2 రాజులు 3:1-27 - Compare All Versions
2 రాజులు 3:1-27 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అహాబు కుమారుడైన యెహోరాము యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలువారికి రాజై పండ్రెండు సంవత్సరములు ఏలెను. ఇతడు తన తలి దండ్రులు చేసిన ప్రకారము చేయక, తన తండ్రి నిలిపిన బయలుదేవతాస్తంభమును తీసివేసెనుగాని యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక చేయుచునే వచ్చెను. మోయాబు రాజైన మేషా అనేకమైన మందలుగల వాడై లక్ష గొఱ్ఱెపిల్లలను బొచ్చుగల లక్ష గొఱ్ఱెపొట్టేళ్లను ఇశ్రాయేలురాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు. అయితే అహాబు మరణమైన తరువాత మోయాబురాజు ఇశ్రాయేలురాజుమీద తిరుగుబాటుచేయగా యెహోరాము షోమ్రోనులోనుండి బయలుదేరి ఇశ్రాయేలువారినందరిని సమకూర్చెను. యూదారాజైన యెహోషాపాతునకు వర్తమానము పంపి–మోయాబురాజు నామీద తిరుగుబాటు చేసియున్నాడు; నీవు వచ్చి నాతోకూడ మోయాబీయులతో యుద్ధము చేసెదవా అని యడుగగా అతడు–నేను నీవాడనైయున్నాను, నా జనులు నీ జనులే, నా గుఱ్ఱములు నీ గుఱ్ఱములే; నేను బయలుదేరి వచ్చెదనని ప్రత్యుత్తరమిచ్చెను. –మనము ఏ మార్గమున పోవుదమని యెహోషాపాతు అడుగగా అతడు–ఎదోము అరణ్య మార్గమున పోవుదుమని చెప్పెను. ఇశ్రాయేలురాజును యూదారాజును ఎదోమురాజును బయలుదేరి యేడు దినములు చుట్టు తిరిగిన తరువాత, వారితోకూడనున్నదండువారికిని పశువులకును నీళ్లు లేకపోయెను. ఇశ్రాయేలురాజు–కటకటా ముగ్గురు రాజులమైన మనలను మోయాబీయులచేతికి అప్పగింపవలెనని యెహోవా మనలను పిలిచెననగా యెహోషాపాతు–అతనిద్వారా మనము యెహోవాయొద్ద విచారణచేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని యడిగెను. అంతట ఇశ్రాయేలురాజు సేవకులలో ఒకడు–ఏలీయా చేతులమీద నీళ్లుపోయుచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా యెహోషాపాతు –యెహోవా ఆజ్ఞ యితనిద్వారా మనకు దొరుకుననెను. ఇశ్రాయేలురాజును యెహోషాపాతును ఎదోమురాజును అతని యొద్దకుపోగా ఎలీషా ఇశ్రాయేలురాజును చూచి–నాతో నీకు నిమిత్తమేమి? నీ తలిదండ్రులుంచుకొనిన ప్రవక్తలయొద్దకు పొమ్మని చెప్పెను. –ఆలాగనవద్దు, మోయాబీయులచేతికి అప్పగింపవలెనని యెహోవా, రాజులమైన మాముగ్గురిని పిలిచెనని ఇశ్రాయేలురాజు అతనితో అనినప్పుడు ఎలీషా ఇట్లనెను–ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యూదారాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయనియెడల నిన్ను చూచుట కైనను లక్ష్యపెట్టుటకైనను ఒప్పకపోదును. నాయొద్దకు వీణె వాయించగల యొకనిని తీసికొనిరమ్ము. వాద్యకు డొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతనిమీదికి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను. – యెహోవా సెలవిచ్చినదేమనగా – ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి; యెహోవా సెలవిచ్చునదేమనగా–గాలియేగాని వర్షమేగాని రాక పోయినను, మీరును మీ మందలును మీ పశువులును త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీయులను మీచేతికి అప్పగించును. మీరు ప్రాకారములుగల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి, మంచి చెట్లనెల్ల నరికి, నీళ్ల బావులన్నిటిని పూడ్చి, సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనెను. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చియున్నారని మోయాబీయులు విని, అల్పులనేమి ఘనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారినందరిని సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్లమీద ప్రకాశింపగా, అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తమువలె కనబడెను గనుక వారు–అది రక్తము సుమా; రాజులు ఒకరినొకరు హతము చేసికొని నిజముగా హతులైరి; మోయాబీయులారా, దోపుడు సొమ్ము పట్టుకొందము రండని చెప్పుకొనిరి. వారు ఇశ్రాయేలువారి దండుదగ్గరకు రాగా ఇశ్రాయేలీయులు లేచి వారిని హతము చేయుచుండిరి గనుక మోయాబీయులు వారియెదుట నిలువలేక పారిపోయిరి; ఇశ్రాయేలీయులు వారి దేశములో చొరబడి మోయాబీయులను హతము చేసిరి. మరియు వారు పట్టణములను పడగొట్టి, సమస్తమైన మంచి భూభాగములమీదను తలయొక రాయి వేసి నింపి, నీళ్ల బావులన్నిటిని పూడ్చి, మంచి చెట్లన్నిటిని నరికివేసిరి. కీర్హరెశెతు పట్టణమును మాత్రము వారు విడిచిపెట్టిరి గనుక దాని ప్రాకారము నిలిచి యుండెనుగాని వడిసెలలు విసరువారు దాని చుట్టుకొని రాళ్లు విసరుచు వచ్చిరి. మోయాబురాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూచి కత్తిదూయు ఏడువందలమందిని ఏర్పరచుకొని, ఎదోమురాజునొద్దకు తీసికొని పోవుటకు యత్నించెనుగాని అది వారివలన కాకపోయెను. అప్పుడతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠకుమారుని తీసికొని, పట్టణపు ప్రాకారముమీద దహనబలిగా అర్పింపగా ఇశ్రాయేలువారిమీదికి కోపము బహుగా వచ్చెను గనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి.
2 రాజులు 3:1-27 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యూదా రాజు యెహోషాపాతు పాలన పద్దెనిమిదో సంవత్సరంలో అహాబు కొడుకు యెహోరాము ఇశ్రాయేలుకి రాజయ్యాడు. ఇతడు షోమ్రోనులో పన్నెండు సంవత్సరాలు పరిపాలన చేశాడు. తన తల్లిదండ్రుల తీరును పూర్తిగా అనుసరించక పోయినా ఇతడు దేవుని దృష్టిలో చెడ్డ పనులే చేశాడు. అయితే బయలు దేవుణ్ణి పూజించడం కోసం అతని తండ్రి కట్టించిన రాతి స్తంభాన్ని తీసివేశాడు. నెబాతు కొడుకు యరొబాము ఏ ఏ అక్రమాలు చేసి ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారకుడయ్యాడో అవే అక్రమాలు ఇతడూ చేశాడు. మోయాబు రాజు మేషాకు విస్తారమైన మేకల, గొర్రెల మందలున్నాయి. ఇతడు ఇశ్రాయేలు రాజుకి ఒక లక్ష గొర్రె పిల్లలనూ, లక్ష గొర్రె పొట్టేళ్ల ఉన్నినీ పన్నుగా కడుతుండేవాడు. కానీ అహాబు చనిపోయిన తరువాత ఈ మోయాబు రాజు మేషాఇశ్రాయేలు రాజుపై తిరుగుబాటు చేశాడు. దాంతో ఇశ్రాయేలు ప్రజలందర్నీ యుద్ధానికి సిద్ధం చేయడానికి యెహోరాము షోమ్రోనులో నుండి ప్రయాణమయ్యాడు. ఇతడు యూదా దేశానికి రాజుగా ఉన్న యెహోషాపాతుకు ఒక సందేశం పంపించాడు. ఆ సందేశంలో “మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేశాడు. మోయాబుపై నేను చేయబోయే యుద్ధంలో నాతో కలిసి వస్తావా?” అని అడిగాడు. దానికి యెహోషాపాతు “నేను యుద్ధానికి వస్తాను. నేనే నువ్వూ, నా ప్రజలు నీ ప్రజలే, నా గుర్రాలు నీ గుర్రాలే అనుకో” అని జవాబిచ్చాడు. అప్పుడు యెహోరాము “దాడి చేయడానికి మనం ఏ దారి గుండా వెళ్దాం?” అని అడిగాడు. అందుకు యెహోషాపాతు “ఎదోము అడవి దారి గుండా వెళ్దాం” అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు, యూదా, ఎదోము దేశాల రాజులు ఏడు రోజుల పాటు ప్రయాణం చేశారు. చివరికి వాళ్ళ సైన్యానికీ, గుర్రాలకూ మిగిలిన పశువులకూ నీళ్ళు లేకుండా పోయాయి. కాబట్టి ఇశ్రాయేలు రాజు “అయ్యోయ్యో, ఎందుకిలా జరిగింది? మోయాబు వాళ్ళ చేతుల్లో ఓడిపోవడానికి రాజులైన మన ముగ్గుర్నీ యెహోవా పిలిచాడా ఏమిటి?” అన్నాడు. కానీ యెహోషాపాతు “మన కోసం యెహోవాను సంప్రదించడానికి ఇక్కడ ఒక్క యెహోవా ప్రవక్త కూడా లేడా?” అని అడిగాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజు దగ్గర సైనికోద్యోగి ఒకడు “షాపాతు కొడుకు ఎలీషా ఇక్కడ ఉన్నాడు. అతడు ఇంతకు ముందు ఎలీయా చేతులపై నీళ్ళు పోసే వాడు” అని చెప్పాడు. దానికి యెహోషాపాతు “యెహోవా వాక్కు అతని దగ్గర ఉంది” అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు రాజు, ఎదోము రాజు, యెహోషాపాతూ కలసి అతని దగ్గరికి వెళ్ళారు. ఎలీషా ఇశ్రాయేలు రాజును చూసి “నీతో నాకేం పని? నీ తల్లీ తండ్రీ పెట్టుకున్న ప్రవక్తల దగ్గరికి వెళ్ళు” అన్నాడు. ఇశ్రాయేలు రాజు అతనితో “మోయాబు వారు మమ్మల్ని ఓడించాలని యెహోవా మా ముగ్గురు రాజులను పిలిచాడు” అన్నాడు. అప్పుడు ఎలీషా “నేను సైన్యాలకు ప్రభువు అయిన యెహోవా సమక్షంలో నిలబడి ఉన్నాను. ఆ యెహోవా ప్రాణం మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇక్కడ ఉన్న యూదా రాజు యెహోషాపాతును నేను గౌరవించకపోతే నిన్నసలు లక్ష్యపెట్టేవాణ్ణి కాదు. నీ వైపు చూసే వాణ్ణి కాదు. అయితే ఇప్పుడు తీగ వాయిద్యం వాయించగల ఒకణ్ణి నా దగ్గరికి తీసుకురండి” అన్నాడు. తీగ వాయిద్యం వాయించేవాడు ఒకడు వచ్చి వాయిస్తూ ఉండగా యెహోవా హస్తం ఎలీషా పైకి బలంగా వచ్చింది. అప్పుడు అతడు ఇలా అన్నాడు. “యెహోవా ఇలా చెప్తున్నాడు, ఎండిన ఈ నదీ లోయలో అంతటా కందకాలు తవ్వించండి. ఎందుకంటే యెహోవా ఇలా చెప్తున్నాడు, గాలీ ఉండదు, వర్షమూ రాదు. ఈ లోయ అంతా నీటితో నిండిపోతుంది. మీరు ఆ నీరు తాగుతారు. మీ పశువులూ, మీ దగ్గర ఉన్న జంతువులూ తాగుతాయి. యెహోవా దృష్టికి ఇది చాలా తేలికైన విషయం. పైగా ఆయన మోయాబు వాళ్ళపై మీకు విజయం ఇస్తాడు. మీరు ప్రాకారాలున్న ప్రతి పట్టణాన్నీ, ప్రతి మంచి పట్టణాన్నీ వశం చేసుకోవాలి. అక్కడ మీరు ప్రతి మంచి చెట్టునీ నరికి వేయాలి. నీళ్ళ ఊటలను పూడ్చి వేయాలి. మంచి భూములను రాళ్ళతో నింపి పాడు చేయాలి.” కాబట్టి మరుసటి ఉదయం నైవేద్యం అర్పించే సమయానికి ఎదోము వైపు నుండి నీళ్ళు పారుతూ వచ్చాయి. వారున్న ఆ ప్రాంతమంతా జలమయం అయింది. తమతో యుద్ధం చేయడానికి రాజులు వచ్చారని మోయాబు వారు విన్నారు. వాళ్ళలో యువకులు మొదలు వృద్ధుల వరకూ ఆయుధాలు ధరించ గలిగిన వాళ్ళంతా ఆ దేశం సరిహద్దులో సమకూడారు. ఉదయాన్నే వారు లేచి చూసినప్పుడు సూర్య కాంతి ఆ నీళ్ల మీద ప్రతిబింబిస్తూ ఉంది. అవతల నుండి మోయాబు వాళ్ళకు ఆ నీళ్లు రక్తంలా కనిపించాయి. “అదంతా రక్తం! రాజులు నాశనమయ్యారు. వారు ఒకళ్లనొకళ్ళు చంపుకున్నారు. మోయాబు వీరులారా, రండి, మనం వెళ్ళి దోపుడు సొమ్ము పట్టుకుందాము” అని చెప్పుకున్నారు. వారు ఇశ్రాయేలు శిబిరం దగ్గరికి వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలు సైన్యం మోయాబు వాళ్ళపై మెరుపు దాడి చేశారు. మోయాబు వారు ఇశ్రాయేలు సైన్యం ఎదుట నిలవలేక కాళ్ళకు బుద్ధి చెప్పారు. ఇశ్రాయేలు సైన్యం మోయాబులో చొరబడి వాళ్ళను తరిమి చంపారు. వాళ్ళ పట్టణాలను ధ్వంసం చేశారు. అంతా తలో రాయి వేసి సారవంతమైన భూములను రాళ్ళతోనింపారు. నీళ్ళ ఊటలు పూడ్చివేశారు. మంచి చెట్లు అన్నిటినీ నరికి వేశారు. ఒక్క కీర్హరెశెతు అనే పట్టణాన్ని మాత్రం దాని ప్రాకారంతో ఉండనిచ్చారు. కానీ ఒడిసెల విసిరే వారు దాన్ని కూడా చుట్టుముట్టి రాళ్ళు విసురుతూ దానిపై దాడి చేశారు. మోయాబు రాజు మేషా, యుద్ధంలో ఓడిపోయామని గ్రహించి ఏడువందల మంది ఖడ్గధారులను తనతో తీసుకుని సైన్యాన్ని ఛేదించుకుంటూ ఎదోము రాజు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. కాని అది వాళ్ళకు సాధ్యం కాలేదు. అప్పుడు అతడు తన తరువాత రాజు కావలసిన తన పెద్ద కొడుకుని పట్టుకుని పట్టణం గోడ పైన దహనబలిగా అర్పించాడు. కాబట్టి ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా తీవ్రమైన కోపం రేగింది. అప్పుడు ఇశ్రాయేలు సైన్యం మేషా రాజును విడిచిపెట్టి తమ స్వదేశానికి తిరిగి వచ్చారు.
2 రాజులు 3:1-27 TERV (పవిత్ర బైబిల్)
అహాబు కుమారుడైన యెహోరాము షోమ్రోనులో ఇశ్రాయేలుకు రాజయ్యాడు. యూదా రాజుగా యెహోషాపాతు 18 వ పరిపాలనా సంవత్సరమున అతను పాలించడానికి మొదలు పెట్టాడు. యెహోరాము 12 సంవత్సరములు పరిపాలించాడు. యెహోవా తప్పని చెప్పిన పనులు యెహోరాము చేశాడు. కాని యెహోరాము తన తల్లిదండ్రులవంటి వాడు కాడు. బయలు దేవతను పూజించేందుకు తన తండ్రి నిర్మించిన స్తంభాన్ని అతడు తొలగించాడు. కాని నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలను అతడు చేశాడు. యరొబాము ఇశ్రాయేలువారిని పాపములు చేసేటట్లు చేశాడు. యెహోరాము యరొబాము చేసిన పాపాలను అనుసరించాడు. మోయాబు రాజు మేషా. మేషావద్ద చాలా మేకలుండెను. మేషా 1,00,000 గొర్రెల ఉన్నిని 1,00,000 గొర్రె పొట్టేలుల ఉన్నిని ఇశ్రాయేలు రాజుకి ఇచ్చాడు. కాని అహాబు మరణించిన తర్వాత, మోయాబు రాజు ఇశ్రాయేలు రాజ్యపరిపాలనకు తిరుగుబాటు చేశాడు. తర్వాత యెహోరాము రాజు షోమ్రోను నుండి వెలుపలికి పోయి ఇశ్రాయేలు మనుష్యులందరిని సమీకరించాడు. యెహోరాము యూదారాజైన యెహోషాపాతు వద్దకు దూతలను పంపాడు. యెహోరాము ఇట్లన్నాడు: “మోయాబు రాజు, నా పరిపాలనపై తిరుగబడ్డాడు. మోయాబుతో యుద్ధము చేయడానికి నీవు నాతో కలసెదవా?” యెహోషాపాతు, “అలాగే నేను నీతో కలుస్తాను. మనమిద్దరము ఒక సైన్యమవుదాము. నా ప్రజలు నీ ప్రజలవలె వుంటారు. నా గుర్రములు నీ గుర్రములవలె వుంటాయి.” అని చెప్పాడు. యెహోషాపాతు యెహోరాముతో, “మనము ఏ త్రోవను వెళ్లాలి?” అని అడిగాడు. “మనము ఎదోము ఎడారిద్వారా వెళ్లాలి” అని యెహోరాము సమాధానమిచ్చాడు. అందువల్ల ఇశ్రాయేలు రాజు, యూదా, ఎదోము రాజులతో కలిసి వెళ్లాడు. ఏడు రోజులపాటు వాళ్లు ప్రయాణం చేశారు. తమ సైన్యనానికి గానీ, జంతువులకు గానీ తగినంత నీరు దొరకలేదు. చివరికి ఇశ్రాయేలు రాజు (యెహోరాము) ఇలా చెప్పాడు, “యెహోవా నిజంగానే మన ముగ్గురిని మోయాబు రాజులను ఓడించటానికే ఒకటిగా చేశాడు.” కాని యెహోషాపాతు, “తప్పక యెహోవా యొక్క ఒక ప్రవక్త అక్కడే వున్నాడు. మనమేమి చేయవలెనో యెహోవాని అడగమని మనము ఆ ప్రవక్తను అడుగుదాము” అనిచెప్పాడు. ఇశ్రాయేలు రాజు సేవకుడొకడు, “షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడే వున్నాడు. ఎలీషా ఎలీయా యొక్క సేవకుడు” అనిచెప్పాడు. “యెహోవా మాట ఎలీషాతో ఉన్నది” అని యెహోషాపాతు పలికాడు. అందువల్ల ఇశ్రాయేలు రాజు (యెహోరాము), ఎదోము రాజు మరియు యెహోషాపాతు ఎలీషాని దర్శించటానికి వెళ్లారు. ఇశ్రాయేలురాజు (యెహోరాము)తో ఎలీషా, “నా నుండి నీకేమి కావలెను! నీ తల్లిదండ్రులయొక్క ప్రవక్తల వద్దకు పొమ్ము” అన్నాడు. ఇశ్రాయేలు రాజు ఎలీషాతో, “అలా కాదు. మేము నిన్ను దర్శించుటకే వచ్చాము. మమ్మల్ని మోయాబీయులను ఓడించటానికి మా ముగ్గురి రాజులను దేవుడు ఒకటిగా పిలిచాడు” అని చెప్పాడు. “నేను యూదా రాజయిన యెహోషాపాతును గౌరవిస్తున్నాను. యెహోవా పేరు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. సర్వశక్తిమంతుడైన యెహోవాను నేను సేవిస్తాను. యెహోవా జీవముతోడు యెహోషాపాతు కనుక లేకపోయినచో నేను నిన్ను శ్రద్ధ చేయక నిన్ను పూర్తిగా నిర్లక్ష్యము చేసేవాడిని. కాని ఇప్పుడు వీణ వాయించే వానిని తీసుకొని రమ్ము.” అని ఎలీషా చెప్పాడు. ఆ వ్యక్తి వీణ వాయించగానే, యెహోవా యొక్క శక్తి ఎలీషా మీదికి వచ్చింది. అప్పుడు ఎలీషా, “యెహోవా చెప్పుచున్నది ఇదే. లోయలో రంధ్రాలు చేయండి. యెహోవా చెప్పుచున్నది ఇదే. నీవు పెనుగాలిని చూడవు. నీవు వానను చూడవు. కాని లోయ నీటితో నిండి ఉంటుంది. అప్పుడు నీవు, నీ ఆవులు, జంతువులు తాగటానికి నీరు లభిస్తుంది. ఇది చేయడం యెహోవాకు సులభం మోయాబీయులను ఓడించేలా యెహోవా చేయగలడు. నీవు ప్రతి దృఢమైన నగరముపై మరియు ప్రతి మంచి నగరముపై దాడి చేస్తావు. నీవు ప్రతి మంచి వృక్షాన్ని నరికి వేస్తావు. అన్ని ఊటలను నీవు నిలిపివేయగలవు. నీవు విసిరివేసే రాళ్లతో ప్రతి మంచి స్థలమును నీవు పాడుచేస్తావు” అని పలికాడు. ఉదయాన దేవునికి బలి జరిగే సమయంలో ఎదోము మార్గము నుండి నీరు ప్రవహించడం ప్రారంభమయ్యింది. లోయ నిండింది. మోయాబు లోని ప్రజలు తమతో యుద్ధం చేయడానికి గాను రాజులు వచ్చిన విషయము విన్నారు. కవచములు ధరించడానికి మనుష్యులందరు ఒక్కటిగా వయసు మళ్లిన వారైయున్నారు. వారు సరిహద్దు వద్ద వేచి ఉన్నారు. వారు యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆ రోజు ఉదయం వారు పెందలకడనే మేల్కోన్నారు. లోయలోని నీళ్లలో ప్రభాత సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. అది మోయాబు ప్రజలకు నెత్తురువలె కనిపించింది. “నెత్తురు చూడుడి! రాజులు తమలో తాము పోరాడుకొని వుండవచ్చును. ఒకరి నొకరు నాశనము చేసికొని వుండవచ్చు. మృత శరీరముల నుండి విలువగల వస్తువులు తీసుకొనుటకు గాను మనము వెళ్దాము” అని మోయాబు ప్రజలు చెప్పుకున్నారు. మోయాబు ప్రజలు ఇశ్రాయేలు గుడారము వద్దకు వచ్చారు. కాని ఇశ్రాయేలు వారు వెలుపలికి వచ్చి మోయాబు సైన్యాన్ని ఎదుర్కొన్నారు. ఇశ్రాయేలు ప్రజల నుండి మోయాబు ప్రజలు పారిపోయారు. ఇశ్రాయేలు వారు మోయాబు దాకా పరుగెత్తుకు పోయి మోయాబు ప్రజలతో యుద్ధం చేశారు. ఇశ్రాయేలు వారు నగరములను ధ్వంసం చేశారు. వారు మోయాబులోని ప్రతి మంచి పట్టణము మీదికి రాళ్లు విసిరివేశారు. నీటి బావులన్నిటినీ పూడ్చి వేసినారు. అన్ని ఊటలను ఆపి వేశారు. అన్ని మంచి చెట్లను నరికివేశారు. కీర్హరెశెతు వరకు వారు యుద్ధం చేస్తూ వెళ్లారు. ఇశ్రాయేలు సైనికులు కీర్హరెశెతు చుట్టు ముట్టి, దాని మీద దాడిచేశారు. మోయాబు రాజు ఆ యుద్ధము తనకు కష్టమైనదిగా చూశాడు. అందువల్ల ఖడ్గములు ధరించిన ఏడువందల మంది మనుష్యుల్ని తీసుకొని సైన్యాన్ని ఛేదించడానికి, ఎదోము రాజుని హతమార్చడానికిగాను వెళ్లాడు. కాని వారు ఎదోము రాజుని ఎదుర్కొనలేక పోయారు. తర్వాత మోయాబు రాజు తన పెద్దకొడుకుని వెంట తీసుకొనిపోయాడు. తన అనంతరము రాజు కావలసిన కుమారుడు అతడే. తన కుమారుని ప్రాకారము మీద దహన బలిగా అర్పించాడు. ఇది చూచిన ఇశ్రాయేలీయులు తల క్రిందులయ్యారు. అందువల్ల ఇశ్రాయేలు ప్రజలు మోయాబు రాజుని విడిచి తమ దేశానికి తిరిగి వెళ్లిపోయారు.
2 రాజులు 3:1-27 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యూదా రాజైన యెహోషాపాతు పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో అహాబు కుమారుడైన యోరాము సమరయలో ఇశ్రాయేలు మీద రాజయ్యాడు. అతడు పన్నెండు సంవత్సరాలు పరిపాలించాడు. అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు కాని తన తల్లిదండ్రులు చేసినట్లు చేయలేదు. తన తండ్రి నిలబెట్టిన బయలు పవిత్ర రాతిని తీసివేశాడు. అయితే ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలనే ఇతడు కూడా చేస్తూ వచ్చాడు. మోయాబు రాజైన మేషాకు చాలా గొర్రెలు ఉండేవి. అతడు ఇశ్రాయేలు రాజుకు లక్ష గొర్రెపిల్లలను, లక్ష పొట్టేళ్ళ ఉన్నిని పన్నుగా చెల్లిస్తూ వచ్చాడు. అయితే అహాబు చనిపోయిన తర్వాత, మోయాబు రాజు ఇశ్రాయేలు రాజు మీద తిరుగబడ్డాడు. కాబట్టి ఆ సమయంలో రాజైన యెహోరాము సమరయ నుండి బయలుదేరి ఇశ్రాయేలంతటిని సమకూర్చాడు. అతడు యూదా రాజైన యెహోషాపాతుకు, “మోయాబు రాజు నా మీద తిరుగబడ్డాడు, మీరు నాతో కూడా మోయాబు మీదికి యుద్ధానికి వస్తారా?” అని కబురు పంపాడు. అందుకు యెహోషాపాతు, “నేను మీలాంటి వాడినే, నా ప్రజల మీ ప్రజలు, నా గుర్రాలు మీ గుర్రాలు” అని అన్నాడు. యెహోషాపాతు, “ఏ దారి నుండి మనం దాడి చేద్దాం?” అని అడిగాడు. అందుకు, “ఎదోము ఎడారి దారి నుండి” అని యోరాము జవాబిచ్చాడు. కాబట్టి ఇశ్రాయేలు రాజు, యూదారాజు, ఎదోము రాజు కలిసి బయలుదేరి ఏడు రోజులు చుట్టూ తిరిగి ప్రయాణించిన తర్వాత సైన్యానికి పశువులకు వారి దగ్గర నీళ్లు మిగల్లేదు. ఇశ్రాయేలు రాజైన యోరాము ఆతురతతో, “అయ్యో! యెహోవా మోయాబుకు అప్పగించడానికి మన ముగ్గురు రాజులను పిలిచారా?” అని అన్నాడు. అయితే యెహోషాపాతు, “యెహోవా దగ్గర విచారించడానికి ఇక్కడ యెహోవా ప్రవక్తలు ఎవరు లేరా?” అని అడిగాడు. ఇశ్రాయేలు రాజు పరివారంలో ఒకడు, “షాపాతు కుమారుడైన ఎలీషా ఉన్నాడు. అతడు ఏలీయా చేతుల మీద నీళ్లు పోసేవాడు” అని చెప్పాడు. యెహోషాపాతు, “అతని దగ్గర యెహోవా వాక్కు ఉంది” అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు రాజు, యెహోషాపాతు, ఎదోము రాజు ముగ్గురు అతని దగ్గరకు వెళ్లారు. ఎలీషా ఇశ్రాయేలు రాజుతో, “నా దగ్గరకు ఎందుకు వచ్చావు? నీ తండ్రి ప్రవక్తల దగ్గరకు, నీ తల్లి ప్రవక్తల దగ్గరకు వెళ్లు” అన్నాడు. ఇశ్రాయేలు రాజు జవాబిస్తూ, “లేదు, యెహోవా మా ముగ్గురు రాజులను మోయాబుకు అప్పగించడానికి పిలిచారు” అన్నాడు. అందుకు ఎలీషా ఇలా అన్నాడు, “నేను సేవించే సజీవుడైన సైన్యాల యెహోవా పేరిట ప్రమాణం చేసి చెప్తున్నాను, యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవించకపోతే, అసలు నీవైపు చూసేవాన్ని కూడా కాదు. సరే, ఒక తంతివాద్యం వాయించేవాన్ని నా దగ్గరకు తీసుకురా.” తంతివాద్యం వాయించేవాడు వాయిస్తూ ఉన్నప్పుడు, యెహోవా హస్తం ఎలీషా మీదికి వచ్చింది. అప్పుడతడు, “యెహోవా చెప్పే మాట ఇదే: నేను ఈ లోయను నీటి గుంటలతో నింపుతాను. ఎందుకంటే యెహోవా చెప్పే మాట ఇదే: గాలి గాని వాన గాని మీరు చూడరు, అయినా నీళ్ల గుంటలతో ఈ లోయ నిండిపోతుంది. మీరు మీ మందలు ఇతర జంతువులు త్రాగడానికి నీళ్లు ఉంటాయి. యెహోవా దృష్టికి ఇది తేలికైన పని; ఆయన మోయాబును కూడ మీ చేతులకు అప్పగిస్తారు. మీరు కోటగోడలు గల ప్రతి పట్టణాన్ని, ప్రతి ప్రధాన పట్టణాన్ని పడగొడతారు. అలాగే మీరు ప్రతి మంచి చెట్టును నరికి ఊటలన్నిటిని పూడ్చి ప్రతి మంచి పొలాన్ని రాళ్లతో నింపి పాడుచేస్తారు” అని చెప్పాడు. మరుసటి ఉదయం బలి అర్పించే సమయంలో, ఎదోము వైపు నుండి నీళ్లు వచ్చాయి. ఆ ప్రాంతమంతా నీటితో నిండిపోయింది. రాజులు తమతో యుద్ధం చేయడానికి వచ్చారని మోయాబీయులు విని యువకులు మొదలుకొని వృద్ధుల వరకు ఆయుధాలు ధరించగలిగిన వారంతా సరిహద్దు దగ్గర గుమికూడారు. ఉదయం వారు లేచినప్పుడు సూర్యకిరణాలు నీళ్ల మీద పడగా, మోయాబీయులకు తమ ఎదురుగా ఉన్న నీళ్లు రక్తంలా ఎర్రగా కనబడ్డాయి. వారు, “అది రక్తం! రాజులు ఒకడితో ఒకడు యుద్ధం చేసుకుని ఒకనినొకడు చంపుకొని ఉంటారు. ఇప్పుడు మోయాబు వారలారా! రండి దోపుడుసొమ్ము పట్టుకుందాం” అని చెప్పుకున్నారు. మోయాబీయులు ఇశ్రాయేలు శిబిరం చేరినప్పుడు, ఇశ్రాయేలీయులు లేచి వారితో పోరాడగా వారు నిలబడలేక పారిపోయారు. అప్పుడు ఇశ్రాయేలీయులు మోయాబును ఆక్రమించుకుని మోయాబీయులను హతం చేశారు. వారి పట్టణాలు పడగొట్టారు, ప్రతి మంచి పొలాన్ని రాళ్లతో నింపివేయడానికి ప్రతి మనిషి ఒక రాయిని వేశాడు. వారు ఊటలన్నిటిని మూసి, ప్రతి మంచి చెట్టును నరికివేశారు. కీర్ హరెశెతు పట్టణాన్ని మాత్రం దాని ప్రాకారంతో ఉండనిచ్చారు. కాని వడిసెలతో ఉన్నవారు దానిని కూడా చుట్టుముట్టి దాడి చేశారు. మోయాబు రాజు యుద్ధం తన చేజారిపోతుందని గ్రహించి, ఖడ్గం దూసే ఏడు వందల మందిని వెంటబెట్టుకొని ఎదోము రాజు దగ్గరకు చేధించుకొని వెళ్లాలని చూశాడు కాని అది సాధ్యం కాలేదు. అప్పుడు అతడు తన తర్వాత రాజు కావలసిన తన పెద్ద కుమారుని తీసుకెళ్లి పట్టణ ప్రాకారం మీద బలిగా అర్పించాడు. ఇశ్రాయేలువారి మీద తీవ్రమైన కోపం కలిగింది; వారు అతన్ని విడిచిపెట్టి తమ స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు.