2 కొరింథీయులకు 1:8-10
2 కొరింథీయులకు 1:8-10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
సహోదరి సహోదరులారా, ఆసియా ప్రాంతంలో మాకు ఎదురైన కష్టాల గురించి మీకు చెప్పకుండా ఉండాలని అనుకోవడం లేదు. మేము మా శక్తికి మించిన కష్టాలను అనుభవించాము. కాబట్టి మేము జీవితంపై ఆశ వదులుకున్నాము. మాకు మరణశిక్ష విధించబడినట్లుగా భావించించాము. మేము మాపై ఆధారపడక, మృతులను కూడ పునరుత్ధానులుగా చేసిన దేవునిపై ఆధారపడడానికే అలా జరిగింది. మరణకరమైన భయంకర ప్రమాదాల నుండి ఆయన మమ్మల్ని కాపాడారు. ఇకముందు కూడా కాపాడతారు. ఇకముందు కూడ కాపాడతాడు. ఆయన తిరిగి మమ్మల్ని కాపాడతారని ఆయనలో నిరీక్షణ కలిగి ఉన్నాము.
2 కొరింథీయులకు 1:8-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సోదరులారా, ఆసియ ప్రాంతంలో మేము పడిన బాధలు మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం లేదు. మేము బతుకుతామనే నమ్మకం లేక, మా శక్తికి మించిన భారంతో పూర్తిగా కుంగిపోయాము. వాస్తవంగా, మాకు మరణదండన విధించినట్టు అనిపించింది. అయితే చనిపోయిన వారిని లేపే దేవుని మీద తప్ప, మా మీద మేము నమ్మకం ఉంచకుండేలా అలా జరిగింది. ఆయన అలాటి భయంకరమైన ఆపద నుండి మమ్మల్నిరక్షించాడు, మళ్లీ రక్షిస్తాడు. ఆయన మీద మా నమ్మకం పెట్టుకున్నాము. మళ్ళీ మళ్ళీ ఆయన మమ్మల్ని తప్పిస్తాడు.
2 కొరింథీయులకు 1:8-10 పవిత్ర బైబిల్ (TERV)
మేము ఆసియ ప్రాంతంలో అనుభవించిన కష్టాలు మీకు చెప్పకుండా ఉండలేము. మాకు అక్కడ తీవ్రమైన కష్టాలు కలిగాయి. అవి మేము మోయలేనంతగా ఉండినవి. జీవిస్తామనే ఆశ కూడా పోయింది. మా మనస్సులకు మరణదండన పొందినట్లు అనిపించింది. మమ్మల్ని మేము నమ్ముకోరాదని, చనిపోయినవాళ్ళను బ్రతికించే దేవుణ్ణి నమ్మాలని ఇలా జరిగింది. దేవుడు మమ్మల్ని ఆ ప్రమాదకరమైన చావునుండి రక్షించాడు. ఇక ముందు కూడా రక్షిస్తాడు. మాకు ఆయన పట్ల పూర్తిగా విశ్వాసం ఉంది.
2 కొరింథీయులకు 1:8-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించినశ్రమనుగూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు; అదేదనగా మేము బ్రదుకుదుమను నమ్మకములేక యుండునట్లుగా, మా శక్తికి మించిన అత్యధిక భారమువలన క్రుంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమ్మిక యుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను. ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మాకొరకు ప్రార్థనచేయుటవలన మీరు కూడ సహాయము చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై యున్నాము.