అపొస్తలుల కార్యములు 5:1-16
అపొస్తలుల కార్యములు 5:1-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అననీయ అనేవాడు తన భార్యయైన సప్పీరాతో కలిసి తన పొలాన్ని అమ్మాడు. అతడు తన భార్యకు తెలిసే ఆ అమ్మిన డబ్బు నుండి కొంత దాచుకొని, మిగిలిన దానిని తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. అప్పుడు పేతురు, “అననీయా, పొలాన్ని అమ్మిన డబ్బులో కొంత నీవు దాచుకొని పరిశుద్ధాత్మతో అబద్ధమాడడానికి ఎలా సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించాడు? అమ్మక ముందు అది నీదే కాదా? దానిని అమ్మిన తర్వాత ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! అలాంటప్పుడు ఇలాంటి పని చేయాలని నీవు ఎలా ఆలోచించావు? నీవు మనుష్యులతో కాదు కాని దేవునితోనే అబద్ధమాడావు” అన్నాడు. అననీయ ఆ మాటలు విని, వెంటనే క్రిందపడి చనిపోయాడు. జరిగిన విషయాన్ని విన్నవారందరిలో గొప్ప భయం పుట్టింది. అప్పుడు కొంతమంది యువకులు వచ్చి, అతని శరీరాన్ని బట్టలతో చుట్టి, మోసుకువెళ్లి పాతిపెట్టారు. మూడు గంటల తర్వాత, జరిగిన సంగతి తెలియని అతని భార్య లోపలికి వచ్చింది. పేతురు ఆమెను, “నీవు అననీయ కలిసి ఆ పొలాన్ని ఇంతకే అమ్మారా? నాకు చెప్పు” అని అడిగాడు. అందుకు ఆమె, “అవును, ఇంతకే అమ్మాము” అని జవాబిచ్చింది. అందుకు పేతురు ఆమెతో, “ప్రభువు ఆత్మను పరీక్షించడానికి మీరు ఎందుకు ఒక్కటయ్యారు? ఇదిగో, నీ భర్తను పాతిపెట్టిన వారి పాదాలు గుమ్మం దగ్గరే ఉన్నాయి, వారు నిన్ను కూడా మోసుకుపోతారు” అన్నాడు. ఆ క్షణమే ఆమె అతని పాదాల దగ్గర పడి చనిపోయింది. అప్పుడు ఆ యువకులు లోపలికి వచ్చి, ఆమె చనిపోయిందని చూసి, ఆమె శరీరాన్ని మోసుకుపోయి తన భర్త ప్రక్కనే ఆమెను పాతిపెట్టారు. సంఘంలో ఈ సంగతులను విన్నవారందరిలో గొప్ప భయం పుట్టింది. అపొస్తలులు ప్రజల మధ్యలో అనేక సూచకక్రియలను, అద్భుతాలను చేశారు. విశ్వసించిన వారందరు సొలొమోను మండపంలో కలుసుకొనేవారు. ప్రజలు వారిని చాలా గౌరవించినప్పటికి, ఎవరు వారితో కలిసే ధైర్యం చేయలేకపోయారు. అయినా, మరి ఎక్కువ సంఖ్యలలో స్త్రీలు పురుషులు ప్రభువును నమ్ముకొని విశ్వాసుల గుంపులో చేరారు. అపొస్తలుల కార్యాలను బట్టి అనేకమంది రోగులను మంచాల మీద తీసుకువచ్చి, పేతురు వెళ్లేటప్పుడు అతని నీడ పడినా చాలని భావించి వీధుల్లో పరుపు మీద పడుకోబెట్టారు. యెరూషలేము చుట్టుప్రక్కల ఉన్న పట్టణపు ప్రజలు తీసుకుని వచ్చిన రోగులు అపవిత్రాత్మలతో పీడింపడే వారందరు కూడా స్వస్థపడ్డారు.
