అపొస్తలుల కార్యములు 16:1-5 - Compare All Versions
అపొస్తలుల కార్యములు 16:1-5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ . తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యొక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరులవలన మంచిపేరు పొందినవాడు. అతడు తనతోకూడ బయలుదేరి రావలెనని పౌలుకోరి, అతని తండ్రి గ్రీసుదేశస్థుడని ఆ ప్రదేశములోని యూదులకందరికి తెలియును గనుక వారినిబట్టి అతని తీసికొని సున్నతి చేయించెను. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్లుచు, యెరూషలేములోనున్న అపొస్తలులును పెద్దలును నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి, అనుదినము లెక్కకు విస్తరించుచుండెను.
అపొస్తలుల కార్యములు 16:1-5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
పౌలు, దెర్బే లుస్త్ర పట్టణాలకు వచ్చాడు. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడున్నాడు. అతని తల్లి విశ్వాసి అయిన ఒక యూదు వనిత. తండ్రి గ్రీసు దేశస్థుడు. తిమోతికి లుస్త్ర, ఈకొనియలో ఉన్న సోదరుల మధ్య మంచి పేరు ఉంది. అతడు తనతో కూడ రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులందరికీ తెలుసు గనక వారిని బట్టి అతనికి సున్నతి చేయించాడు. వారు ఆ పట్టణాల ద్వారా వెళ్తూ, యెరూషలేములో ఉన్న అపొస్తలులూ పెద్దలూ నిర్ణయించిన విధులను పాటించేలా వాటిని వారికి అందజేశారు. కాబట్టి సంఘాలు విశ్వాసంలో బలపడి, ప్రతిరోజూ సంఖ్యలో పెరిగాయి.
అపొస్తలుల కార్యములు 16:1-5 TERV (పవిత్ర బైబిల్)
ఆ తర్వాత పౌలు దెర్బే వెళ్ళి అక్కడినుండి లుస్త్రకు వెళ్ళాడు. లుస్త్రలో తిమోతి అనే పేరుగల ఒక విశ్వాసి ఉండేవాడు. అతని తల్లి భక్తిగల యూదురాలు; తండ్రి గ్రీసు దేశస్థుడు. లుస్త్ర, ఈకొనియ పట్టణాల్లో నివసించే సోదరుల్లో తిమోతి మంచి పేరు తెచ్చుకున్నాడు. పౌలు అతణ్ణి తన వెంట పిలుచుకు వెళ్దామనుకొన్నాడు. తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రాంతంలో నివసించే యూదులందరికి తెలుసు. కాబట్టి అతనికి సున్నతి చేయించాడు. అపొస్తలులు, పెద్దలు యెరూషలేములో నిర్ణయించిన నియమాల్ని, వాళ్ళు ప్రతి పట్టణానికి వెళ్ళి ప్రజలకు తెలియచేసి, వాటిని పాటించమని చెప్పారు. తద్వారా సంఘాల్లో భక్తి అభివృద్ధి చెందింది. రోజు రోజుకూ ఆ సంఘాల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
అపొస్తలుల కార్యములు 16:1-5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పౌలు దెర్బేకు వచ్చి అక్కడినుండి లుస్త్రకు వచ్చాడు, అక్కడ తిమోతి అనే పేరుగల విశ్వాసిని కలుసుకున్నాడు. అతని తల్లి క్రీస్తును విశ్వాసించిన యూదురాలు తండ్రి గ్రీసు దేశస్థుడు. లుస్త్ర ఈకొనియ విశ్వాసులు అతని గురించి మంచి చెప్పారు. పౌలు తన ప్రయాణంలో అతన్ని వెంట తీసుకుని వెళ్లాలని భావించి, ఆ ప్రాంతంలోని యూదులందరికి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని తెలుసు కాబట్టి వారిని బట్టి అతనికి సున్నతి చేయించాడు. వారు పట్టణం నుండి పట్టణానికి ప్రయాణం చేస్తూ, యెరూషలేములోని అపొస్తలుల సంఘపెద్దల నిర్ణయాలను ప్రజలు పాటించడం కోసం అప్పగించారు. కాబట్టి సంఘాలన్ని విశ్వాసంలో బలపడుతూ, ప్రతిరోజు విశ్వాసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.