్యులు వానితో కలిసి కొనిరి, వాడు చంపబడెను, వానికి లోబడిన వారందరును చెదరి వ్యర్థులైరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి, ప్రజలను తనతోకూడ తిరుగుబాటుచేయ ప్రేరేపించెను; వాడు కూడ నశించెను, వానికి లోబడినవారందరును చెదరి పోయిరి. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా–ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనయైనను ఈ కార్యమైనను మనుష్యులవలన కలిగినదాయెనా అది వ్యర్థమగును. దేవునివలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు; మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ. వారతని మాటకు సమ్మతించి, అపొస్తలులను పిలిపించి కొట్టించి–యేసు నామమునుబట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందునవారు సంతోషించుచు మహాసభ యెదుటనుండి వెళ్లిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.