2 దినవృత్తాంతములు 33:15-17
2 దినవృత్తాంతములు 33:15-17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అతడు యెహోవా మందిరంలో నుండి ఇతర దేవుళ్ళ విగ్రహాలను తొలగించాడు. యెరూషలేములో, యెహోవా మందిర కొండమీద తాను కట్టించిన బలిపీఠాలు తీసివేసి పట్టణం బయట వాటిని పారవేయించాడు. అప్పుడతడు యెహోవా బలిపీఠాలన్ని మరమ్మత్తు చేయించి, వాటి మీద సమాధానబలులు కృతజ్ఞతార్పణలు అర్పించాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించమని యూదా వారికి ఆజ్ఞాపించాడు. అయినా ప్రజలు ఇంకా క్షేత్రాల్లో బలులు అర్పిస్తూనే ఉన్నారు అయితే అవి వారి దేవుడైన యెహోవాకే అర్పించారు.
2 దినవృత్తాంతములు 33:15-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా మందిరం నుంచి అన్యుల దేవతా విగ్రహం తీసివేసి, యెరూషలేములో యెహోవా మందిరం ఉన్న కొండ మీద తాను కట్టించిన బలిపీఠాలన్నిటినీ తీసి పట్టణం బయట పారవేయించాడు. అతడు యెహోవా బలిపీఠంను బాగుచేసి, దాని మీద సమాధానబలులు, కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించమని యూదా వారికి ఆజ్ఞాపించాడు. అయినా ప్రజలు ఎత్తయిన స్థలాల్లో ఇంకా బలులు అర్పిస్తూనే ఉన్నారు గాని అవి తమ దేవుడైన యెహోవాకే అర్పించారు.
2 దినవృత్తాంతములు 33:15-17 పవిత్ర బైబిల్ (TERV)
ఇతర దేవుళ్ల విగ్రహాలన్నిటినీ మనష్షే తీసి పారవేశాడు. ఆలయంలో వున్న విగ్రహాన్ని అతడు తీసివేశాడు. యెరూషలేములో ఆలయ ప్రాకారం మీద అతను నెలకొల్పిన బలిపీఠాలన్నీ తొలగించాడు. ఆ బలిపీఠాలన్నిటినీ యెరూషలేము నగరంనుండి తీసి బయట పారవేశాడు. పిమ్మట అతడు యెహోవా బలిపీఠాన్ని ప్రతిష్ఠించి దాని మీద సమాధానబలులు, కృతజ్ఞతార్పణలు సమర్పించాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఘనంగా ఆరాధించుమని మనష్షే యూదా ప్రజలందరికి ఆజ్ఞాపించాడు. ప్రజలు ఉన్నత స్థలాలలో బలులు యివ్వటం కొనసాగించారు గాని వారు అవన్నీ వారి దేవుడగు యెహోవాకే అర్పించారు.
2 దినవృత్తాంతములు 33:15-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు యెహోవా మందిరమునుండి అన్యుల దేవతలను విగ్రహమును తీసివేసి, యెరూషలేమునందును యెహోవామందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటిని తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించెను. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగుచేసి, దానిమీద సమాధానబలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాను సేవించుడని యూదావారికి ఆజ్ఞ ఇచ్చెను. అయినను జనులు ఉన్నతస్థలములయందు ఇంకను బలులు అర్పించుచు వచ్చిరిగాని ఆ యర్పణలను తమ దేవుడైన యెహోవా నామమునకే చేసిరి.