2 సమూయేలు 11:1-11
2 సమూయేలు 11:1-11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వసంతకాలంలో రాజులు యుద్ధానికి బయలుదేరే కాలంలో, దావీదు యోవాబును తన మనుష్యులతో ఇశ్రాయేలు సైన్యమంతటితో పంపించగా, వారు అమ్మోనీయులను నాశనం చేసి రబ్బా పట్టణాన్ని ముట్టడించారు. కాని దావీదు యెరూషలేములోనే ఉండిపోయాడు. ఒక రోజు సాయంత్రం దావీదు పడక మీద నుండి లేచి రాజభవనం పైకప్పు మీద నడుస్తూ, అక్కడినుండి ఒక స్త్రీ స్నానం చేయడం చూశాడు. ఆ స్త్రీ చాలా అందంగా ఉంది. ఆమె గురించి వివరాలు తెలుసుకొని రమ్మని దావీదు ఒక వ్యక్తిని పంపించాడు. అతడు వచ్చి, “ఆమె ఎలీయాము కుమార్తెయైన బత్షెబ, హిత్తీయుడైన ఊరియాకు భార్య” అని చెప్పాడు. ఆమెను తీసుకురావడానికి దావీదు తన మనుష్యులను పంపించాడు. ఆమె అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఆమెతో పడుకున్నాడు. ఆమె తనకు కలిగిన అపవిత్రతను శుద్ధి చేసుకుని తన ఇంటికి వెళ్లిపోయింది. ఆ స్త్రీ గర్భం ధరించగా, “నేను గర్భవతినయ్యాను” అని దావీదుకు కబురు పంపింది. అప్పుడు దావీదు, “హిత్తీయుడైన ఊరియాను నా దగ్గరకు పంపించు” అని యోవాబుకు కబురు చేయగా యోవాబు అతన్ని దావీదు దగ్గరకు పంపాడు. ఊరియా తన దగ్గరకు వచ్చినప్పుడు దావీదు అతన్ని, యోవాబు ఎలా ఉన్నాడో సైనికులు ఎలా ఉన్నారో యుద్ధం ఎలా జరుగుతుందో అడిగాడు. తర్వాత దావీదు ఊరియాతో, “నీవు ఇంటికి వెళ్లి పాదాలు కడుక్కో” అని చెప్పాడు. ఊరియా రాజభవనం నుండి వెళ్లిపోయాడు. అతని వెనుక రాజు అతనికి కానుక పంపించాడు. అయితే ఊరియా తన ఇంటికి వెళ్లకుండా తన రాజు సేవకులందరితో కలిసి రాజభవన ద్వారం దగ్గరే నిద్రపోయాడు. ఊరియా ఇంటికి వెళ్లలేదని దావీదు విని ఊరియాను పిలిచి, “నీవు చాలా కాలం తర్వాత తిరిగి వచ్చావు కదా! ఇంటికి ఎందుకు వెళ్లలేదు?” అని అడిగాడు. అందుకు ఊరియా దావీదుతో, “మందసం, ఇశ్రాయేలీయులు, యూదా వారు గుడారాల్లోనే ఉంటున్నారు. నా దళాధిపతియైన యోవాబు, నా ప్రభువు యొక్క సైనికులు పొలిమేరల్లో ఉన్నారు. అలాంటప్పుడు నేను ఇంటికి వెళ్లి తిని త్రాగి, నా భార్యతో ఎలా సంతోషించగలను? నీ జీవం తోడు, నేను అలా చేయను” అన్నాడు.
2 సమూయేలు 11:1-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వసంత కాలంలో రాజులు యుద్ధాలకు బయలుదేరే కాలంలో, అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణాన్ని ఆక్రమించుకోడానికి దావీదు యోవాబునీ తన సేవకులనూ ఇశ్రాయేలు సైన్యమంతటినీ పంపించాడు. దావీదు యెరూషలేములోనే ఉండిపోయాడు. ఒకరోజు సాయంత్రం సమయంలో దావీదు పడక మీద నుండి లేచి రాజభవనం డాబా మీద నడుస్తున్నాడు. డాబాపై నుండి కిందికి చూస్తున్నప్పుడు స్నానం చేస్తూ ఉన్న ఒక స్త్రీ కనిపించింది. ఆమె ఎంతో అందంగా ఉంది. ఆమె గురించి వివరాలు తెలుసుకు రమ్మని దావీదు ఒకణ్ణి పంపించాడు. అతడు వచ్చి “ఆమె పేరు బత్షెబ. హిత్తీయుడైన ఊరియా భార్య, ఏలీయాము కూతురు” అని చెప్పాడు. దావీదు తన మనుషులను పంపి ఆమెను తన దగ్గరికి పిలిపించాడు. ఆమె అతని దగ్గరకు వచ్చినప్పుడు ఆమెతో శయనించాడు. ఆమె తనకు కలిగిన మలినం పోగొట్టుకుని తన ఇంటికి తిరిగి వెళ్ళింది. కొన్ని రోజులకు ఆమె గర్భం ధరించింది. “నేను గర్భవతి నయ్యాను” అని ఆమె దావీదుకు కబురు పంపింది. దావీదు “హిత్తీయుడైన ఊరియాని నా దగ్గరికి పంపించు” అని ఒక వ్యక్తి ద్వారా యోవాబుకు కబురు చేశాడు. యోవాబు ఊరియాని దావీదు దగ్గరికి పంపించాడు. జరుగుతున్న యుద్ధ విశేషాలనూ యోవాబు, ఇతర సైనికుల క్షేమ సమాచారాలనూ దావీదు అతణ్ణి అడిగి తెలుసుకున్నాడు. తరువాత దావీదు “నువ్వు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకో” అని ఊరియాకు అనుమతి ఇచ్చాడు. ఊరియా రాజు నగరం నుండి బయలుదేరాడు. రాజు అతని వెనకాలే అతనికి ఒక బహుమానం పంపించాడు. అయితే ఊరియా తన ఇంటికి వెళ్ళకుండా రాజు సేవకులతో కలసి రాజనగర గుమ్మం దగ్గర నిద్రపోయాడు. ఊరియా అతని ఇంటికి వెళ్ళలేదన్న సంగతి దావీదుకు తెలిసింది. అప్పుడు దావీదు ఊరియాను పిలిపించి “నువ్వు ప్రయాణం చేసి అలసిపోయావు కదా, ఇంటికి ఎందుకు వెళ్ళలేదు?” అని అడిగాడు. అందుకు ఊరియా “మందసమూ, ఇశ్రాయేలువారూ యూదావారూ గుడారాల్లో ఉంటున్నారు. నా అధికారి యోవాబూ, మా రాజువైన నీ సేవకులూ బాహ్య ప్రదేశంలో ఉండగా నేను తింటూ, తాగుతూ నా భార్యతో గడపడానికి ఇంటికి వెళ్ళాలా? నీ మీద, నీ ప్రాణం మీద ఒట్టు, నేను అలా ఎంత మాత్రం చేయలేను” అని దావీదుతో అన్నాడు.
2 సమూయేలు 11:1-11 పవిత్ర బైబిల్ (TERV)
వసంతకాలం వచ్చింది. రాజులు యుద్ధాలకు దిగే తరుణం. దావీదు యోవాబును, ఇతర సేవకులను, ఇశ్రాయేలీయులను సిద్ధంచేసి అమ్మోనీయులను నాశనం చేయటానికి పంపాడు యోవాబు సైన్యం (అమ్మోనీయుల రాజధాని నగరమైన) రబ్బా నగరంపై కూడ దాడి చేసింది. ఈసారి దావీదు యెరూషలేములోనే వుండిపోయాడు. ఆ రోజు సాయంత్రం పడకనుంచి లేచి, రాజు మేడ మీద అటు యిటు తిరుగ సాగాడు. అప్పుడతడు స్నానం చేస్తూ ఉన్న స్త్రీనొక దానిని చూసాడు. ఆమె చాలా అందంగా ఉంది. దావీదు తన సేవకులను పిలువనంపాడు. ఆ స్త్రీ ఎవరని అడుగగా, ఒక సేవకుడు, “ఆమె పేరు బత్షెబ అనీ, ఆమె ఏలీయాము కుమార్తె అనీ చెప్పాడు. ఆమె హిత్తీయుడగు ఊరియాకు భార్య అనికూడ చెప్పాడు.” దావీదు దూతలను పంపి బత్షెబను తన వద్దకు తీసుకొని రమ్మని చెప్పాడు. ఆమె దావీదు వద్దకు వచ్చినప్పుడు, ఆమెతో అతడు సంగమించాడు. ఆమె స్నానాదులు చేసి, శుచియై తన ఇంటికి వెళ్లిపోయింది. కాని “బత్షెబ గర్భవతి” అయింది. ఈ విషయమై దావీదుకు వర్తమానం పంపింది. దావీదు ఒక వర్తమానం యోవాబుకు పంపాడు. “హిత్తీయుడగు ఊరియాను నా వద్దకు పంపు” అని కబురు చేశాడు. అందువల్ల యోవాబు ఊరియాను దావీదు వద్దకు పంపాడు. ఊరియా దావీదు వద్దకు వచ్చాడు. దావీదు అతనిని యోవాబు ఎలా ఉన్నాడనీ, సైనికులెలా వున్నారనీ, యుద్ధం ఎలా కొనసాగుతున్నదనీ అడిగాడు. తరువాత “ఇంటికి పోయి విశ్రాంతి తీసుకోమని” దావీదు ఊరియాకు చెప్పాడు. ఊరియా రాజు ఇంటిని వదిలి బయటికి వచ్చాడు. రాజు ఊరియాకు ఒక బహుమానం కూడ పంపాడు. కాని ఊరియా ఇంటికి పోలేదు. రాజు ఇంటి ఆవరణ ద్వారం వద్ద ఊరియా నిద్రపోయాడు. మిగిలిన రాజ సేవకుల మాదిరిగా అతను కూడా అక్కడే నిద్ర పోయాడు. “ఊరియా ఇంటికి పోలేదని” సేవకులు దావీదుకు చెప్పారు. అప్పుడు దావీదు ఊరియాను పిలిచి, “నీవు చాలా దూరంనుండి వచ్చావు గదా! నీవు ఇంటికి ఎందుకు వెళ్లలేదు?” అని అడిగాడు. దావీదుతో ఊరియా ఇలా అన్నాడు: “పవిత్ర పెట్టె, ఇశ్రాయేలు, యూదా సైనికులు అందరూ గుడారాలలో ఉంటున్నారు. నా యజమాని యోవాబు, నా ప్రభువు (దావీదు రాజు) యొక్క సేవకులందరూ బయట పొలాల్లో గుడారాలు వేసుకొనివున్నారు. కావున నేను ఇంటికి వెళ్లి తాగి, భార్యతో విలాసంగా కాలం గడపటం మంచిది కాదు!”
2 సమూయేలు 11:1-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతనివారిని ఇశ్రాయేలీయులనందరిని పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడివేసిరి; అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకువేళ దావీదు పడకమీదనుండి లేచి రాజనగరి మిద్దెమీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానముచేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతియై యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలిసికొనుటకై యొక దూతను పంపెను, అతడు వచ్చి–ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబ అని తెలియజేయగా దావీదు దూతలచేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను; కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన యింటికి మరల వచ్చెను. ఆ స్త్రీ గర్భవతియై –నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా దావీదు హిత్తీయుడగు ఊరియాను నాయొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. ఊరియా దావీదు నొద్దకురాగా దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధసమాచారమును అడిగెను. తరువాత దావీదు–ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవియ్యగా, ఊరియా రాజ నగరిలోనుండి బయలువెళ్లెను. అతనివెనుక రాజు ఫలాహారము అతనియొద్దకు పంపించెనుగాని ఊరియా తన యింటికి వెళ్లక తన యేలినవాని సేవకులతోకూడ రాజ నగరిద్వారమున పండుకొనెను. ఊరియా తన యింటికి పోలేదను మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి–నీవు ప్రయాణముచేసి వచ్చితివి గదా; యింటికి వెళ్లకపోతివేమని యడుగగా ఊరియా–మందసమును ఇశ్రాయేలు వారును యూదావారును గుడారములలో నివసించుచుండగను, నా యధిపతియగు యోవాబును నా యేలినవాడవగు నీ సేవకులును బయట దండులో నుండగను, భోజనపానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికిపోదునా? నీ తోడు నీ ప్రాణముతోడు నేనాలాగు చేయువాడను కానని దావీదుతో అనెను.