అపొస్తలుల కార్యములు 1:12-26
అపొస్తలుల కార్యములు 1:12-26 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
తర్వాత అపొస్తలులు ఒలీవల కొండ నుండి బయలుదేరి యెరూషలేముకు తిరిగి వెళ్లారు, అది ఒక సబ్బాతు దిన ప్రయాణం అనగా దాదాపు ఒక కిలోమీటరు దూరం ఉంటుంది. వారు పట్టణం చేరి, తాము ఉంటున్న మేడ గదికి ఎక్కి వెళ్లారు. అక్కడ ఎవరు ఉన్నారంటే: పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా; బర్తలోమయి, మత్తయి; అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే సీమోను, యాకోబు కుమారుడైన యూదా. వీరితో పాటు కొందరు స్త్రీలు, యేసు తల్లియైన మరియ, ఆయన తమ్ముళ్ళు కలిసి, ఏకమనస్సుతో విడువక ప్రార్థిస్తున్నారు. ఇంచుమించు నూట ఇరవైమంది విశ్వాసులు ఒక్కచోట చేరినప్పుడు పేతురు వారి మధ్యలో నిలబడి, “సహోదరీ సహోదరులారా, యేసును బంధించడానికి వారికి దారి చూపించిన యూదా గురించి, చాలా కాలం క్రిందట దావీదు ద్వారా పరిశుద్ధాత్మ చెప్పిన లేఖనాలు నెరవేరవలసి ఉంది. ‘అతడు మనలో ఒకనిగా ఉండి మన పరిచర్యలో భాగం పంచుకొన్నాడు.’ ” ద్రోహం చేసి సంపాదించిన డబ్బుతో యూదా ఒక పొలాన్ని కొన్నాడు; అక్కడే అతడు తలక్రిందులుగా పడి, శరీరం చీలి అతని ప్రేగులన్ని బయట చెదరిపడ్డాయి. ఈ సంగతిని గురించి యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్కరు విన్నారు, కాబట్టి ఆ పొలాన్ని వారి భాషలో అకెల్దమా అని పిలుస్తున్నారు, అకెల్దమా అనగా రక్త భూమి అని అర్థం. పేతురు ఇలా అన్నాడు, “ఎందుకంటే, కీర్తన గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉంది: “ ‘అతని స్థలం పాడైపోవును గాక; దానిలో ఎవరు నివసించకుందురు గాక’ ‘అతని నాయకత్వం వేరొకడు తీసుకొనును గాక.’ కాబట్టి యోహాను ద్వార బాప్తిస్మం పొందుకున్నది మొదలుకొని ప్రభువైన యేసు మన దగ్గర నుండి పరలోకానికి వెళ్లిన సమయం వరకు, ఆయన మన మధ్య ఉన్న కాలమంతా మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడ ఆయన పునరుత్థానం గురించి సాక్షిగా ఉండాలి.” కాబట్టి వారు యూస్తు, బర్సబ్బా అని పిలువబడే యోసేపు మత్తీయా అనే ఇద్దరి పేర్లు సూచించారు. తర్వాత వారు, “ప్రభువా, నీకు అందరి హృదయాలు తెలుసు. ఈ ఇద్దరిలో ఎవరు యూదా విడిచి వెళ్లిన ఈ అపొస్తలిక పరిచర్యను కొనసాగించడానికి మీరు ఎవరిని ఎన్నుకున్నారో మాకు చూపించండి” అని ప్రార్థించారు. తర్వాత వారు చీట్లు వేసినప్పుడు, మత్తీయా పేరున చీటి వచ్చింది, కాబట్టి పదకొండు మంది అపొస్తలులతో అతన్ని చేర్చారు.
అపొస్తలుల కార్యములు 1:12-26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు వారు ఒలీవ కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. ఆ కొండ యెరూషలేముకు విశ్రాంతి దినాన నడవదగినంత దూరంలో ఉంది. వారు పట్టణంలో ప్రవేశించి, తాము బస చేస్తున్న మేడగదిలోకి వెళ్ళారు. వారెవరంటే, పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, ఉద్యమ కారుడైన సీమోను, యాకోబు కుమారుడు యూదా. వీరూ, వీరితో కూడా కొందరు స్త్రీలూ, యేసు తల్లి మరియ, ఆయన తమ్ముళ్ళూ ఏకగ్రీవంగా, నిలకడగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో సుమారు నూట ఇరవై మంది శిష్యులు సమావేశమై ఉన్నపుడు పేతురు వారి మధ్య నిలబడి, “సోదరులారా, యేసును పట్టుకున్నవారికి దారి చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి ఉంది. ఇతడు మనలో ఒకడుగా లెక్కలోకి వచ్చి ఈ పరిచర్యలో భాగం పొందాడు. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన డబ్బుతో ఒక పొలం కొన్నాడు. అతడు తలకిందులుగా పడి శరీరం బద్దలై పేగులన్నీ బయటికి వచ్చాయి. ఈ విషయం యెరూషలేములో నివసిస్తున్న వారందరికీ తెలిసింది. కాబట్టి వారి భాషలో ఆ పొలాన్ని ‘అకెల్దమ’ అంటున్నారు. దాని అర్థం ‘రక్త భూమి.’ ఇందుకు రుజువుగా, ‘అతని ఇల్లు పాడైపోవు గాక, దానిలో ఎవ్వడూ కాపురముండకపోవు గాక, అతని ఉద్యోగం వేరొకడు తీసికొనును గాక,’ అని కీర్తనల గ్రంథంలో రాసి ఉంది. “కాబట్టి యోహాను బాప్తిసమిచ్చింది మొదలు ప్రభువైన యేసు మన దగ్గర నుండి పరలోకానికి వెళ్ళిన రోజు వరకూ, ఆయన మన మధ్య ఉన్న కాలమంతా మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడ ఆయన పునరుత్థానం గురించి సాక్షిగా ఉండాలి” అని చెప్పాడు. అప్పుడు వారు యూస్తు, బర్సబ్బా అనే మారు పేర్లున్న యోసేపునూ, మత్తీయనూ నిలబెట్టి, ఈ విధంగా ప్రార్థించారు. “అందరి హృదయాలను ఎరిగిన ప్రభూ, తన చోటికి వెళ్ళడానికి యూదా దారి తప్పి పోగొట్టుకొన్న ఈ పరిచర్యలో, అపొస్తలత్వంలో పాలు పొందడానికి వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొన్న వాణ్ణి చూపించు.” తరువాత శిష్యులు వారిద్దరి మీదా చీట్లు వేస్తే మత్తీయ పేరుతో చీటి వచ్చింది కాబట్టి అతనిని పదకొండుమంది అపొస్తలులతో కలిపి లెక్కించారు.
అపొస్తలుల కార్యములు 1:12-26 పవిత్ర బైబిల్ (TERV)
ఆ తర్వాత వాళ్ళు ఒలీవల కొండనుండి యెరూషలేముకు తిరిగి వచ్చారు. ఈ కొండ పట్టణానికి విశ్రాంతి రోజున నడిచినంత దూరంలో ఉంటుంది. వాళ్ళు వచ్చి మేడ మీద తాము నివసిస్తున్న గదిలోకి వెళ్ళారు. అక్కడున్న అపొస్తలులు ఎవరనగా: పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, “జెలోతే” అని పిలువబడే సీమోను, యాకోబు కుమారుడు యూదా. వీళ్ళంతా సమావేశమై ఒకే మనస్సుతో ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు. కొందరు స్త్రీలు, యేసు తల్లి మరియ, యేసు సోదరులు కూడా వీళ్ళతో ఉండేవాళ్ళు. ఒక రోజు భక్తులందరూ సమావేశం అయ్యారు. వాళ్ళ సంఖ్య నూట ఇరవై. పేతురు మాట్లాడటానికి లేచి నిలుచున్నాడు. అతడు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నా సోదరులారా! చాలా కాలం క్రిందటే పవిత్రాత్మ యూదాను గురించి దావీదు నోటి ద్వారా పలికాడు. లేఖనాల్లో వ్రాయబడిన ఈ విషయాలు తప్పక జరుగవలసినవి. ఈ యూదా యేసును బంధించిన వాళ్ళకు దారి చూపాడు. యూదా మాలో ఒకడు. మాతో కలిసి సేవ చెయ్యటానికి ఎన్నుకోబడ్డవాడు.” యూదా చేసిన ఈ కుట్రకు అతనికి డబ్బు దొరికింది. ఆ డబ్బుతో ఒక భూమి కొనబడింది. ఆ తర్వాత యూదా తలక్రిందుగా పడిపోయాడు. అతని దేహం చీలిపోయి ప్రేగులు బయటపడ్డాయి. యెరూషలేములోని వాళ్ళంతా దీన్ని గురించి విన్నారు. అందువలన తమ భాషలో ఆ భూమిని అకెల్దమ అని పిలిచేవాళ్ళు. దీని అర్థం “రక్తపు భూమి.” పేతురు యింకా ఈ విధంగా అన్నాడు: “దీన్ని గురించి కీర్తనల గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడివుంది: ‘అతని భూమిని పాడు పడనిమ్ము అక్కడెవ్వరూ నివసించకుండా పోనిమ్ము.’ ‘అతని స్థానాన్ని యింకొకడు ఆక్రమించనిమ్ము!’ “ఇప్పుడు యింకొకడు మనలో చేరాలి. అతడు వాళ్ళలో, అంటే యేసు మనతో కలిసి జీవించినంత కాలం మనతో కలిసి ఉన్నవాళ్ళలో ఒకడై ఉండాలి. అతడు యేసు ప్రభువు చావునుండి బ్రతికి వచ్చాడన్న దానికి మనతో కలిసి సాక్ష్యం చెప్పాలి. యోహాను బాప్తిస్మము నివ్వటం మొదలు పెట్టినప్పటినుండి యేసును మననుండి పరలోకానికి తీసుకు వెళ్ళిన దినం దాకా మనతో కలిసి జీవించినవాడై ఉండాలి.” వాళ్ళు ఇద్దరి పేర్లను సూచించారు. బర్సబ్బా అని పిలువబడే యోసేపు పేరు, ఇతన్నే యూస్తు అని కూడా అంటారు, మత్తీయ పేరు. అంతా కలిసి ఈ విధంగా ప్రార్థించారు: “ప్రభూ! నీకు ప్రతి ఒక్కరి మనస్సు తెలుసు. యూదా తన స్థానాన్ని వదిలి తాను వెళ్ళతగిన స్థానానికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ ఇద్దరిలో అపొస్తలత్వాన్ని, ఈ సేవా స్థానాన్ని ఆక్రమించటానికి నీవెన్నుకొన్నవాణ్ణి మాకు చూపించు.” ఆ తర్వాత వాళ్ళు చీటీలు వేసారు. వాళ్ళు తీసిన చీటీలో మత్తీయ పేరు వ్రాయబడి ఉంది. అందువల్ల అతడు ఆ పదకొండుగురిలాగే అపొస్తలుడయ్యాడు.
అపొస్తలుల కార్యములు 1:12-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండనుండి యెరూషలేమునకు తిరిగి వెళ్లిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతిదినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరును, వీరితోకూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరువదిమంది సహోదరులు కూడియుండగా పేతురు వారి మధ్యనిలిచి ఇట్లనెను –సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదానుగూర్చి పరిశుద్ధాత్మ దావీదుద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి యుండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడినవాడై యీ పరిచర్యలో పాలుపొందెను. ఈ యూదా ద్రోహమువలన సంపాదించిన రూకల నిచ్చియొక పొలము కొనెను. అతడు తలక్రిందుగాపడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికి తెలియ వచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అన బడియున్నది; దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా –అతని యిల్లు పాడైపోవునుగాక దానిలో ఎవడును కాపురముండక పోవునుగాక అతని యుద్యోగము వేరొకడు తీసికొనునుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడియున్నది. కాబట్టి యోహాను బాప్తిస్మమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మనయొద్దనుండి పరమునకు చేర్చుకొనబడిన దినమువరకు, ఆయన మన మధ్య సంచరించుచుండిన కాల మంతయు మనతో కలిసియున్న వీరిలో ఒకడు, మనతోకూడ ఆయన పునరుత్థానమునుగూర్చి సాక్షియై యుండుట ఆవశ్యకమని చెప్పెను. అప్పుడు వారు యూస్తు అను మారుపేరుగల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థనచేసిరి–అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన యీ పరి చర్యలోను అపొస్తలత్వములోను పాలుపొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనినవానిని కనబరచుమనిరి. అంతట వారు వీరినిగూర్చి చీట్లువేయగా మత్తీయపేరట చీటి వచ్చెను గనుక అతడు పదునొకండుమంది అపొస్తలులతోకూడ లెక్కింపబడెను.