అపొస్తలుల కార్యములు 2:37-40 - Compare All Versions

అపొస్తలుల కార్యములు 2:37-40 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ప్రజలు ఈ మాటలు విని, మనస్సులో బాధపడి పేతురు, ఇతర అపొస్తలులతో, “సహోదరులారా, మేము ఏమి చేయాలి?” అని అన్నారు. అందుకు పేతురు, “మీలో ప్రతి ఒక్కరు, మీ పాపాల క్షమాపణ కోసం పశ్చాత్తాపపడి, యేసు క్రీస్తు పేరట బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుకొంటారు. ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు దూరంగా ఉన్నవారందరికి అనగా, మన ప్రభువైన దేవుడు పిలిచే వారందరికి చెందుతుంది” అని వారితో చెప్పాడు. ఇంకా అనేక రకాల మాటలతో పేతురు వారిని హెచ్చరించి, “ఈ వక్ర తరం నుండి మీరు రక్షణ పొందండి” అని వారికి విజ్ఞప్తి చేశాడు.

అపొస్తలుల కార్యములు 2:37-40 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వారీ మాట విన్నప్పుడు తమ హృదయంలో గుచ్చినట్టయి, “సోదరులారా, మేమేం చేయాలి” అని పేతురునూ మిగతా అపొస్తలులనూ అడిగారు. దానికి పేతురు, “మీలో ప్రతివాడూ పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ కోసం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఈ వాగ్దానం మీకూ మీ పిల్లలకూ, దూరంగా ఉన్న వారందరికీ, అంటే ప్రభువైన మన దేవుడు తన దగ్గరికి పిలుచుకొనే వారందరికీ చెందుతుంది” అని వారితో చెప్పాడు. ఇంకా అతడు అనేక రకాలైన మాటలతో సాక్షమిచ్చి, “మీరు ఈ దుష్ట తరం నుండి వేరుపడి రక్షణ పొందండి” అని వారిని హెచ్చరించాడు.

అపొస్తలుల కార్యములు 2:37-40 TERV (పవిత్ర బైబిల్)

ఇది విని ప్రజల హృదయాలు కదిలిపొయ్యాయి. వాళ్ళు పేతురు మరియు యితర అపొస్తలులను, “సోదరులారా! మేము ఏం చెయ్యాలి?” అని అడిగారు. పేతురు ఈ విధంగా జవాబు చెప్పాడు: “మీలో ప్రతి ఒక్కడూ పాప క్షమాపణ నిమిత్తం మారుమనస్సు కలిగి యేసు క్రీస్తు పేరిట బాప్తిస్మము పొందాలి. అప్పుడు మీ పాపాలు క్షమించబడ్తాయి. మీకు పవిత్రాత్మ వరం లభిస్తుంది. దేవుడు ఈ వాగ్దానాన్ని మీకోసం, మీ సంతానాని కోసం, ప్రభువు ఆహ్వానించబోయే దూర ప్రాంతాల వాళ్ళకందరి కోసం చేసాడు.” వాళ్ళకు అనేక మాటల ద్వారా ఎన్నో విషయాలు చెప్పాడు. అంతేకాక, వాళ్ళతో ఈ విధంగా బ్రతిమిలాడాడు: “వక్రబుద్ధులున్న ఈ తరం వాళ్ళనుండి విడిపోయి రక్షణ పొందండి.”

అపొస్తలుల కార్యములు 2:37-40 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని –సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా పేతురు–మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి–మీరు మూర్ఖులగు ఈ తరమువారికి వేరై రక్షణపొందుడని వారిని హెచ్చరించెను.