1 థెస్సలొనీకయులకు 2:4-6
1 థెస్సలొనీకయులకు 2:4-6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దానికి బదులు, దేవుడు మాకు ఈ సువార్తను అప్పగించడానికి ఆయనచే యోగ్యులుగా ఎంచబడిన వారిలా మేము బోధిస్తున్నాము. కాబట్టి మేము మనుష్యులను మెప్పించడానికి కాకుండా మన హృదయాలను పరిశీలించే దేవుని మెప్పించడానికి ప్రయత్నిస్తున్నాము. మేము ఎన్నడు ముఖస్తుతి చేయలేదు, మేము అత్యాశను దాచిపెట్టే ముసుగును వేసుకోలేదని మీకు తెలుసు; దాని గురించి దేవుడే మాకు సాక్షి. మేము క్రీస్తు అపొస్తలులుగా మా అధికారాన్ని ప్రదర్శించే అవకాశం ఉన్నా ప్రజల నుండి గాని మీ నుండి గాని ఇతరుల నుండి గాని వచ్చే ఘనతను మేము ఆశించలేదు.
1 థెస్సలొనీకయులకు 2:4-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుడు మమ్మల్ని యోగ్యులుగా ఎంచి సువార్తను మాకు అప్పగించాడు. కాబట్టి మేము మనుషులను సంతోషపరచడానికి కాకుండా హృదయాలను పరిశీలించే దేవుణ్ణి సంతోషపరచడానికే మాట్లాడుతున్నాము. మేము ముఖస్తుతి మాటలు ఏనాడూ పలకలేదని మీకు తెలుసు. అలాగే అత్యాశను కప్పిపెట్టే వేషాన్ని ఎప్పుడూ వేసుకోలేదు. దీనికి దేవుడే సాక్షి. ఇంకా మేము యేసుక్రీస్తు అపొస్తలులం కాబట్టి ఆధిక్యతలు ప్రదర్శించడానికి అవకాశం ఉన్నా మీ వల్ల కానీ, ఇతరుల వల్ల కానీ, మనుషుల వల్ల కలిగే ఏ ఘనతనూ మేము ఆశించలేదు.
1 థెస్సలొనీకయులకు 2:4-6 పవిత్ర బైబిల్ (TERV)
దేవుడు మా యోగ్యతను గమనించి మాకు సువార్తను అప్పగించాడు. మా హృదయాలను పరీక్షించే దేవుణ్ణి సంతోషపెట్టాలని చూస్తున్నాము కాని, మానవుల్ని కాదు. మేము పొగడ్తలు ఉపయోగించలేదని మీకు తెలుసు. స్వార్థానికోసం మేము దొంగవేషాలు వేయలేదు. దీనికి దేవుడే సాక్షి. మీ పొగడ్తలు కాని, లేక ఇతర్ల పొగడ్తలు కాని మాకు అవసరం లేదు.
1 థెస్సలొనీకయులకు 2:4-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవునివలన ఎంచబడిన వారమై, మనుష్యులను సంతోషపెట్టు వారముకాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మీరెరిగియున్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింపలేదు; ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తుయొక్క అపొస్తలులమై యున్నందున అధికారముచేయుటకు సమర్థులమై యున్నను, మీవలననే గాని యితరుల వలననే గాని, మనుష్యులవలన కలుగు ఘనతను మేము కోరలేదు.