అపొస్తలుల కార్యములు 22:17-28
అపొస్తలుల కార్యములు 22:17-28 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“నేను యెరూషలేముకు తిరిగివచ్చి, దేవాలయంలో ప్రార్థిస్తున్నప్పుడు, నేను స్వాప్నిక స్థితిలోనికి వెళ్లి, ప్రభువు నాతో మాట్లాడడం చూశాను. ఆయన, ‘త్వరగా! నీవు వెంటనే యెరూషలేమును విడిచి వెళ్లు, ఎందుకంటే, నా గురించి నీవు ఇచ్చే సాక్ష్యం ఇక్కడి ప్రజలు అంగీకరించరు’ అని చెప్పారు. “అందుకు నేను, ‘ప్రభువా, నేను ఒక సమాజమందిరం నుండి మరొక సమాజమందిరానికి వెళ్తూ, నిన్ను నమ్మినవారిని చెరసాలలో వేయించి హింసించానని నీకు తెలుసు. నీకోసం హతసాక్షిగా చనిపోయిన స్తెఫెను రక్తం చిందినప్పుడు నేను అక్కడే నిలబడి దానికి సమ్మతించి, అతన్ని చంపిన వారి వస్త్రాలకు కాపలాగా ఉన్నానని తెలుసు కదా’ అన్నాను. “అప్పుడు ప్రభువు నాతో, ‘నీవు వెళ్లు, నేను నిన్ను వీరినుండి దూరంగా యూదేతరుల దగ్గరకు పంపిస్తాను’ అని చెప్పారు.” పౌలు చెప్పిందంతా ఆ ప్రజలు విని, “వీనిని భూమి మీద ఉండకుండ చేయండి! ఇలాంటివాడు బ్రతుక కూడదు!” అని బిగ్గరగా కేకలు వేశారు. ఇతడు దైవదూషణ చేస్తున్నాడని కేకలువేస్తూ తమ వస్త్రాలను విసిరివేస్తూ, దుమ్మెత్తి ఆకాశంలోనికి పోస్తున్నప్పుడు, సైన్యాధిపతి పౌలును సైనిక కోటలోకి తీసుకెళ్లి, ప్రజలు అతని గురించి ఎందుకు అలా కేకలు వేస్తున్నారో తెలుసుకోవడానికి అతన్ని కొరడాలతో కొట్టించి, విచారించమని ఆదేశించాడు. వారు అతన్ని కొరడాలతో కొట్టడానికి ఈడ్చుకొని వెళ్తున్నప్పుడు, అక్కడ నిలబడి ఉన్న శతాధిపతితో పౌలు, “ఏ నేరం నిరూపించకుండానే ఒక రోమీయుని కొరడాలతో కొట్టించడం మీకు న్యాయమేనా?” అన్నాడు. అది విన్న ఆ శతాధిపతి, తన అధిపతి దగ్గరకు వెళ్లి అతనితో, “మీరేమి చేస్తున్నారు? ఈ వ్యక్తి రోమీయుడు” అని చెప్పాడు. ఆ అధిపతి పౌలు దగ్గరకు వెళ్లి, “నీవు రోమీయుడవా?” అని అడిగాడు. “అవును, నేను రోమీయుడనే” అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఆ అధిపతి, “నేను నా రోమా పౌరసత్వాన్ని పొందడానికి ఎంతో వెల చెల్లించాను” అన్నాడు. దానికి పౌలు, “నేను పుట్టుకతోనే రోమీయుడను” అని సమాధానం చెప్పాడు.
అపొస్తలుల కార్యములు 22:17-28 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ వెంటనే నేను యెరూషలేముకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా పరవశానికి లోనై ప్రభువుని చూశాను. ఆయన నాతో, ‘నీవు వెంటనే యెరూషలేము విడిచి వెళ్ళు. నన్ను గూర్చి నీవిచ్చే సాక్ష్యం ఇక్కడి వారు అంగీకరించరు’ అని చెప్పాడు. అందుకు నేను, ‘ప్రభూ, ప్రతి సమాజ మందిరంలో నీపై నమ్మకముంచిన వారిని నేను చెరసాలలో వేయించి కొట్టించానని వారికి తెలుసు. అంతేగాక నీ సాక్షి అయిన స్తెఫను రక్తం ఒలికించినప్పుడు నేను కూడా అక్కడ నిలబడి అందుకు సమ్మతించి అతణ్ణి చంపినవారి వస్త్రాలకు కాపలా ఉన్నాను’ అని చెప్పాను. అందుకు ఆయన ‘వెళ్ళు, ఎందుకంటే నేను నిన్ను దూరంగా యూదేతరుల దగ్గరికి పంపుతాను’ అని నాతో చెప్పాడు.” ఇంతవరకూ అతడు చెప్పింది వారు చక్కగా విన్నారు. కానీ ఆ వెంటనే వారు, “ఇలాటివాడు బతకడానికి అర్హుడు కాదు. భూమి మీద ఉండకుండా వాణ్ణి చంపివేయండి” అని కేకలు వేశారు. వారు కేకలు వేస్తూ తమ పై వస్త్రాలు విదిలించుకుంటూ ఆకాశం వైపు దుమ్మెత్తి పోశారు. ఈ విధంగా వారు అతనికి వ్యతిరేకంగా కేకలు వేయడానికి కారణమేమిటో తెలుసుకోవడం కోసం సహస్రాధిపతి అతనిని కొరడాలతో కొట్టి, విచారణ కోసం కోటలోకి తీసుకుని పొండని ఆజ్ఞాపించాడు. వారు పౌలును తాళ్ళతో కట్టేటప్పుడు అతడు తన దగ్గర నిలబడిన శతాధిపతిని, “శిక్ష విధించకుండానే ఒక రోమా పౌరుణ్ణి కొరడాలతో కొట్టడానికి మీకు అధికారం ఉందా?” అని అడిగాడు. శతాధిపతి ఆ మాట విని సైనికాధికారి దగ్గరికి వెళ్ళి, “నీవేం చేస్తున్నావు? ఈ వ్యక్తి రోమీయుడు, తెలుసా?” అన్నాడు. అప్పుడు సహస్రాధిపతి వచ్చి పౌలుతో, “నీవు రోమ్ పౌరుడివా? అది నాతో చెప్పు” అన్నాడు. పౌలు “అవును” అన్నాడు. అప్పుడు ఆ సైనికాధికారి, “నేను చాలా వెల చెల్లించి ఈ పౌరసత్వం సంపాదించుకున్నాను” అన్నాడు. అందుకు పౌలు, “నేనైతే పుట్టుకతోనే రోమా పౌరుణ్ణి” అని చెప్పాడు.
అపొస్తలుల కార్యములు 22:17-28 పవిత్ర బైబిల్ (TERV)
“నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి మందిరంలో ప్రార్థనలు చేస్తుండగా నాకు దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ప్రభువు, ‘త్వరగా లే! వెంటనే యెరూషలేము వదిలి వెళ్ళిపో! నా గురించి నీవు చెప్పే సత్యాన్ని వాళ్ళు అంగీకరించరు’ అని అనటం విన్నాను. “నేను, ‘ప్రభూ! నేను యూదుల ప్రతి సమాజమందిరంలోకి వెళ్ళి భక్తుల్ని బంధించి శిక్షించిన విషయం అందరికీ తెలుసు. నీ సాక్షి స్తెఫను తన రక్తాన్ని చిందించినప్పుడు నేను నా అంగీకారం చూపుతూ, అతణ్ణి చంపుతున్నవాళ్ళ దుస్తుల్ని కాపలా కాస్తూ అక్కడే నిలుచొని ఉన్నాను’ అని అన్నాను. “అప్పుడు ప్రభువు నాతో, ‘వెళ్ళు! నిన్ను దూరంగా యూదులు కానివాళ్ళ దగ్గరకు పంపుతాను’ అని అన్నాడు.” ప్రజలు పౌలు చెప్పింది అంతదాకా విన్నారు. కాని అతడు ఈ మాట అనగానే, బిగ్గరగా, “అతడు బ్రతకటానికి వీల్లేదు, చంపి పారవేయండి!” అని కేకలు వేసారు. వాళ్ళు తమ దుస్తుల్ని చింపి పారవేస్తూ, దుమ్ము రేపుతూ కేకలు వేసారు. సేనాధిపతి పౌలును కోట లోపలికి తీసుకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ప్రజలు అతణ్ణి చూసి ఎందుకిలా కేకలు వేస్తున్నారో తెలుసుకోవటానికి పౌలును కొరడాలతో కొట్టమని ఆజ్ఞాపించాడు. అతణ్ణి కొట్టటానికి కట్టి వేస్తుండగా పౌలు అక్కడున్న శతాధిపతితో, “నేరస్తుడని నిర్ణయం కాకముందే రోమా పౌరుణ్ణి కొరడా దెబ్బలు కొట్టటం న్యాయమేనా?” అని అడిగాడు. ఇది విన్నాక ఆ సేనాధిపతి, సహస్రాధిపతి దగ్గరకు వెళ్ళి పౌలు అన్నది చెబుతూ, “మీరేమి చేస్తున్నారో మీకు తెలుసా? అతడు రోమా పౌరుడట!” అని అన్నాడు. ఆ సహస్రాధిపతి పౌలు దగ్గరకు వెళ్ళి, “ఇప్పుడు చెప్పు! నీవు రోమా పౌరుడివా?” అని అడిగాడు. “ఔను!” పౌలు సమాధానం చెప్పాడు. సహస్రాధిపతి, “నేను రోమా పౌరుడవటానికి చాలా డబ్బు యివ్వవలసి వచ్చింది” అని అన్నాడు. పౌలు, “నేను పుట్టినప్పటినుండి రోమా పౌరుణ్ణి!” అని అన్నాడు.
అపొస్తలుల కార్యములు 22:17-28 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అంతట నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని. అప్పుడాయన–నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్లుము. నన్నుగూర్చి నీవిచ్చు సాక్ష్యము వారంగీకరింపరని నాతో చెప్పెను. అందుకు నేను–ప్రభువా, ప్రతి సమాజమందిరములోను నీయందు విశ్వాసముంచువారిని నేను చెరసాలలో వేయుచు కొట్టుచు నుంటినని వారికి బాగుగా తెలియును. మరియు నీ సాక్షి యైన స్తెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడ దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపినవారి వస్త్రములకు కావలియుంటినని చెప్పితిని. అందుకు ఆయన–వెళ్లుము, నేను దూరముగా అన్యజనులయొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను. ఈ మాటవరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. అప్పుడు ఇటువంటివాడు బ్రదుకతగడు, భూమి మీద ఉండకుండ వానిని చంపివేయుడని కేకలు వేసిరి. వారు కేకలువేయుచు తమ పైబట్టలు విదుల్చుకొని ఆకా శముతట్టు దుమ్మెత్తి పోయుచుండగా వారతనికి విరోధముగా ఈలాగు కేకలు వేసిన హేతువేమో తెలిసికొనుటకై, సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి, విమర్శింపవలెనని చెప్పి, కోటలోనికి తీసికొనిపొండని ఆజ్ఞా పించెను. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచియున్న శతాధిపతిని చూచి–శిక్ష విధింపకయే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారమున్నదా? అని యడిగెను. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతియొద్దకు వచ్చి– నీవేమి చేయబోవుచున్నావు? ఈ మనుష్యుడు రోమీ యుడు సుమీ అనెను. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి–నీవు రోమీయుడవా? అది నాతో చెప్పుమనగా అతడు–అవునని చెప్పెను. సహస్రాధిపతి– నేను బహు ద్రవ్యమిచ్చి యీ పౌరత్వము సంపాదించు కొంటిననెను; అందుకు పౌలు–నేనైతే పుట్టుకతోనే రోమీయుడననెను.