అపొస్తలుల కార్యములు 20:17-38
అపొస్తలుల కార్యములు 20:17-38 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
పౌలు మిలేతు నుండి ఎఫెసు సంఘ పెద్దలకు వర్తమానం పంపి వారిని పిలిపించాడు. వారు వచ్చినపుడు, వారితో ఈ విధంగా చెప్పాడు: “నేను ఆసియా ప్రాంతానికి వచ్చిన మొదటి రోజు నుండి మీతో గడిపిన సమయమంతటిలో నేను ఎలా జీవించానో మీకు తెలుసు. నాకు విరోధంగా యూదులు చేసిన కుట్రల వలన నేను ఎదుర్కొన్న శ్రమల మధ్యలో కూడా నేను కన్నీరు విడుస్తు, మిక్కిలి వినయంగా ప్రభువును సేవించాను. మీకు ఉపయోగకరమైన దానిని సంకోచించకుండా బహిరంగంగా ఇంటింటికి తిరిగి బోధించానని మీకు తెలుసు. పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగి ప్రభువైన యేసును నమ్మమని యూదులకు గ్రీసు దేశస్థులకు నేను ప్రకటించాను. “ఇప్పుడు, నేను ఆత్మ చేత బలవంతం చేయబడి, నేను యెరూషలేముకు వెళ్తున్నాను, అక్కడ నాకు ఏమి జరుగబోతుందో తెలియదు. ప్రతి పట్టణంలో నా కోసం సంకెళ్ళు హింసలు వేచి ఉన్నాయని, పరిశుద్ధాత్మ నన్ను హెచ్చరిస్తున్నాడని మాత్రం నాకు తెలుసు. అయినా కాని, నా జీవితం నాకు విలువైనది కాదని నేను భావిస్తున్నాను; ప్రభువైన యేసు నా ముందు ఉంచిన పరుగు పందెమును పూర్తి చేసి, దేవుని కృపను గురించిన సువార్తను ప్రకటించాలని ఆయన నాకు ఇచ్చిన పనిని పూర్తి చేయడమే నా ఏకైక లక్ష్యంగా ఉంది. “నేను మీ మధ్య తిరుగుతూ దేవుని రాజ్యం గురించి ప్రకటించాను కానీ మీలో ఎవరూ మళ్ళీ నన్ను చూడరని నాకు తెలుసు. మీ రక్తం విషయంలో నేను నిర్దోషిని అని నేడు మీ ముందు ప్రకటిస్తున్నాను. ఎందుకంటే, దేవుని ఉద్దేశమంతటిని మీకు ప్రకటించడానికి నేను సంకోచించలేదు. అయితే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాచుకుంటూ పరిశుద్ధాత్మ మీకు అప్పగించిన మందను సంఘపెద్దలుగా కాయండి. దేవుడు తన స్వరక్తాన్ని క్రయధనంగా చెల్లించి కొన్న ఆయన సంఘానికి కాపరులుగా ఉండండి. నేను వెళ్లిన తర్వాత, భయంకరమైన తోడేళ్ళు మీ మధ్యకు చొరబడతాయి, అవి మందను విడిచిపెట్టవని నాకు అర్థమవుతుంది. శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవడానికి సత్యాన్ని మళ్ళించే వారు మీ సొంతవారిలో నుండే బయలుదేరుతారు. కాబట్టి మీరు మెలకువగా ఉండండి! నేను మూడు సంవత్సరాలు రాత్రింబగళ్ళు ఎలా కన్నీరు కార్చుతూ మీలో అందరిని మానకుండా హెచ్చరించానో జ్ఞాపకం చేసుకోండి. “ఇప్పుడు నేను మిమ్మల్ని దేవునికి, మిమ్మల్ని అభివృద్ధిపరచి పరిశుద్ధులందరితో పాటు మీకు స్వాస్థ్యాన్ని ఇవ్వగల ఆయన కృపా వాక్యానికి అప్పగిస్తున్నాను. నేను ఎవరి వెండిని కాని బంగారం కాని వస్త్రాలను కాని ఆశించలేదు. నా సొంత చేతులతో నా అవసరాలను, నాతో ఉన్న వారి అవసరాలను తీర్చానని మీకే తెలుసు. నేను చేసే ప్రతి పనిలో మీకు మాదిరిని చూపిస్తూ, ‘తీసుకోవడంకంటే ఇవ్వడం ఎంతో దీవెనకరం’ అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోవాలని, నేను కష్టపడి బలహీనులకు సహాయం చేసి మీకు మాదిరిని చూపించాను” అని చెప్పాడు. పౌలు మాట్లాడటం ముగించిన తర్వాత, అతడు వారందరితో కలిసి మోకరించి ప్రార్థించాడు. వారందరు పౌలును కౌగిలించుకుని ముద్దు పెడుతూ ఏడ్చారు. మీరు మరలా ఎన్నడు నా ముఖం చూడరు అని అతడు చెప్పిన మాట వారికి చాలా దుఃఖం కలిగించింది. ఆ తర్వాత వారు అతన్ని ఓడ వరకు సాగనంపారు.
అపొస్తలుల కార్యములు 20:17-38 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అతడు మిలేతులో ఉండగానే ఎఫెసులోని పెద్దలకు కబురు పెట్టి వారిని పిలిపించాడు. వారు వచ్చినపుడు వారితో ఇలా అన్నాడు, “నేను ఆసియలో కాలు మోపిన రోజు నుండి మీ మధ్య ఏ విధంగా ఉన్నానో మీకే తెలుసు. యూదుల కుట్రల వలన నాకు విషమ పరీక్షలు సంభవించినా కన్నీటితోనూ, సంపూర్ణమైన వినయభావంతోనూ ప్రభువుకు సేవ చేశానని మీకు తెలుసు. మీకు ప్రయోజనకరమైన దేనినీ నేను దాచుకోకుండా బహిరంగంగా, ఇంటింటికీ తిరిగి బోధించాను. అంతేకాక, దేవుని ఎదుట పశ్చాత్తాప పడి మన ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసముంచాలని యూదులకూ, గ్రీసు దేశస్తులకూ ఏ విధంగా సాక్ష్యం ఇస్తున్నానో, అంతా మీకు తెలుసు. “ఇదిగో, ఇప్పుడు నేను ఆత్మ నిర్బంధంలో యెరూషలేము వెళ్తున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవిస్తాయో నాకు తెలియదు. కానీ, పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో సాక్షమిస్తూ నా కోసం సంకెళ్ళు, హింసలూ వేచి ఉన్నాయని చెప్పాడని మాత్రం తెలుసు. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇవ్వడంలో నా జీవిత లక్ష్యాన్ని, ప్రభువైన యేసు వలన నేను పొందిన పరిచర్యను పూర్తి చేయడం కోసం నా ప్రాణాన్ని నాకెంత మాత్రం ప్రియంగా ఎంచుకోవడం లేదు. ఇదిగో, దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ నేను మీ మధ్య తిరుగుతూ ఉన్నాను. మీరెవరూ ఇక మీదట నా ముఖం చూడరని నాకు తెలుసు. కాబట్టి మీ అందరి రక్తం విషయంలో నేను నిర్దోషినని మిమ్మల్నే సాక్ష్యంగా పెడుతున్నాను. ఎందుకంటే దేవుని సంకల్పాన్ని మీకు పూర్తిగా ప్రకటించకుండా నేనేమీ దాచుకోలేదు. “ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడం కోసం పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనికి అధ్యక్షులుగా నియమించాడో ఆ మంద అంతటిని గురించీ, మీ మట్టుకు మిమ్మల్ని గురించీ జాగ్రత్తగా ఉండండి. నాకు తెలుసు, నేను వెళ్ళిపోయిన వెంటనే క్రూరమైన తోడేళ్ళు వంటివారు మీలో ప్రవేశిస్తారు. వారు మందపై జాలి చూపరు. అంతేకాక శిష్యులను తమతో ఈడ్చుకుపోవడం కోసం దారి మళ్ళించే మాటలు పలికే వ్యక్తులు మీలో నుండే బయలుదేరుతారు. కాబట్టి మూడు సంవత్సరాలుగా నేను రాత్రింబగళ్ళు కన్నీళ్ళతో మీలో ప్రతి ఒక్కరికీ ఎడతెగక బుద్ధి నేర్పడం మానలేదని గుర్తుంచుకుని మెలకువగా ఉండండి. ఇప్పుడు దేవునికీ, ఆయన కృపావాక్యానికీ మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయటానికీ పరిశుద్ధులందరితో వారసత్వం అనుగ్రహించడానికీ శక్తిశాలి. నేను ఎవరి వెండినిగానీ, బంగారాన్నిగానీ, వస్త్రాలుగానీ ఆశించలేదు. నా అవసరాల నిమిత్తం, నాతో ఉన్నవారి నిమిత్తం ఈ నా చేతులు కష్టపడ్డాయని మీకు తెలుసు. మీరు కూడా అదే విధంగా ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలనీ, ‘పుచ్చు కోవడం కంటే ఇవ్వడం ధన్యకరమైనది’ అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలనీ, నేను అన్ని విషయాల్లో మీకు ఆదర్శంగా నిలిచాను.” అతడు ఈ విధంగా చెప్పి మోకరించి వారందరితో కలిసి ప్రార్థన చేశాడు. అప్పుడు వారంతా చాలా ఏడ్చి పౌలును కౌగలించుకుని ముద్దుపెట్టుకున్నారు. మరి ముఖ్యంగా, “మీరు ఇక మీదట నా ముఖం చూడరు” అని అతడు చెప్పిన మాటను బట్టి వారు ఎంతో దుఃఖిస్తూ ఓడ వరకూ అతనిని సాగనంపారు.
అపొస్తలుల కార్యములు 20:17-38 పవిత్ర బైబిల్ (TERV)
పౌలు కొందర్ని మిలేతునుండి ఎఫెసుకు పంపి అక్కడున్న సంఘ పెద్దల్ని పిలిపించాడు. వాళ్ళు వచ్చాక వాళ్ళతో యిలా చెప్పాడు: “నేను ఆసియలో అడుగు పెట్టిన నాటినుండి మీతో ఉన్నన్ని రోజులు ఏ విధంగా జీవించానో మీకు తెలుసు. యూదుల పన్నాగాలవల్ల నాకు ఎన్నో కష్టాలు, దుఃఖాలు సంభవించాయి. అయినా ప్రభువు సేవ సంపూర్ణమైన విశ్వాసంతో చేసాను. ఆత్మీయ విషయాల్లో మీకు ఉపయోగమయ్యే ప్రతీ విషయాన్ని దాచకుండా, బహిరంగంగా ప్రకటించటమే కాకుండా యింటింటికీ వెళ్ళి బోధించానని మీకు తెలుసు. మారుమనస్సు పొంది, దేవుని కోసం జీవించమని, మన యేసు ప్రభువును నమ్మమని యూదులకు, గ్రీకులకు చెప్పాను. “పరిశుద్ధాత్మ చెప్పినట్లు చెయ్యాలనే ఉద్దేశ్యంతో నేను యెరూషలేము వెళ్తున్నాను. అక్కడేం జరుగుతుందో నాకు తెలియదు. నేను కష్టాలు, కారాగారాలు ఎదుర్కొంటానని పరిశుద్ధాత్మ నన్ను ప్రతి పట్టణంలో ముందే వారించాడు. ఇది మాత్రం నాకు తెలుసు. నా జీవితాన్ని నేను లెక్కచెయ్యను. కాని ఈ పరుగు పందెం ముగించి యేసు ప్రభువు చెప్పిన ఈ కార్యాన్ని పూర్తి చేస్తే చాలు. దేవుని అనుగ్రహాన్ని గురించి చెప్పే సువార్తను ప్రకటించటమే నా కర్తవ్యం. “మళ్ళీ మిమ్మల్ని చూడటం వీలు పడదని నాకు తెలుసు. నేను మీతో ఉండి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాను. అందువల్ల ఈ రోజు నేనిది ఖచ్చితంగా చెప్పగలను. మీలో ఎవరైనా ఆత్మీయంగా మరణిస్తే దానికి నేను బాధ్యుణ్ణి కాను. ఎందుకంటే, నేను దేవుడు చెయ్యదలచినదాన్ని సంపూర్ణంగా కొంచెం కూడా సంకోచించకుండా ప్రకటించాను. పరిశుద్ధాత్మ మిమ్మల్ని సంఘానికి కాపరులుగా నియమించాడు. ఆ దేవుని సంఘానికి మీరు కాపరుల్లా ఉండాలి. ఆయన తన సంఘమును తన స్వంత రక్తంతో సంపాదించాడు. మీ విషయంలో, ఈ సంఘం విషయంలో జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపొయ్యాక భయంకరమైన తోడేళ్ళు మీ మందలోకి వచ్చి హాని కలిగిస్తాయని నాకు తెలుసు. మీలోనుండి కూడా కొందరు ముందుకు వచ్చి మీతో ఉన్న అనుచరుల్ని దొంగిలించాలని అబద్ధాలాడుతారు. అందుకే జాగ్రత్తగా ఉండండి. నేను మూడు సంవత్సరాలు మీతో ఉన్నాను. కంటతడి పెట్టుకొని రాత్రింబగళ్ళు మీలో ఉన్న ప్రతి ఒక్కర్నీ వారించాను. ఈ విషయం మరిచిపోకండి. “ఇప్పుడు మిమ్మల్ని దేవునికి, ఆయన అనుగ్రహాన్ని గురించి బోధించే సందేశానికి అప్పగిస్తున్నాను. ఆ సందేశంలో మిమ్మల్ని ఆత్మీయంగా అభివృద్ధి పరచగల శక్తి ఉంది. అంతే కాక అది పరిశుద్ధమైన దేవుని విశ్వాసులకు లభించిన వారసత్వం మీక్కూడా లభించేటట్లు చేస్తుంది. మీనుండి నేను వెండి బంగారాలు కాని, మంచి దుస్తులు కాని ఆశించలేదు. నేను నా చేతుల్తో పని చేసి, నా అవసరాలు, నాతో ఉన్న వాళ్ళ అవసరాలు తీర్చుకొన్నానని మీకు తెలుసు. కష్టించి పని చేసి దిక్కులేని వాళ్ళకు సహాయం చెయ్యటం ఉత్తమమని మీకు అన్ని విధాలా తెలియ చేసాను. యేసు ప్రభువు, ‘తీసుకోవటంలో కన్నా యివ్వటంలో చాలా దీవెన ఉంది!’ అని అన్నాడు. ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోవటం అవసరమని మీకు రుజువు చేసాను.” ఈ విధంగా చెప్పి, అతడు మోకాళ్ళూని అందరితో కలిసి ప్రార్థించాడు. ఆ తర్వాత అందరూ కంటతడి పెట్టుకొని అతనికి ప్రేమతో వీడ్కోలు యిచ్చారు. “మిమ్మల్ని మళ్ళీ చూడటం వీలుపడదు” అని అతడన్న మాటలు వాళ్ళకు చాలా దుఃఖం కలిగించాయి. ఆ తదుపరి వాళ్ళతనితో ఓడవరకు వెళ్ళారు.
అపొస్తలుల కార్యములు 20:17-38 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అతడు మిలేతునుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తనయొద్దకు వచ్చినప్పుడతడు వారితో ఇట్లనెను– నేను ఆసియలో కాలుపెట్టిన దినమునుండి, ఎల్లకాలము మీ మధ్య ఏలాగు నడుచుకొంటినో మీరే యెరుగుదురు. యూదుల కుట్రలవలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియును. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచు కొనక బహిరంగముగాను, ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు, దేవుని యెదుట మారుమనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచ వలెనని, యూదులకును గ్రీసుదేశస్థులకును ఏలాగు సాక్ష్య మిచ్చుచుంటినో యిదంతయు మీకు తెలియును. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడినవాడనై యెరూషలేమునకు వెళ్లుచున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదుగాని, బంధకములును శ్రమలును నాకొరకు కాచుకొనియున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియును. అయితే దేవుని కృపాసువార్తనుగూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంతమాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. ఇదిగో దేవుని రాజ్యమునుగూర్చి ప్రకటించుచు నేను మీమధ్యను సంచరించుచుంటిని; మీలో ఎవరును ఇకమీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియును. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషినికానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపా దించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆయావత్తుమందనుగూర్చియు, మీ మట్టుకు మిమ్మునుగూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్లు కన్నీళ్లు విడుచుచు ప్రతిమనుష్యునికి మానక బుద్ధిచెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును, పరిశుద్ధపరచబడినవారందరిలో స్వాస్థ్య మనుగ్రహించుటకును శక్తి మంతుడు. ఎవని వెండినైనను, బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు; నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియును. మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు– పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసి కొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను. అతడీలాగు చెప్పి మోకాళ్లూని వారందరితో ప్రార్థన చేసెను. అప్పుడు వారందరు చాల ఏడ్చిరి. మీరు ఇకమీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడమీదపడి అతనిని ముద్దుపెట్టుకొని, వారు ఓడవరకు అతనిని సాగ నంపిరి.