2 కొరింథీయులకు 12:11-21

2 కొరింథీయులకు 12:11-21 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

నన్ను నేనే బుద్ధిహీనునిగా చేసుకున్నాను, కాని మీరే నన్ను బలవంతం చేశారు. నిజానికి మీరు నన్ను మెచ్చుకోవల్సింది, ఎందుకంటే, నేను వ్యర్థుడనే అయినా మీ “శ్రేష్ఠమైన అపొస్తలుల” కంటే ఏ విషయంలో తక్కువ వాడను కాను. అపొస్తలుల సూచకక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు పూర్తి సహనంతో నా వల్ల మీ మధ్య జరిగాయి. నేనెప్పుడు మీకు భారంగా లేను అనేది తప్ప ఇతర సంఘాల కంటే మీరు ఎలా తక్కువ అవుతారు? ఈ తప్పును బట్టి నన్ను క్షమించండి! నేను మూడవసారి మీ దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉన్నాను, అయితే వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను, ఎందుకంటే నాకు కావల్సింది మీరే తప్ప మీ ధనం కాదు. పిల్లలు తల్లిదండ్రుల కోసం కాదు తల్లిదండ్రులే పిల్లల కోసం పొదుపు చేసి ఉంచాలి. కాబట్టి నాకు కలిగినదంత మీ ఆత్మల కోసం చాలా సంతోషంగా ఖర్చుచేస్తాను, అంతేకాదు నన్ను నేను కూడా మీ కోసం ఖర్చు చేసుకుంటాను; నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించినప్పుడు మీరు నన్ను తక్కువగా ప్రేమిస్తారా? అదలా ఉండనివ్వండి, నేను మీకు భారంగా ఉండలేదు గాని యుక్తిగా మాయ చేసి మిమ్మల్ని పట్టుకున్నాను అని అంటారేమో! నేను మీ దగ్గరకు పంపినవారి ద్వారా మిమ్మల్ని మోసం చేసి ఏమైనా సంపాదించుకున్నానా? తీతును మీ దగ్గరకు వెళ్లమని వేడుకున్నాను. అతనితో పాటు మా సహోదరున్ని కూడ పంపాను. తీతు మిమ్మల్ని దోచుకోలేదు కదా? మేము ఒకే ఆత్మను కలిగి ఒకే అడుగుజాడల్లో నడువలేదా? ఇంతవరకు మేము మీతో మా పక్షంగా వాదించుకుంటున్నామని మీరు అనుకుంటున్నారా? దేవుని దృష్టికి క్రీస్తులో ఉన్న వారిలా మేము మాట్లాడుతున్నాము; మిత్రులారా! మేము చేసే ప్రతిదీ మిమ్మల్ని బలపరచడానికే. ఎందుకంటే నేను వచ్చినపుడు నేను కోరుకున్నట్లుగా మీరు ఉండకపోవచ్చు, అలాగే మీరు కోరుకున్నట్లుగా నేను ఉండకపోవచ్చు. అక్కడ కలహాలు, అసూయలు, క్రోధాలు, కక్షలు, వదంతులు, గుసగుసలు, గర్వం, అల్లర్లు ఉంటాయేమోనని భయపడుతున్నాను. మరల నేను వచ్చినప్పుడు దేవుడు మీ ముందు నన్ను చిన్నబుచ్చుకునేలా చేస్తాడేమోనని భయపడుతున్నాను, అంతేగాక గతంలో పాపం చేసి జరిగించిన అపవిత్రత, లైంగిక పాపం, పోకిరి చేష్టల గురించి పశ్చాత్తాపం చెందని వారి గురించి కూడ నేను దుఃఖపడాల్సి వస్తుందేమో అని భయపడుతున్నాను.

2 కొరింథీయులకు 12:11-21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

నేను బుద్ధిహీనుడినయ్యాను! మీరే నన్ను బలవంతం చేశారు. వాస్తవానికి మీరు నన్ను మెచ్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే నేను వట్టివాడినైనా ఆ “గొప్ప అపొస్తలుల” కంటే ఏ మాత్రం తక్కువ వాణ్ణి కాను. నాలో అసలైన అపొస్తలుని గురుతులు ఎంతో సహనంతో మీ మధ్య దేవుడు కనిపింపజేశాడు. సూచకక్రియలూ అద్భుతాలూ మహత్కార్యాలూ కనపరిచాడు. నేను మీకు భారంగా లేను అనే విషయంలో తప్ప, ఇతర సంఘాలకంటే మీరు ఏ విషయంలో తక్కువ వారయ్యారు? ఈ నా తప్పు క్షమించండి మరి! ఇప్పుడు ఈ మూడవసారి మీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను. మీకేముందో అది నాకు అక్కరలేదు. నాకు మీరే కావాలి. తల్లిదండ్రుల కోసం పిల్లలు దాచరు. కానీ తల్లిదండ్రులే పిల్లల కోసం దాచాలి. కాబట్టి మీ ఆత్మల కోసం ఎంతో ఆనందంగా ఖర్చు చేస్తాను. మీకోసం ఖర్చయిపోతాను. నేను మిమ్మల్ని అంత ఎక్కువగా ప్రేమిస్తుంటే మీరు నన్ను ఇంత తక్కువగా ప్రేమిస్తారా? అదలా ఉంచండి. నేను మీకు భారంగా ఉండలేదు గానీ నేను యుక్తిగా మాయోపాయం చేత మిమ్మల్ని పట్టుకున్నాను అని చెబుతారేమో! నేను మీ దగ్గరికి పంపినవారి ద్వారా మిమ్మల్ని ఉపయోగించుకున్నానా? మీ దగ్గరికి వెళ్ళమని తీతును ప్రోత్సహించాను. అతనితో వేరొక సోదరుని పంపాను. తీతు మీ దగ్గర ఏమైనా సంపాదించాడా? మేము ఏక మనసుతో ఏక విధానంతో ప్రవర్తించలేదా? మేమింత వరకూ మా పక్షంగా మేము వాదించుకుంటున్నామని మీరు అనుకుంటున్నారా? దేవుని దృష్టిలో క్రీస్తును బట్టి మీ క్షేమాభివృద్ధి కోసం ఇవన్నీ చెబుతున్నాం. ఎందుకంటే నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టులుగా ఉండరేమో అనీ, నేను మీకు ఇష్టుడనుగా ఉండనేమో అని భయపడుతున్నాను. కలహాలు, అసూయ, క్రోధాలు, కక్షలు, వదంతులు, గర్వం, అల్లర్లు ఉంటాయేమో. నేను తిరిగి వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చుతాడేమో అనీ, గతంలో పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వం, ఇంద్రియలోలత్వం విషయంలో పశ్చాత్తాపం పొందని అనేకుల గురించి దుఖించాల్సి వస్తుందేమో అనీ భయపడుతున్నాను.

2 కొరింథీయులకు 12:11-21 పవిత్ర బైబిల్ (TERV)

నేను తెలివిలేని వానిలా ప్రవర్తిస్తున్నాను. కాని దీనికి మీరే కారకులు. నేను ఏమీకాకపోయినా ఆ “గొప్ప అపొస్తలుల” కన్నా తీసిపోను. కనుక మీరు నన్ను మెచ్చుకోవలసింది. అపొస్తలుడని అనిపించుకొనుటకు తగిన రుజువులు, అద్భుతాలు, మహత్కార్యాలు మీ మధ్య నేను పట్టుదలతో చేసాను. అని నేను మీ కోసం పట్టుదలతో చేసాను. నేను మీకు ఎన్నడూ భారంగా ఉండలేదు అన్న విషయంలో తప్ప ఇతర సంఘాలకన్నా మీరు ఏ విషయంలో తీసిపోయారు? దీనికి నన్ను క్షమించండి. ఇక యిప్పుడు మూడవసారి మీ దగ్గరకు రావటానికి సిద్ధంగా ఉన్నాను. ఈసారి కూడా నేను మీకు భారంగా ఉండను. నాకు కావలసింది మీ దగ్గరున్న వస్తువులు కాదు. మీరు నాకు కావాలి. పిల్లలు తల్లిదండ్రుల కోసం ఆస్తిని కూడపెట్టరు. కాని తల్లిదండ్రులే తమ పిల్లల కోసం ఆస్తి కూడబెడ్తారు. అందువల్ల నా దగ్గరున్నదంతా ఆనందంతో మీకోసం వ్యయంచేస్తాను. “నన్ను” మీకోసం ఉపయోగించుకోండి. నేను మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తే నన్ను మీరు తక్కువగా ప్రేమిస్తారా? అది అలా ఉండనివ్వండి, నేను మీకు భారంగా ఉండలేదని తెలుసు కాని, “నేను పన్నాగాలు పన్ని మిమ్మల్ని వలలో వేసుకొన్నానని” కొందరు అనవచ్చు. నేను పంపిన మనుష్యుల్లో ఎవర్నైనా మిమ్మల్ని మోసగించటానికి ఉపయోగించుకొన్నానా? లేదని నాకు తెలుసు. నేను వాళ్ళ ద్వారా మిమ్మల్ని ఉపయోగించుకొన్నానా? నేను తీతును మీ దగ్గరకు వెళ్ళమని వేడుకొన్నాను. మా సోదరుణ్ణి అతని వెంట పంపాను. తీతు మిమ్మల్ని వంచించలేదు కదా? వంచించాడా? లేదు. మేమంతా ఒకే ఆత్మతో, ఒకే మార్గాన్ని అనుసరించామని మీకు తెలుసు. మమ్మల్ని మేము మీ ముందు సమర్థించుకోవాలని మా పక్షాన మేము వాదిస్తున్నామని అనుకొంటున్నారా? లేదు. మేము దేవుని ముందు క్రీస్తులో మాట్లాడుతున్నాము. సోదరులారా! మీ విశ్వాసాన్ని ధృఢపరచాలని మేము యివి చేస్తున్నాము. ఎందుకంటే, మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను అనుకొన్నట్లు మీరు, మీరనుకొన్నట్లు నేను ఉండమేమోనని నాకు భయం వేస్తోంది. కలహాలు, అసూయలు, కోపాలు, కక్షలు, వదంతులు, గుస గుసలు, అహంభావాలు, అల్లర్లు ఉంటాయేమోనని భయపడుతున్నాము. నేను మీ దగ్గరకు మళ్ళీ వచ్చినప్పుడు నా దేవుని ముందు నాకు తలవంపులు కలుగుతాయేమోనని భయం వేస్తోంది. గతంలో కామక్రీడలు, వ్యభిచారం లాంటి అపవిత్రమైన పనులు చేసి ఆ పాపాలకు పశ్చాత్తాపం పొందనివాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటివాళ్ళవల్ల నాకు దుఃఖం కలుగుతుందనే భయం వేస్తోంది.

2 కొరింథీయులకు 12:11-21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నేనవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీచేత మెప్పు పొందవలసినవాడను, ఏలయనగా నేను ఏమాత్రపువాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె నేను ఏ విషయములోను తక్కువ వాడను కాను. సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుటవలన, అపొస్తలునియొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీమధ్యను నిజముగా కనుపరచబడెను. నేను మీకు భారముగా ఉండకపోతినను విషయములో తప్ప, మరి ఏ విషయములో మీరితర సంఘములకంటె తక్కువ వారైతిరి? నేను చేసిన యీ అన్యాయమును క్షమించుడి. ఇదిగో, యీ మూడవసారి మీయొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను; వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను.2 పిల్లలు తలిదండ్రులకొరకు కాదు తలిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చతగినది గదా కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మలకొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను; నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మును ఎంత యెక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా? అది ఆలా గుండనియ్యుడి. నేను మీకు భారముగా ఉండలేదు గాని యుక్తిగలవాడనై మిమ్మును తంత్రము చేతపట్టుకొంటిని అని చెప్పుదురేమో. నేను మీ యొద్దకు పంపినవారిలో ఎవనివలననైనను మిమ్మును మోసపుచ్చి ఆర్జించుకొంటినా? మీయొద్దకు వెళ్లుటకు తీతును హెచ్చరించి అతనితోకూడ ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి యేమైన ఆర్జించుకొనెనా? మేమొక్క ఆత్మవలననే ఒక్క అడుగుజాడలయందే నడుచుకొనలేదా? మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో. దేవుని యెదుటనే క్రీస్తునందు మాటలాడుచున్నాము; ప్రియులారా, మీ క్షేమాభివృద్ధికొరకు ఇవన్నియు చెప్పు చున్నాము. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు, నేను మీకిష్టు డనుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును అసూయయు క్రోధములును కక్షలును కొండెములును గుసగుసలాడుటలును ఉప్పొంగుటలును అల్లరులునుఉండు నేమో అనియు, నేను మరల వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు,మునుపు పాపముచేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి చేష్టల నిమిత్తము మారుమనస్సు పొందని అనేకులనుగూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను.