అపొస్తలుల కార్యములు 28:1-14

అపొస్తలుల కార్యములు 28:1-14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

మేము క్షేమంగా ఒడ్డు చేరుకొన్న తర్వాత, ఆ ద్వీపం పేరు మాల్తే అని తెలుసుకున్నాము. ఆ ద్వీపవాసులు మా పట్ల ఎంతో దయ చూపించారు. అప్పుడు వర్షం పడుతూ చలిగా ఉండడంతో వారు మంట వెలిగించి మా అందరిని చేర్చుకున్నారు. పౌలు కొన్ని కట్టెలు ఏరి మంటలో పెడుతున్నప్పుడు, ఆ మంట వేడికి ఒక పాము బయటకు వచ్చి, అతని చేతిని పట్టుకుంది. పాము అతని చేతికి వేలాడడం చూసిన ఆ ద్వీపవాసులు తమలో తాము, “ఈ వ్యక్తి ఖచ్చితంగా హంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకున్నా, న్యాయదేవత ఇతన్ని బ్రతకనివ్వడం లేదు” అని చెప్పుకొన్నారు. అయితే పౌలు తన చేతిని విదిలించి ఆ పామును మంటలో వేశాడు దానివల్ల అతనికి ఎలాంటి హాని కలుగలేదు. ప్రజలు అతని శరీరం వాపు వస్తుందని లేదా అకస్మాత్తుగా మరణిస్తాడని అనుకున్నారు; కానీ చాలాసేపు చూసిన తర్వాత కూడా అతనికి ఏ ప్రమాదం జరుగకపోవడం చూసి, తమ మనస్సులను మార్చుకొని, ఇతడు ఒక దేవున్ని చెప్పసాగారు. పొప్లి అనేవాడు ఆ ద్వీపానికి ముఖ్యుడు, ఆ ప్రాంతంలో అతనికి భూములు ఉన్నాయి. అతడు మమ్మల్ని తన ఇంటికి ఆహ్వానించి మూడు రోజులు మంచి ఆతిథ్యం ఇచ్చాడు. ఆ సమయంలో పొప్లి తండ్రి జ్వరం, రక్త విరేచనాలతో బాధపడుతూ అనారోగ్యంతో మంచం పట్టి ఉన్నాడు. పౌలు అతన్ని చూడడానికి వెళ్లి, ప్రార్థన చేసిన తర్వాత తన చేతులను అతని మీద ఉంచి స్వస్థపరిచాడు. ఇది జరిగినప్పుడు, ఆ ద్వీపంలోని మిగిలిన రోగులు కూడా వచ్చి స్వస్థత పొందుకున్నారు. వారు అనేక సత్కారాలతో మాకు మర్యాద చేశారు; మేము ఓడలో ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మాకు కావలసిన వస్తువులన్నిటిని తెచ్చి ఓడలో ఉంచారు. మేము మూడు నెలలు ద్వీపంలో శీతాకాలం గడిపిన తర్వాత కాస్టర్, పోలుక్స్ అనే కవల దేవతల చిహ్నం కలిగిన అలెక్సంద్రియ పట్టణానికి వెళ్లే ఓడ ఎక్కి బయలుదేరాము. మేము సురకూసై పట్టణానికి వచ్చి అక్కడ మూడు రోజులు ఉన్నాము. అక్కడినుండి ఓడలో బయలుదేరి రేగియు అనే పట్టణానికి వచ్చాము, మరుసటిరోజు దక్షిణపు గాలి విసరడంతో పొతియొలీ పట్టణానికి చేరుకొన్నాము. అక్కడ కలిసిన కొందరు సహోదర సహోదరీలు తమతో ఒక వారం రోజులు ఉండమని మమ్మల్ని వేడుకున్నారు. ఆ విధంగా మేము రోమా పట్టణానికి చేరుకున్నాము.

