2 సమూయేలు 6:16-22
2 సమూయేలు 6:16-22 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా నిబంధన మందసం దావీదు పట్టణంలోనికి వస్తుండగా, సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూసింది. యెహోవా సన్నిధిలో రాజైన దావీదు గంతులు వేస్తూ నాట్యం చేయడం చూసి తన మనస్సులో అతన్ని నీచంగా చూసింది. వారు యెహోవా మందసాన్ని తీసుకువచ్చి, దావీదు దాని కోసం వేసిన గుడారంలో దానిని ఉంచారు, దావీదు యెహోవా సన్నిధిలో దహనబలులు సమాధానబలులు అర్పించాడు. అతడు దహనబలులు సమాధానబలులు అర్పించిన తర్వాత, దావీదు సైన్యాల యెహోవా పేరిట ప్రజలను దీవించాడు. అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులందరికి ప్రతి స్త్రీకి పురుషునికి ఒక రొట్టె, కొంత మాంసం, ఒక ఖర్జూర పండ్ల రొట్టె, ఒక ద్రాక్షపండ్ల రొట్టె ఇచ్చాడు. తర్వాత ప్రజలంతా ఎవరి ఇళ్ళకు వారు వెళ్లిపోయారు. తన ఇంటివారిని దీవించడానికి దావీదు ఇంటికి తిరిగి వెళ్లినప్పుడు సౌలు కుమార్తె మీకాలు ఎదురు వచ్చి అతనితో, “ఇశ్రాయేలు రాజు తన సేవకులైన బానిస అమ్మాయిలు చూస్తుండగా ఒక పిచ్చివాడు చేసినట్లుగా ఈ రోజు బట్టలు విప్పి అర్థనగ్నంగా ఎంత గొప్పగా కనబడ్డాడో!” అని హేళనగా మాట్లాడింది. అందుకు దావీదు మీకాలుతో, “నీ తండ్రిని నీ తండ్రి ఇంటివారిని కాదని నన్ను ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించిన యెహోవా సన్నిధిలో నేను ఆనందిస్తూ నాట్యం చేశాను. నేను ఇంతకన్నా ఎక్కువ అవమానపడినా నా దృష్టికి నేను తక్కువ వాడినైనా ఫర్వాలేదు, కాని నీవు చెప్తున్న బానిస అమ్మాయిల దృష్టిలో గౌరవించబడతాను” అన్నాడు.
2 సమూయేలు 6:16-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా మందసం దావీదు పట్టణానికి వచ్చినప్పుడు, సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూసింది. యెహోవా సన్నిధిలో గంతులు వేస్తూ నాట్యం చేస్తున్న దావీదును చూసి, తన మనస్సులో అతన్ని గూర్చి నీచంగా భావించుకుంది. వారు యెహోవా మందసాన్ని తీసుకువచ్చి దావీదు దాని కోసం ఏర్పాటు చేసిన గుడారంలో ఉంచినప్పుడు, దావీదు యెహోవా సన్నిధిలో హోమబలులు, శాంతిబలులు అర్పించాడు. హోమబలులు, శాంతిబలులు అర్పించడం ముగిసిన తరువాత దావీదు సైన్యాలకు అధిపతి అయిన యెహోవా పేరట ప్రజలను ఆశీర్వదించాడు. సమావేశమైన ఇశ్రాయేలీయుల్లో స్త్రీ పురుషులందరికీ రొట్టె, మాంసం, ఎండు ద్రాక్షముద్ద ఒక్కొక్కటి చొప్పున పంచిపెట్టాడు. తరువాత ప్రజలంతా తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు. దావీదు తన ఇంటివారిని దీవించడానికి వచ్చినప్పుడు, సౌలు కుమార్తె మీకాలు దావీదుకు ఎదురు వచ్చింది. ఆమె “ఇశ్రాయేలీయుల రాజు బానిస పిల్లల ఎదుటా సేవకుల ఎదుటా ఈ రోజు బట్టలు తీసేసి ఎంత గొప్పగా కనబడ్డాడు! ఎవడో పనికిమాలినవాడు విప్పేసినట్టు తన బట్టలు విప్పేసాడు” అంది. అప్పుడు దావీదు, “నీ తండ్రినీ, అతని సంతానాన్నీ తోసిపుచ్చి ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులను పాలించడానికి నన్ను ఎన్నుకొన్న యెహోవా సన్నిధిలో నేను అలా చేశాను. యెహోవా సన్నిధిలో నాట్యం చేశాను. నేను ఇంతకన్నా మరింత హీనంగా నా దృష్టికి నేను తక్కువ వాడనై నువ్వు చెబుతున్న బానిస స్త్రీల దృష్టిలో గొప్పవాడినవుతాను” అని మీకాలుతో అన్నాడు.
2 సమూయేలు 6:16-22 పవిత్ర బైబిల్ (TERV)
సౌలు కుమార్తె మీకాలు ఒక కిటికీ గుండా చూస్తూ వుంది. యెహోవా పవిత్ర పెట్టె నగరంలోనికి వచ్చినప్పుడు, యెహోవా ముందు దావీదు చిందులేస్తూ, నాట్యం చేస్తూవున్నాడు. ఇదంతా మీకాలు చూసి, దావీదును తన మనసులో అవమానించింది. పవిత్ర పెట్టె కొరకు దావీదు ఒక గుడారం నిర్మింపజేశాడు. ఇశ్రాయేలీయులు యెహోవా పవిత్ర పెట్టెను గుడారంలో దాని స్థానంలో నిలిపారు. దావీదు అప్పుడు దహన బలులు, సమాధాన బలులు యెహోవాకు సమర్పించాడు. దహన బలులు, సమాధాన బలులు సమర్పించాక, సర్వశక్తిమంతుడైన యెహోవా పేరిట దావీదు ప్రజలను ఆశీర్వదించాడు. నైవేద్యంగా ఉంచిన రొట్టె, ఎండిన ద్రాక్ష భక్ష్యములు, ఖర్జూరపు పండువేసి చేసిన రొట్టెలను స్త్రీ పురుషులందరికీ, ఇశ్రాయేలీయులందరికీ ప్రసాదంగా పంచి పెట్టాడు. తరువాత వారంతా తమ తమ ఇండ్లకు వెళ్లిపోయారు. దావీదు తన ఇంటి వారిని ఆశీర్వదించటానికి వెళ్లాడు. కాని సౌలు కుమార్తె మీకాలు దావీదును కలవటానికి బయటికి వచ్చింది. “ఇశ్రాయేలు రాజు ఈనాడు తనను తాను ఏమాత్రం గౌరవించుకోలేదు. నీ సేవకుల పని గత్తెల ముందు నీవు నీ బట్టలు విప్పివేశావు. సిగ్గు విడిచి బట్టలు విప్పుకునే ఒక మూర్ఖునిలా ప్రవర్తించావు!” అని బాగా అవమానించింది. అందుకు దావీదు మీకాలుతో ఇలా అన్నాడు: “యెహోవా నన్ను ఎంపిక చేశాడు. అంతేగాని నీ తండ్రనీ కాదు, లేక అతని కుటుంబంలో మరెవ్వరినీ కాదు. తన ప్రజలైన ఇశ్రాయేలీయులందరికీ నాయకునిగా యెహోవా నన్ను ఎంపిక చేశాడు. అందువల్ల యెహోవా ఎదుట నేను ఉత్సవం చేశాను. బహుశః నీ దృష్టిలో నాకు గౌరవం లేకుండా పోవచ్చు. నాకు నేను ఇంకా కించ పర్చుకోవచ్చు. కాని నీవు చెప్పిన ఆ పనిగత్తెలు మాత్రం నన్ను గౌరవిస్తారు!”
2 సమూయేలు 6:16-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా మందసము దావీదు పురమునకు రాగా, సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలోనుండి చూచి, యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచు నున్న దావీదును కనుగొని, తన మనస్సులో అతని హీనపరచెను. వారు యెహోవా మందసమును తీసికొని వచ్చి గుడారముమధ్యను దావీదు దానికొరకు ఏర్పరచిన స్థలమున నుంచగా, దావీదు దహనబలులను సమాధానబలులను యెహోవా సన్నిధిని అర్పించెను. దహనబలులను సమాధానబలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకధిపతియగు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి, సమూహముగా కూడిన ఇశ్రాయేలీయులగు స్త్రీపురుషులకందరికి ఒక్కొక రొట్టెయు ఒక్కొక భక్ష్యమును ఒక్కొక ద్రాక్షపండ్ల అడయు పంచిపెట్టిన తరువాత జనులందరును తమతమ యిండ్లకు వెళ్లిపోయిరి. తన యింటివారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి–హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి యెంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు –నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనులమీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను యేర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేనాలాగు చేసితిని; యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని. ఇంతకంటె మరి యెక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి ఘనుడనగుదునని మీకాలుతో అనెను. మరణమువరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనకయుండెను.