2 పేతురు 3:1-4 - Compare All Versions
2 పేతురు 3:1-4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రియులారా, యీ రెండవ పత్రిక మీకిప్పుడు వ్రాయుచున్నాను పరిశుద్ధ ప్రవక్తలచేత పూర్వమందు పలుకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసికొనవలెనను విషయమును మీకు జ్ఞాపకముచేసి, నిర్మలమైన మీ మనస్సు లను రేపుచున్నాను. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు, –ఆయన రాకడనుగూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను.
2 పేతురు 3:1-4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ప్రియులారా, ఇది నేను మీకు రాస్తున్న రెండవ ఉత్తరం. యథార్ధమైన మీ మనసును పురికొల్పడానికి జ్ఞాపకం చేస్తూ వీటిని రాస్తున్నాను. పవిత్ర ప్రవక్తలు పూర్వకాలంలో చెప్పిన మాటలనూ, మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞనూ మీరు గుర్తు చేసుకోవాలని ఈ ఉత్తరం రాస్తున్నాను. ముందుగా ఇది తెలుసుకోండి, చివరి రోజుల్లో తమ దురాశలను అనుసరించి నడిచే కొందరు బయలుదేరతారు. “ఆయన మళ్ళీ వస్తాడన్న వాగ్దానం ఏమయ్యింది? మా పూర్వీకులు చనిపోయారు, కాని సృష్టి ఆరంభం నుండి అన్ని విషయాలూ ఏమీ మార్పు లేకుండానే జరిగిపోతున్నాయి” అంటూ మిమ్మల్ని ఎగతాళి చేస్తారు.
2 పేతురు 3:1-4 TERV (పవిత్ర బైబిల్)
ప్రియమైన సోదరులారా! ఇది నా రెండవ ఉత్తరం. కల్మషం లేని మీ హృదయాలను ఉత్తేజపరచాలని మీకీ రెండు ఉత్తరాలు వ్రాసాను. పవిత్రులైన ప్రవక్తలు చాలాకాలం క్రిందటే చెప్పిన సందేశాలను మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు మీ అపొస్తలుల ద్వారా యిచ్చిన ఆజ్ఞను మీకు జ్ఞాపకం చెయ్యాలని నా ఉద్దేశ్యం. చివరి రోజుల్లో కొందరు వ్యక్తులు వచ్చి తమ వాంఛల్ని తీర్చుకుంటూ మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. ఈ విషయాన్ని మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి: “వస్తానని వాగ్దానం చేసాడే, ఎప్పుడు వస్తాడు? మా పూర్వికులు మరణించినప్పటి నుండే కాదు. ప్రపంచం సృష్టింపబడినప్పటి నుండీ అన్నీ సక్రమంగానే నడుస్తున్నాయి” అని వాళ్ళంటారు.
2 పేతురు 3:1-4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ప్రియ స్నేహితుల్లారా, ఇది మీకు వ్రాస్తున్న నా రెండవ పత్రిక. మీలో పరిపూర్ణమైన ఆలోచనను ప్రేరేపించడానికి జ్ఞాపకం చేయాలని ఈ రెండు పత్రికలను మీకు వ్రాశాను. పూర్వకాలంలో పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలుకబడిన వాక్యాలను, మన ప్రభువైన రక్షకుని వలన అపొస్తలుల ద్వారా మీకు ఇవ్వబడిన ఆజ్ఞలను మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతున్నాను. అన్నిటికి మించి, అంత్యదినాలలో తమ చెడు కోరికలనే అనుసరించే అపహాసకులు వస్తారని మీరు గ్రహించాలి. “ ‘వస్తాను’ అని ఆయన చేసిన వాగ్దానం ఎక్కడ ఉంది? మన పితరులు ఎప్పుడో చనిపోయారు, సృష్టి ఆరంభం నుండి ఎలా ఉందో, మార్పు లేకుండా అంతా అలాగే జరుగుతుంది” అని వారు చెప్తారు.