అపొస్తలుల కార్యములు 17:1-15

అపొస్తలుల కార్యములు 17:1-15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

పౌలు అతనితో ఉన్నవారు అంఫిపొలి అపొల్లోనియ అనే పట్టణాల గుండా థెస్సలొనీక పట్టణానికి చేరుకొన్నారు, అక్కడ ఒక యూదుల సమాజమందిరం ఉంది. పౌలు తన అలవాటు ప్రకారం, మూడు సబ్బాతు దినాలు సమాజమందిరంలోనికి వెళ్లి లేఖనాల్లో నుండి వారితో చర్చిస్తూ, క్రీస్తు ఏ విధంగా శ్రమలను అనుభవించి, చావు నుండి తిరిగి లేచాడో వారికి నిరూపిస్తూ, “మేము ప్రకటిస్తున్న ఈ యేసే క్రీస్తు అని” వివరించాడు. కొంతమంది యూదులు ఒప్పింపబడి పౌలు సీలలతో చేరారు, అదే విధంగా పెద్ద సంఖ్యలో దేవునికి భయపడే గ్రీసు దేశస్థులు, కొద్దిమంది ప్రముఖ స్త్రీలు కూడా చేరారు. కానీ ఆ బోధను నమ్మని ఇతర యూదులు అసూయపడ్డారు; వారు సంతవీధులలోని పోకిరివారిని తమ వెంటపెట్టుకుని గుంపుగా చేరి పట్టణంలో అల్లరిని సృష్టించారు. వారు పౌలు సీలలను ప్రజల మధ్యకు తీసుకురావాలని వారిని వెదకడానికి యాసోను ఇంటి మీద దాడి చేశారు. కానీ వారు అక్కడ కనబడలేదు కాబట్టి వారు యాసోనును మరికొందరు విశ్వాసులను పట్టణపు అధికారుల దగ్గరకు ఈడ్చుకొని వచ్చి, “భూలోకాన్ని తలక్రిందులు చేసినవారు ఇక్కడకు కూడా వచ్చారు. యాసోను వారిని తన ఇంటికి ఆహ్వానించాడు. వీరందరు యేసు అనే మరొక రాజు ఉన్నాడని చెప్పి, కైసరు చట్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు” అని కేకలు వేశారు. ఆ మాటలను విన్న జనసమూహం, పట్టణ అధికారులు కలవరపడ్డారు. వారు యాసోను మిగిలిన వారి దగ్గర నుండి జామీను తీసుకుని విడిచిపెట్టారు. రాత్రియైన వెంటనే విశ్వాసులు పౌలును సీలలను అక్కడినుండి బెరయాకు పంపివేశారు. వారు అక్కడ చేరుకొని యూదుల సమాజమందిరానికి వెళ్లారు. బెరయాలోని యూదులు థెస్సలొనీకలో ఉండే వారికంటే వాక్యాన్ని శ్రద్ధతో స్వీకరించి పౌలు చెప్పిన సంగతులను సత్యమేనా అని తెలుసుకోవడానికి ప్రతిరోజు లేఖనాలను పరిశీలిస్తూ వచ్చారు. దాని ఫలితంగా, వారిలో చాలామంది యూదులు, అలాగే గ్రీసు దేశపు ప్రముఖులైన స్త్రీలు పురుషులు నమ్మారు. కానీ థెస్సలొనీకలోని యూదులు పౌలు దేవుని వాక్యాన్ని బెరయాలో ప్రకటిస్తున్నాడని విన్నప్పుడు, వారిలో కొందరు అక్కడికి కూడా వెళ్లి, ప్రజలను రెచ్చగొట్టి అల్లరి రేపారు. కాబట్టి విశ్వాసులు వెంటనే పౌలును అక్కడినుండి సముద్రతీరానికి పంపించారు, కానీ సీల తిమోతిలు బెరయాలోనే ఉండిపోయారు. పౌలు వెంట వచ్చినవారు ఏథెన్సు పట్టణం వరకు అతన్ని చేర్చి, సీల తిమోతిలు వీలైనంత తొందరగా తన దగ్గరకు తిరిగి చేరాలి అనే ఆజ్ఞపొంది వెళ్లారు.

అపొస్తలుల కార్యములు 17:1-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

వారు అంఫిపొలి, అపొల్లోనియ పట్టణాల మీదుగా తెస్సలోనిక పట్టణానికి వచ్చారు. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉంది. పౌలు తన అలవాటు ప్రకారం అలవాటు ప్రకారం మూడు విశ్రాంతి దినాలు లేఖనాల్లో నుండి వారితో తర్కించాడు. క్రీస్తు హింసలు అనుభవించి మృతుల్లో నుండి లేవడం తప్పనిసరి అని లేఖనాలను విప్పి వివరించాడు. “నేను మీకు ప్రకటించే యేసే క్రీస్తు” అని తెలియజేశాడు. కొంతమంది యూదులు ఒప్పుకుని పౌలు సీలలతో కలిశారు. వారిలో భక్తిపరులైన గ్రీకు వారూ, చాలమంది ప్రముఖులైన స్త్రీలు కూడా ఉన్నారు. అయితే ఆ బోధను నమ్మని యూదులు అసూయతో నిండిపోయి, వ్యాపార వీధుల్లో తిరిగే కొంతమంది పోకిరీ వాళ్ళను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమంతా పెద్ద అల్లరి సృష్టించారు. వారు యాసోను ఇంటి మీద దాడి చేసి, పౌలు సీలలను జనం మధ్యకు తీసుకు వెళ్ళాలనుకున్నారు. అయితే వారు కనబడక పోయేసరికి యాసోనునూ మరి కొంతమంది సోదరులనూ ఆ పట్టణ అధికారుల దగ్గరికి ఈడ్చుకుపోయి, “భూలోకాన్ని తలకిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చారు. యాసోను వీరిని తన ఇంట్లో పెట్టుకున్నాడు. వీరంతా యేసు అనే వేరొక రాజున్నాడని చెబుతూ సీజరు చట్టాలకు విరోధంగా నడుచుకుంటున్నారు” అని కేకలు వేశారు. జనసమూహం అధికారులూ ఈ మాటలు విని ఆందోళనపడ్డారు. వారు యాసోను దగ్గరా మిగతావారి దగ్గరా జామీను తీసుకుని వారిని విడుదల చేశారు. సోదరులు అదే రాత్రి పౌలునూ సీలనూ బెరయ ఊరికి పంపించారు. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళారు. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఉన్నత భావాలు గలవారు. ఎందుకంటే వీరు శ్రద్ధతో వాక్యాన్ని అంగీకరించి, పౌలు, సీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో అని ప్రతి రోజూ లేఖనాలను తరచి చూస్తూ వచ్చారు. అందుచేత వారిలో చాలామంది నమ్మారు. ప్రముఖ గ్రీకు స్త్రీలూ, పురుషులూ విశ్వసించారు. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్కు ప్రకటిస్తున్నాడని తెస్సలోనికలోని యూదులు తెలుసుకుని అక్కడికి కూడా వచ్చి జనాన్ని రెచ్చగొట్టి అల్లరి రేపారు. వెంటనే సోదరులు పౌలును సముద్రం వరకూ పంపారు. సీల, తిమోతి, అక్కడే ఉండిపోయారు. పౌలును సాగనంపడానికి వెళ్ళిన వారు అతనిని ఏతెన్సు పట్టణం వరకూ తెచ్చారు. సీల, తిమోతి సాధ్యమైనంత తొందరగా తన దగ్గరికి రావాలని పౌలు, వారి ద్వారా కబురు పంపాడు.

అపొస్తలుల కార్యములు 17:1-15 పవిత్ర బైబిల్ (TERV)

వాళ్ళు “అంఫిపొలి”, “అపోల్లోనియ” పట్టణాల ద్వారా ప్రయాణం చేసి థెస్సలొనీక అనే పట్టణం చేరుకొన్నారు. అక్కడ ఒక యూదుల సమాజమందిరం ఉంది. అలవాటు ప్రకారం పౌలు ఆ సమాజమందిరానికి వెళ్ళాడు. అక్కడ మూడు శనివారాలు గడిపాడు. వాళ్ళతో యూదుల లేఖనాలు చెప్పి, విషయాలు తర్కించాడు. క్రీస్తు చనిపోవలసిన అవసరం, బ్రతికి రావలసిన అవసరం ఉందని వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పాడు. ఈ విషయాన్ని లేఖనాలుపయోగించి రుజువు చేసాడు. “నేను చెబుతున్న ఈ యేసే క్రీస్తు!” అని వాళ్ళకు నచ్చచెప్పాడు. తద్వారా కొందరు సమ్మతించి పౌలు, సీల పక్షము చేరిపోయారు. దైవభీతిగల చాలా మంది గ్రీకులు, ముఖ్యమైన స్త్రీలు వీళ్ళ పక్షం చేరిపోయారు. ఇది గమనించి యూదులు అసూయ పడ్డారు. సంతలో ఉన్న పనిలేనివాళ్ళను కొందర్ని నమావేశపరచి పట్టణంలో అల్లర్లు మొదలు పెట్టారు. పౌలు, సీలలను ప్రజల ముందుకు లాగాలనుకొని అంతా కలిసి యాసోను యింటి మీద పడ్డారు. వాళ్ళు అక్కడ కనిపించక పోయేసరికి యాసోన్ను, మరి కొందరు సోదరుల్ని పట్టణపు అధికారుల ముందుకు తీసుకొని వచ్చి, “ప్రపంచాన్నే కలవరపరచిన ఈ మనుష్యులు ఇప్పుడిక్కడికి వచ్చారు. వీళ్ళకు యాసోను తన యింట్లో ఆతిథ్యమిచ్చాడు. వీళ్ళంతా చక్రవర్తి నియమాల్ని అతిక్రమిస్తూ యేసు అనే మరొక రాజున్నాడంటున్నారు” అని కేకలు వేసారు. ఈ మాటలు విని అక్కడున్న ప్రజలు, అధికారులు రేకెత్తిపోయారు. ఆ తర్వాత యాసోనుతో, మిగతా వాళ్ళందరితో పత్రాన్ని వ్రాయించుకొని వాళ్ళను వదిలివేసారు. అర్థరాత్రి కాగానే సోదరులు పౌలును, సీలను బెరయ అనే పట్టణానికి పంపించారు. బెరయకు వచ్చినవాళ్ళు యూదుల సమాజమందిరానికి వెళ్ళారు. థెస్సలోనీక వాళ్ళకన్నా బెరయవాళ్ళు మర్యాద కలవాళ్ళు. వాళ్ళు దైవసందేశాన్ని శ్రద్ధతో వినేవాళ్ళు. ప్రతిరోజు పవిత్ర గ్రంథం చదివి, ఆ సందేశంలోని నిజానిజాలు పరిశీలించేవాళ్ళు. చాలా మంది యూదులు విశ్వాసులయ్యారు. వాళ్ళలాగే ముఖ్యమైన గ్రీకు స్త్రీలు, పురుషులు కూడా విశ్వాసులయ్యారు. పౌలు దైవసందేశాన్ని బెరయలో కూడా ఉపదేశిస్తున్నాడని థెస్సలోనీకలోని యూదులకు తెలిసింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రజలను పురికొలిపి, వాళ్ళలో అల్లర్లు రేకెత్తించారు. వెంటనే సోదరులు పౌలును సముద్ర తీరానికి పంపారు. సీల, తిమోతి బెరయలోనే ఉండిపోయారు. పౌలుతో వెళ్ళినవాళ్ళు అతనితో కలిసి ఏథెన్సుదాకా వెళ్ళారు. సీలను, తిమోతిని అయినంత త్వరలో రమ్మనమని పౌలు వాళ్ళ ద్వారా కబురు పంపాడు. ఈ వార్తతో వాళ్ళు తిరిగి బెరయకు వెళ్ళిపోయారు.

అపొస్తలుల కార్యములు 17:1-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

వారు అంఫిపొలి, అపొల్లోనియ పట్టణములమీదుగా . వెళ్లి థెస్సలొనీకకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజమందిరమొకటి యుండెను గనుక పౌలు తనవాడుక చొప్పున సమాజపు వారియొద్దకు వెళ్లి–క్రీస్తు శ్రమపడి మృతులలోనుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురముచేయు యేసే క్రీస్తయియున్నాడనియు లేఖనములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు, వారితో మూడువిశ్రాంతిదినములు తర్కించుచుండెను. వారిలో కొందరును, భక్తిపరులగు గ్రీసుదేశస్థులలో చాలమందియు, ఘనతగల స్త్రీలలో అనేకులును ఒప్పుకొని పౌలుతోను సీలతోను కలిసికొనిరి. అయితే యూదులు మత్సరపడి, పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపుకూర్చి పట్టణమెల్ల అల్లరిచేయుచు, యాసోను ఇంటిమీదపడి వారిని జనుల సభయెదుటికి తీసికొని వచ్చుటకు యత్నముచేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారులయొద్దకు ఈడ్చుకొనిపోయి – భూలోకమును తలక్రిందుచేసిన వీరు ఇక్కడికి కూడ వచ్చియున్నారు; యాసోను వీరిని చేర్చుకొనియున్నాడు. వీరందరు యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి, కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొనువారు అని కేకలువేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరచిరి. వారు యాసోనునొద్దను మిగిలినవారియొద్దను జామీను తీసికొని వారిని విడుదల చేసిరి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజమందిరములో ప్రవేశించిరి. వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులును, ఘనతగల గ్రీసుదేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలమందియు విశ్వసించిరి. అయితే బెరయలో కూడ పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని థెస్సలొనీకలో ఉండు యూదులు తెలిసికొని అక్కడికిని వచ్చి జనసమూహములను రేపి కలవరపరచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రమువరకు వెళ్లుమని పంపిరి; అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. పౌలును సాగనంప వెళ్లినవారు అతనిని ఏథెన్సు పట్టణమువరకు తోడుకొని వచ్చి, సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతనియొద్దకు రావలెనని ఆజ్ఞపొంది బయలుదేరి పోయిరి.