అపొస్తలుల కార్యములు 5:1-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అననీయ అనే ఒక వ్యక్తి తన భార్య సప్పీరాతో కలిసి పొలం అమ్మాడు. భార్యకు తెలిసే అతడు ఆ డబ్బులో కొంత దాచుకుని కొంత తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. అప్పుడు పేతురు, “అననీయా!, నీ భూమి ఖరీదులో కొంత దాచుకుని సాతాను ప్రేరణకు లొంగి పరిశుద్ధాత్మను ఎందుకు మోసగించావు? అది నీ దగ్గరున్నపుడు నీదే గదా? అమ్మిన తరువాత ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఈ సంగతిని ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడావు” అని అతనితో చెప్పాడు. అననీయ ఈ మాటలు వింటూనే కుప్పకూలి ప్రాణం విడిచాడు. అది విన్న వారందరికీ చాలా భయం వేసింది. అప్పుడు కొందరు యువకులు వచ్చి అతణ్ణి గుడ్డలో చుట్టి మోసుకుపోయి పాతిపెట్టారు. సుమారు మూడుగంటల తరువాత అతని భార్య ఏం జరిగిందో తెలియక లోపలికి వచ్చింది. అప్పుడు పేతురు, “మీరు ఆ పొలాన్ని ఇంతకే అమ్మారా? నాతో చెప్పు” అని ఆమెనడిగాడు. అందుకామె, “అవును, యింతకే అమ్మాము” అని చెప్పింది. అందుకు పేతురు, “ప్రభువు ఆత్మను పరీక్షించడానికి మీరెందుకు ఒకటయ్యారు? ఇదిగో, నీ భర్తను పాతిపెట్టిన వారింకా లోపలికైనా రాలేదు. వారు నిన్నూ మోసికుని పోతారు” అని ఆమెతో చెప్పాడు. వెంటనే ఆమె అతని కాళ్ళ దగ్గర పడి ప్రాణం విడిచింది. ఆ యువకులు లోపలికి వచ్చి ఆమె చనిపోయిందని చూసి ఆమెనూ మోసికొనిపోయి, ఆమె భర్త పక్కనే పాతిపెట్టారు. సంఘమంతటికీ, ఇంకా ఈ సంగతులు విన్న వారందరికీ చాలా భయం వేసింది. ప్రజల మధ్య అపొస్తలుల ద్వారా అనేక సూచకక్రియలూ అద్భుతాలూ జరుగుతూ ఉన్నాయి. నమ్మిన వారంతా కలిసి సొలొమోను మంటపంలో కలుసుకుంటూ ఉన్నారు. తక్కిన వారిలో ఎవరికీ వారితో కలిసే ధైర్యం లేదు. అయితే సామాన్య ప్రజలు వారిని గౌరవిస్తూ ఉన్నారు. చాలా మంది స్త్రీ పురుషులు విశ్వసించి ప్రభువు పక్షాన చేరారు. పేతురు వస్తూ ఉంటే ప్రజలు రోగులను వీధుల్లోకి తెచ్చి, వారి మీద అతని నీడ అయినా పడాలని మంచాల మీదా పరుపుల మీదా వారిని ఉంచారు. యెరూషలేము చుట్టూ ఉన్న పట్టణాల్లోని ప్రజలు, రోగులనూ దురాత్మల చేత బాధల పాలౌతున్న వారిని తీసుకొచ్చారు. వారంతా బాగుపడ్డారు.
అపొస్తలుల కార్యములు 5:1-16 పవిత్ర బైబిల్ (TERV)
“అననీయ” అనబడే ఒక వ్యక్తి, అతని భార్య “సప్పీరా” కలిసి తమ భూమి అమ్మేసారు. “అననీయ” తన కొరకు కొంత డబ్బు దాచుకొన్నాడు. ఈ విషయం అతని భార్యకు తెలుసు. “అననీయ” మిగతా డబ్బు తెచ్చి అపొస్తలుల కాళ్ళ ముందుంచాడు. అప్పుడు పేతురు ఈ విధంగా అన్నాడు: “అననీయా, నీ మనస్సులో సాతాను ఎందుకు చేరాడు? భూమి అమ్మగా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని దాచి పవిత్రాత్మను ఎందుకు మోసం చేసావు? అది అమ్మక ముందు కూడా నీదే కదా! అమ్మిన తర్వాత కూడా ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఇలా చెయ్యటానికి నీకెట్లా బుద్ధి పుట్టింది? నీవు మనుష్యులతో కాదు అబద్ధం ఆడింది, దేవునితో.” ఈ మాటలు విని అననీయ క్రింద పడి ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటనని విన్నవాళ్ళందరికీ ఒక పెద్ద భయం పట్టుకుంది. కొందరు యువకులు ముందుకొచ్చి అననీయ దేహాన్ని ఒక వస్త్రంలో చుట్టి మోసుకెళ్ళి సమాధి చేసారు. మూడు గంటల తర్వాత అననీయ భార్య అక్కడికి వచ్చింది. అక్కడ జరిగిందేదీ ఆమెకు తెలియదు. పేతురు, “మీరు భూమి అమ్మగా లభించిన డబ్బు యింతేనా? చెప్పు!” అని ఆమెను అడిగాడు. “ఔను! అంతే డబ్బు లభించింది” అని ఆమె సమాధానం చెప్పింది. పేతురు ఆమెతో, “నీవు, నీ భర్త కలిసి ప్రభువు ఆత్మను పరీక్షించాలని ఎందుకు నిశ్చయించుకున్నారు? ఆ తలుపు దగ్గరనుండి వస్తున్న అడుగుల చప్పుడు విను! అవి నీ భర్తను సమాధి చేసినవాళ్ళవి. వాళ్ళు నిన్ను కూడా మోసుకు వెళ్తారు” అని అన్నాడు. తక్షణమే ఆమె అతని పాదాలముందు పడి ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత యువకులు లోపలికి వచ్చి ఆమె చనిపోయి ఉండటం చూసి ఆమెను కూడా మోసుకు వెళ్ళి ఆమె భర్త ప్రక్కన సమాధి చేసారు. సంఘానికి, ఈ సంఘటనలు విన్నవాళ్ళకు పెద్ద భయం పట్టుకుంది. అపొస్తలులు, విశ్వాసులు ఉమ్మడిగా సొలొమోను మండపంలో సమావేశమౌతూ ఉండేవాళ్ళు. వీళ్ళు ప్రజల్లో ఎన్నో అద్భుతాలు, మహత్యాలు చేసారు. ప్రజలు అపొస్తలుల్ని పొగుడుతూ ఉన్నప్పటికీ మిగతావాళ్ళు వాళ్ళతో చేరడానికి తెగించలేదు. చాలా మంది స్త్రీలు, పురుషులు ప్రభువును విశ్వసించారు. ప్రభువు వాళ్ళను సంఘంలో చేర్చాడు. ఇవి చూసిన ప్రజలు జబ్బుతో ఉన్నవాళ్ళను దారి మీదికి తెచ్చి పరుపుల మీద చాపల మీద పడుకోబెట్టారు. పేతురు ఆ దారి మీదుగా నడిచినప్పుడు అతని నీడ కొందరి మీదనన్నా పడుతుందని వాళ్ళ ఉద్దేశ్యం. ప్రజలు యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాంతాలనుండి గుంపులు గుంపులుగా వచ్చారు. తమలో జబ్బుతో ఉన్నవాళ్ళను, దయ్యాలు పట్టి బాధపడ్తున్నవాళ్ళను తీసుకు వచ్చారు. వాళ్ళందరికీ నయమైపోయింది.
అపొస్తలుల కార్యములు 5:1-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అననీయ అను ఒక మనుష్యుడు తన భార్యయైన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్యయెరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను. అప్పుడు పేతురు –అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీయొద్ద నున్నపుడు నీదే గదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై యుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించు కొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయ యీ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినినవారికందరికిని మిగుల భయము కలిగెను; అప్పుడు పడుచు వారు లేచి వానిని బట్టతో చుట్టి మోసికొనిపోయి పాతిపెట్టిరి. ఇంచుమించు మూడు గంటల సేపటికి వానిభార్య జరిగినది యెరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు–మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె–అవును ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు–ప్రభువుయొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టినవారి పాదములు వాకిటనే యున్నవి; వారు నిన్నును మోసికొని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదములయొద్దపడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు, లోపలికి వచ్చి, ఆమె చనిపోయినది చూచి, ఆమెను మోసికొనిపోయి, ఆమె పెనిమిటియొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికిని, ఈ సంగతులు వినినవారికందరికిని మిగుల భయము కలిగెను. ప్రజలమధ్య అనేకమైన సూచకక్రియలును మహ త్కార్యములును అపొస్తలులచేత చేయబడుచుండెను. మరియు వారందరు ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. కడమవారిలో ఎవడును వారితో కలిసి కొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులును స్త్రీలును అనేకులు మరియెక్కు వగ విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. అందు చేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి, వారిలో ఎవనిమీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచములమీదను పరుపులమీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మలచేత పీడింపబడిన వారిని మోసికొని కూడివచ్చిరి. వారందరు స్వస్థత పొందిరి.