2 దినవృత్తాంతములు 7:11-16
2 దినవృత్తాంతములు 7:11-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
సొలొమోను యెహోవా మందిరాన్ని, రాజభవనాన్ని పూర్తి చేసి, యెహోవా మందిరంలో, తన సొంత భవనంలో తాను కోరుకున్నదంతా పూర్తి చేసినప్పుడు, ఒక రాత్రి యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలా అన్నారు: “నేను నీ ప్రార్థన విన్నాను, ఈ స్థలాన్ని నా కోసం బలులు అర్పించే మందిరంగా ఎన్నుకున్నాను. “వాన కురవకుండా నేను ఆకాశాన్ని మూసివేసినప్పుడు గాని భూమిని మ్రింగివేయమని మిడతలను ఆజ్ఞాపించినప్పుడు గాని నా ప్రజల మధ్యకు తెగులును పంపినప్పుడు గాని, ఒకవేళ నా పేరుతో పిలువబడే నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థనచేసి నా వైపు తిరిగి తమ చెడు మార్గాలను వదిలి వేస్తే, పరలోకం నుండి నేను వారి ప్రార్థన వింటాను. వారి పాపాలను క్షమించి, వారి దేశాన్ని బాగుచేస్తాను. ఇప్పటినుండి ఈ స్థలంలో చేసే ప్రార్థనలపై నా దృష్టి ఉంటుంది నా చెవులతో వింటాను. ఇక్కడ నా పేరు ఎప్పటికీ ఉండాలని నేను ఈ మందిరాన్ని ఎన్నుకుని ప్రతిష్ఠించాను. నా కనుదృష్టి, నా హృదయం ఎల్లప్పుడు దీనిపై ఉంటాయి.
2 దినవృత్తాంతములు 7:11-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ విధంగా సొలొమోను యెహోవా మందిరాన్ని, రాజనగరాన్ని కట్టించి, యెహోవా మందిరంలో, తన నగరంలో చేయాలని తాను ఆలోచించిన దానంతటినీ ఏ లోపమూ లేకుండా నెరవేర్చి పని ముగించాడు. అప్పుడు యెహోవా రాత్రి వేళ సొలొమోనుకు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పాడు “నేను నీ విన్నపాన్ని అంగీకరించి ఈ స్థలాన్ని నాకు బలులు అర్పించే మందిరంగా కోరుకున్నాను. నేను ఆకాశాన్ని మూసివేసి వాన కురవకుండా చేసినప్పుడూ, దేశాన్ని నాశనం చేయడానికి మిడతలకు సెలవిచ్చినప్పుడూ, నా ప్రజల మీదికి తెగులు రప్పించినప్పుడూ, నా పేరు పెట్టుకున్న నా ప్రజలు తమని తాము తగ్గించుకుని, ప్రార్థన చేసి, నన్ను వెతికి, తమ దుష్టత్వాన్ని విడిచి నన్ను వేడుకుంటే, నేను పరలోకం నుండి వారి ప్రార్థన విని, వారి పాపాన్ని క్షమించి, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. ఈ స్థలం లో చేసే ప్రార్థన మీద నా దృష్టి ఉంటుంది, నా చెవులు దాన్ని వింటాయి. నా పేరు ఈ మందిరానికి నిత్యమూ ఉండేలా నేను దాన్ని కోరుకుని పరిశుద్ధపరిచాను. నా కనులు, నా మనస్సు నిత్యం దాని మీద ఉంటాయి.
2 దినవృత్తాంతములు 7:11-16 పవిత్ర బైబిల్ (TERV)
సొలొమోను ఆలయాన్ని, రాజభవనాన్ని నిర్మించటం పూర్తిచేశాడు. ఆలయ నిర్మాణంలోను, తన ఇంటి నిర్మాణంలోను సొలొమోను అనుకున్న పనులన్నీ పూర్తిచేశాడు. ఆ రాత్రి యెహోవా సొలొమోనుకు దర్శనమిచ్చాడు. యెహోవా ఇలా అన్నాడు: “సొలొమోనూ, నీ ప్రార్థన నేను విన్నాను. బలులు యివ్వటానికి అనువైన ప్రదేశంగా ఈ స్థలాన్ని నేనే ఎంపిక చేశాను. వర్షాలు లేకుండా నేను ఆకాశాన్ని మూసివేసినప్పుడుగాని, దేశాన్ని నాశనం చేసే విధంగా నేను మిడతల దండులను పంపినుప్పుడుగాని, నేను నా ప్రజలకు వ్యాధులు సొకేలా చేసినప్పుడుగాని, నా పేరు మీద పిలవబడే నా ప్రజలు అణకువతో వుండి నన్ను ప్రార్థిస్తే, నా కొరకు ఎదురు చూస్తే, వారు తమ చెడు మార్గాలను విడనాడితే, నేనప్పుడు ఆకాశం నుండి వారి మొర ఆలకిస్తాను. నేను వారి పాపాలను క్షమిస్తాను. నేను వారి దేశాన్ని బాగు చేస్తాను. నేను నా నేత్రలను తెరచియున్నాను. నా చెవులు ఈ ప్రదేశంలో చేసిన ప్రార్థనలను వింటాయి. ఇక్కడ నా పేరు శాశ్వతంగా ఉండునట్లు నేనీ ప్రదేశాన్ని ఎంపిక చేసి, దానిని పవిత్రంగా మార్చాను. అవును; నా కళ్లు, నా హృదయం ఇక్కడ ఈ ఆలయంలో ఎల్లప్పుడూ వుంటాయి.
2 దినవృత్తాంతములు 7:11-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి, యెహోవామందిరమందును తన నగరునందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపములేకుండ నెరవేర్చి పని ముగించెను. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను–నేను నీ విన్నపము నంగీకరించి యీ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. వాన కురియకుండ నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనులమీదికి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనమీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధపరచితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును.