2 కొరింథీయులకు 5:19-21
2 కొరింథీయులకు 5:19-21 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆ పరిచర్య ఏంటంటే: దేవుడు ప్రజల పాపాలను వారి మీద మోపకుండా క్రీస్తు ద్వారా లోకాన్ని తనతో సమాధానపరచుకున్నారు. ఆ సమాధాన సందేశాన్ని బోధించే పని మాకు అప్పగించారు. అందువల్ల మేము దేవుడు మా ద్వారా వేడుకోడానికి ఏర్పరచబడిన క్రీస్తు రాయబారులము. దేవునితో సమాధానపడమని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బ్రతిమాలుతున్నాము. మనం ఆయనలో దేవుని నీతి అయ్యేలా, పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేశారు.
2 కొరింథీయులకు 5:19-21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అంటే, దేవుడు వారి అతిక్రమాలను వారి మీద మోపక, క్రీస్తులో లోకాన్ని తనతో సమాధానపరచుకుంటూ, ఆ సమాధాన ఉపదేశాన్ని మాకు అప్పగించాడు. కాబట్టి మేము క్రీస్తు ప్రతినిధులం. దేవుడే మా ద్వారా మిమ్మల్ని బతిమాలుకొంటున్నట్టుంది. దేవునితో సమాధానపడమని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుతున్నాం. ఎందుకంటే మనం ఆయనలో దేవుని నీతి అయ్యేలా పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసం పాపంగా చేశాడు.
2 కొరింథీయులకు 5:19-21 పవిత్ర బైబిల్ (TERV)
క్రీస్తు ద్వారా దేవుడు అందరినీ తన మిత్రులుగా చేసుకొనుచున్నాడన్నదే మా సందేశం. దేవుడు ప్రజలు చేసిన పాపాలను క్షమిస్తాడు. వాళ్ళను తన మిత్రులుగా ఏ విధంగా చేసుకొంటాడన్న సందేశం చెప్పాడు. మేము క్రీస్తు రాయబారులం. దేవుడే మా ద్వారా ఈ విజ్ఞప్తి చేస్తున్న విషయం గ్రహించండి. క్రీస్తు పక్షాన దేవునితో సమాధానపడమని మిమ్మల్ని వేడుకొంటున్నాము. క్రీస్తు పాపం చెయ్యలేదు. కాని మనకోసం దేవుడు ఆయన్ని పాపంగా చేసాడు. మనం క్రీస్తులో ఐక్యత పొంది దేవుని దృష్టిలో నీతిమంతులంగా ఉండాలని ఇలా చేసాడు.
2 కొరింథీయులకు 5:19-21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధానవాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై–దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను.