2 దినవృత్తాంతములు 26:1-15

2 దినవృత్తాంతములు 26:1-15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అప్పుడు యూదా ప్రజలందరూ పదహారు సంవత్సరాల వయస్సు వాడైన ఉజ్జియాను అతని తండ్రియైన అమజ్యా స్థానంలో రాజుగా చేశారు. రాజైన అమజ్యా చనిపోయి అతని పూర్వికుల దగ్గరకు చేరిన తర్వాత ఉజ్జియా ఏలతును పునర్నిర్మించి తిరిగి యూదాకు కలిపాడు. ఉజ్జియా రాజైనప్పుడు అతని వయస్సు పదహారు సంవత్సరాలు, అతడు యెరూషలేములో యాభై రెండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెకొల్యా. ఆమె యెరూషలేముకు చెందినది. అతడు తన తండ్రి అమజ్యా చేసినట్లు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు. దేవుని భయం కలిగి ఉండాలని తనకు బోధించిన జెకర్యా దినాల్లో అతడు దేవున్ని అనుసరించాడు. అతడు యెహోవాను అనుసరించినంత కాలం దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చారు. అతడు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి వెళ్లి గాతు, జబ్నె, అష్డోదు పట్టణాల గోడలు పడగొట్టాడు. అష్డోదు ప్రాంతంలో, ఫిలిష్తీయుల మధ్య ఉన్న పట్టణాలను తిరిగి కట్టించాడు. ఫిలిష్తీయులతో గూర్-బయలులో ఉన్న అరబీయులతో మెయునీయులతో యుద్ధం చేసినప్పుడు దేవుడు అతనికి సహాయం చేశారు. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్ను చెల్లించేవారు. అతడు చాలా శక్తివంతంగా అభివృద్ధి చెందాడు కాబట్టి, అతని గొప్పతనం ఈజిప్టు సరిహద్దు వరకు వ్యాపించింది. ఉజ్జియా యెరూషలేములో మూల ద్వారం దగ్గర, లోయ ద్వారం దగ్గర, ప్రాకారం మూల దగ్గర బురుజులు నిర్మించి వాటిని పటిష్టం చేశాడు. అతడు అరణ్యంలో బురుజులు కూడా నిర్మించాడు అనేక తొట్టెలను తవ్వాడు, ఎందుకంటే అతనికి పర్వత ప్రాంతాల్లో మైదానంలో చాలా పశువులు ఉన్నాయి. అతడు మట్టిని ప్రేమిస్తున్నందున కొండల్లో సారవంతమైన భూములలో తన పొలాలను ద్రాక్షతోటలను పని చేసేవారిని కలిగి ఉన్నాడు. ఉజ్జియాకు సుశిక్షితులైన సైన్యం ఉంది, రాజ అధికారులలో ఒకరైన హనన్యా ఆధ్వర్యంలో కార్యదర్శియైన యెహీయేలు అధికారియైన మయశేయా వారిని లెక్కించిన ప్రకారం విభాగాలుగా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ యుద్ధవీరులపై 2,600 మంది అధికారులున్నారు. వారంతా పూర్వికుల కుటుంబాల పెద్దలు. యుద్ధానికి బాగా శిక్షణ పొందిన 3,07,500 మంది వారి చేతి క్రింద ఉన్నారు. రాజుకు అతని శత్రువు పోరాడడానికి సహాయం చేయగల బలమైన సైన్యం అది. ఉజ్జియా సైన్యమంతటికి డాళ్లు, ఈటెలు, శిరస్త్రాణాలు, కవచాలు, విల్లులు, వడిసెలు సరఫరాచేశాడు. యెరూషలేములో సైనికులు బాణాలు వేయడానికి గోడల నుండి పెద్ద రాళ్లను విసిరేందుకు వీలుగా అతడు బురుజులపై మూలల రక్షణ కోసం కనిపెట్టిన పరికరాలను తయారుచేశాడు. అతని కీర్తి చాలా దూరం వ్యాపించింది, ఎందుకంటే అతడు స్థిరపడేవరకు యెహోవా అతనికి ఎంతో సహాయం చేశారు.

2 దినవృత్తాంతములు 26:1-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అప్పుడు యూదా ప్రజలంతా 16 ఏళ్ల వాడైన ఉజ్జియాను అతని తండ్రి అమజ్యాకు బదులు రాజుగా నియమించారు. ఎలోతు పట్టణాన్ని కట్టించి, అది యూదా వారికి తిరిగి వచ్చేలా చేసింది ఇతడే. ఆ తరువాత రాజు తన పూర్వీకులతో పాటు కన్ను మూశాడు. ఉజ్జియా పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు 16 ఏళ్ల వాడు. అతడు యెరూషలేములో 52 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి యెరూషలేము నివాసి. ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రియైన అమజ్యా చేసిన దాని ప్రకారం యెహోవా దృష్టికి యథార్ధంగా ప్రవర్తించాడు. దేవుని మాట వినేలా సలహాలిచ్చిన జెకర్యా రోజుల్లో ఉజ్జియా దేవుని ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతణ్ణి వర్ధిల్లజేశాడు. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేశాడు. గాతు, యబ్నె, అష్డోదు పట్టణ ప్రాకారాలను పడగొట్టి, అష్డోదు దేశంలో ఫిలిష్తీయుల ప్రాంతంలో పట్టణాలను కట్టించాడు. ఫిలిష్తీయులతో, గూర్బయలులో నివసించిన అరబీయులతో, మెయోనీయులతో అతడు యుద్ధం చేసినప్పుడు దేవుడు అతనికి సహాయం చేశాడు. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్ను చెల్లించారు. అతడు చాలా శక్తిమంతుడయ్యాడు కాబట్టి అతని కీర్తి ఇతర దేశాలకూ ఐగుప్తు వరకూ వ్యాపించింది. ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మం దగ్గర, లోయ గుమ్మం దగ్గర, ప్రాకారపు మూల దగ్గర, బురుజులు కట్టించి వాటి చుట్టూ ప్రాకారాలు ఏర్పరచాడు. అతడు అరణ్యంలో కావలి గోపురాలు కట్టించి చాలా బావులు తవ్వించాడు. అతనికి పల్లపు భూముల్లో, మైదాన భూముల్లో చాలా పశు సంపద ఉంది. కాబట్టి కొండ సీమలో ప్రాంతంలో అతనికి సారవంతమైన భూమీ రైతులూ ద్రాక్షతోట పనివారూ ఉన్నారు. ఎందుకంటే అతనికి వ్యవసాయమంటే ఎంతో ఇష్టం. దీనికి తోడు, ఉజ్జియాకు పోరాడే యోధులున్నారు. వారు లెక్క ప్రకారం గుంపులుగా ఏర్పడి యుద్ధానికి వెళ్ళేవారు. రాజు అధికారుల్లో కార్యదర్శి మయశేయా, ప్రధానమంత్రి యెహీయేలు వారి లెక్క ఎంతైనది చూసి పటాలాలుగా ఏర్పరచేవారు. వీరు హనన్యా చేతి కింద ఉన్నారు. వారి పూర్వీకుల ఇంటి పెద్దల సంఖ్యను బట్టి పోరాడ గలిగిన వారు 2, 600 మంది. రాజుకు సహాయం చేయడానికి శత్రువులతో యుద్ధం చేయడంలో పేరు పొందిన పరాక్రమశాలురైన 3,07,500 మంది సైన్యం, వారి చేతి కింద ఉంది. ఉజ్జియా ఈ సైన్యమంతటికీ డాళ్లనూ, ఈటెలనూ, శిరస్త్రాణాలనూ, కవచాలనూ, విల్లులనూ, వడిసెలలనూ చేయించాడు. అతడు అంబులనూ పెద్దరాళ్లనూ ప్రయోగించడానికి నిపుణులు కల్పించిన యంత్రాలను యెరూషలేములో చేయించి కోటల్లో ప్రాకారాల్లో ఉంచాడు. అతడు స్థిరపడే వరకూ అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది కాబట్టి అతని కీర్తి సుదూర ప్రాంతాలకు వ్యాపించింది.

2 దినవృత్తాంతములు 26:1-15 పవిత్ర బైబిల్ (TERV)

తరువాత అమజ్యా స్థానంలో కొత్త రాజుగా ప్రజలు ఉజ్జియాను ఎంచుకున్నారు. ఉజ్జియా తండ్రి పేరు అమజ్యా. ఇది జరిగే నాటికి ఉజ్జియా పదహారు సంవత్సరాలవాడు. ఎలతు పట్టణాన్ని ఉజ్జియా తిరిగి నిర్మించి యూదాకు యిచ్చాడు. అమజ్యా చనిపోయి, తన పూర్వీకులతో సమాధి చేయబడిన తరువాత ఉజ్జియా ఇది చేశాడు. తాను రాజయ్యేనాటికి ఉజ్జియా పదహారు సంవత్సరాలవాడు. యెరూషలేములో అతడు ఏబై రెండు సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు యెకొల్యా. యెకొల్యా యెరూషలేముకు చెందిన స్త్రీ. యెహోవా అతని నుండి ఆశించిన విధంగా ఉజ్జియా తన కార్యకలాపాలు కొనసాగించాడు. తన తండ్రి అమజ్యావలెనే ఉజ్జియా కూడా దేవుని పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నాడు. జెకర్యా జీవించి ఉన్న కాలంలోనే ఉజ్జియా దేవుని సేవకుడయ్యాడు. ప్రభువైన యెహోవా పట్ల ఎలా భక్తి విశ్వాసాలు కలిగి వుండాలో జెకర్యా ఉజ్జియాకు నేర్పాడు. ఉజ్జియా యెహోవాకు విధేయుడై వున్నంతకాలం, ఆయన అతనికి విజయం చేకూర్చి పెట్టాడు. ఫిలిష్తీయులతో ఉజ్జియా యుద్ధం చేశాడు. గాతు, యబ్నె, అష్డోదు పట్టణాల చుట్టూ వున్న ప్రాకారాలను అతడు పడగొట్టాడు. అష్టోదు పట్టణానికి దగ్గరగాను, మరియు ఫిలిష్తీయులు నివసించే ప్రాంతాలలోను ఉజ్జియా కొన్ని పట్టణాలను నిర్మించాడు. ఫిలిష్తీయులతోను, గూర్బయలులో నివసిస్తున్న అరబీయులతోను, మెహోనీయులతోను ఉజ్జియా జరిపిన యుద్ధాలలో యెహోవా అతనికి విజయం చేకూర్చాడు. అమ్మోనీయులు ఉజ్జియాకు కప్పం చెల్లించారు. ఈజిప్టు సరిహద్దులవరకు ఉజ్జియా పేరు ప్రతిష్ఠలు వ్యాపించాయి. మిక్కిలి బలపరాక్రమాలు కలవాడగుటచే ఉజ్జియా ప్రసిద్ధిగల వ్యక్తి అయ్యాడు. యెరూషలేములో మూలద్వారాం వద్ద, లోయ ద్వారం వద్ద, మరియు గోడమలుపు వద్ద ఉజ్జియా బురుజులు కట్టించి బాగా బలపర్చాడు. ఎడారిలో సహితం ఉజ్జియా బురుజులు కట్టించాడు. అతడు చాలా బావుల కూడా తవ్వించాడు. కొండల (మన్యం) ప్రాంతంలోను, మైదాన ప్రాంతాలలోను అతనికి పశుసంపద విస్తారంగా వుంది. పంట సాగుకు అనువైన కొండలయందు, మైదానములందు ఉజ్జియాకు వ్యవసాయదారులున్నారు. ద్రాక్షతోటల పెంపకంలో శ్రద్ధవహించే రైతులు కూడ అతనికి వున్నారు. అతడు వ్యవసాయ రంగాన్ని అభిమానించాడు. ఉజ్జియాకు మంచి శిక్షణ పొందిన సైన్యం ఉంది. కార్యదర్శి యెహీయేలు, మరో అధికారి మయశేయా అనేవారు సైన్యాన్ని, వివిధ భాగాలుగా విభజించారు. వారి పైఅధికారి హనన్యా. యెహీయేలు, మయశేయా సైనికులందరినీ లెక్కించి వారిని పటాలాలుగా విభజించారు. హనన్యా రాజాధికారులలో ఒకడు. సైనికులపై అధికారులే రెండువేల ఆరువందల మంది ఉన్నారు. వంశాలవారీ ఎంపికైన సైన్యాధికారుల క్రింద మొత్తం మూడు లక్షల ఏడువేల ఐదువందల మంది యుద్ధంలో కాకలు తీరిన సైనికులున్నారు. ఆ సైనికులు శత్రువుల నుండి రక్షణ పొందటానికి రాజుకు సహాయపడతారు. ఉజ్జియా సైన్యానికి డాళ్లు, ఈటెలు, శిరస్త్రాణాలు కవచాలు విల్లంబులు, ఒడిసెల రాళ్లు సరఫరా చేశాడు. మేధావులు తమ కల్పనా శక్తితో రూపొందించిన యంత్రాలను ఉజ్జియా యెరూషలేములో తయారుచేయించాడు. ఆ యంత్రాలను బురుజుల మీద, గోడలు కలిసిన మూలల మీద ఉంచాడు. ఈ యంత్రాలు బాణాలు వదలటం, బండరాళ్లు విసిరి వేయటం మొదలైన పనులు చేసేవి. ఉజ్జియా చాలా ప్రఖ్యాతి గాంచాడు. దూర ప్రదేశాలలో కూడ ప్రజలు అతని పేరు విన్నారు. అతనికి ఎడతెగని సహాయం అందటంతో అతను చాలా శక్తివంతమైన రాజు అయ్యాడు.

2 దినవృత్తాంతములు 26:1-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అంతట యూదా జనులందరును పదునారేండ్ల వాడైన ఉజ్జియాను తీసికొని అతని తండ్రియైన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఏలతును కట్టించి, రాజగు తన తండ్రి అతని పితరులతోకూడ నిద్రించిన తరువాత అది యూదావారికి తిరిగి వచ్చునట్లు చేసెను. ఉజ్జియా యేలనారంభించినప్పుడు పదునారేండ్లవాడై యెరూషలేములో ఏబది రెండు సంవత్సరములు ఏలెను; అతని తల్లి యెరూషలేము కాపురస్థురాలు, ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రియైన అమజ్యా చర్యయంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జెకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలము దేవుడు అతని వర్ధిల్ల జేసెను. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధముచేసి గాతు ప్రాకారమును యబ్నె ప్రాకారమును అష్డోదు ప్రాకారమును పడగొట్టి, అష్డోదు దేశములోను ఫిలిష్తీయుల ప్రదేశములలోను ప్రాకారపురములను కట్టించెను. ఫిలిష్తీయులతోను గూర్బయలులో నివసించిన అరబీయులతోను మెహూనీయులతోను అతడు యుద్ధముచేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను. మరియు ఉజ్జియా యెరూషలేములో మూలగుమ్మము దగ్గరను, పల్లపుస్థలముల గుమ్మము దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను, దుర్గములను కట్టించి గుమ్మములు దిట్టపరచెను. అదియుగాక షెఫేలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్షగలవాడు గనుక పర్వతములలోను కర్మెలులోను అతనికి వ్యవసాయకులును ద్రాక్ష తోట పనివారును కలిగియుండిరి. యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగియుండెను; అందులోని యోధులు రాజు అధిపతులలో హనన్యా అనువాని చేతిక్రిందనుండిరి. ఖజానాదారుడగు మయ శేయాయు ప్రధానమంత్రియగు యెహీయేలును వారి లెక్క ఎంతైనది చూచి వారిని పటాలముగా ఏర్పరచువారై యుండిరి. వారి పితరులయిండ్ల పెద్దల సంఖ్యనుబట్టి పరాక్రమశాలులు రెండువేల ఆరువందలమంది యైరి. రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుటయందు పేరుపొందిన పరాక్రమశాలు లైన మూడులక్షల ఏడువేల ఐదువందలమందిగల సైన్యము వారి చేతిక్రింద ఉండెను. ఉజ్జియా యీ సైన్యమంతటికి డాళ్లను ఈటెలను శిరస్త్రాణములను కవచములను విల్లులను వడిసెలలను చేయించెను. మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయ శాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడువరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను.