2 దినవృత్తాంతములు 7:1-22 - Compare All Versions
2 దినవృత్తాంతములు 7:1-22 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సొలొమోను ప్రార్థన ముగించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహనబలిని, బలులను దహించివేసింది. యెహోవా మహిమ మందిరాన్ని నింపింది. ఆలయమంతా యెహోవా మహిమతో నిండడంతో యాజకులు లోపలికి ప్రవేశించలేకపోయారు. అగ్ని దిగి రావడం, యెహోవా మహిమ మందిరం మీద ఉండడం ఇశ్రాయేలీయులు చూసినప్పుడు, వారు కాలిబాట మీద సాష్టాంగపడి, “యెహోవా మంచివాడు; ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అంటూ ఆయనను ఆరాధించి కృతజ్ఞత చెల్లించారు. తర్వాత రాజు, ప్రజలంతా యెహోవా ఎదుట బలులు అర్పించారు. సొలొమోను రాజు 22,000 పశువులు, 1,20,000 గొర్రెలు, మేకలు బలిగా అర్పించాడు. ఈ విధంగా రాజు, ప్రజలందరు దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించారు. యాజకులు తమ స్థలాల్లో నిలబడి ఉండగా, రాజైన దావీదు యెహోవాను స్తుతించడానికి, “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉండును గాక!” అంటూ ఆయనను స్తుతిస్తూ కృతజ్ఞత చెల్లించడానికి దావీదు యెహోవా కోసం తయారుచేసిన వాయిద్యాలు వాయిస్తూ గీతాలను పాడుతూ లేవీయులు కూడా తమ స్థలాలలో నిలబడ్డారు. లేవీయులకు ఎదురుగా యాజకులు నిలబడి బూరలు ఊదుతుండగా ఇశ్రాయేలీయులంతా నిలబడి ఉన్నారు. సొలొమోను చేసిన ఇత్తడి బలిపీఠం మీద అర్పించలేనంత ఎక్కువగా ఆ దహనబలులు, భోజనార్పణలు, సమాధానబలుల క్రొవ్వు ఉంది కాబట్టి అతడు యెహోవా ఆలయానికి ముందున్న ఆవరణం మధ్య భాగాన్ని అతడు పవిత్రపరచి, దహనబలులు, భోజనార్పణలు, క్రొవ్వు పదార్థాలు అర్పించాడు. ఆ సమయంలో ఏడు రోజులు సొలొమోను అతనితో ఇశ్రాయేలు ప్రజలంతా పండుగ చేశారు. లెబో హమాతుకు వెళ్లే మార్గం నుండి ఈజిప్టు వాగువరకు ఉన్న ప్రాంతాల నుండి ప్రజలు గొప్ప సమూహంగా వచ్చారు. ఎనిమిదవ రోజున వారు సమావేశాన్ని నిర్వహించారు, ఎందుకంటే ఏడు రోజులు బలిపీఠాన్ని ప్రతిష్ఠించి మరో ఏడు రోజులు పండుగ జరుపుకున్నారు. ఏడవ నెల ఇరవై మూడవ రోజున, అతడు ప్రజలను తమ ఇళ్ళకు పంపివేశాడు. యెహోవా దావీదుకు, సొలొమోనుకు, తన ప్రజలైన ఇశ్రాయేలుకు చేసిన మంచి వాటిని బట్టి హృదయంలో ఆనందంతో, సంతోషంతో వెళ్లారు. సొలొమోను యెహోవా మందిరాన్ని, రాజభవనాన్ని పూర్తి చేసి, యెహోవా మందిరంలో, తన సొంత భవనంలో తాను కోరుకున్నదంతా పూర్తి చేసినప్పుడు, ఒక రాత్రి యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలా అన్నారు: “నేను నీ ప్రార్థన విన్నాను, ఈ స్థలాన్ని నా కోసం బలులు అర్పించే మందిరంగా ఎన్నుకున్నాను. “వాన కురవకుండా నేను ఆకాశాన్ని మూసివేసినప్పుడు గాని భూమిని మ్రింగివేయమని మిడతలను ఆజ్ఞాపించినప్పుడు గాని నా ప్రజల మధ్యకు తెగులును పంపినప్పుడు గాని, ఒకవేళ నా పేరుతో పిలువబడే నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థనచేసి నా వైపు తిరిగి తమ చెడు మార్గాలను వదిలి వేస్తే, పరలోకం నుండి నేను వారి ప్రార్థన వింటాను. వారి పాపాలను క్షమించి, వారి దేశాన్ని బాగుచేస్తాను. ఇప్పటినుండి ఈ స్థలంలో చేసే ప్రార్థనలపై నా దృష్టి ఉంటుంది నా చెవులతో వింటాను. ఇక్కడ నా పేరు ఎప్పటికీ ఉండాలని నేను ఈ మందిరాన్ని ఎన్నుకుని ప్రతిష్ఠించాను. నా కనుదృష్టి, నా హృదయం ఎల్లప్పుడు దీనిపై ఉంటాయి. “నీ మట్టుకైతే, నీ తండ్రి దావీదులా నమ్మకంగా జీవిస్తూ, నేను ఆజ్ఞాపించినదంతా చేసి, నా శాసనాలను నియమాలను పాటిస్తే, నీ తండ్రి దావీదుకు, ‘ఇశ్రాయేలు సింహాసనం మీద నీ సంతతివారు ఎప్పటికీ కూర్చుంటారు’ అని నిబంధన చేసినట్లు నీ రాజ సింహాసనం ఎల్లకాలం స్థాపిస్తాను. “అయితే ఒకవేళ మీరు నన్ను అనుసరించుట మాని, నేను మీకు ఇచ్చిన శాసనాలు, ఆజ్ఞలు విడిచి ఇతర దేవుళ్ళను సేవిస్తూ పూజిస్తే, అప్పుడు నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన నా దేశం నుండి వారిని పెళ్లగించి నా నామం కోసం ప్రతిష్ఠించుకున్న ఈ మందిరాన్ని తిరస్కరిస్తాను. నేను దాన్ని ప్రజలందరిలో సామెతగా, హేళనకు కారణంగా చేస్తాను. ఈ మందిరం శిథిలాల కుప్పగా మారుతుంది. దాటి వెళ్లేవారంతా ఆశ్చర్యపడి, ‘యెహోవా ఈ దేశానికి, ఈ ఆలయానికి ఇలా ఎందుకు చేశారో?’ అని అడుగుతారు. అప్పుడు ప్రజలు, ‘వారు తమను ఈజిప్టు దేశం నుండి తీసుకువచ్చిన తమ పూర్వికుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టి వేరే దేవుళ్ళను హత్తుకుని, పూజిస్తూ వాటికి సేవ చేశారు, అందుకే యెహోవా వారిపై ఈ విపత్తును తెచ్చారు’ అని జవాబిస్తారు.”
2 దినవృత్తాంతములు 7:1-22 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
సొలొమోను తన ప్రార్థన ముగించగానే ఆకాశం నుండి అగ్ని దిగి దహనబలులనూ ఇతర బలులనూ దహించివేసింది. యెహోవా తేజస్సు మందిరాన్ని పూర్తిగా నింపింది. యెహోవా తేజస్సుతో మందిరం నిండిపోవడం వలన యాజకులు అందులో ప్రవేశించలేక పోయారు. అగ్నీ యెహోవా తేజస్సూ మందిరం పైకి దిగటం చూసి ఇశ్రాయేలీయులంతా సాష్టాంగ నమస్కారం చేసి “యెహోవా దయ గలవాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది” అంటూ ఆయనను ఆరాధించి స్తుతించారు. రాజూ, ప్రజలూ కలిసి యెహోవా ముందు బలులు అర్పించారు. సొలొమోను రాజు 22,000 పశువులనూ 1, 20,000 గొర్రెలనూ బలులుగా అర్పించాడు. రాజు, ప్రజలు, అందరూ కలిసి దేవుని మందిరాన్ని ప్రతిష్టించారు. యాజకులు తమ తమ సేవా స్థలాల్లో నిలిచారు. లేవీయులు “యెహోవా కృప నిత్యమూ నిలుస్తుంది” అంటూ దేవుణ్ణి స్తుతించడానికి దావీదు ఏర్పాటు చేసిన యెహోవా గీతాలు పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. యాజకులు వారికి ఎదురుగా నిలబడి బూరలు ఊదుతూ ఉంటే, ఇశ్రాయేలు ప్రజలంతా నిలబడి ఉన్నారు. సొలొమోను తాను చేయించిన ఇత్తడి బలిపీఠం దహనబలులకూ నైవేద్యాలకూ కొవ్వుకూ సరిపోక పోవడం వలన యెహోవా మందిరం ముందు ఉన్న మధ్య ఆవరణాన్ని ప్రతిష్ఠించి, అక్కడ దహనబలులనూ శాంతి బలిపశువుల కొవ్వునూ అర్పించాడు. సొలొమోను, అతనితో కూడా హమాతు సరిహద్దు నుండి ఐగుప్తు నది వరకూ ఉన్న దేశం నుండి గొప్ప సమూహంగా వచ్చిన ఇశ్రాయేలీయులందరూ ఏడు రోజులు పండగ ఆచరించారు. ఎనిమిదో రోజు వారు పండగ ముగించారు. ఏడు రోజులూ బలిపీఠాన్ని ప్రతిష్టిస్తూ పండగ ఆచరించారు. ఏడవ నెల ఇరవై మూడో రోజున సొలొమోను దావీదుకు, తనకు, తన ప్రజలు ఇశ్రాయేలీయులకు యెహోవా చేసిన మేలుల విషయంలో సంతోషిస్తూ, మనసులో ఆనందపడుతూ, ఎవరి గుడారాలకు వారిని వెళ్ళమని ప్రజలకి అనుమతినిచ్చి పంపేశాడు. ఆ విధంగా సొలొమోను యెహోవా మందిరాన్ని, రాజనగరాన్ని కట్టించి, యెహోవా మందిరంలో, తన నగరంలో చేయాలని తాను ఆలోచించిన దానంతటినీ ఏ లోపమూ లేకుండా నెరవేర్చి పని ముగించాడు. అప్పుడు యెహోవా రాత్రి వేళ సొలొమోనుకు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పాడు “నేను నీ విన్నపాన్ని అంగీకరించి ఈ స్థలాన్ని నాకు బలులు అర్పించే మందిరంగా కోరుకున్నాను. నేను ఆకాశాన్ని మూసివేసి వాన కురవకుండా చేసినప్పుడూ, దేశాన్ని నాశనం చేయడానికి మిడతలకు సెలవిచ్చినప్పుడూ, నా ప్రజల మీదికి తెగులు రప్పించినప్పుడూ, నా పేరు పెట్టుకున్న నా ప్రజలు తమని తాము తగ్గించుకుని, ప్రార్థన చేసి, నన్ను వెతికి, తమ దుష్టత్వాన్ని విడిచి నన్ను వేడుకుంటే, నేను పరలోకం నుండి వారి ప్రార్థన విని, వారి పాపాన్ని క్షమించి, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. ఈ స్థలం లో చేసే ప్రార్థన మీద నా దృష్టి ఉంటుంది, నా చెవులు దాన్ని వింటాయి. నా పేరు ఈ మందిరానికి నిత్యమూ ఉండేలా నేను దాన్ని కోరుకుని పరిశుద్ధపరిచాను. నా కనులు, నా మనస్సు నిత్యం దాని మీద ఉంటాయి. నీ తండ్రి దావీదు నడుచుకున్నట్టు నువ్వు కూడా నాకు అనుకూలంగా ప్రవర్తించి, నేను నీకాజ్ఞాపించిన దానంతటినీ జరిగించి, నా కట్టడలనీ నా న్యాయవిధులనీ అనుసరిస్తే, ఇశ్రాయేలీయులను పాలించడానికి నీ సంతతి వాడు ఒకడు నీకుండకుండా పోడు, అని నేను నీ తండ్రి దావీదుతో చేసిన నిబంధనను అనుసరించి నేను నీ రాజ్య సింహాసనాన్ని స్థిరపరుస్తాను. అయితే మీరు దారి తొలగి, నేను మీకు నియమించిన కట్టడలనూ ఆజ్ఞలనూ విడిచిపెట్టి, ఇతర దేవుళ్ళను అనుసరించి వాటిని పూజిస్తే, నేను మీకిచ్చిన నా దేశంలోనుండి మిమ్మల్ని పెళ్ళగించి, నా నామం కోసం నేను పరిశుద్ధపరచిన ఈ మందిరాన్ని నా సన్నిధి నుండి తీసేసి, సమస్త జాతుల్లో దాన్ని సామెతకు, ఎగతాళికీ కారణంగా చేస్తాను. అప్పుడు గొప్ప పేరు పొందిన ఈ మందిరం పక్కగా వెళ్ళేవారంతా విస్మయం చెంది, ‘యెహోవా ఈ దేశానికీ మందిరానికీ ఎందుకిలా చేశాడు?’ అని అడుగుతారు. అప్పుడు మనుషులు, ‘ఈ దేశ ప్రజలు తమ పూర్వికులను ఐగుప్తు దేశం నుండి రప్పించిన తమ దేవుడు యెహోవాను విసర్జించి ఇతర దేవుళ్ళను వెంబడించి వాటిని పూజించారు కాబట్టి యెహోవా ఈ విపత్తునంతటినీ వారిమీదకి రప్పించాడు’ అని చెబుతారు.”
