1 సమూయేలు 8:4-9
1 సమూయేలు 8:4-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇశ్రాయేలీయుల పెద్దలందరు కూడి రామాలో సమూయేలునొద్దకు వచ్చి –చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తనవంటి ప్రవర్తన గలవారు కారు గనుక, సకలజనుల మర్యాదచొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. –మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థనచేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా–జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము; వారు నిన్ను విసర్జింపలేదుగాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించియున్నారు. వారు నన్ను విసర్జించి, యితర దేవతలను పూజించి, నేను ఐగుప్తులోనుండి వారిని రప్పించిన నాటి నుండి నేటివరకు తాము చేయుచువచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీయెడలను జరిగించుచున్నారు; వారు చెప్పిన మాటలను అంగీకరించుము. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయుము.
1 సమూయేలు 8:4-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కాబట్టి ఇశ్రాయేలీయుల పెద్దలందరు ఒక్కటిగా కలిసి రామాలో ఉన్న సమూయేలు దగ్గరకు వచ్చారు. వారతనితో, “నీవు ముసలివాడవు, నీ కుమారులు నీ మార్గాన్ని అనుసరించుట లేదు; కాబట్టి ఇతర దేశాలకు రాజు ఉన్నట్లే మాకు న్యాయం చేయడానికి ఒక రాజును నియమించు” అని అడిగారు. అయితే వారు, “మమ్మల్ని నడిపించడానికి మాకు ఒక రాజు కావాలి” అని అడగడం సమూయేలుకు నచ్చలేదు; కాబట్టి అతడు యెహోవాకు ప్రార్థన చేశాడు. అందుకు యెహోవా సమూయేలుతో, “ప్రజలు నీతో చెప్పేదంతా విను; వారు తిరస్కరించింది నిన్ను కాదు, వారికి రాజుగా ఉండకుండా నన్ను తిరస్కరించారు. వారు నన్ను విడిచిపెట్టి ఇతర దేవతలను సేవిస్తూ, ఈజిప్టులో నుండి నేను వారిని బయటకు రప్పించిన రోజు నుండి ఇప్పటివరకు అలాగే చేశారు. నీ పట్ల కూడా అలాగే చేస్తున్నారు. వారు చెప్పేది విను; అయితే వారిని పరిపాలించబోయే రాజు హక్కులు ఎలాంటివో వారికి స్పష్టంగా వివరించి హెచ్చరించు” అని చెప్పారు.
1 సమూయేలు 8:4-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇశ్రాయేలు పెద్దలంతా కలసి రమాలో ఉన్న సమూయేలు దగ్గరకి వచ్చి, “అయ్యా, విను. నువ్వు ముసలివాడివి. నీ కొడుకులు నీలాగా మంచి ప్రవర్తన గలవారు కారు. కాబట్టి ప్రజలందరి కోరికను మన్నించి మాకు ఒక రాజును నియమించు. అతడు మాకు న్యాయం తీరుస్తాడు” అని అతనితో అన్నారు. “మాకు న్యాయం చేయడానికి ఒక రాజును నియమించు” అని వారు అడిగిన మాట సమూయేలుకు రుచించలేదు. అప్పుడు సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాడు. యెహోవా సమూయేలుకు ఇలా బదులిచ్చాడు. “ప్రజలు నిన్ను కోరినట్టు జరిగించు. వారు తిరస్కరించింది నిన్ను కాదు. తమను పాలించకుండా నన్నే తిరస్కరించారు. వారు నన్ను తిరస్కరించి, ఇతర దేవుళ్ళను పూజించి, నేను ఐగుప్తునుండి వారిని రప్పించినప్పటి నుండి ఇప్పటిదాకా వారు చేస్తూ వస్తున్న పనుల ప్రకారమే వారు నీ పట్ల కూడా జరిగిస్తున్నారు. వారు కోరినట్టు జరిగించు. అయితే వారికి రాబోయే కొత్త రాజు ఎలా పరిపాలిస్తాడో దానికి నువ్వే సాక్ష్యంగా ఉండి వారికి స్పష్టంగా తెలియజెయ్యి.”
1 సమూయేలు 8:4-9 పవిత్ర బైబిల్ (TERV)
కావున ఇశ్రాయేలు పెద్దలంతా (నాయకులు) సమూయేలును కలుసుకొనుటకు రామా వెళ్లారు. వారు సమూయేలుతో, “నీవు వృద్ధుడవు. పైగా నీ కుమారులు నీ మాదిరిని వెంబడించుట లేదు. కాబట్టి అన్ని రాజ్యాల మాదిరిగా మమ్ములను పాలించటానికి కూడ ఒక రాజును ఇయ్యి” అని అన్నారు. ఇది తప్పు అని సమూయేలు తలచాడు. కనుక సమూయేలు యెహోవాకు ప్రార్థించాడు. యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: “ప్రజలు ఏమి చెపితే దానిని నీవు పాటించు. వారి రాజుగా ఉండేందుకు వారు నన్ను తిరస్కరించారు గాని నిన్ను కాదు. వారు ఎప్పటిలాగే ప్రవర్తిస్తున్నారు. నేను వారిని ఈజిప్టునుంచి రక్షించినప్పుడు, వారు నన్ను వదిలి ఇతర దేవుళ్లను పూజించారు. నీ పట్ల కూడా వారిప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నారు. అయినా నీవు ప్రజలు చెప్పిన దానిని పాటించు. కాని వారికి ఒక హెచ్చరిక చెయ్యి. రాజు వారికి ఏమి చేస్తాడో ఒకసారి వివరించి చెప్పాలి.”