1 తిమోతికి 6:11-16

1 తిమోతికి 6:11-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అయితే దైవజనుడవైన నీవు, వీటి నుండి పారిపోయి నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, సహనం, మంచితనం అనే వాటిని వెంబడించు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడు. అనేకమంది సాక్షిసమూహం ఎదుట నీవు చేసిన మంచి ఒప్పుకోలును బట్టి నీవు పిలువబడిన నిత్యజీవాన్ని చేపట్టు. అన్నిటికి జీవాన్ని ఇచ్చే దేవుని ఎదుట, పొంతి పిలాతు ఎదుట మంచి సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ముందు నేను నీకు నిర్ధేశించాను. నీవు మన ప్రభువైన యేసు క్రీస్తు తిరిగి ప్రత్యక్షమయ్యే వరకు నిందగాని డాగుగాని లేకుండా ఈ ఆజ్ఞలకు లోబడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఏకైక అధిపతిగా ఉన్న భాగ్యవంతుడైన దేవున్ని తగిన సమయంలో దేవుడు ప్రత్యక్షపరుస్తారు. ఆయన ఒక్కడే మరణం లేనివాడు, ఆయన సమీపించలేనంత వెలుగులో నివసిస్తాడు, ఆయనను ఎవరూ ఎన్నడు చూడలేదు, ఎన్నడు చూడలేరు. అలాంటి దేవునికే ఘనత ప్రభావాలు నిరంతరం కలుగును గాక ఆమేన్.

1 తిమోతికి 6:11-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

దేవుని మనిషీ, నువ్వు మాత్రం వీటి నుండి పారిపో. నీతినీ, భక్తినీ, విశ్వాసాన్నీ, ప్రేమనూ, ఓర్పునూ, సాత్వీకాన్నీ సంపాదించుకోడానికి ప్రయాసపడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి, దేవుడు దేనిని పొందడానికి నిన్ను పిలిచాడో ఆ నిత్యజీవాన్ని చేపట్టు. దాని విషయంలో నువ్వు అనేకమంది ముందు మంచి సాక్ష్యం ఇచ్చావు. అంతటికీ జీవాధారమైన దేవుని ఎదుటా పొంతి పిలాతు ముందు సత్యాన్ని గూర్చి ధైర్యంగా సాక్షమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటా నువ్వు నిష్కళంకంగా, నిందారహితుడిగా ఈ ఆజ్ఞను గైకొనాలని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు దీన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడలో ప్రత్యక్షమయ్యే వరకూ చేస్తుండాలి. భాగ్యవంతుడు, ఎకైక శక్తిశాలి అయిన దేవుడు తగిన కాలంలో ఆ ప్రత్యక్షతను కనుపరుస్తాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన మాత్రమే అమరత్వం కలిగి సమీపింప శక్యం గాని తేజస్సులో నివసిస్తున్నాడు. మనుషుల్లో ఎవరూ ఆయనను చూడలేదు, ఎవరూ చూడలేరు. ఆయనకు ఘనత, శాశ్వతమైన ప్రభావం కలుగు గాక. ఆమేన్‌.

1 తిమోతికి 6:11-16 పవిత్ర బైబిల్ (TERV)

కాని నీవు విశ్వాసివి. కనుక వీటికి దూరంగా ఉండు. నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, సహనాన్ని, వినయాన్ని అలవరచుకో. నీ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి బాగా పోరాటం సాగించు. అనంత జీవితాన్ని సంపాదించు. దీని కోసమే దేవుడు నిన్ను పిలిచాడు. నీవు అనేకుల సమక్షంలో ఆ గొప్ప సత్యాన్ని అంగీకరించావు. అన్నిటికీ ప్రాణం పోసే దేవుని పేరిట, పొంతి పిలాతు సమక్షంలో అదే గొప్ప సత్యాన్ని అంగీకరించిన యేసు క్రీస్తు పేరిట నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చేదాక ఈ ఆజ్ఞను పాటించు. దాన్ని పాటించటంలో ఏ మచ్చా రానీయకుండా, ఏ అపకీర్తీ రానివ్వకుండా చూడు. “మన పాలకుడు,” రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునైయున్నాడు. సర్వాధిపతి అయిన దేవుడు తగిన సమయం రాగానే యేసు క్రీస్తును పంపుతాడు. మనం సమీపించలేని వెలుగులో ఉండే అమరుడైన దేవుడాయన. దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు, మరి ఎవ్వరూ చూడలేరు. ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆయన శక్తి తరగకుండా ఉండుగాక! అమేన్.

1 తిమోతికి 6:11-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి, నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపా దించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాససంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులయెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవా ధారకుడైన దేవుని యెదుటను, పొంతిపిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తుయేసు ఎదుటను, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగువరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు. సమీ పింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్.

1 తిమోతికి 6:11-16

1 తిమోతికి 6:11-16 TELUBSI1 తిమోతికి 6:11-16 TELUBSI1 తిమోతికి 6:11-16 TELUBSI