అపొస్తలుల కార్యములు 24:1-16

అపొస్తలుల కార్యములు 24:1-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అయిదు రోజుల తర్వాత ప్రధాన యాజకుడైన అననీయా కొందరు యూదా నాయకులు, తెర్తుల్లు అనే ఒక న్యాయవాదితో కలిసి కైసరయ పట్టణానికి వచ్చి పౌలుకు వ్యతిరేకంగా తమ ఫిర్యాదులను అధిపతికి తెలియజేశారు. పౌలును ఫెలిక్స్ ముందు నిలబెట్టిన తర్వాత, తెర్తుల్లు తన ఫిర్యాదులను అధిపతికి ఇలా తెలియజేశాడు: “ఘనత వహించిన ఫెలిక్స్ అధిపతి, మీ పాలనలో మీరు ముందు చూపుతో ఎన్నో సంస్కరణలు ఈ దేశానికి తెచ్చినందుకు మేము చాలా కాలం నుండి శాంతి కలిగి సంతోషంగా ఉన్నాము. ఈ విషయాన్ని ప్రతిచోట అన్ని విధాలుగా పూర్ణ కృతజ్ఞతతో మేము అంగీకరిస్తున్నాము. మిమ్మల్ని మరింత ఇబ్బందికి గురిచేయకుండా, మేము క్లుప్తంగా చెప్పేదానిని దయచేసి వినండని ప్రాధేయపడుతున్నాను. “ఇతడు లోకమంతట యూదులలో కలహాలను రేపుతూ ఇబ్బంది కలిగిస్తున్నాడు. నజరేయులు అనే మతశాఖకు ఇతడు నాయకుడు. ఇతడు దేవాలయాన్ని కూడా అపవిత్రం చేయాలని చూశాడు, కాబట్టి మేము ఇతన్ని పట్టుకున్నాము. మేము ఇతన్ని మా ధర్మశాస్త్రం ప్రకారం విచారణ చేస్తున్నాము. అయితే అధిపతి లూసియ వచ్చి ఇతన్ని మా దగ్గర నుండి బలవంతంగా తీసుకెళ్లి, ఇతనిపై ఫిర్యాదు చేసినవారు మీ ముందుకు రావాలి అని ఆదేశించాడు. మీరు ఇతన్ని విచారణ చేస్తే మేము ఇతనిపై చేసిన ఫిర్యాదులు సత్యమని మీరే తెలుసుకుంటారు” అని చెప్పాడు. అప్పుడు మిగిలిన యూదులు అతనితో ఏకీభవించి, ఆ ఫిర్యాదులు సత్యమే అని చెప్పారు. అధిపతి పౌలును మాట్లాడమని సైగ చేసినప్పుడు, అతడు ఈ విధంగా సమాధాన ఇచ్చాడు: “మీరు అనేక సంవత్సరాలుగా ఈ దేశానికి న్యాయాధికారిగా ఉన్నారని నాకు తెలుసు కాబట్టి నేను సంతోషంగా నా సమాధానాన్ని తెలియజేయగలను. నేను ఆరాధించడానికి యెరూషలేముకు వెళ్లి ఈ రోజుతో పన్నెండు రోజులే అవుతున్నాయని మీరు సులభంగా విచారించి తెలుసుకోగలరు. దేవాలయంలో కాని సమాజమందిరంలో కాని పట్టణంలో కాని మరెక్కడైనా నేను ఎవరితోనైనా వాదించడం లేదా ప్రజలమధ్య అల్లరి రేపడం కాని నా మీద ఫిర్యాదు చేసినవారు కనుగొనలేదు. వారు నాపై చేసిన ఫిర్యాదు నిజమని వారే నిరూపించలేరు. ఏది ఏమైనా, మతశాఖకు చెందినదని పిలువబడుతున్న ఈ మార్గాన్ని వెంబడించేవానిగా, నేను మన పూర్వికుల దేవునినే ఆరాధిస్తున్నానని ఒప్పుకుంటాను. నేను ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల గ్రంథాల్లో వ్రాసిన ప్రకారం అన్నిటిని నమ్ముతున్నాను. అలాగే నీతిమంతులకు దుర్మార్గులకు పునరుత్థానం ఉందని వీరికున్న నిరీక్షణనే నేను కూడా కలిగి ఉన్నాను. కాబట్టి నా మనస్సాక్షిని దేవుడు మనిషి ముందు స్పష్టంగా ఉంచడానికి నేనెల్లప్పుడు ప్రయాసపడుతున్నాను.

అపొస్తలుల కార్యములు 24:1-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఐదు రోజుల తరువాత ప్రధాన యాజకుడు అననీయ, కొందరు పెద్దలు, తెర్తుల్లు అనే ఒక న్యాయవాది కైసరయ వచ్చి, పౌలు మీద మోపిన ఫిర్యాదును గవర్నరుకి తెలియజేశారు. పౌలు గవర్నర్ ఎదుట నిలబడినప్పుడు తెర్తుల్లు అతని మీద నేరం మోపుతూ ఇలా అన్నాడు. “మహా ఘనత వహించిన ఫేలిక్స్, పౌలు గవర్నర్ ఎదుట నిలబడినప్పుడు ఎంతో నెమ్మది అనుభవిస్తున్నామనీ, ఈ దేశ ప్రజలకు కలిగే అనేక సమస్యలు మీ ద్వారా పరిష్కారం అవుతున్నాయనీ ఒప్పుకొంటున్నాము. ఆ కారణంగా మేము అన్ని విధాలా, అన్ని చోట్లా మీ పట్ల పూర్ణ కృతజ్ఞత కలిగి ఉన్నాం. నేను మీకు ఎక్కువ విసుగు పుట్టించకుండా క్లుప్తంగా చెప్పే విషయాలను మీరు సహనంతో వినాలని వేడుకొంటున్నాను. ఈ వ్యక్తి ఒక చీడలాంటి వాడు. భూమిపై ఉన్న యూదులందరినీ తిరుగుబాటుకు రేపుతున్నాడు. ఇతడు నజరేయులనే మతశాఖకు నాయకుడని మేము గమనించాం. పైగా ఇతడు దేవాలయాన్ని కూడా అపవిత్రం చేయడానికి ప్రయత్నించాడు. అందువలన మేము అతణ్ణి నిర్బంధించాం అయితే మీ సైనికాధికారి లూసియస్ వచ్చి బలవంతంగా పౌలును మా చేతుల్లోనుంచి విడిపించి తీసుకుపోయాడు. వీటిని గురించి మీరు పౌలును ప్రశ్నిస్తే మేము ఇతని మీద మోపుతున్న నేరాలన్నీ వాస్తవమని మీకే అర్థం అవుతుంది.” యూదులంతా ఏకీభవించి ఈ మాటలు నిజమే అని చెప్పారు. అప్పుడు గవర్నర్, పౌలును మాట్లాడమని సైగ చేశాడు. పౌలు ఇలా అన్నాడు, “మీరు అనేక సంవత్సరాలుగా ఈ ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నారని తెలిసి నేను ధైర్యంగా జవాబు చెప్పుకుంటున్నాను. నేను యెరూషలేములో ఆరాధించడానికి వెళ్ళి కేవలం పన్నెండు రోజులు మాత్రమే అయ్యిందని మీరు విచారించి తెలుసుకోవచ్చు. దేవాలయంలోగానీ, సమాజ మందిరాల్లోగానీ, పట్టణంలోగానీ, నేను ఎవరితోనైనా తర్కించడం, లేదా ప్రజల మధ్య అల్లరి రేపడం ఎవరూ చూడలేదు. వారు ఇప్పుడు నా మీద మోపే నేరాలను మీకు రుజువు పరచలేరు. అయితే ఒక సంగతి మీ ఎదుట ఒప్పుకుంటున్నాను. ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాల్లో రాసి ఉన్నవన్నీ నమ్మి, నీతిపరులకూ అనీతిపరులకూ పునరుత్థానం కలుగుతుందని వీరు నమ్ముతున్నట్టుగానే నేను కూడా దేవునిలో నమ్మకముంచి, వారు మతశాఖ అని పిలిచిన ఈ మార్గంలోనే నా పూర్వీకుల దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. ఈ విధంగా నేను దేవుని పట్లా, మనుష్యుల పట్లా ఎప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషంగా ఉండేలా చూసుకుంటున్నాను.

అపొస్తలుల కార్యములు 24:1-16 పవిత్ర బైబిల్ (TERV)

అయిదు రోజుల తర్వాత ప్రధాన యాజకుడైన అననీయ, కొంతమంది పెద్దలతో, తెర్తుల్లు అనబడే న్యాయవాదితో కలిసి కైసరియ చేరుకున్నాడు. పౌలు పట్ల తాము చేయదలచిన నేరారోపణల్ని రాష్ట్రాధిపతి ముందు ఉంచాడు. తెర్తుల్లు తన వాదనను ప్రారంభిస్తూ, “మీ పాలనలో చాలాకాలం శాంతంగా జీవించాము. ఇది మా అదృష్టం. మీ ముందు చూపువల్ల ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు జరిగాయి. “మహా ఘనత పొందిన ఫేలిక్సు ప్రభూ! మీరు చేసిన వాటిని అన్ని ప్రాంతాల్లో ఉన్న మా ప్రజలు, ఎంతో కృతజ్ఞతతో, సంపూర్ణంగా అంగీకరిస్తున్నారు. మిమ్మల్ని ఎక్కువగా విసిగించటం మాకు ఇష్టం లేదు. కనుక క్లుప్తంగా చెపుతాము. మేము చెప్పేది మాపై దయ ఉంచి వినమని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇతడు సమస్యలు, కష్టాలు కలిగిస్తాడని మాకు తెలిసింది. ప్రపంచంలో ఉన్న యూదులందరిలో ఇతడు అల్లర్లు లేపాడు. ఇతడు కుట్రలు పన్నే నజరేతు జాతికి నాయకుడు. ఇతడు దేవాలయాన్ని అపవిత్రం చెయ్యటానికి ప్రయత్నించాడు. మీరితణ్ణి విచారిస్తే మేము చేసిన ఆరోపణల యొక్క నిజానిజాలు మీకే తెలుస్తాయి” అని అన్నాడు. న్యాయస్థానంలో యూదులందరూ ఈ ఆరోపణలు నిజమని చెబుతూ, తెర్తుల్లు వాదనను బలపరిచారు. రాష్ట్రాధిపతి పౌలును మాట్లాడమని సంజ్ఞ చేసాడు. పౌలు ఈ విధంగా మాట్లాడటం మొదలు పెట్టాడు: “మీరు ఈ దేశంలో ఎన్నో సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నారు. అందువల్ల నేను ఆనందంగా నా నిర్దోషత్వం నిరూపిస్తాను. నేను ఆరాధించటానికి యెరూషలేము వెళ్ళి యింకా పన్నెండు రోజులు కాలేదు. నేను చెబుతున్నదానిలోని నిజానిజాలు మీరు సులభంగా విచారించవచ్చు. నాపై నేరారోపణ చేసిన వీళ్ళు నేను మందిరంలో వాదిస్తుండగా చూసారా? లేదు. సమాజమందిరంలో కాని పట్టణంలో మరెక్కడైనా కాని, నేను ప్రజల్ని పురికొల్పటం వీళ్ళు చూసారా? లేదు. వీళ్ళు ప్రస్తుతం నాపై మోపుతున్న నేరాల్ని నిరూపించలేరు. “వాళ్ళు, దేన్ని వేరొక మతంగా పరిగణిస్తారో దాన్ని నేను అనుసరిస్తున్నానని ఒప్పుకుంటాను. ఈ మార్గాన్ననుసరించి నేను మా పూర్వికుల దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. పైగా, ధర్మశాస్త్రంలో వ్రాయబడినవాటిని, మన ప్రవక్తలు వ్రాసిన వాటిని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. వాళ్ళలాగే నాకూ దేవుడంటే నమ్మకం ఉంది. వాళ్ళలాగే, సన్మార్గుడు, దుర్మార్గుడు బ్రతికి వస్తారని నేను ఎదురు చూస్తున్నాను. అందువలన నా ఆత్మను దేవుని దృష్టిలో, మానవుని దృష్టిలో మలినం కాకుండా ఉంచుకోవటానికి ఎప్పుడూ మనసారా ప్రయత్నిస్తున్నాను.

అపొస్తలుల కార్యములు 24:1-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అయిదు దినములైన తరువాత ప్రధానయాజకుడైన అననీయయు, కొందరు పెద్దలును, తెర్తుల్లు అను ఒక న్యాయ వాదియు కైసరయకు వచ్చి, పౌలుమీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి. పౌలు రప్పింపబడినప్పుడు తెర్తుల్లు అతనిమీద నేరముమోప నారంభించి యిట్లనెను– మహాఘనతవహించిన ఫేలిక్సా, మేము తమవలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు, ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటవుచున్నవనియు ఒప్పుకొని, మేము సకల విధములను సకల స్థలములలోను పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము. నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగజేయకుండ మేము క్లుప్తముగా చెప్పుకొనుదానిని తమరు ఎప్పటివలె శాంతముగా వినవలెనని వేడుకొనుచున్నాను. ఈ మనుష్యుడు పీడవంటివాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపు వాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడునై యున్నట్టు మేము కనుగొంటిమి, మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను గనుక మేము అతని పట్టుకొంటిమి. తమరు విమర్శించినయెడల మేము ఇతనిమీద మోపుచున్న నేరములన్నియు తమకే తెలియవచ్చునని చెప్పెను. యూదులందుకు సమ్మతించి యీ మాటలు నిజమే అని చెప్పిరి. అప్పుడు అధిపతి–మాటలాడుమని పౌలునకు సైగ చేయగా అతడిట్లనెను– తమరు బహు సంవత్సరములనుండి యీ జనమునకు న్యాయాధిపతులై యున్నారని యెరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొనుచున్నాను. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్లిననాటనుండి పండ్రెండు దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలిసికొన వచ్చును. దేవాలయములోనేమి, సమాజమందిరములలోనేమి, పట్టణములోనేమి, నేను ఎవనితోను తర్కించుట యైనను, జనులను గుమికూర్చుటయైనను వారు చూడలేదు. మరియు వారు ఇప్పుడు నామీద మోపు నేరములను తమరికి ఋజువుపరచలేరు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములయందును వ్రాయబడియున్నవన్నియు నమ్మి, నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగ బోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడ దేవునియందు నిరీక్షణయుంచి, వారు మతభేదమని పేరుపెట్టు ఈ మార్గముచొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరియెదుట ఒప్పుకొనుచున్నాను. ఈ విధమున నేనును దేవునియెడలను మనుష్యులయెడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసికొనుచున్నాను.