అపొస్తలుల కార్యములు 2:1-11 - Compare All Versions
అపొస్తలుల కార్యములు 2:1-11 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పెంతెకొస్తు పండుగ రోజు వచ్చినప్పుడు, వారందరు ఒక్కచోట చేరుకొన్నారు. అప్పుడు అకస్మాత్తుగా పరలోకం నుండి వేగంగా వీస్తున్న గాలి లాంటి ధ్వని వచ్చి వారు కూర్చున్న ఇల్లంతా నింపింది. అగ్ని జ్వాలల్లాంటి నాలుకలు విభజింపబడి వారిలో అందరిపై నిలిచినట్లు వారు చూశారు వారందరు పరిశుద్ధాత్మతో నింపబడి, ఆత్మ వారికి ఇచ్చిన సామర్థ్యంతో ఇతర భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో ఆకాశం క్రింద ఉన్న దేశాలన్నింటి నుండి వచ్చిన దైవభక్తి కలిగిన యూదులు యెరూషలేములో నివసిస్తున్నారు. వారు ఈ శబ్దం విన్నప్పుడు, ప్రజలు కలవరంతో ఒక్క చోటికి గుంపుగా వచ్చారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు తమ సొంత భాష మాట్లాడడం విన్నారు. వారు ఎంతగానో ఆశ్చర్యపడి, “మాట్లాడుతున్న వీరందరు గలిలయులు కారా? అయితే మనలో ప్రతి ఒక్కరూ మన మాతృభాషలో వారు మాట్లాడటాన్ని ఎలా వింటున్నాం? అని చెప్పుకొన్నారు. పార్తీయులు, మెదీయ వారు, ఎలామీయులు, మెసొపొటేమియా నివాసులు, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా, ఫ్రుగియ, పంఫులియా, ఈజిప్టు, కురేనే దగ్గరి లిబియా ప్రాంతాలకు చెందినవారు, రోమా నుండి వచ్చిన కొంతమంది సందర్శకులు అనగా యూదులు, యూదా మతంలోనికి మారిన వారు; క్రేతీయులు, అరబీయులు మొదలైన వారందరు విస్మయపడి ఆశ్చర్యంతో, వీరు మన భాషలో దేవుని గొప్ప కార్యాలను ప్రకటించడాన్ని మనం వింటున్నాము.”
అపొస్తలుల కార్యములు 2:1-11 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
పెంతెకొస్తు అనే పండగరోజు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట సమావేశమయ్యారు. అప్పుడు వేగంగా వీచే బలమైన గాలి వంటి శబ్దం ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండిపోయింది. అగ్నిజ్వాలలు నాలుకలుగా చీలినట్టుగా వారికి కనబడి, వారిలో ప్రతి ఒక్కరి మీదా వాలాయి. అందరూ పరిశుద్ధాత్మతో నిండి ఆ ఆత్మ వారికి శక్తి అనుగ్రహించిన కొద్దీ వేరు వేరు భాషల్లో మాట్లాడసాగారు. ఆ రోజుల్లో ఆకాశం కింద ఉన్న ప్రతి ప్రాంతపు జనంలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో నివసిస్తున్నారు. ఈ శబ్దం విన్న జన సందోహం కూడి వచ్చి, ప్రతి వాడూ తన సొంత భాషలో మాట్లాడడం విని కలవరపడ్డారు. వారు ఆశ్చర్యంతో తలమునకలైపోతూ, “మాట్లాడే వీరంతా గలిలయ వారే గదా. మనలో ప్రతివాడి మాతృభాషలో వీరు మాట్లాడడం మనం వింటున్నామేంటి? పార్తీయులూ మాదీయులూ ఏలామీయులూ, మెసపటేమియా యూదయ కప్పదొకియ పొంతు ఆసియ ఫ్రుగియ పంఫూలియ ఐగుప్తు అనే దేశాల వారూ, కురేనేలో భాగంగా ఉన్న లిబియ ప్రాంతాలవారూ, రోమ్ నుండి సందర్శకులుగా వచ్చిన యూదులూ, యూదామతంలోకి మారినవారూ, క్రేతీయులూ అరబీయులూ మొదలైన మనమంతా వీరు మన భాషల్లో దేవుని గొప్ప కార్యాలను చెబుతుంటే వింటున్నాము” అనుకున్నారు.
అపొస్తలుల కార్యములు 2:1-11 TERV (పవిత్ర బైబిల్)
పెంతెకొస్తు అనే పండుగ వచ్చింది. ఆ రోజు వాళ్ళంతా ఒక చోట సమావేశం అయ్యారు. తీవ్రమైన గాలి వీచినప్పుడు కలిగే ధ్వనిలాంటిది పరలోకంనుండి అకస్మాత్తుగా వచ్చి వాళ్ళు కూర్చొన్న యింటినంతా నింపివేసింది. అప్పుడు వాళ్ళకు నాలుకల్లా అగ్నిజ్వాలలు కనిపించాయి. అవి విడిపోయి ప్రతి ఒక్కరి మీదా దిగినవి. అందరూ పవిత్రాత్మతో నిండిపోయి తమ భాషల్లో కాక యితర భాషల్లో మాట్లాడటం మొదలు పెట్టారు. వాళ్ళిలా మాట్లాడటానికి పవిత్రాత్మ శక్తినిచ్చాడు. అప్పుడు ఈ యెరూషలేము పట్టణంలో అన్ని దేశాలకు చెందిన దైవభక్తిగల యూదులు ఉండినారు. ఆ మాటల శబ్దం విని ఒక పెద్ద ప్రజల గుంపు అక్కడికి వచ్చింది. గుంపులోని ప్రతి ఒక్కడూ తన స్వంత భాషలో వాళ్ళు మాట్లాడటం విని దిగ్భ్రాంతి చెందాడు. వాళ్ళు దిగ్భ్రాంతి చెంది, “మాట్లాడుతున్న వాళ్ళందరూ గలిలయ ప్రాంతపు వాళ్ళే కదా? అలాంటప్పుడు, మాలోని ప్రతి ఒక్కడూ, అతని స్వంత భాషలో వాళ్ళు మాట్లాడటం ఎట్లా వింటున్నాడు? మేము, అంటే ‘పార్తీయ’ దేశంవాళ్ళు, ‘మాదీయ’ దేశంవాళ్ళు, ‘ఏలామీ’ దేశంవాళ్ళు, ‘మెసొపొతమియ’ నివాసులు, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియ నివాసులు, ఫ్రుగియ, పంఫులియ, ఈజిప్టు ప్రాంతాలవాళ్ళు, ‘లిబియ’లోని ‘కురేనే’ దగ్గరున్న ప్రాంతాలనుండి వచ్చినవాళ్ళు, రోమా నగరంనుండి వచ్చినవాళ్ళు, యూదులు, యూద మతంలో చేరినవాళ్ళు, క్రేతీయులు, అరబీయులు, వాళ్ళు దేవుని మహిమల్ని గురించి మా స్వంత భాషలో చెప్పటం వింటున్నామే!” అని అన్నారు.
అపొస్తలుల కార్యములు 2:1-11 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతి జనములోనుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి, ప్రతిమనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి. అంతట అందరు విభ్రాంతినొంది ఆశ్చర్యపడి–ఇదిగో మాటలాడుచున్న వీరందరు గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపుభాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే; ఇదేమి? పార్తీయులు మాదీయులు ఏలామీయులు, మెసొపొతమియ యూదయ కప్పదొకియ, పొంతు ఆసియ ఫ్రుగియ పంఫూలియ ఐగుప్తు అను దేశములయందలివారు, కురేనేదగ్గర లిబియ ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమానుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు అరబీయులు మొదలైన మన మందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్పకార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి.