అపొస్తలుల కార్యములు 5:1-4 - Compare All Versions
అపొస్తలుల కార్యములు 5:1-4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అననీయ అను ఒక మనుష్యుడు తన భార్యయైన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్యయెరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను. అప్పుడు పేతురు –అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీయొద్ద నున్నపుడు నీదే గదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై యుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించు కొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను.
అపొస్తలుల కార్యములు 5:1-4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అననీయ అనే ఒక వ్యక్తి తన భార్య సప్పీరాతో కలిసి పొలం అమ్మాడు. భార్యకు తెలిసే అతడు ఆ డబ్బులో కొంత దాచుకుని కొంత తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. అప్పుడు పేతురు, “అననీయా!, నీ భూమి ఖరీదులో కొంత దాచుకుని సాతాను ప్రేరణకు లొంగి పరిశుద్ధాత్మను ఎందుకు మోసగించావు? అది నీ దగ్గరున్నపుడు నీదే గదా? అమ్మిన తరువాత ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఈ సంగతిని ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడావు” అని అతనితో చెప్పాడు.
అపొస్తలుల కార్యములు 5:1-4 TERV (పవిత్ర బైబిల్)
“అననీయ” అనబడే ఒక వ్యక్తి, అతని భార్య “సప్పీరా” కలిసి తమ భూమి అమ్మేసారు. “అననీయ” తన కొరకు కొంత డబ్బు దాచుకొన్నాడు. ఈ విషయం అతని భార్యకు తెలుసు. “అననీయ” మిగతా డబ్బు తెచ్చి అపొస్తలుల కాళ్ళ ముందుంచాడు. అప్పుడు పేతురు ఈ విధంగా అన్నాడు: “అననీయా, నీ మనస్సులో సాతాను ఎందుకు చేరాడు? భూమి అమ్మగా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని దాచి పవిత్రాత్మను ఎందుకు మోసం చేసావు? అది అమ్మక ముందు కూడా నీదే కదా! అమ్మిన తర్వాత కూడా ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఇలా చెయ్యటానికి నీకెట్లా బుద్ధి పుట్టింది? నీవు మనుష్యులతో కాదు అబద్ధం ఆడింది, దేవునితో.”
అపొస్తలుల కార్యములు 5:1-4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అననీయ అనేవాడు తన భార్యయైన సప్పీరాతో కలిసి తన పొలాన్ని అమ్మాడు. అతడు తన భార్యకు తెలిసే ఆ అమ్మిన డబ్బు నుండి కొంత దాచుకొని, మిగిలిన దానిని తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. అప్పుడు పేతురు, “అననీయా, పొలాన్ని అమ్మిన డబ్బులో కొంత నీవు దాచుకొని పరిశుద్ధాత్మతో అబద్ధమాడడానికి ఎలా సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించాడు? అమ్మక ముందు అది నీదే కాదా? దానిని అమ్మిన తర్వాత ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! అలాంటప్పుడు ఇలాంటి పని చేయాలని నీవు ఎలా ఆలోచించావు? నీవు మనుష్యులతో కాదు కాని దేవునితోనే అబద్ధమాడావు” అన్నాడు.