2 దినవృత్తాంతములు 7:1-22 TERV (పవిత్ర బైబిల్)
సొలొమోను ప్రార్థన పూర్తి చేసేసరికి ఆకాశం నుండి అగ్ని దిగి దహనబలులను, మిగిలిన అర్పణలను దహించి వేసింది. యెహోవా మహిమ ఆలయాన్ని నింపివేసింది. యెహోవా మహిమ నిండి వున్న ఆలయంలో యాజకులు ప్రవేశించలేక పోయారు. ఆకాశం నుండి అగ్ని దిగిరావటం ఇశ్రాయేలీయులంతా చూశారు. యెహోవా మహిమ ఆలయాన్ని ఆవరించి వుండటం కూడ వారు చూశారు. వారంతా బాటపై సాష్టాంగ పడ్డారు. వారు యెహోవాను స్తుతించి, నమస్కరించారు. వారింకా యిలా అన్నారు: “ప్రభువు ఉత్తముడు, ఆయన కరుణ ఎప్పటికీ కొనసాగుతుంది.” పిమ్మట రాజైన సొలొమోను, ఇశ్రాయేలు ప్రజలందరు యెహోవా ముందు బలులు అర్పించారు. రాజైన సొలొమోను ఇరవై రెండువేల గిత్తలను, ఒక లక్షా ఇరవైవేల గొర్రెలను బలియిచ్చాడు. రాజు, ప్రజలు అంతా కలిసి ఆలయాన్ని పవిత్రం చేశారు. అది యెహోవా ఆరాధనకై వినియోగింపబడాలి. యాజకులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి సిద్ధంగా నిలబడ్డారు. లేవీయులు కూడ యెహోవా మేళం వాయించే పనిముట్లు పట్టుకుని నిలిచారు. దేవునికి వందనాలర్పించే నిమిత్తం ఈ వాద్య విశేషాలను రాజైన దావీదు చేయించాడు. “దేవుని ప్రేమ అనంతం!” అని యాజకులు, లేవీయులు పలికారు. లేవీయులకు ఎదురుగా నిలబడి యాజకులు బాకాలు ఊదారు. ఇశ్రాయేలీయులందరూ నిలబడ్డారు. ఆలయం ముందున్న ఆవరణ మధ్య భాగాన్ని సొలొమోను ప్రతిష్ఠించాడు. అక్కడే సొలొమోను దహనబలులు, సమాధాన బలుల కొవ్వును అర్పించాడు. తాను నిర్మించిన కంచు బలిపీఠం దహనబలులు, ధాన్యపు అర్పణలు, కొవ్వును పెట్టటానికి చాలనందున, సొలొమోను ఆలయ ఆవరణ మధ్య భాగాన్ని వినియోగించాడు. సొలొమోను, ఇశ్రాయేలు ప్రజలు కలిసి ఏడు రోజులపాటు పండుగ చేశారు. సొలొమోనుతో చాలా మంది జనం వున్నారు. హమాతు పట్టణద్వారం నుండి ఈజిప్టు సెలయేటి వరకు వున్న ప్రాంత మంతటి నుండి జనసమూహాలు వచ్చాయి. ఏడు రోజుల పండుగ ఆచరణ ముగిశాక, ఎనిమిదవ రోజున వారు పవిత్ర సమావేశం ఏర్పాటు చేశారు. బలిపీఠాన్ని వారు పవిత్రం (శుద్ధి) చేశారు. దానిని దైవారాధనలోనే వినియోగిస్తారు. వారు ఏడు రోజులు పండుగ ఆచరించారు. ఆ సంవత్సరం ఏడవ నెల ఇరవై మూడవ రోజు సొలొమోను ప్రజలందరినీ తమ తమ ఇండ్లకు పంపివేశాడు. యెహోవా దావీదుపట్ల, సొలొమోను పట్ల, ఇశ్రాయేలు ప్రజలపట్ల ఎంతో ఉదారంగా వున్నందుకు ప్రజలంతా చాలా సంతోషించారు. వారి హృదయాలు ఆనందమయమయ్యాయి. సొలొమోను ఆలయాన్ని, రాజభవనాన్ని నిర్మించటం పూర్తిచేశాడు. ఆలయ నిర్మాణంలోను, తన ఇంటి నిర్మాణంలోను సొలొమోను అనుకున్న పనులన్నీ పూర్తిచేశాడు. ఆ రాత్రి యెహోవా సొలొమోనుకు దర్శనమిచ్చాడు. యెహోవా ఇలా అన్నాడు: “సొలొమోనూ, నీ ప్రార్థన నేను విన్నాను. బలులు యివ్వటానికి అనువైన ప్రదేశంగా ఈ స్థలాన్ని నేనే ఎంపిక చేశాను. వర్షాలు లేకుండా నేను ఆకాశాన్ని మూసివేసినప్పుడుగాని, దేశాన్ని నాశనం చేసే విధంగా నేను మిడతల దండులను పంపినుప్పుడుగాని, నేను నా ప్రజలకు వ్యాధులు సొకేలా చేసినప్పుడుగాని, నా పేరు మీద పిలవబడే నా ప్రజలు అణకువతో వుండి నన్ను ప్రార్థిస్తే, నా కొరకు ఎదురు చూస్తే, వారు తమ చెడు మార్గాలను విడనాడితే, నేనప్పుడు ఆకాశం నుండి వారి మొర ఆలకిస్తాను. నేను వారి పాపాలను క్షమిస్తాను. నేను వారి దేశాన్ని బాగు చేస్తాను. నేను నా నేత్రలను తెరచియున్నాను. నా చెవులు ఈ ప్రదేశంలో చేసిన ప్రార్థనలను వింటాయి. ఇక్కడ నా పేరు శాశ్వతంగా ఉండునట్లు నేనీ ప్రదేశాన్ని ఎంపిక చేసి, దానిని పవిత్రంగా మార్చాను. అవును; నా కళ్లు, నా హృదయం ఇక్కడ ఈ ఆలయంలో ఎల్లప్పుడూ వుంటాయి. సొలొమోనూ, నీవిప్పుడు నీ తండ్రి మెలగిన రీతిలో నా ముందు జీవిస్తే, నా ఆజ్ఞలన్నీ పాటిస్తే, నా ధర్మశాస్త్రాన్ని, నియమాలను అనుసరిస్తే, నిన్నొక శక్తి గల రాజుగా చేస్తాను. నీ రాజ్యాన్ని సుస్థిరమైనదిగా చేస్తాను. నీ తండ్రియైన దావీదుతో అదే ఒడంబడిక చేశాను. ‘దావీదూ, ఇశ్రాయేలు రాజుగా నీ కుటుంబంలో ఒకడు కొనసాగుతాడు’ అని నేను చెప్పియున్నాను. “కానీ నీవు నా ధర్మాన్ని, ఆజ్ఞలను శిరసావహించనిచో, నీవు గనుక అన్యదేవతారాధనకు పాల్పడితే, అప్పుడు ఇశ్రాయేలు ప్రజలను నేను వారికిచ్చిన రాజ్యం నుండి బయటకు త్రోసివేస్తాను. నా నామముతో పవిత్రపర్చబడిన ఈ ఆలయాన్ని నేను వదలి వేస్తాను. ఇతర దేశాలన్నీ చెడుమాటలు పలికేలా ఈ ఆలయమును మార్చివేస్తాను. అత్యున్నతంగా గౌరవింపబడిన ఈ ఆలయం ప్రక్కగా వెళ్లే వారెవరైనా చూసి ఆశ్చర్యపోతారు. ‘ఈ రాజ్యానికి, ఈ ఆలయానికి, యెహోవా ఎందుకింత భయంకర పరస్థితి కల్పించాడు?’ అని అనుకుంటారు. పిమ్మట వారు ఈ రకంగా సమాధానం చెప్పుకుంటారు: ‘వారి పూర్వీకుల దేవుడైన యెహోవాను ఇశ్రాయేలు ప్రజలు అనుసరించలేదు. ఆయనే వారిని ఈజిప్టు నుండి విముక్తి చేసి బయటకు తీసుకొనివచ్చాడు. కాని ఇశ్రాయేలు ప్రజలు అన్యదేవతలను సేవించారు. వారు విగ్రహాలను కొలిచారు. అందువల్లనే యెహోవా ఈ భయంకర పరిస్థితులు ఇశ్రాయేలు ప్రజలకు కల్పించాడు అని అనుకుంటారు.’”
2 దినవృత్తాంతములు 7:1-22 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సొలొమోను తానుచేయు ప్రార్థనను ముగించి నప్పుడు అగ్ని ఆకాశమునుండి దిగి దహనబలులను ఇతరమైన బలులను దహించెను; యెహోవా తేజస్సు మందిరమునిండ నిండెను, యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరముమీదికి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరును సాష్టాంగనమస్కారము చేసి–యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరును యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను ఇరువది రెండువేల పశువులను లక్ష యిరువది వేల గొఱ్ఱెలను బలులుగా అర్పించెను; యాజకులు తమతమ సేవాధర్మములలో నిలిచియుడగను, లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారిచేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలిచియుడగను, యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను, ఇశ్రాయేలీయులందరును నిలిచియుండగను రాజును జనులందరును కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠచేసిరి. మరియు తాను చేయించిన యిత్తడి బలిపీఠము దహనబలులకును నైవేద్యములకును క్రొవ్వుకును చాలనందున యెహోవా మందిరము ముంగిటనున్న నడిమి ఆవరణమును సొలొమోను ప్రతిష్ఠించి, అక్కడ దహనబలులను సమాధాన బలిపశువుల క్రొవ్వును అర్పించెను. ఆ సమయమందు సొలొమోనును, అతనితోకూడ హమాతునకు పోవు మార్గము మొదలుకొని ఐగుప్తు నదివరకున్న దేశములోనుండి బహు గొప్ప సమూహముగా కూడివచ్చిన ఇశ్రాయేలీయులందరును ఏడు దినములు పండుగ ఆచరించి యెనిమిదవనాడు పండుగ ముగించిరి; ఏడు దినములు బలిపీఠమును ప్రతిష్ఠచేయుచు ఏడు దినములు పండుగ ఆచరించిరి. ఏడవ నెల యిరువది మూడవ దినమందు దావీదునకును సొలొమోనునకును తన జనులైన ఇశ్రాయేలీయులకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచును మనోత్సాహము నొందుచును, ఎవరి గుడారములకు వారు వెళ్లునట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేసెను. ఆప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి, యెహోవామందిరమందును తన నగరునందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపములేకుండ నెరవేర్చి పని ముగించెను. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను–నేను నీ విన్నపము నంగీకరించి యీ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. వాన కురియకుండ నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనులమీదికి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనమీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధపరచితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును. నీ తండ్రియైన దావీదు నడచినట్లుగా నీవును నా కనుకూల వర్తనుడవై నడచి, నేను నీకాజ్ఞాపించిన దానియంతటి ప్రకారముచేసి, నా కట్టడలను నా న్యాయవిధులను అనుసరించినయెడల ఇశ్రాయేలీయులను ఏలుటకు స్వసంతతివాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రియైన దావీదుతో చేసియున్న నిబంధననుబట్టి నేను నీ రాజ్యసింహాసనమును స్థిరపరచుదును. అయితే మీరు త్రోవ తప్పి, నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడచి, యితర దేవతలను అనుసరించి వాటికి పూజానమస్కారములు చేసినయెడల నేను మీకిచ్చిన నా దేశములోనుండి మిమ్మును పెల్లగించి, నా నామమునకు నేను పరిశుద్ధపరచిన యీ మందిరమును నా సన్నిధినుండి తీసి వేసి, సమస్త జనములలో దానిని సామెత కాస్పదముగాను నిందకాస్పదముగాను చేయుదును. అప్పుడు ప్రఖ్యాతి నొందిన యీ మందిరమార్గమున పోవు ప్రయాణస్థులందరును విస్మయమొంది–యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఎందుకు ఈ ప్రకారముగా చేసెనని యడుగగా జనులు–ఈ దేశస్థులు తమపితరులను ఐగుప్తు దేశమునుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విస ర్జించి యితర దేవతలను అనుసరించి వాటికి పూజానమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించెనని ప్రత్యుత్తరమిచ్చెదరు.