2 దినవృత్తాంతములు 24:1-27 - Compare All Versions

2 దినవృత్తాంతములు 24:1-27 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యోవాషు రాజైనప్పుడు అతని వయస్సు ఏడు సంవత్సరాలు. అతడు యెరూషలేములో నలభై సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు జిబ్యా; ఆమె బెయేర్షేబకు చెందినది. యాజకుడైన యెహోయాదా బ్రతికిన కాలమంతా యోవాషు యెహోవా దృష్టికి సరియైనదే చేశాడు. యెహోయాదా యోవాషుకు ఇద్దరు స్త్రీలతో పెళ్ళి చేశాడు, అతనికి కుమారులు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలం తర్వాత యోవాషు యెహోవా మందిరాన్ని మరమ్మత్తు చేయాలని నిర్ణయించుకున్నాడు. అతడు యాజకులను, లేవీయులను పిలిపించి, “మీ దేవుని మందిరాన్ని మరమ్మత్తు చేయాలి కాబట్టి మీరు యూదా పట్టణాలకు వెళ్లి ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరనుండి ప్రతి సంవత్సరం రావలసిన డబ్బును సేకరించండి. అది వెంటనే చేయండి” అని ఆదేశించాడు. కాని లేవీయులు వెంటనే చేయలేదు. కాబట్టి రాజు ముఖ్య యాజకుడైన యెహోయాదాను పిలిచి, “నిబంధన గుడారం కొరకై ఇశ్రాయేలీయుల సమాజానికి యెహోవా సేవకుడైన మోషే విధించిన పన్నును యూదా నుండి యెరూషలేము నుండి లేవీయులు వెళ్లి తీసుకురావాలని నీవెందుకు అడగలేదు?” అని అన్నాడు. ఆ దుర్మార్గురాలైన అతల్యా కుమారులు దేవుని మందిరంలోకి చొరబడి దానిలోని పవిత్ర వస్తువులను కూడా బయలు కోసం ఉపయోగించారు. రాజు ఆజ్ఞ ప్రకారం, ఒక పెట్టెను తయారుచేసి యెహోవా మందిర ద్వారం బయట ఉంచారు. దేవుని సేవకుడైన మోషే అరణ్యంలో ఇశ్రాయేలీయులకు విధించిన పన్నును వారు యెహోవాకు తీసుకురావాలని యూదాలో యెరూషలేములో ప్రకటించారు. దానికి అధికారులంతా ప్రజలంతా సంతోషించి, వారి కానుకలు తెచ్చి పెట్టె నిండేవరకు అందులో వేశారు. అప్పుడప్పుడు లేవీయులు ఆ పెట్టెను రాజు అధికారుల దగ్గరకు తెచ్చేవారు. పెట్టెలో చాలా డబ్బు కనబడితే రాజు కార్యదర్శి, ముఖ్య యాజకుని అధికారి వచ్చి, పెట్టె ఖాళీచేసి దాని స్థలంలో దానిని మళ్ళీ ఉంచేవారు. ఇలా వారు ప్రతిదినం చేయడం వలన వారు చాలా డబ్బు పోగుచేశారు. రాజు యెహోయాదా ఆ డబ్బును యెహోవా మందిరంలో అవసరమైన పనులు చేసేవారికి ఇచ్చారు. యెహోవా మందిరాన్ని బాగుచేయడానికి తాపీ మేస్త్రీలను, వడ్లవారిని, మందిరాన్ని మరమ్మత్తు చేయడానికి ఇనుముతో ఇత్తడితో పనిచేసేవారిని జీతానికి తీసుకున్నారు. పనివారు శ్రద్ధగా పని చేస్తుంటే వారి ఆధ్వర్యంలో మరమ్మత్తులు ముందుకు కొనసాగాయి. వారు దేవుని మందిరాన్ని దాని అసలు నమూనా ప్రకారం పునర్నిర్మించి దానిని పటిష్టం చేశారు. పని ముగించిన తర్వాత వారు మిగతా డబ్బును రాజు దగ్గరకు, యెహోయాదా దగ్గరకు తెచ్చారు. ఆ డబ్బుతో యెహోవా ఆలయానికి సంబంధించిన వస్తువులు సేవా సంబంధమైన వస్తువులు, దహనబలికి ఉపయోగపడే వస్తువులు, గరిటెలు, వేరువేరు వెండి బంగారు వస్తువులు చేయించారు. యెహోయాదా బ్రతికి ఉన్నంతకాలం యెహోవా మందిరంలో ప్రతిరోజు దహనబలులు అర్పించబడ్డాయి. యెహోయాదా వయస్సు నిండి ముసలితనంలో చనిపోయాడు. అప్పుడు అతని వయస్సు నూట ముప్పై సంవత్సరాలు. అతడు ఇశ్రాయేలులో దేవునికి, ఆయన మందిరానికి చేసిన మేలును బట్టి దావీదు పట్టణంలో రాజులతో పాటు పాతిపెట్టబడ్డాడు. యెహోయాదా మరణించిన తర్వాత, యూదా అధికారులు వచ్చి రాజుకు నమస్కరించగా అతడు వారి మాట విన్నాడు. అప్పుడు వారు తమ పూర్వికుల దేవుడైన యెహోవా మందిరాన్ని విడిచి అషేరా స్తంభాలకు, విగ్రహాలకు పూజ చేశారు. వారు చేసిన ఈ అపరాధం కారణంగా దేవుని కోపం యూదా వారిమీదికి, యెరూషలేము వారిమీదికి వచ్చింది. అయినా, వారిని తన వైపుకు మళ్ళించాలని యెహోవా తన ప్రవక్తలను వారి దగ్గరకు పంపాడు. ప్రవక్తలు సాక్ష్యమిస్తూ వారిని హెచ్చరించారు కాని వారు ప్రవక్త మాటలు పెడచెవిని పెట్టారు. ఆ సమయంలో దేవుని ఆత్మ యాజకుడైన యెహోయాదా కుమారుడైన జెకర్యా మీదికి రాగా అతడు ప్రజలు ముందు నిలబడి, “దేవుడు చెప్పే మాట ఇదే: ‘యెహోవా ఆజ్ఞలను మీరెందుకు మీరుతున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విడిచిపెట్టారు కాబట్టి ఆయన మిమ్మల్ని విడిచిపెట్టారు’ ” అన్నాడు. అయితే వారు అతని మీద కుట్రపన్ని అతన్ని యెహోవా ఆలయ ఆవరణంలో రాళ్లతో కొట్టి చంపారు. రాజు జారీ చేసిన ఆజ్ఞ ప్రకారమే అలా జరిగింది. జెకర్యా తండ్రియైన యెహోయాదా తనపై చూపిన దయను యోవాషు రాజు మరచిపోయే, అతని కుమారున్ని చంపించాడు. జెకర్యా చనిపోతూ చివరిగా, “యెహోవా ఇది చూసి విచారణ చేస్తారు” అన్నాడు. ఆ సంవత్సరం చివరిలో సిరియా సైన్యం యోవాషు మీదికి దండెత్తి వచ్చింది. వారు యూదాపై యెరూషలేముపై దాడిచేసి ప్రజల నాయకులందరిని చంపారు. కొల్లసొమ్మంతా దమస్కులో ఉన్న వారి రాజుకు పంపారు. వచ్చిన సిరియా సైన్యం చిన్నదే అయినా చాలా పెద్ద సైన్యాన్ని యెహోవా వారి వశం చేశాడు. యూదా తమ పూర్వికుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టారు కాబట్టి అలా జరిగింది. యోవాషు కూడా తీర్పుకు గురి అయ్యాడు. సిరియావారు తిరిగి వెళ్లేటప్పుడు గాయాలతో ఉన్న యోవాషును వదిలేశారు. యాజకుడైన యెహోయాదా కుమారుడిని చంపినందుకు అతని అధికారులు అతనిపై కుట్రపన్ని అతన్ని అతని మంచం మీద చంపారు. కాబట్టి అతడు చనిపోయి దావీదు పట్టణంలో పాతిపెట్టబడ్డాడు, అయితే రాజుల సమాధుల్లో కాదు. అతనిపై అమ్మోనీయురాలైన షిమాతు కుమారుడైన జాబాదు, మోయాబురాలైన షిమ్రీతు కుమారుడైన యెహోజాబాదు కుట్రపన్నారు. యోవాషు కుమారుల గురించి, అతని గురించి చెప్పిన ప్రవచనాల విషయం, దేవుని మందిరాన్ని పూర్వస్థితికి తెచ్చిన విషయం రాజు గ్రంథ వ్యాఖ్యానంలో వ్రాసి ఉన్నాయి. అతని తర్వాత అతని కుమారుడైన అమజ్యా రాజయ్యాడు.

2 దినవృత్తాంతములు 24:1-27 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యోవాషు పరిపాలించడం మొదలు పెట్టినప్పుడు అతని వయస్సు ఏడేళ్ళు. అతడు యెరూషలేములో 40 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి బెయేర్షెబాకు చెందిన జిబ్యా. యాజకుడు యెహోయాదా బతికిన రోజులన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్ధంగా ప్రవర్తించాడు. యెహోయాదా అతనికి ఇద్దరు స్త్రీలనిచ్చి పెళ్ళి చేశాడు. అతనికి కొడుకులూ, కూతుళ్ళూ కలిగారు. ఇదంతా జరిగిన తరువాత యెహోవా మందిరాన్ని బాగుచేయాలని యోవాషు నిర్ణయించుకున్నాడు. అతడు యాజకులనూ లేవీయులనూ ఒక చోట సమావేశపరచి వారితో ఇలా అన్నాడు “మీరు యూదా పట్టణాలకు పోయి మీ దేవుని మందిరం బాగుచేయడానికి ఇశ్రాయేలీయులందరి దగ్గర నుంచి ధనం ప్రతి సంవత్సరం పోగుచేయాలి. ఈ పని మీరు త్వరగా మొదలుపెట్టాలి.” మొదట్లో లేవీయులు ఆ పని త్వరగా చేయలేదు. అందుకు రాజు ప్రధాన యాజకుడు యెహోయాదాను పిలిపించాడు. “సాక్ష్యపు గుడారాన్ని బాగు చేయడానికి యూదాలో నుండీ, యెరూషలేములో నుండీ, ఇశ్రాయేలీయుల సమాజానికి యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నీవెందుకు చెప్పి తెప్పించ లేదు?” అని అడిగాడు. ఎందుకంటే దుర్మార్గురాలైన అతల్యా కొడుకులు దేవుని మందిరాన్ని పాడు చేసి, యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్ఠ ఉపకరణాలన్నిటినీ బయలు దేవుడి పూజకు ఉపయోగించారు. కాబట్టి రాజాజ్ఞ ప్రకారం వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిర ద్వారం బయట ఉంచారు. దేవుని సేవకుడైన మోషే, అరణ్యంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు నిర్ణయించిన కానుకను యెహోవా దగ్గరికి ప్రజలు తీసుకు రావాలని యూదాలోనూ యెరూషలేములోనూ వారు చాటించారు. అధికారులందరూ ప్రజలందరూ సంతోషంగా కానుకలు తెచ్చి, పెట్టె నిండేంత వరకూ దానిలో వేశారు. లేవీయులు ఆ పెట్టెను రాజు అధికారుల దగ్గరికి తీసుకువచ్చిన ప్రతిసారీ, అందులో చాలా ధనం కనిపించినప్పుడల్లా రాజు కార్యదర్శి, ప్రధాన యాజకుని అధికారీ వచ్చి, పెట్టె ఖాళీ చేసి దాన్ని యథాస్థానంలో ఉంచేవారు. అనుదినం వారు ఇలా చేస్తూ చాలా ధనం సమకూర్చారు. అప్పుడు రాజు, యెహోయాదా, యెహోవా మందిరంలో పనిచేసే వారికి ఆ ధనాన్ని ఇచ్చారు. యెహోవా మందిరాన్ని బాగుచేయడానికి రాతి పని చేసే వారిని, వడ్రంగి వారిని, ఇనుప పనీ, ఇత్తడి పనీ చేసే వారిని కూలికి తీసుకున్నారు. ఈ విధంగా పనివారు కష్టించి పనిచేస్తుంటే మందిర మరమ్మత్తు చక్కగా కొనసాగింది. వారు దేవుని మందిరాన్ని దాని పూర్వస్థితికి తెచ్చి దాన్ని దృఢపరచారు. వారు దాన్ని పూర్తి చేసిన తరువాత మిగిలిన ధనాన్ని రాజు దగ్గరికీ, యెహోయాదా దగ్గరికీ తీసుకువచ్చారు. ఆ డబ్బుతో వారు యెహోవా మందిరానికి సంబంధించిన వస్తువులనూ, సేవకు ఉపయోగపడే వస్తువులనూ, దహనబలికి ఉపయోగపడే వస్తువులనూ, గరిటెలనూ, వెండీ బంగారు ఉపకరణాలనూ చేయించారు. యెహోయాదా జీవించి ఉన్న రోజులన్నిటిలో వారు యెహోవా మందిరంలో దహనబలులను కొనసాగించారు. యెహోయాదా వయసు మీరి పండు వృద్ధాప్యంలో చనిపోయాడు. అతడు చనిపోయినప్పుడు అతని వయస్సు 130 ఏళ్ళు. అతడు ఇశ్రాయేలీయుల్లో దేవుని కోసం, దేవుని ఇంటి కోసం మంచి మేలు చేశాడు కాబట్టి వారు అతణ్ణి దావీదు పట్టణంలో రాజుల దగ్గర పాతిపెట్టారు. యెహోయాదా చనిపోయిన తరువాత యూదా అధికారులు వచ్చి రాజును గౌరవించారు. రాజు వారి మాటలు విన్నాడు. ప్రజలు తమ పూర్వీకుల దేవుడైన యెహోవా మందిరాన్ని విడిచి, అషేరా దేవతాస్తంభాలను, విగ్రహాలను పూజించారు. వారు చేసిన ఈ దుర్మార్గానికి యూదావారి మీదికీ యెరూషలేము నివాసుల మీదికీ దేవుని కోపం వచ్చింది. అయినా తన వైపు వారిని మళ్లించడానికి యెహోవా వారి దగ్గరికి ప్రవక్తలను పంపాడు. ఆ ప్రవక్తలు వారికి వ్యతిరేకంగా సాక్ష్యం పలికారు గానీ ప్రజలు వారి మాట వినలేదు. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కొడుకూ అయిన జెకర్యా మీదికి వచ్చాడు. అతడు ప్రజల ముందు నిలబడి “మీరెందుకు యెహోవా ఆజ్ఞలను ధిక్కరిస్తున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను వదిలివేశారు కాబట్టి ఆయన మిమ్మల్ని వదిలివేశాడని దేవుడు చెబుతున్నాడు” అన్నాడు. అయితే వారతని మీద కుట్ర పన్ని రాజాజ్ఞతో యెహోవా మందిర ఆవరణం లోపల రాళ్ళు రువ్వి అతణ్ణి చంపేశారు. ఈ విధంగా రాజైన యోవాషు జెకర్యా తండ్రి యెహోయాదా తనకు చేసిన ఉపకారాన్ని మరిచిపోయి అతని కొడుకుని చంపించాడు. అతడు చనిపోయేటప్పుడు “యెహోవా దీన్ని చూసి విచారణ చేస్తాడు గాక” అన్నాడు. ఆ సంవత్సరం చివరిలో అరాము సైన్యం యోవాషు మీదికి వచ్చింది. వారు యూదా మీదికీ యెరూషలేము మీదికీ వచ్చి, ప్రజల అధికారులందరినీ హతమార్చి, దోపిడీ సొమ్మంతా దమస్కు రాజు దగ్గరికి పంపారు. అరామీయుల సైన్యం చిన్నదే అయినా యెహోవా ఒక గొప్ప సైన్యంపై వారికి విజయం దయచేశాడు. ఎందుకంటే, యూదావారు తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను వదిలి వేశారు. ఈ విధంగా అరామీయులు యోవాషుకు శిక్ష అమలు చేశారు. అరామీయులు వెళ్ళిపోయేటప్పటికి యోవాషు తీవ్ర గాయాలతో ఉన్నాడు. యాజకుడైన యెహోయాదా కొడుకులను చంపించినందుకు అతని సొంత సేవకులు అతని మీద కుట్ర చేశారు. అతని పడక మీదే అతణ్ణి చంపేశారు. అతడు చనిపోయిన తరువాత ప్రజలు దావీదు పట్టణంలో అతణ్ణి పాతిపెట్టారు గానీ రాజుల సమాధుల్లో అతణ్ణి పాతిపెట్టలేదు. అమ్మోనీయురాలైన షిమాతు కొడుకు జాబాదు, మోయాబీయురాలు అయిన షిమ్రీతు కొడుకు యెహోజాబాదు అనేవారు అతని మీద కుట్ర చేశారు. యోవాషు కొడుకులను గురించీ, అతని గురించి చెప్పిన ముఖ్యమైన ప్రవచనాల గురించీ, దేవుని మందిరాన్ని పునర్నిర్మించడం గురించీ, రాజుల గ్రంథ వ్యాఖ్యానంలో రాసి ఉంది. అతనికి బదులు అతని కొడుకు అమజ్యా రాజయ్యాడు.

2 దినవృత్తాంతములు 24:1-27 TERV (పవిత్ర బైబిల్)

యోవాషు రాజయ్యేనాటికి ఏడేండ్లవాడు. అతడు యెరూషలేములో నలబై సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు జిబ్యా. జిబ్యా బెయేర్షెబా పట్టణ కాపురస్థురాలు. యాజకుడైన యెహోయాదా జీవించియున్నంత కాలం యోవాషు యెహోవా సన్నిధిని అన్నీ మంచి పనులు చేశాడు. యోవాషుకు ఇద్దరు భార్యలను యెహోయాదా ఎంపిక చేశాడు. యోవాషుకు కుమారులు, కుమార్తెలు కలిగారు. కొంతకాలం తరువాత ఆలయాన్ని పునరుద్ధరించాలని యోవాషు నిర్ణయించాడు. యాజకులను, లేవీయులను, యోవాషు సమావేశపర్చి, “మీరు యూదా పట్టణాలకు వెళ్లి ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు ప్రజలిచ్చే సొమ్మును జమచేయండి. ఆ ధనంతో మీ దేవుని ఆలయాన్ని పునరుద్ధరించండి. ఈ పని త్వరగా చేయండి” అని చెప్పాడు. కాని, లేవీయులు త్వరపడలేదు. ప్రముఖ యాజకుడైన యెహోయాదాను రాజైన యోవాషు పిలిపించి, “యెహోయాదా, యూదా నుండి, యెరూషలేము నుండి లేవీయులు పన్ను వసూలు చేసి తీసుకొని వచ్చేలా నీవు ఎందుకు ఏర్పాటు చేయలేదు? యెహోవా సేవకుడైన మోషే, ఇశ్రాయేలు ప్రజలు ఆ పన్ను వసూళ్లను పవిత్ర గుడారానికై వెచ్చించే వారుగదా!” అని అన్నాడు. గతంలో అతల్యా కుమారులు ఆలయంలో జొరబడ్డారు. యెహోవా ఆలయంలో పవిత్ర వస్తువులన్నిటినీ వారు బయలు దేవుళ్ల ఆరాధనకు వినియోగించారు. అతల్యా ఒక దుష్ట స్త్రీ. రాజైన యోవాషు ఒక పెట్టె చేయించి దానిని యెహోవా ఆలయ ద్వారం బయట పెట్టించాడు. పిమ్మట లేవీయులు యూదాలోను, యెరూషలేములోను ఒక ప్రకటన చేశారు. ప్రజలందరినీ పన్ను డబ్బు యెహోవా కొరకు తెమ్మని చెప్పారు. వారు ఎడారిలో వున్నప్పుడు యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలను చెల్లించమని చెప్పినదే ఈ పన్నుధనం. పెద్దలు, ప్రజలు అంతా చాలా సంతోషపడ్డారు. వారు తమ వంతు ధనాన్ని తెచ్చి ఆ పెట్టెలో వుంచారు. ఆ పెట్టె నిండేవరకు ప్రజలు డబ్బు వేస్తూవచ్చారు. తరువాత లేవీయులు ఆ పెట్టెను రాజాధికారుల యొద్దకు తీసుకొని వెళ్లారు. పెట్టె డబ్బుతో నిండివున్నట్లు వారు చూశారు. రాజు యొక్క కార్యదర్శి, ప్రధాన యాజకుని అధికారి వచ్చి పెట్టెలోని డబ్బును బయటికి తీశారు. మళ్లీ ఆ పెట్టెను యధాస్థానంలో వుంచారు. వారలా అనేక పర్యాయాలు చేసి ధనాన్ని విశేషంగా సేకరించారు. తరువాత రాజైన యోవాషు, యెహోయాదా ఆ ధనాన్ని ఆలయ పునరుద్ధరణకు పనిచేస్తున్న పనివారికి చెల్లించారు. ఆలయపు పనిలో నిమగ్నమైన వారు నిపుణులైన కొయ్యచెక్కడపు (నగిషీ) పనివారిని, వడ్రంగులను ఆలయ పునరుద్ధరణకై కిరాయికి నియమించారు. ఆలయ పునరుద్ధరణ పనికి ఇనుము, కంచు పనులలో మంచి అనుభవం వున్నవారిని కూడా వారు కిరాయికి నియమించారు. పనిమీద తనిఖీకై నియమింపబడిన వారు చాలా నమ్మకస్థులు. ఆలయ పునరుద్ధరణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. దాని పూర్వరూపం ఏమాత్రం మార్చకుండా దానిని పునరుద్ధరించి, ఇంకా బలంగా తీర్చిదిద్దారు. పని పూర్తయ్యాక, మిగిలిన డబ్బును రాజైన యోవాషుకు, యెహోయాదాకు వారు తిరిగి యిచ్చి వేశారు. వారాధనాన్ని ఇంకా ఆలయానికి కావలసిన వస్తుసామగ్రికి, పరికరాలకు వినియోగించారు. ఈ వస్తు సామగ్రిని ఆలయ ఆరాధనలోను, దహన బలులు సమర్పించటంలో వినియోగించారు. వెండి బంగారాలతో వారింకా గిన్నెలను, ఇతర పరికరాలను చేయించారు. యాజకులు యెహోవా ఆలయంలో యెహోయాదా బ్రతికివున్నంత కాలం దహనబలులు అర్పించారు. యెహోయాదా వృద్ధుడయ్యాడు. అతడు దీర్ఘకాలం జీవించి పిమ్మట చనిపోయాడు. చనిపోయేనాటికి యెహోయాదా నూటముప్పై యేండ్ల వయస్సువాడు. దావీదు నగరంలో రాజులను వుంచేచోట ప్రజలు యెహోయాదాను సమాధిచేశారు. ఇశ్రాయేలులో యెహోవాకు, ఆయన ఆలయానికి తన జీవిత కాలంలో ఎనలేని సేవ చేసినందువలన ప్రజలతనిని అక్కడ సమాధి చేశారు. యెహోయాదా చనిపోయిన పిమ్మట, యూదా పెద్దలు వచ్చి రాజైన యోవాషుకు తలవంచి నమస్కరించారు. ఆ పెద్దల విన్నపాన్ని రాజు విన్నాడు. రాజు, పెద్దలు కూడ యెహోవా ఆలయాన్ని తిరస్కరించారు. వారి పూర్వీకులు యెహోవా దేవుని ఆరాధించారు. ఇప్పుడు వీరు అషేరా దేవతా స్తంభాలను, ఇతర విగ్రహాలను పూజించటం మొదలు పెట్టారు. రాజు, ప్రజానాయకులు దుష్టనడక నడచిన కారణంగా దేవుడు యూదా, యెరూషలేము ప్రజలపట్ల కోపగించాడు. వారిని మళ్లీ సన్మార్గాన్ని అనుసరింప జేయటానికి యెహోవా వారివద్దకు ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తలు ప్రజలను హెచ్చరించారు. అయినా ప్రజలు వారి హెచ్చిరికను పెడచెవిని పెట్టారు. దేవుని ఆత్మ జెకర్యా మీదికి వచ్చింది. జెకర్యా తండ్రి యాజకుడైన యెహోయాదా. జెకర్యా ప్రజలముందు నిలబడి యిలా అన్నాడు: “దేవుడు యిలా చెబుతున్నాడు. ‘ప్రజలారా, యెహోవా ఆజ్ఞలను మీరు ఎందుకు మీరుతున్నారు.? మీరు విజయవంతులు కాలేరు. మీరు యెహోవాని వదిలిపెట్టారు. అందువల్ల దేవుడు కూడ మిమ్మల్ని వదిలివేస్తున్నాడు!’” కాని ప్రజలు జెకర్యాకు వ్యతిరేకంగా కుట్రపన్నారు. జెకర్యాను చంపమని రాజు ప్రజలకు ఆజ్ఞ ఇవ్వటంతో, వారతనిని రాళ్లతో కొట్టి చంపారు. ప్రజలీపని ఆలయ ఆవరణలో చేశారు. రాజైన యోవాషు యెహోయాదా తన పట్ల చూపిన కనికరాన్ని గుర్తు పెట్టుకోలేదు. యెహోయాదా జెకర్యా తండ్రి. కాని యెహోయాదా కుమరుడైన జెకర్యాను యోవాషు చంపివేశాడు. తను చనిపోయేముందు జెకర్యా, “నీ వేమీ చేస్తున్నావో యెహోవా చూచి, నిన్ను శిక్షించుగాక!” అని అన్నాడు. సంవత్సరాంతంలో అరాము (సిరియా) సైన్యం యోవాషు మీదికి వచ్చింది. వారు యూదా, యెరూషలేములపై దండెత్తి ప్రజానాయకులందరినీ చంపివేశారు. వారు విలువైన వస్తువులన్నీ దోచుకుని వాటిని దమస్కు (డెమాస్కస్) రాజుకు పంపించారు. అరాము సైన్యం ఒక చిన్న దండుగా వచ్చినప్పటికీ, యూదాకు చెందిన ఒక మహా సైన్యాన్ని ఓడించగలిగేలా యెహోవా వారికి తోడ్పడ్డాడు. వారి పూర్వీకులు ఆరాధించిన దైవాన్ని యూదా ప్రజలు వదిలి పెట్టిన కారణంగా యెహోవా ఈ పని చేశాడు. అందువల్లనే యోవాషు శిక్షింపబడ్డాడు. అరామీయులు (సిరియనులు) యోవాషును వదిలి వెళ్లేటప్పటికి అతడు తీవ్రంగా గాయపడ్డాడు. యోవాషు స్వంత సేవకులే అతనిపై కుట్రపన్నారు. యాజకుడైన యెహోయాదా కుమారుడు జెకర్యాను యెవాషు చంపిన కారణంగా వారు అలా ప్రవర్తించారు. యోవాషును అతని పక్క మీదనే సేవకులు హత్యచేశారు. చనిపోయిన యోవాషును ప్రజలు దావీదు నగరంలో సమాధి చేశారు. కాని రాజులను వుంచే చోట మాత్రం అతనిని వారు సమాధి చేయలేదు. జాబాదు మరియు యెహోజాబాదు అనేవారు. యోవాషు మీద కుట్ర పన్నిన సేవకులు. జాబాదు తల్లి పేరు షిమాతు అమ్మోనీయురాలు. యెహోజాబాదు తల్లిపేరు షిమ్రీతు. షిమ్రీతు మోయాబు స్త్రీ. యోవాషు కుమారుల గురించిన వృత్తాంతాలు, అతనిని గురించిన గొప్ప ప్రవచనాలు అతడు ఆలయాన్ని పునరుద్ధరించిన విధము మొదలైన విషయాలన్నీ రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయ బడ్డాయి. అతని తరువాత అమజ్యా కొత్త రాజయ్యాడు. అమజ్యా యోవాషు కుమారుడు.

2 దినవృత్తాంతములు 24:1-27 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యోవాషు ఏలనారంభించినప్పుడు ఏడు సంవత్స. రముల యీడుగలవాడై యెరూషలేములో నలువది ఏండ్లు ఏలెను; అతని తల్లి బెయేర్షెబా కాపురస్థురాలైన జిబ్యా. యాజకుడైన యెహోయాదా బ్రదికిన దినములన్నియు యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. యెహోయాదా అతనికి యిద్దరు భార్యలను పెండ్లి చేసెను; అతడు కుమారులను కుమార్తెలను కనెను. అంతట యెహోవా మందిరమును బాగుచేయవలెనని యోవాషునకు తాత్పర్యము పుట్టెను గనుక అతడు యాజకులను లేవీయులను సమకూర్చి–మీరు యూదా పట్టణములకు పోయి మీ దేవుని మందిరము బాగుచేయుటకై ఇశ్రాయేలీయులందరియొద్దనుండి ధనమును ఏటేట సమకూర్చుచు, ఈ కార్యమును మీరు త్వరపెట్టవలెనని వారికాజ్ఞ ఇచ్చెను. వారు దానిని త్వరగా చేయకపోయి నందున రాజు ప్రధానయాజకుడగు యెహోయాదాను పిలిచి–ఆ దుర్మార్గురాలైన అతల్యా కుమారులు దేవుని మందిరమును పాడుచేసి, యెహోవామందిర సంబంధమైన ప్రతిష్ఠోపకరణముల నన్నిటిని బయలుదేవతపూజకు ఉప యోగించిరి. సాక్ష్యపు గుడారమును బాగుచేయుటకై యూదాలోనుండియు యెరూషలేములోనుండియు ఇశ్రాయేలీయుల సమాజముచేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నీ వెందుకు చెప్పి తెప్పించలేదని యడిగెను. కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పునవారు ఒక పెట్టెను చేయించి యెహోవామందిరద్వారము బయట ఉంచిరి. మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలీయులకు నిర్ణ యించిన కానుకను యెహోవాయొద్దకు జనులు తేవలెనని యూదాలోను యెరూషలేములోను వారు చాటించిరి. కాగా అధిపతులందరును జనులందరును సంతోషముగా కానుకలను తీసికొని వచ్చి చాలినంతమట్టుకు పెట్టెలో వేసిరి. లేవీయులు ఆ పెట్టెను రాజు విమర్శించు స్థలమునకు తెచ్చుచు వచ్చిరి; అందులో ద్రవ్యము విస్తారముగా నున్నట్టు కనబడినప్పుడెల్ల, రాజుయొక్క ప్రధానమంత్రియు ప్రధానయాజకుడు నియమించిన పై విచారణకర్తయు వచ్చి, పెట్టెలోనున్న ద్రవ్యమును తీసి యథాస్థానమందు దానిని ఉంచుచు వచ్చిరి; వారీచొప్పున పలుమారు చేయుటచేత విస్తారమైన ద్రవ్యము సమకూర్చబడెను. అప్పుడు రాజును యెహోయాదాయును యెహోవా మందిరపు పనిచేయువారికి దానినిచ్చి, యెహోవా మందిరమును బాగుచేయుటకై కాసెవారిని వడ్లవారిని, యెహోవా మందిరమును బలపరచుటకు ఇనుపపని యిత్తడిపని చేయువారిని కూలికి కుదిర్చిరి. ఈలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దాని బలపరచిరి. అది సిద్ధమైన తరువాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకును యెహోయాదా యొద్దకును తీసికొనిరాగా వారు దాని చేత యెహోవా మందిరపు సేవయందు ఉపయోగపడునట్లును, దహనబలులనర్పించుటయందు ఉపయోగపడునట్లును, ఉపకరణములను గరిటెలను వెండి బంగారముల ఉపకరణములను చేయించిరి. యెహోయాదాయున్న యన్నిదినములు యెహోవా మందిరములో దహనబలులు నిత్యమును అర్పింపబడెను. యెహోయాదా దినములు గడచిన వృద్ధుడై చని పోయెను; అతడు చనిపోయినప్పుడు నూట ముప్పది ఏండ్ల వాడు. అతడు ఇశ్రాయేలీయులలో దేవునిదృష్టికిని తన యింటివారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజులదగ్గర అతని పాతిపెట్టిరి. యెహోయాదా చనిపోయిన తరువాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. జనులు తమపితరుల దేవుడైన యెహోవా మందిరమును విడచి, దేవతాస్తంభములకును విగ్రహములకును పూజచేసిరి; వారు చేసిన యీ యప రాధము నిమిత్తము యూదావారిమీదికిని యెరూషలేము కాపురస్థులమీదికిని కోపము వచ్చెను. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవావారియొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారిమీద సాక్ష్యము పలికిరిగాని వారు చెవియొగ్గక యుండిరి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జెకర్యామీదికి రాగా అతడు జనులయెదుట నిలువబడి–మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు; మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించియున్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. అందుకు వారతనిమీద కుట్రచేసి, రాజు మాటనుబట్టి యెహోవా మందిరపు ఆవరణములోపల రాళ్లు రువ్వి అతని చావగొట్టిరి. ఈ ప్రకారము రాజైన యోవాషు జెకర్యా తండ్రియైన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచినవాడై అతని కుమారుని చంపించెను; అతడు చనిపోవునప్పుడు–యెహోవా దీని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక యనెను. ఆ సంవత్సరాంతమందు సిరియా సైన్యము యోవాషు మీదికి వచ్చెను; వారు యూదాదేశముమీదికిని యెరూషలేముమీదికిని వచ్చి, శేషములేకుండ జనుల అధిపతుల నందరిని హతముచేసి, తాము పట్టుకొనిన కొల్లసొమ్మంతయు దమస్కు రాజునొద్దకు పంపిరి. సిరియనులు చిన్న దండుతో వచ్చినను యూదావారు తమపితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవావారి చేతికి అతివిస్తారమైన ఆ సైన్యమును అప్పగింపగా యోవాషుకు శిక్ష కలిగెను. వారు యోవాషును విడచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగియైయుండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్యదోషము నిమిత్తము అతని సేవకులు అతనిమీద కుట్రచేసి, అతడు పడకమీద ఉండగా అతని చంపిరి. అతడు చనిపోయిన తరువాత జనులు దావీదు పట్టణమందు అతని పాతిపెట్టిరిగాని రాజుల సమాధులలో అతని పాతిపెట్టలేదు. అతనిమీద కుట్రచేసినవారు అమ్మోనీయురాలైన షిమాతు కుమారుడగు జాబాదు, మోయాబురాలైన షిమ్రీతు కుమారుడగు యెహోజాబాదు అనువారు. అతని కుమారులనుగూర్చియు, అతనిమీద చెప్పబడిన అనేకమైన దేవోక్తులనుగూర్చియు, అతడు దేవుని మందిరమును బాగుచేయుటనుగూర్చియు రాజుల సటీక గ్రంథములో వ్రాయబడి యున్నది. అతనికి బదులుగా అతని కుమారుడైన అమజ్యా రాజాయెను.