అపొస్తలుల కార్యములు 4:1-8
అపొస్తలుల కార్యములు 4:1-8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
పేతురు యోహానులు ప్రజలతో మాట్లాడుతున్నపుడు యాజకులు దేవాలయ కావలివారి అధిపతి సద్దూకయ్యులు వారి దగ్గరకు వచ్చారు. అపొస్తలులు ప్రజలకు యేసును గురించి బోధిస్తూ, ఆయన మృతుల నుండి తిరిగి లేచాడని ప్రకటించడం విని వారు చాలా కలవరపడ్డారు. వారు పేతురు యోహానులను పట్టుకుని, సాయంకాలం కావడంతో, మరుసటిరోజు వరకు వారిని చెరసాలలో బంధించారు. కానీ సువార్తను విన్న అనేకమంది నమ్మారు; ఆ విధంగా నమ్మినవారిలో పురుషుల సంఖ్య సుమారు అయిదువేల వరకు పెరిగింది. మరుసటిరోజు అధికారులు, యూదా నాయకులు ధర్మశాస్త్ర ఉపదేశకులు యెరూషలేములో కలుసుకొన్నారు. ముఖ్య యాజకుడు అన్నా, అతని అల్లుడు కయప, యోహాను, అలెగ్జాండరు ప్రధాన యాజకుని ఇతర కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు. వారు పేతురు యోహానులను తీసుకువచ్చి వారి ముందు నిలబెట్టి, “మీరు ఈ పనిని ఏ అధికారంతో ఏ పేరిట చేశారు?” అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నిండుకొని, వారితో, “అధికారులారా, ప్రజా నాయకులారా!
అపొస్తలుల కార్యములు 4:1-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పేతురు యోహానులు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నపుడు యాజకులూ, ద్వారపాలకుల అధికారీ, సద్దూకయ్యులూ వారి దగ్గరికి వచ్చారు. వారు యేసుని గూర్చి బోధిస్తూ ఆయన చనిపోయి తిరిగి లేచాడని ప్రకటించడం విని కలవరపడ్డారు. వారిని బలవంతంగా పట్టుకుని, సాయంకాలం అయిందని మరునాటి వరకూ వారిని ఖైదులో ఉంచారు. కానీ వాక్కు విన్న వారిలో చాలామంది నమ్మారు. వారిలో పురుషుల సంఖ్య దాదాపు ఐదు వేలు. మరుసటి రోజు వారి అధికారులూ పెద్దలూ ధర్మశాస్త్ర పండితులూ యెరూషలేములో సమావేశమయ్యారు. ప్రధాన యాజకుడైన అన్న, కయప, యోహాను, అలెగ్జాండర్, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో ఉన్నారు. వారు పేతురు యోహానులను వారి మధ్యలో నిలబెట్టి, “మీరు ఏ అధికారంతో ఏ నామంలో దీన్ని చేశారు?” అని అడిగారు. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇలా అన్నాడు, “ప్రజల అధికారులారా, పెద్దలారా
అపొస్తలుల కార్యములు 4:1-8 పవిత్ర బైబిల్ (TERV)
యాజకులు, మందిరం యొక్క ద్వారపాలకుల అధిపతి, సద్దూకయ్యులు కలిసి పేతురు, యోహాను ఉన్న చోటికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు ప్రజలకు ఉపదేశిస్తూ ఉన్నారు. ఆ అపొస్తలులు ప్రజలకు ఉపదేశించటం, యేసును ఉదాహరణగా తీసుకొని చనిపోయినవాళ్ళు బ్రతికి వస్తారని ప్రకటించటం విని వాళ్ళకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు పేతురును, యోహానును బంధించారు. అప్పటికే సాయంకాలమై ఉండటం వల్ల మరుసటి రోజు దాకా వాళ్ళను బంధించి ఉంచారు. వాళ్ళ సందేశాన్ని విని అనేకులు విశ్వాసులయ్యారు. ఆ విశ్వాసుల సంఖ్య సుమారు అయిదు వేలదాకా పెరిగిపోయింది. మరుసటి రోజు నాయకులు, పెద్దలు, పండితులు యెరూషలేములో సమావేశం అయ్యారు. “అన్న” అనే ప్రధాన యాజకుడు, కయప, యోహాను, అలెక్సంద్రు, ప్రధాన యాజకుని కుటుంబానికి చెందినవాళ్ళంతా ఆ సమావేశంలో ఉన్నారు. పేతురును, యోహానును వీళ్ళ ముందుకు పిలుచుకు వచ్చారు. “ఏ అధికారంతో, ఎవరి పేరిట మీరాపని చేసారు?” అని వాళ్ళు ప్రశ్నించటం మొదలు పెట్టారు. అదే సమయంలో, పేతురు పవిత్రాత్మతో నిండినవాడై వాళ్ళకు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ప్రజా నాయకులారా! పెద్దరాలా!
అపొస్తలుల కార్యములు 4:1-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారు ప్రజలతో మాటలాడుచుండగా, యాజకులును దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులును వారు ప్రజ లకు బోధించుటయు, యేసునుబట్టి మృతులలోనుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారిమీదికివచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని, సాయంకాలమైనందున మరునాటివరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినినవారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్యయించుమించు అయిదువేలు ఆయెను. మరునాడు వారి అధికారులును పెద్దలును శాస్త్రులును యెరూషలేములో కూడుకొనిరి. ప్రధానయాజకుడైన అన్నయు కయపయు, యోహానును అలెక్సంద్రును ప్రధానయాజకుని బంధువులందరు వారితోకూడ ఉండిరి. వారు పేతురును యోహానునుమధ్యను నిలువబెట్టి– మీరు ఏ బలముచేత ఏ నామమునుబట్టి దీనిని చేసితిరని అడుగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై యిట్లనెను –ప్రజల అధికారులారా, పెద్దలారా