అపొస్తలుల కార్యములు 28:1-14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మేము తప్పించుకొన్న తరువాత ఆ ద్వీపం మెలితే అని మాకు తెలిసింది. అనాగరికులైన అక్కడి ప్రజలు మాకు చేసిన సపర్య అంతా ఇంతా కాదు. అప్పుడు వర్షం కురుస్తూ చలిగా ఉండడంతో వారు నిప్పు రాజబెట్టి మా అందరినీ చేర్చుకున్నారు. అప్పుడు పౌలు కొన్ని పుల్లలేరి నిప్పుల మీద వేస్తుండగా ఒక పాము ఆ వేడికి బయటికి వచ్చి అతని చెయ్యి పట్టుకుంది. ఆ ప్రజలు ఆ పాము అతని చేతిని పట్టుకుని వేలాడడం చూసి “ఈ మనిషి తప్పకుండా హంతకుడై ఉంటాడు. ఇతడు సముద్రం నుండి తప్పించుకున్నప్పటికీ న్యాయం ఇతణ్ణి వదిలిపెట్ట లేదు” అని తమలో తాము చెప్పుకున్నారు. కానీ పౌలు మాత్రం ఆ విష జంతువును మంటలో జాడించివేసి, ఏ హానీ పొందలేదు. వారైతే అతనికి హటాత్తుగా జ్వరం వంటిది రావటమో, అతడు అకస్మాత్తుగా పడి చనిపోవడమో జరుగుతుందని కనిపెడుతున్నారు. చాలాసేపు కనిపెట్టిన తరువాత అతనికి ఏ హానీ కలగకపోవడం చూసి తమ అభిప్రాయం మార్చుకుని, “ఇతడొక దేవుడు” అని చెప్పసాగారు. పొప్లి అనేవాడు ఆ ద్వీపంలో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతంలో భూములున్నాయి. అతడు మమ్మల్ని చేర్చుకుని మూడు రోజులు స్నేహభావంతో ఆతిథ్యమిచ్చాడు. ఆ సమయంలో పొప్లి తండ్రి జ్వరం, రక్త విరేచనాల చేత బాధపడుతూ పండుకుని ఉన్నాడు. పౌలు అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, అతని మీద చేతులుంచి స్వస్థపరిచాడు. ఇది చూసి ఆ దీవిలో ఉన్న మిగిలిన రోగులు కూడా వచ్చి స్వస్థత పొందారు. వారు అనేక సత్కారాలతో మాకు మర్యాద చేసి, మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచారు. కవల దేవుళ్ళ చిహ్నంతో ఉన్న అలెగ్జాండ్రియ పట్టణపు ఓడ ఒకటి ఆ ద్వీపంలో చలికాలమంతా నిలిచి ఉంది. మూడు నెలలు అక్కడున్న తరువాత ఆ ఓడ ఎక్కి బయలుదేరి సురకూసై నగరానికి వచ్చి అక్కడ మూడు రోజులున్నాం. అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియు పట్టణం వచ్చి ఒక రోజు తరువాత దక్షిణపు గాలి విసరడంతో మరునాడు పొతియొలీ పట్టణం వచ్చాం. అక్కడి సోదరులను కలిసినప్పుడు వారు తమ దగ్గర ఏడు రోజులు ఉండమని మమ్మల్ని వేడుకున్నారు. ఆ తరువాత రోమ్ నగరానికి వచ్చాం.

అపొస్తలుల కార్యములు 28:1-14 పవిత్ర బైబిల్ (TERV)

తీరం చేరుకున్నాక ఆ ద్వీపాన్ని “మెలితే” అంటారని తెలుసుకున్నాము. ఆ ద్వీపంలో నివసించేవాళ్ళు మాపై చాలా దయచూపారు. అప్పుడు వర్షం కురుస్తూవుంది. చలి తీవ్రంగా ఉంది. వాళ్ళు చలిమంటలు వేసి మమ్మల్ని కూడా రమ్మన్నారు. పౌలు కట్టెలు ప్రోగుచేసి ఆ మోపును మంటపై వేసాడు. ఆ కట్టెల మోపునుండి ఒక పాము ఆ వేడికి తట్టుకోలేక వెలుపలికి వచ్చి, పౌలు చేతిని కరిచి దాని పళ్ళతో పట్టుకుంది. ఆ ద్వీపవాసులు పౌలు చేతికి పాము వ్రేలాడి ఉండటం చూసి తమలో తాము, “ఇతడు తప్పక ఒక హంతకుడై ఉండాలి! సముద్రంనుండి తప్పించుకున్నాడు కాని, దేవుడతన్ని బ్రతుకనివ్వలేదు” అని అనుకున్నారు. కాని పౌలు, ఆ పామును మంటలోకి దులిపి వేసాడు. అతనికి ఏ హాని కలుగలేదు. వాళ్ళు అతని శరీరం వాచి పోతుందనో, లేక అతడు అకస్మాత్తుగా చనిపోతాడనో అనుకొని చాలా సేపు కాచుకున్నారు. అతనికి ఏ హాని కలగక పోవటం గమనించి, వాళ్ళు తమ మనస్సును మార్చుకొని, “అతడు ఒక దేవత” అని అన్నారు. ఆ ప్రక్కనున్న పొలాలు “పొప్లి” అనే అతనికి చెందినవి. పొప్లి ఆ ద్వీపానికి అధికారి. అతడు మమ్మల్ని తన యింటికి ఆహ్వానించి మూడు రోజుల దాకా అతిథిసత్కారాలు చేసాడు. పొప్లి తండ్రి జ్వరంతో, చీమునెత్తురు విరేచనాలతో మంచం పట్టి ఉన్నాడు. పౌలు అతణ్ణి చూడటానికి వెళ్ళాడు. దేవుణ్ణి ప్రార్థించి పౌలు తన చేతుల్ని అతని తలపై ఉంచాడు. వెంటనే అతనికి నయమైపోయింది. ఈ విధంగా జరిగిన తర్వాత ఆ ద్వీపంలో ఉన్న మిగతా రోగులు కూడా వచ్చారు. వాళ్ళక్కూడా నయమైపోయింది. ఆ ద్వీప వాసులు మమ్మల్ని ఎన్నో విధాలుగా గౌరవించి మేము ప్రయాణమయ్యేముందు మాకు కావలసిన సామగ్రి నిచ్చారు. చలికాలమంతా ఆ ద్వీపంలో ఉండిపోయిన ఒక ఓడలో మూడు నెలల తర్వాత ప్రయాణం చేసాము. అది అలెక్సంద్రియ నగరానికి చెందిన ఓడ. దాని పేరు “కవల దేవతలు.” మేము “సురకూసై” అనే పట్టణానికి చేరుకున్నాము. సురకూసైలో మేము మూడు రోజులుండి, మరల బయలు దేరాము. మేము రేగియ నగరానికి వచ్చాము. మరుసటి రోజు నైరుతి గాలి వీచటంతో మేము బయలుదేర గలిగాము. ఒక రోజు తరువాత మేము పొతియొలీ నగరం చేరాము. అక్కడున్న సోదరుల్లో కొందర్ని కలుసుకున్నాము. వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించి తమతో ఒక వారం ఉండమన్నారు. ఈ విధంగా రోమా చేరుకున్నాము.

అపొస్తలుల కార్యములు 28:1-14 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలిసికొంటిమి. అనాగరికులగు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచార మింతంతకాదు. ఏలాగనగా, అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందునవారు నిప్పురాజబెట్టి మమ్మును అందరిని చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పులమీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువతని చేతిని వ్రేలా డుట చూచినప్పుడు–నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు; ఇతడు సముద్రమునుండి తప్పించుకొనినను న్యాయమాతనిని బ్రదుకనియ్యదని తమలో తాము చెప్పు కొనిరి. అతడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించి వేసి, యే హానియు పొందలేదు. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడిచచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగకుండుట చూచి ఆ అభి ప్రాయము మాని–ఇతడొక దేవత అని చెప్పసాగిరి. పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మును చేర్చుకొని మూడుదినములు స్నేహ భావముతో ఆతిథ్య మిచ్చెను. అప్పుడు పొప్లియొక్క తండ్రి జ్వరముచేతను రక్తభేదిచేతను బాధపడుచు పండుకొని యుండెను. పౌలు అతనియొద్దకు వెళ్లి ప్రార్థనచేసి, అతనిమీద చేతులుంచి స్వస్థపరచెను. ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడ వచ్చి స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కారములతో మమ్మును మర్యాద చేసి, మేము ఓడ ఎక్కి వెళ్లినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. మూడు నెలలైన తరువాత, ఆ ద్వీపమందు శీతకాల మంతయు గడపిన అశ్వినీ చిహ్నముగల అలెక్సంద్రియ పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరి సురకూసైకి వచ్చి అక్కడ మూడుదినములుంటిమి. అక్కడనుండి చుట్టు తిరిగి రేగియుకు వచ్చి యొక దినమైన తరువాత దక్షిణపు గాలి విసరుటవలన మరునాడు పొతియొలీకి వచ్చితిమి. అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద ఏడు దినములుండవలెనని మమ్మును వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితిమి.