అపొస్తలుల కార్యములు 13:1-12
అపొస్తలుల కార్యములు 13:1-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నీగెరనబడిన సుమెయోను, కురేనీయుడైన లూకియ చతుర్థాధిపతియైన హేరోదుతోకూడ పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలును బోధకులును ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ–నేను బర్నబాను సౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతట వారు ఉపవాసముండి ప్రార్థనచేసి వారిమీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మచేత పంపబడినవారై సెలూ కయకు వచ్చి అక్కడనుండి ఓడయెక్కి కుప్రకు వెళ్లిరి. వారు సలమీలో ఉండగా యూదుల సమాజమందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై యుండెను. వారు ఆ ద్వీపమందంతట సంచరించి పాఫు అను ఊరికి వచ్చి నప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్ యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకముగలవాడైన సెర్గి పౌలు అను అధిపతియొద్దనుండెను; అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసమునుండి తొలగింపవలెనని యత్నముచేసి వారిని ఎదిరించెను; ఎలుమ అను పేరునకు గారడీవాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరిచూచి–సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధీ, నీవు ప్రభువుయొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభువు తనచెయ్యి నీమీద ఎత్తియున్నాడు; నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైన చెయ్యిపట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను. అంతట ఆ అధిపతి జరిగినదానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వ సించెను.
అపొస్తలుల కార్యములు 13:1-12 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అంతియొకయ సంఘంలో ప్రవక్తలు బోధకులు ఉన్నారు. వారిలో కొందరు: బర్నబా, నీగెర అనబడే సుమెయోను, కురేనీకి చెందిన లూకియ, చతుర్థాధిపతి హేరోదుతో పాటు పెరిగిన మనయేను, సౌలు. ఒక రోజు వారు ఉపవాసం ఉండి ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ, “నేను బర్నబా సౌలును పిలిచిన పని కోసం వారిని నా కోసం ప్రత్యేకపరచండి” అని చెప్పాడు. కాబట్టి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత వారి మీద చేతులుంచి వారిని సేవకు పంపించారు. వారిద్దరు పరిశుద్ధాత్మచే పంపబడిన తర్వాత, సెలూకయ పట్టణాన్ని దాటి ఓడలో కుప్ర ద్వీపానికి వెళ్లారు. వారు సలమీ పట్టణానికి చేరాక, దేవుని వాక్యాన్ని యూదుల సమాజమందిరాల్లో ప్రకటించారు. అప్పుడు మార్కు అనే యోహాను వారికి సహాయంగా ఉన్నాడు. వారు పాఫు అనే ఊరు వచ్చేవరకు ఆ ద్వీపమంతా తిరిగారు. అక్కడ వారు బర్ యేసు అనే పేరుగల యూదా మంత్రగాడైన ఒక అబద్ధ ప్రవక్తను కలుసుకొన్నారు. అతడు సెర్గియ పౌలు అనే రోమా అధిపతి దగ్గర ఉండేవాడు. ఆ అధిపతి తెలివిగలవాడు, అతడు దేవుని వాక్యాన్ని వినాలని బర్నబాను సౌలును పిలిపించుకున్నాడు. అయితే ఎలుమ అనే మంత్రగాడు ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగించాలనే ఉద్దేశంతో వారిని ఎదిరించాడు. అప్పుడు పౌలు అనబడే సౌలు పరిశుద్ధాత్మతో నింపబడి, ఎలుమ వైపు నేరుగా చూస్తూ, “నీవు సాతాను బిడ్డవు నీతికార్యాలన్నింటికి విరోధివి! నీవు అన్ని రకాల కపటంతో మోసంతో నిండి ఉన్నావు. ప్రభువు యొక్క సరియైన మార్గాలను చెడగొట్టడం మానవా? ఇదిగో, దేవుని హస్తం నీకు వ్యతిరేకంగా ఉంది. నీవు సూర్యుని కాంతిని కూడా చూడలేదా కొంతకాలం గ్రుడ్డివాడివి అవుతావు” అన్నాడు. వెంటనే అతని మీదికి మబ్బు వంటి చీకటి కమ్మింది, కాబట్టి అతడు తడుముకుంటూ తనను ఎవరైనా చేయి పట్టుకుని నడిపిస్తారని వెదకసాగాడు. జరిగింది అంతా ఆ అధిపతి చూసి, ప్రభువు గురించిన బోధకు ఆశ్చర్యపడి నమ్మాడు.
అపొస్తలుల కార్యములు 13:1-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అంతియొకయలోని క్రైస్తవ సంఘంలో బర్నబా, నీగెరు అనే సుమెయోను, కురేనీ వాడైన లూకియ, రాష్ట్రపాలకుడు హేరోదుతో పాటు పెరిగిన మనయేను, సౌలు అనే ప్రవక్తలూ బోధకులూ ఉన్నారు. వారు ప్రభువును ఆరాధిస్తూ ఉపవాసం ఉన్నపుడు, పరిశుద్ధాత్మ, “నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కోసం వారిని నాకు కేటాయించండి” అని వారితో చెప్పాడు. విశ్వాసులు ఉపవాసముండి, ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిన తరువాత వారిని పంపించారు. కాబట్టి బర్నబా, సౌలు పరిశుద్ధాత్మ పంపగా బయలుదేరి సెలూకియ వచ్చి అక్కడ నుండి సముద్ర మార్గంలో సైప్రస్ ద్వీపానికి వెళ్ళారు. వారు సలమీ అనే ఊరికి చేరుకుని యూదుల సమాజ మందిరాల్లో దేవుని వాక్కు ప్రకటించారు. మార్కు అనే యోహాను వారికి సహాయంగా ఉన్నాడు. వారు ఆ ద్వీపమంతా తిరిగి పాఫు అనే ఊరికి వచ్చి మంత్రగాడూ యూదీయ అబద్ధ ప్రవక్త అయిన బర్ యేసు అనే ఒకణ్ణి చూశారు. ఇతడు వివేకి అయిన సెర్గియ పౌలు అనే అధిపతి దగ్గర ఉండేవాడు. ఆ అధిపతి దేవుని వాక్కు వినాలని బర్నబానూ సౌలునూ పిలిపించాడు. అయితే ఎలుమ (ఈ పేరుకు మాంత్రికుడు అని అర్థం) ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగించాలనే ఉద్దేశంతో వారిని ఎదిరించాడు. అందుకు పౌలు అని పేరు మారిన సౌలు పరిశుద్ధాత్మతో నిండి అతనిని తేరి చూసి, “అపవాది కొడుకా, నీవు అన్ని రకాల కపటంతో దుర్మార్గంతో నిండి ఉన్నావు, నీవు నీతికి విరోధివి, ప్రభువు తిన్నని మార్గాలను చెడగొట్టడం మానవా? ఇదిగో, ప్రభువు నీ మీద చెయ్యి ఎత్తాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడవు” అని చెప్పాడు. వెంటనే మబ్బూ, చీకటీ అతనిని కమ్మాయి, కాబట్టి అతడు ఎవరైనా తనను చెయ్యి పట్టుకుని నడిపిస్తారేమో అని తడుములాడసాగాడు. అధిపతి, జరిగిన దాన్ని చూసి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాడు.
అపొస్తలుల కార్యములు 13:1-12 పవిత్ర బైబిల్ (TERV)
అంతియొకయలోని సంఘంలో ఉన్న ప్రవక్తలు, పండితులు ఎవరనగా: బర్నబా, “నీగెరు” అని పిలువబడే “సుమెయోను”, కురేనీ గ్రామానికి చెందిన లూకియ, మనయేను, (ఇతడు, సామంత రాజైన హేరోదు, యిద్దరూ కలిసి పెరిగారు), మరియు సౌలు. వీళ్ళు ఉపవాసాలు చేసి ప్రభువును ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ, “బర్నబాను, సౌలును నా కోసం వేరుచేయండి. వాళ్ళను ఒక ప్రత్యేకమైన పని కోసం పిలిచాను” అని అన్నాడు. అక్కడున్నవాళ్ళు వీళ్ళిద్దర్ని పంపే ముందు ప్రార్థనలు, ఉపవాసాలు చేసి, వాళ్ళపై తమ చేతులుంచి పంపారు. పవిత్రాత్మ వాళ్ళను పంపాడు. వాళ్ళు “సెలూకయ” అనే పట్టణానికి వెళ్ళి అక్కడినుండి ఓడలో ప్రయాణం చేసి సైప్రసు (కుప్ర) అనే ద్వీపాన్ని చేరుకున్నారు. అక్కడినుండి సలామి అనే పట్టణానికి వెళ్ళారు. అక్కడున్న యూదుల సమాజ మందిరాల్లో దైవసందేశాన్ని ప్రకటించారు. వాళ్ళకు సహాయంగా యోహాను వాళ్ళ వెంటే ఉన్నాడు. వాళ్ళు ఆ ద్వీపాన్నంతా పర్యటించి “పాఫు” అనే పట్టణం చేరుకున్నారు. మాయాజాలం చేస్తూ తానొక ప్రవక్తనని చెప్పుకుంటున్న వ్యక్తిని అక్కడ కలుసుకున్నారు. అతడు యూదుడు. పేరు “బర్ యేసు,” అతడు “సెర్గి పౌలు” అనే రాష్ట్రపాలకునికి సన్నిహితంగా ఉండేవాడు. సెర్గి పౌలు తెలివిగలవాడు. దైవసందేశాన్ని వినాలని బర్నబాను, సౌలును ఆహ్వానించాడు. ఎలుమ రాష్ట్రపాలకుణ్ణి ఈ విశ్వాసానికి దూరంగా ఉంచాలని ప్రయత్నించాడు. “ఎలుమ” అనగా గ్రీకు భాషలో మాయాజాలకుడు. అప్పుడు సౌలు (ఇతణ్ణి పౌలు అని కూడా పిలిచే వారు) పరిశుద్ధాత్మతో నిండిపోయి ఎలుమను సూటిగా చూస్తూ, “నీవు సాతానుకు పుట్టావు! మంచిదన్న ప్రతిదీ నీకు శత్రువు! నీలో అన్ని రకాల మోసాలు, కుట్రలు ఉన్నాయి! ప్రభువు యొక్క సక్రమ మార్గాల్ని వక్రంగా మార్చటం ఎప్పుడు మానుకొంటావు? ఇదిగో చూడు, ప్రభువు ఇప్పుడు నిన్ను శిక్షిస్తాడు. కొంతకాలం దాకా నీవు సూర్యుని వెలుగు చూడలేవు! గ్రుడ్డివాడివై పోతావు!” అని అన్నాడు. తక్షణమే పొగమంచు, చీకట్లు అతణ్ణి చుట్టివేసాయి. తన చేయి పట్టుకొని నడిపేందుకు ఎవరైనా దొరుకుతారేమోనని తారాడుతూ చూసాడు. ఆ రాష్ట్రపాలకుడు ప్రభువును గురించి చెప్పిన బోధలు విని ఆశ్చర్యపడి ప్రభువును నమ్మాడు.