అపొస్తలుల కార్యములు 17:1-4 - Compare All Versions

అపొస్తలుల కార్యములు 17:1-4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వారు అంఫిపొలి, అపొల్లోనియ పట్టణములమీదుగా . వెళ్లి థెస్సలొనీకకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజమందిరమొకటి యుండెను గనుక పౌలు తనవాడుక చొప్పున సమాజపు వారియొద్దకు వెళ్లి–క్రీస్తు శ్రమపడి మృతులలోనుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురముచేయు యేసే క్రీస్తయియున్నాడనియు లేఖనములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు, వారితో మూడువిశ్రాంతిదినములు తర్కించుచుండెను. వారిలో కొందరును, భక్తిపరులగు గ్రీసుదేశస్థులలో చాలమందియు, ఘనతగల స్త్రీలలో అనేకులును ఒప్పుకొని పౌలుతోను సీలతోను కలిసికొనిరి.

అపొస్తలుల కార్యములు 17:1-4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వారు అంఫిపొలి, అపొల్లోనియ పట్టణాల మీదుగా తెస్సలోనిక పట్టణానికి వచ్చారు. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉంది. పౌలు తన అలవాటు ప్రకారం అలవాటు ప్రకారం మూడు విశ్రాంతి దినాలు లేఖనాల్లో నుండి వారితో తర్కించాడు. క్రీస్తు హింసలు అనుభవించి మృతుల్లో నుండి లేవడం తప్పనిసరి అని లేఖనాలను విప్పి వివరించాడు. “నేను మీకు ప్రకటించే యేసే క్రీస్తు” అని తెలియజేశాడు. కొంతమంది యూదులు ఒప్పుకుని పౌలు సీలలతో కలిశారు. వారిలో భక్తిపరులైన గ్రీకు వారూ, చాలమంది ప్రముఖులైన స్త్రీలు కూడా ఉన్నారు.

అపొస్తలుల కార్యములు 17:1-4 TERV (పవిత్ర బైబిల్)

వాళ్ళు “అంఫిపొలి”, “అపోల్లోనియ” పట్టణాల ద్వారా ప్రయాణం చేసి థెస్సలొనీక అనే పట్టణం చేరుకొన్నారు. అక్కడ ఒక యూదుల సమాజమందిరం ఉంది. అలవాటు ప్రకారం పౌలు ఆ సమాజమందిరానికి వెళ్ళాడు. అక్కడ మూడు శనివారాలు గడిపాడు. వాళ్ళతో యూదుల లేఖనాలు చెప్పి, విషయాలు తర్కించాడు. క్రీస్తు చనిపోవలసిన అవసరం, బ్రతికి రావలసిన అవసరం ఉందని వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పాడు. ఈ విషయాన్ని లేఖనాలుపయోగించి రుజువు చేసాడు. “నేను చెబుతున్న ఈ యేసే క్రీస్తు!” అని వాళ్ళకు నచ్చచెప్పాడు. తద్వారా కొందరు సమ్మతించి పౌలు, సీల పక్షము చేరిపోయారు. దైవభీతిగల చాలా మంది గ్రీకులు, ముఖ్యమైన స్త్రీలు వీళ్ళ పక్షం చేరిపోయారు.

అపొస్తలుల కార్యములు 17:1-4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

పౌలు అతనితో ఉన్నవారు అంఫిపొలి అపొల్లోనియ అనే పట్టణాల గుండా థెస్సలొనీక పట్టణానికి చేరుకొన్నారు, అక్కడ ఒక యూదుల సమాజమందిరం ఉంది. పౌలు తన అలవాటు ప్రకారం, మూడు సబ్బాతు దినాలు సమాజమందిరంలోనికి వెళ్లి లేఖనాల్లో నుండి వారితో చర్చిస్తూ, క్రీస్తు ఏ విధంగా శ్రమలను అనుభవించి, చావు నుండి తిరిగి లేచాడో వారికి నిరూపిస్తూ, “మేము ప్రకటిస్తున్న ఈ యేసే క్రీస్తు అని” వివరించాడు. కొంతమంది యూదులు ఒప్పింపబడి పౌలు సీలలతో చేరారు, అదే విధంగా పెద్ద సంఖ్యలో దేవునికి భయపడే గ్రీసు దేశస్థులు, కొద్దిమంది ప్రముఖ స్త్రీలు కూడా చేరారు.