1 తిమోతికి 6:6-12

1 తిమోతికి 6:6-12 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అయితే సంతృప్తితో దైవభక్తి కలిగి ఉండడమే గొప్ప లాభదాయకము. మనం ఈ లోకంలోనికి ఏమి తీసుకురాలేదు, లోకం నుండి ఏమి తీసుకెళ్లలేము. కాబట్టి మనం ఆహారాన్ని వస్త్రాలను కలిగి ఉంటే, వాటితో తృప్తిచెందాలి. అయితే ధనవంతులుగా అవ్వాలని కోరుకునేవారు శోధనలో పడి, మానవులను పాడుచేసి నాశనం చేసే మూర్ఖమైన ప్రమాదకరమైన కోరికల వలలో చిక్కుకుంటారు. డబ్బుపై ఉండే ప్రేమ ప్రతి దుష్టత్వానికి వేరు. కొందరు డబ్బును ఎక్కువగా ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి, తమను తామే అనేక దుఃఖాలకు గురిచేసుకున్నారు. అయితే దైవజనుడవైన నీవు, వీటి నుండి పారిపోయి నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, సహనం, మంచితనం అనే వాటిని వెంబడించు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడు. అనేకమంది సాక్షిసమూహం ఎదుట నీవు చేసిన మంచి ఒప్పుకోలును బట్టి నీవు పిలువబడిన నిత్యజీవాన్ని చేపట్టు.

1 తిమోతికి 6:6-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అయితే సంతృప్తితో కూడిన దైవభక్తి ఎంతో లాభకరం. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకు పోలేము. కాబట్టి అవసరమైన అన్నవస్త్రాలు కలిగి వాటితో తృప్తిగా ఉందాం. ధనవంతులు కావాలని ఆశించేవారు శోధనలో, ఉచ్చులో, బుద్ధిహీనమైన, హానికరమైన అనేక దురాశల్లో పడిపోతారు. అలాంటివి మనుషులను సంపూర్ణ పతనానికి నాశనానికీ గురిచేస్తాయి. ఎందుకంటే ధనాశ అన్ని కీడులకూ మూలం. కొందరు డబ్బునాశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమపైకి తామే నానాబాధలు కుని తెచ్చుకున్నారు. దేవుని మనిషీ, నువ్వు మాత్రం వీటి నుండి పారిపో. నీతినీ, భక్తినీ, విశ్వాసాన్నీ, ప్రేమనూ, ఓర్పునూ, సాత్వీకాన్నీ సంపాదించుకోడానికి ప్రయాసపడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి, దేవుడు దేనిని పొందడానికి నిన్ను పిలిచాడో ఆ నిత్యజీవాన్ని చేపట్టు. దాని విషయంలో నువ్వు అనేకమంది ముందు మంచి సాక్ష్యం ఇచ్చావు.

1 తిమోతికి 6:6-12 పవిత్ర బైబిల్ (TERV)

కాని సంతృప్తితో ఉండి, భక్తిని అవలంభిస్తే అదే ఒక గొప్ప ధనము. ఈ లోకంలోకి మనమేమీ తీసుకురాలేదు. ఈ లోకంనుండి ఏమీ తీసుకుపోలేము. మనకు తిండి, బట్ట ఉంటే చాలు. దానితో తృప్తి పొందుదాము. కాని ధనవంతులు కావాలనుకొనేవారు, ఆశలకులోనై మూర్ఖత్వంతో హానికరమైన ఆశల్లో చిక్కుకుపోతారు. అవి వాళ్ళను అధోగతి పట్టించి పూర్తిగా నాశనం చేస్తాయి. ధనాశ అన్ని రకాల దుష్టత్వానికి మూలకారణం. కొందరు, ధనాన్ని ప్రేమించి, క్రీస్తు పట్ల ఉన్న విశ్వాసానికి దూరమైపోయారు. తద్వారా దుఃఖాల్లో చిక్కుకుపోయారు. కాని నీవు విశ్వాసివి. కనుక వీటికి దూరంగా ఉండు. నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, సహనాన్ని, వినయాన్ని అలవరచుకో. నీ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి బాగా పోరాటం సాగించు. అనంత జీవితాన్ని సంపాదించు. దీని కోసమే దేవుడు నిన్ను పిలిచాడు. నీవు అనేకుల సమక్షంలో ఆ గొప్ప సత్యాన్ని అంగీకరించావు.

1 తిమోతికి 6:6-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది. మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము. కాగా అన్నవస్త్రములుగలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి, నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపా దించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాససంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులయెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి.