2 దినవృత్తాంతములు 36:22-23

2 దినవృత్తాంతములు 36:22-23 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

పర్షియా రాజైన కోరెషు పాలన మొదటి సంవత్సరంలో, యిర్మీయా చెప్పిన యెహోవా మాటను నెరవేర్చడానికి, తన రాజ్యమంతటా ఒక ప్రకటన చేసేలా, దానిని వ్రాతపూర్వకంగా ఉంచేలా యెహోవా పర్షియా రాజైన కోరెషు హృదయాన్ని ప్రేరేపించారు: “పర్షియా రాజైన కోరెషు చెప్పేది ఇదే: “ ‘పరలోకపు దేవుడైన యెహోవా నాకు భూమిపై ఉన్న అన్ని రాజ్యాలను ఇచ్చారు. యూదాలోని యెరూషలేములో తనకు మందిరాన్ని నిర్మించడానికి నన్ను నియమించారు. మీ మధ్య ఉన్న ఆయన ప్రజల్లో ఎవరైనా అక్కడికి వెళ్లవచ్చు, వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండును గాక.’ ”

2 దినవృత్తాంతములు 36:22-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

పారసీకదేశపు రాజు కోరెషు పాలన మొదటి సంవత్సరం యిర్మీయా ద్వారా పలికిన తన మాట నెరవేర్చడానికి యెహోవా పారసీకదేశపు రాజు కోరెషు మనస్సును ప్రేరేపించాడు. అతడు తన రాజ్యమంతటా చాటించి రాత పూర్వకంగా ఇలా ప్రకటన చేయించాడు. “పారసీకదేశపు రాజు కోరెషు ఆజ్ఞాపించేది ఏంటంటే పరలోకంలో ఉన్న దేవుడైన యెహోవా అన్ని రాజ్యాలనూ నా వశం చేశాడు. యూదాలో ఉన్న యెరూషలేములో తనకు మందిరాన్ని కట్టించమని నాకు ఆజ్ఞాపించాడు. ఆయన ప్రజలైన మీరెవరైనా యెరూషలేము వెళ్ళవచ్చు. మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉంటాడు గాక.”

2 దినవృత్తాంతములు 36:22-23 పవిత్ర బైబిల్ (TERV)

పర్షియా (పారసీక) రాజు కోరెషు (సైరస్) పాలన మొదటి సంవత్సరంలో ఈ విధంగా జరిగింది. ప్రవక్తయగు యిర్మీయా ద్వారా యెహోవా ప్రకటించిన విషయాలు ఆయన నిజంగా జరిగేలా చేసినాడు. యెహోవా సైరస్ (కోరెషు) హృదయాన్ని స్పందింపజేసి, అతనిచే ఒక ఆజ్ఞ వ్రాయించి దూతల ద్వారా తన రాజ్యమంతా ప్రకటింపజేసినాడు: పర్షియా రాజైన కోరెషు తెలియజేయున దేమనగా: ఆకాశమందు ప్రభువైన యెహోవా నన్ను ఈ భూమండలానికంతకు రాజుగా చేసినాడు. యెరూషలేములో ఆయనకొక ఆలయం కట్టించే బాధ్యత నాకు అప్పజెప్పినాడు. దేవుని ప్రజలైన మీరంతా ఇప్పుడు యెరూషలేము వెళ్లటానికి స్వేచ్ఛ కలిగియున్నారు. మీ దేవుడైన యెహోవా మీకు తోడై వుండుగాక.

2 దినవృత్తాంతములు 36:22-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

పారసీకదేశపు రాజైన కోరెషు ఏలుబడియందు మొదటి సంవత్సరమున యిర్మీయాద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకదేశపురాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమం దంతటను చాటించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను –పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞా పించునదేమనగా–ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకలజనములను నా వశముచేసి, యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు; కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు బయలుదేర వచ్చును; వారి దేవుడైన యెహోవావారికి తోడుగా నుండునుగాక.