Skip to content

అపొస్తలుల కార్యములు 1:3-5 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 1:3-5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆయన శ్రమపడిన తరువాత నలువది దినములవరకు వారి కగపడుచు, దేవుని రాజ్యవిషయములనుగూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను చూపి వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను. ఆయన వారిని కలిసికొని యీలాగు ఆజ్ఞాపించెను–మీరు యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్దానముకొరకు కనిపెట్టుడి; యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను.

అపొస్తలుల కార్యములు 1:3-5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆయన హింసలు పొందిన తరువాత నలభై రోజులపాటు వారికి కనబడుతూ, దేవుని రాజ్య విషయాలను బోధిస్తూ, అనేక రుజువులను చూపించి వారికి తనను తాను సజీవునిగా కనపరచుకున్నాడు. ఆయన వారిని కలుసుకుని ఈ విధంగా ఆజ్ఞాపించాడు, “మీరు యెరూషలేమును విడిచి పోవద్దు. నా ద్వారా విన్న తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టండి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు గానీ కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు.”

అపొస్తలుల కార్యములు 1:3-5 TERV (పవిత్ర బైబిల్)

ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళకు కనిపించి తాను బ్రతికే ఉన్నానని ఎన్నో నిదర్శనాలను చూపించాడు. వాళ్ళకు నలభై రోజుల దాకా కనిపించి దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు. ఆయన వారిని ఒకసారి కలిసికొని ఈ విధంగా ఆజ్ఞాపించాడు: “యెరూషలేము పట్టణాన్ని వదిలి వెళ్ళకండి. నా తండ్రి వాగ్దానం చేసిన వరం కోసం కాచుకొని ఉండండి. దాన్ని గురించి నేను మీకిదివరకే చెప్పాను. యోహాను నీళ్ళతో బాప్తిస్మమునిచ్చాడు. కాని కొద్ది రోజుల్లో మీరు పవిత్రాత్మలో బాప్తిస్మము పొందుతారు.”

అపొస్తలుల కార్యములు 1:3-5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అనగా, ఆయన హింసను పొందిన తర్వాత, తాను సజీవునిగా ఉన్నారని అనేక రుజువులతో తనను తాను వారికి నలభై రోజులు కనుపరచుకుంటూ దేవుని రాజ్యాన్ని గురించి బోధించారు. ఒక రోజు యేసు వారితో కలసి భోజనం చేస్తున్నప్పుడు ఆయన వారికి ఈ ఆజ్ఞ ఇచ్చారు: “మీరు యెరూషలేమును వదిలి వెళ్లకండి, నేను మీతో ముందే చెప్పినట్లు, నా తండ్రి వాగ్దానం చేసిన ఆ బహుమానాన్ని పొందుకొనే వరకు కనిపెడుతూ ఉండండి. ఎందుకంటే, యోహాను నీటితో బాప్తిస్మమిచ్చాడు, కాని కొన్ని రోజుల్లో మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుకొంటారు.”