2 పేతురు 1:12-21

2 పేతురు 1:12-21 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

కాబట్టి, మీకు తెలిసినవే అయినప్పటికీ, మీరు అంగీకరించిన సత్యంలో స్థిరంగా ఉన్నప్పటికీ నేను ఈ విషయాలను గురించి మీకు ఎల్లప్పుడు జ్ఞాపకం చేస్తాను. నేను ఈ శరీరమనే గుడారంలో జీవించినంతకాలం, ఈ సంగతులను గురించి మీకు జ్ఞాపకం చేయడం మంచిదని భావిస్తాను. ఎందుకంటే, నేను ఈ శరీరమనే గుడారాన్ని త్వరలో విడచిపెట్టబోతున్నాను, ఈ సంగతి మన ప్రభువైన యేసు క్రీస్తు నాకు స్పష్టంగా చెప్పారు. కాబట్టి, నేను చనిపోయిన తర్వాత కూడా మీరు నిత్యం ఈ విషయాలను జ్ఞాపకం ఉంచుకునేలా శ్రద్ధ వహిస్తాను. మన ప్రభువైన యేసు క్రీస్తు శక్తి గురించి ఆయన రాకడ గురించి మేము మీకు కట్టుకథలు కల్పించి చెప్పలేదు కాని మా కళ్లారా ఆయన మహా ప్రభావాన్ని చూసి చెప్తున్నాము. ఆయన తండ్రియైన దేవుని నుండి ఘనత మహిమను పొందినపుడు, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనలో నేను ఆనందిస్తున్నాను” అని మహత్తరమైన మహిమగల ఒక శబ్దం పలికింది. మేము ఆయనతో కూడా పరిశుద్ధ పర్వతం మీద ఉన్నప్పుడు పరలోకం నుండి వచ్చిన ఆ శబ్దాన్ని మేము విన్నాము. మరింత నమ్మకమైన ప్రవచనాత్మక సందేశం మనకు ఉంది. ఉదయకాలపు వేకువచుక్క మీ హృదయాలను వెలుగుతో నింపే వరకు చీకటిలో వెలుగుతున్న దీపంలా ఉన్న ఆ సందేశాన్ని శ్రద్ధతో ఆలకించడం మీకు మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రవక్తల సొంత ఊహల్లో నుండి లేఖనంలోని ప్రవచనాలు పుట్టలేదని మీరు తప్పక గుర్తుంచుకోవాలి. ఎందుకంటే, మానవుని ఇష్టాన్ని బట్టి ప్రవచనం పుట్టదు, కాని ప్రవక్తలు పరిశుద్ధాత్మచేత ప్రభావితులై దేవుని నుండి వచ్చిన సందేశాన్నే పలికారు.

2 పేతురు 1:12-21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

వీటి గురించి మీకు ముందే తెలిసినా, మీరు అంగీకరించిన సత్యంలో స్థిరంగా ఉన్నా ఈ సంగతులు మీకు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాను. నేను ఈ శరీరం అనే గుడారంలో ఉన్నంత వరకూ ఇవి మీకు గుర్తు చేయడం మంచిదని భావిస్తున్నాను. మన ప్రభు యేసు క్రీస్తు ముందుగానే నాకు వెల్లడి చేసిన ప్రకారం నేను త్వరలోనే ఈ శరీరం వదిలేస్తానని నాకు తెలుసు. నేను చనిపోయిన తరువాత కూడా మీరు వీటిని ఎప్పుడూ గుర్తు చేసుకునేలా శ్రద్ధ తీసుకుంటాను. ఎందుకంటే, మన ప్రభు యేసు క్రీస్తు శక్తిని, ఆయన రాకడను గురించి చాకచక్యంగా అల్లిన కల్పనా కథలను మేము మీకు చెప్పలేదు, ఆయన గొప్పదనాన్ని కళ్ళారా చూసిన వారుగా చెప్పాం. ఆయన మన తండ్రి అయిన దేవుని నుండి ఘనత, మహిమ పొందగా, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన విషయంలో నేను ఆనందిస్తున్నాను” అనే గొప్ప మహిమగల దైవస్వరం వచ్చినప్పుడు, ఆయనతో మేము ఆ పవిత్ర పర్వతం మీద ఉండి పైనుండి వచ్చిన ఆ స్వరాన్ని స్వయంగా విన్నాం. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్కు మనకు ఉంది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకూ ఆ వాక్కు చీకట్లో వెలుగు ఇచ్చే దీపంలా ఉంది. ఆ వెలుగును మీరు లక్ష్యపెడితే మీకు మేలు. లేఖన ప్రవచనాలు మనిషి ఊహల్లో నుండి పుట్టలేదని మీరు ముందుగా గ్రహించాలి. ప్రవచనం ఎప్పుడూ మనిషి ఉద్దేశంలో నుండి పుట్టలేదు, పరిశుద్ధాత్మతో నిండిన మనుషులు దేవుని మూలంగా మాట్లాడగా వచ్చింది.

2 పేతురు 1:12-21 పవిత్ర బైబిల్ (TERV)

వీటిని గురించి మీకిదివరకే తెలుసు. ప్రస్తుతం మీరంగీకరించిన సత్యంలో మీకు దృఢమైన విశ్వాసముంది. అయినా ఈ విషయాల్ని గురించి మీకు ఎప్పుడూ జ్ఞాపకం చేస్తూ ఉంటాను. గుడారమనే ఈ శరీరంలో ప్రాణమున్నంతవరకు, మీకు జ్ఞాపకం చేయటం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే, మన యేసు క్రీస్తు ప్రభువు ముందే స్పష్టం చేసినట్లు, నేను త్వరలోనే ఈ దేహాన్ని వదిలివేస్తానని నాకు తెలుసు. నేను వెళ్ళాక కూడా మీరీ విషయాల్ని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకొనేటట్లు నేను అన్ని విధాలా పాటుపడతాను. యేసు క్రీస్తు ప్రభువు రాకను గురించి, ఆయన శక్తిని గురించి తెలివిగా అల్లిన కథల ద్వారా మేము మీకు చెప్పలేదు. మేము ఆయన గొప్పతనాన్ని కళ్ళారా చూసాము. ఆయన తన తండ్రి అయిన దేవుని నుండి కీర్తిని, మహిమను పొందుతుండగా, గొప్ప బలముగల స్వరము వినిపించింది: “ఈయన నా కుమారుడు. ఈయన పట్ల నాకు చాలా ప్రేమ ఉంది. ఈయన కారణంగా నాకు చాలా ఆనందం కలుగుతోంది” అని, పవిత్రమైన పర్వతంపై మేము ఆయనతో ఉన్నప్పుడు పరలోకంనుండి ఈ స్వరం వినిపించటం మేము స్వయంగా విన్నాము. అందువల్ల, ప్రవక్తలు చెప్పిన సందేశమంటే మాకు యింకా ఎక్కువ విశ్వాసం కలిగింది. మీరు ఆ సందేశాన్ని గమనించటం మంచిది. ఆ సందేశం చీకటిలో వెలిగే వెలుగులాంటిది. సూర్యోదయమయ్యే వరకూ, వేకువ చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకూ ఆ వెలుగును మీరు గమనిస్తూ ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు తెలుసుకోవలసినది ఏమిటంటే, ప్రవచనాల్లో వ్రాయబడిన విషయాలు, ప్రవక్తలు తమ వ్యక్తిగత అభిప్రాయాలతో వ్రాయలేదు. ఎందుకంటే, “ప్రవచనం” మానవులు తమ యిష్ట ప్రకారం పలికింది కాదు. పవిత్రాత్మచే ప్రేరేపణ పొంది వాళ్ళు దేవుణ్ణుండి సందేశాన్ని పలికారు.

2 పేతురు 1:12-21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

కాబట్టి మీరు ఈ సంగతులను తెలిసికొని మీరంగీక రించిన సత్యమందు స్థిరపరచబడియున్నను, వీటినిగూర్చి ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసివచ్చుననియెరిగి, నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకముచేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను. నేను మృతిపొందిన తరువాత కూడ మీరు నిత్యము వీటిని జ్ఞాపకముచేసికొనునట్లు జాగ్రత్తచేతును. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్మ్యమును మేము కన్నులార చూచినవారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్యమహిమనుండి ఆయనయొద్దకు వచ్చి నప్పుడు, తండ్రియైన దేవునివలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధపర్వతముమీద ఆయనతోకూడ ఉండిన వారమై, ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు. ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి.