1 సమూయేలు 7:2-4
1 సమూయేలు 7:2-4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా మందసం కిర్యత్-యారీములో ఇరవై సంవత్సరాలు ఉంది. ఇశ్రాయేలు ప్రజలంతా మళ్ళీ యెహోవా వైపు తిరిగారు. కాబట్టి సమూయేలు ఇశ్రాయేలీయులతో, “మీ పూర్ణహృదయంతో యెహోవా దగ్గరకు మీరు తిరిగి వస్తే, ఇతర దేవుళ్ళను, అష్తారోతు విగ్రహాలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదలతో యెహోవా వైపు మీ హృదయాలను త్రిప్పి ఆయనను మాత్రమే సేవించండి. అప్పుడు ఫిలిష్తీయుల చేతిలో నుండి ఆయన మిమ్మల్ని విడిపిస్తారు” అన్నాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు బయలు ప్రతిమలను, అష్తారోతు విగ్రహాలను తీసివేసి కేవలం యెహోవాను మాత్రమే సేవించారు.
1 సమూయేలు 7:2-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మందసాన్ని కిర్యత్యారీములో ఉంచి ఇరవై ఏళ్లు నిండాయి. ఇశ్రాయేలీయులంతా యెహోవాను అనుసరించాలని కోరుతూ చింతిస్తున్నారు. సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చి ఇలా చెప్పాడు. “మీరు మనస్ఫూర్తిగా యెహోవా వైపుకు తిరిగి, ఇతర దేవుళ్ళను, అష్తారోతు దేవుళ్ళను మీ మధ్యనుండి తీసివేసి, పట్టుదల గలిగి యెహోవా వైపు మీ మనస్సులను మళ్ళించి ఆయనను ఆరాధించండి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలోనుండి మిమ్మల్ని విడిపిస్తాడు.” ఆ తరువాత ఇశ్రాయేలీయులు బయలు దేవుళ్ళను, అష్తారోతు దేవుళ్ళను విడిచిపెట్టి యెహోవాను మాత్రమే సేవించడం మొదలుపెట్టారు.
1 సమూయేలు 7:2-4 పవిత్ర బైబిల్ (TERV)
కిర్యత్యారీములో ఆ పెట్టె ఇరువది సుధీర్ఘ సంవత్సరాలుండెను. ఇశ్రాయేలు ప్రజలు మళ్లీ భక్తిశ్రద్ధలతో యెహోవా ఎదుట దుఃఖపడి ఆయనను వెదకటం మొదలు పెట్టారు. ఇశ్రాయేలీయులనుద్దేశించి సమూయేలు ఇలా అన్నాడు: “మీ హృదయ పూర్వకంగా మీరంతా యెహోవా దగ్గరకు తిరిగి వస్తున్నట్లయితే, మీరు మీ అన్య దేవుళ్లను విడిచిపెట్టాలి. మీ అష్తారోతు దేవతా విగ్రహాలను విడిచి పెట్టాలి. మిమ్ములను మీరు యెహోవాకు పూర్తిగా సమర్పించుకోండి. ఆయననే ఆరాధించండి. అప్పుడాయన మిమ్మల్ని ఫిలిష్తీయుల బారినుండి తప్పిస్తాడు.” అది విన్న ఇశ్రాయేలీయులు బయలు అష్తారోతు విగ్రహాలన్నిటినీ పారవేసారు. అప్పుడు ఇశ్రాయేలీయులంతా యెహోవాను మాత్రమే సేవించారు.
1 సమూయేలు 7:2-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మందసము కిర్యత్యారీములోనుండిన కాలము ఇరువై సంవత్సరములాయెను. ఇశ్రాయేలీయులందరు యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను–మీ పూర్ణహృదయముతో యెహోవాయొద్దకు మీరు మళ్లుకొనినయెడల, అన్యదేవతలను అష్తారోతు దేవతలను మీ మధ్యనుండి తీసి వేసి, పట్టుదలగలిగి యెహోవాతట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలోనుండి మిమ్మును విడిపించును. అంతట ఇశ్రాయేలీయులు బయలుదేవతలను అష్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి.