1 థెస్సలొనీకయులకు 3:6-13
1 థెస్సలొనీకయులకు 3:6-13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అయితే ఇప్పుడే తిమోతి మీ నుండి మా దగ్గరకు వచ్చి, మీ విశ్వాసం గురించి, మీరు చూపిన ప్రేమ గురించి మంచి వార్తను మాకు అందించాడు. మీరు మమ్మల్ని ఎల్లప్పుడూ మాకు సంబంధించిన మంచి జ్ఞాపకాలతో జ్ఞాపకం చేసుకుంటూ, మేము మిమ్మల్ని చూడాలని ఎలా ఆరాటపడుతున్నామో అలాగే మీరు కూడా మమ్మల్ని చూడాలని ఆరాటపడుతున్నారని అతడు మాతో చెప్పాడు. కాబట్టి సహోదరీ సహోదరులారా, మేము హింసించబడినప్పుడు బాధను కష్టాలను అనుభవిస్తున్న సమయంలో మీ విశ్వాసాన్ని గురించి విన్నప్పుడు మేము ఆదరణ పొందుకున్నాము. ఎందుకంటే, మీరు దేవునిలో స్థిరంగా నిలబడి ఉండడం మాకు ప్రాణం వచ్చినట్లే. మీ వలన దేవుని సన్నిధిలో మేము పొందిన సంతోషమంతటిని బట్టి దేవునికి మీ కోసం కృతజ్ఞతాస్తుతులు ఎంతని చెల్లించాలి? మిమ్మల్ని మరలా చూడాలని మీ విశ్వాసంలో ఉన్న లోపాన్ని సరిచేయాలని రాత్రింబగళ్ళు మీ కోసం ఎంతో పట్టుదలతో ప్రార్థిస్తున్నాము. మన తండ్రియైన దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తు మేము త్వరగా మీ దగ్గరకు రావడానికి మార్గం సరాళం చేయును గాక! మేము మీ పట్ల ప్రేమ చూపినట్లే, విశ్వాసులైన మీరు ఒకరిపట్ల ఒకరు మీ ప్రేమను వృద్ధిపొందించుకొంటూ ఇతరులందరికి ఆ ప్రేమను అందించేలా ప్రభువు చేయును గాక. మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో కలిసివచ్చినపుడు మన తండ్రియైన దేవుని ముందు మీరు నిందారహితులుగా పవిత్రులుగా ఉండడానికి ఆయన మీ హృదయాలను బలపరచును గాక.
1 థెస్సలొనీకయులకు 3:6-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇప్పుడు అతడు మీ దగ్గర నుండి తిరిగి వచ్చి క్రీస్తు పట్ల మీ విశ్వాస ప్రేమలను గురించీ, మేము మిమ్మల్ని చూడాలని ఆశ పడుతున్నట్టే మీరు కూడా మమ్మల్ని చూడాలని ఆశ పడుతున్నారనీ, మమ్మల్ని ఎప్పుడూ ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారనీ మీ గురించి సంతోషకరమైన వార్త అతడు తీసుకుని వచ్చాడు. అందుచేత సోదరులారా, మీ విశ్వాసం చూసి మా ఇబ్బందులన్నిటిలో హింసలన్నిటిలో ఆదరణ పొందాం. ఎందుకంటే మీరు ప్రభువులో నిలకడగా ఉంటే మా జీవితం సార్థకం అయినట్టే. మీ గురించీ, దేవుని ఎదుట మీ విషయంలో మాకు కలిగే ఆనందం గురించి దేవునికి మేము ఏమని కృతజ్ఞతలు చెల్లించగలం? మీ ముఖాలు చూడాలనీ, మీ విశ్వాసంలో కొరతగా ఉన్నవాటిని సరిచేయాలనీ రాత్రింబగళ్ళు తీవ్రంగా ప్రార్థనలో వేడుకుంటున్నాం మన తండ్రి అయిన దేవుడూ, మన ప్రభు యేసూ మమ్మల్ని మీ దగ్గరికి ఎలాంటి ఆటంకం లేకుండా తీసుకువస్తాడు గాక! మీ పట్ల మా ప్రేమ ఎలా అభివృద్ధి చెందుతూ వర్ధిల్లుతూ ఉన్నదో అలాగే మీరు కూడా ఒకరిపట్ల ఒకరు, ఇంకా, అందరి పట్ల కూడా ప్రేమలో అభివృద్ధి చెంది వర్ధిల్లేలా ప్రభువు అనుగ్రహించు గాక. మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో కలిసి వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయాలు పరిశుద్ధత విషయంలో నిందారహితంగా ఉండేలా ఆయన స్థిరపరచు గాక!
1 థెస్సలొనీకయులకు 3:6-13 పవిత్ర బైబిల్ (TERV)
కాని తిమోతి మీ దగ్గర నుండి యిప్పుడే వచ్చాడు. మీ విశ్వాసాన్ని గురించి, మీ ప్రేమను గురించి మంచి వార్త తీసుకొని వచ్చాడు. మమ్మల్ని గురించి అన్ని వేళలా మీరు మంచిగా భావిస్తున్నారని తెలిసింది. మేము మిమ్మల్ని చూడటానికి ఎదురు చూస్తున్నట్లే, మీరు కూడా మమ్మల్ని చూడటానికి ఆశిస్తున్నారని అతడు మాకు చెప్పాడు. సోదరులారా! మేము దుఃఖంతో ఉన్నప్పుడు, హింసలను అనుభవిస్తున్నప్పుడు మీ విశ్వాసం చూసి ఆనందించాము. మీకు ప్రభువు పట్ల ఉన్న విశ్వాసాన్ని మీరు విడువకుండా ఉంటే మా జీవితం సార్థకమౌతుంది. మేము దేవుని సమక్షంలో ఉన్నప్పుడు మీ విషయంలో చాలా కృతజ్ఞులము. మేము ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా అవి తక్కువే! మిమ్మల్ని చూసే అవకాశం కలగాలని, మీ విశ్వాసం దృఢపడాలని, దానికి కావలసినవి దేవుడు ఇవ్వాలని, రాత్రింబగళ్ళు మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాము. మన తండ్రియైన దేవుడు, మన ప్రభువైన యేసు మేము మీ దగ్గరకు రావటానికి మాకు దారి చూపుగాక! మీపై ఉన్న మా ప్రేమ అభివృద్ధి చెందుతున్నట్లే, మీలో పరస్పరం ప్రేమ అభివృద్ధి చెందేటట్లు, యితరుల పట్ల కూడా మీ ప్రేమ అభివృద్ధి చెందేటట్లు ప్రభువు అనుగ్రహించుగాక. మన యేసు ప్రభువు భక్తులతో వచ్చినప్పుడు మన తండ్రియైన దేవుని ముందు మీరు ఏ అపకీర్తి లేకుండా పవిత్రంగా ఉండేటట్లు దేవుడు మీకు శక్తి ననుగ్రహించు గాక!
1 థెస్సలొనీకయులకు 3:6-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
తిమోతియు ఇప్పుడు మీయొద్దనుండి మాయొద్దకు వచ్చి, మేము మిమ్మును ఏలాగు చూడ నపేక్షించుచున్నామో ఆలాగే మీరును మమ్మును చూడ నపేక్షించుచు, ఎల్లప్పుడును మమ్మును ప్రేమతో జ్ఞాపకము చేసికొనుచున్నారని, మీ విశ్వాసమునుగూర్చియు మీ ప్రేమనుగూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను. అందుచేత సహోదరులారా, మా యిబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొందితిమి. ఏలయనగా, మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రదికినట్టే. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్లు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా, మన దేవునియెదుట మిమ్మునుబట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఏలాగు చెల్లింపగలము? మన తండ్రియైన దేవుడును మన ప్రభువైన యేసును మమ్మును నిరాటంకముగా మీయొద్దకు తీసికొని వచ్చును గాక. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, మన తండ్రియైన దేవుని యెదుట మీహృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై, మేము మీయెడల ఏలాగు ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లుచున్నామో, ఆలాగే మీరును ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను, ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక.