1 సమూయేలు 23:24-29

1 సమూయేలు 23:24-29 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

వారు బయలుదేరి సౌలు కంటే ముందు జీఫుకు తిరిగి వెళ్లారు. దావీదు అతని ప్రజలు యెషీమోనుకు దక్షిణాన ఉన్న అరాబాలో మాయోను ఎడారిలో ఉన్నారు. సౌలు అతని మనుష్యులు తనను వెదకడం మొదలుపెట్టారని దావీదుకు తెలిసినప్పుడు కొండ శిఖరం దిగి మాయోను ఎడారిలో నివసించాడు. సౌలు అది విని దావీదును తరుముతూ మాయోను ఎడారిలోనికి వెళ్లాడు. అయితే పర్వతానికి ఒకవైపు సౌలు, మరోవైపు దావీదు అతని ప్రజలు వెళ్తుండగా దావీదు సౌలు నుండి తప్పించుకోవాలని తొందరపడుతున్నాడు. సౌలు అతని ప్రజలు దావీదును అతని ప్రజలను పట్టుకోవాలని వారిని చుట్టుముడుతున్నారు. అప్పుడు ఒక దూత సౌలు దగ్గరకు వచ్చి, “త్వరగా రా, దేశం మీదకి ఫిలిష్తీయులు దండెత్తి వచ్చారు” అని చెప్పాడు. సౌలు దావీదును తరమడం మాని ఫిలిష్తీయులను ఎదుర్కోడానికి వెనుకకు తిరిగి వెళ్లాడు. కాబట్టి ఆ స్థలానికి సెలా హమ్మలెకోతు అని ఆ పేరు పెట్టారు. తర్వాత దావీదు అక్కడినుండి బయలుదేరి ఎన్-గేదీకి వచ్చి కొండ ప్రాంతంలో నివసించాడు.

1 సమూయేలు 23:24-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

వారు లేచి సౌలు కంటే ముందుగా జీఫుకు తిరిగి వెళ్లారు. దావీదు, అతని అనుచరులూ యెషీమోనుకు దక్షిణ వైపున ఉన్న మైదానంలోని మాయోను ఎడారి ప్రాంతంలో ఉన్నప్పుడు, సౌలు, అతని బలగమూ తనను వెదికేందుకు బయలుదేరారన్న మాట దావీదు విని, కొండ పైభాగంలోని మాయోను ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఆది విన్న సౌలు మాయోను ఎడారిలో దావీదును తరుమబోయాడు. కొండకు ఒకవైపు సౌలు, మరోవైపు దావీదు, అతని అనుచరులు వెళ్తున్నపుడు దావీదు సౌలు నుండి తప్పించుకుపోవాలని తొందరపడుతున్నాడు. సౌలు, అతని సైనికులు దావీదును, అతని అనుచరులను పట్టుకోవాలని వారిని చుట్టుముడుతున్నారు. ఇలా జరుగుతున్నప్పుడు గూఢచారి ఒకడు సౌలు దగ్గరికి వచ్చి “నువ్వు త్వరగా బయలుదేరు, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశంలో చొరబడ్డారు” అని చెబితే సౌలు దావీదును తరమడం మానుకుని ఫిలిష్తీయులను ఎదుర్కొనడానికి వెనక్కి తిరిగి వెళ్ళాడు. కాబట్టి ఆ స్థలానికి సెలహమ్మలెకోతు అని పేరు పెట్టబడింది. తరువాత దావీదు అక్కడనుండి వెళ్ళి ఏన్గెదీకి వచ్చి కొండ ప్రాంతలో నివాసం ఏర్పరచుకున్నాడు.

1 సమూయేలు 23:24-29 పవిత్ర బైబిల్ (TERV)

అప్పుడు జీపువాళ్లు జీపుకు తిరిగి వెళ్లిపోయారు. సౌలు తరువాత అక్కడికి వెళ్లాడు. దావీదు, అతని అనుచరులు మాయోను అరణ్యంలో ఉన్నారు. అది యెషీమోనుకు దక్షిణంగా ఉన్న ఎడారి ప్రాంతం. సౌలు, అతని సైనికులు దావీదును వెతుక్కుంటూ వెళ్లారు. కాని సౌలు అతనికొరకు వస్తున్నాడని ప్రజలు దావీదును హెచ్చరించారు. దావీదు మాయోను అరణ్యంలోని “కొండ” కు వెళ్లాడు. ఇది సౌలు తెలుసుకున్నాడు. సౌలు దావీదును వెతుక్కుంటూ మాయోను అరణ్యానికి వెళ్లాడు. పర్వతానికి ఒక ప్రక్కన సౌలు ఉన్నాడు. దావీదు, అతని మనుష్యులు అదే పర్వతానికి మరో వైపున ఉన్నారు. సౌలునుండి దూరంగా పోవటానికి దావీదు తొందర పడుతూ ఉన్నాడు. కానీ దావీదును సపరివారంగా పట్టుకోవాలని సౌలు, అతని సైనికులు ఆ పర్వతం చుట్టూ తిరుగుట ప్రారంభించారు. ఒక సందేశకుడు సౌలు వద్దకు వచ్చి, “ఫిలిష్తీయులు తమ రాజ్యం మీదికి దండెత్తి వస్తున్నారనీ” త్వరగా రమ్మనీ చెప్పాడు. అంతటితో సౌలు దావీదును వెంటాడటం మాని ఫిలిష్తీయులను ఎదుర్కోటానికి వెళ్లాడు. అందువల్ల ప్రజలు ఈ ప్రదేశానికి, “జారుడు బండ” అని పేరు పెట్టారు. దావీదు మోయోను ఎడారి వదలి ఏన్గెదీ దగ్గర ఉన్న కొండస్థలాలకు వెళ్లాడు.

1 సమూయేలు 23:24-29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అంతట వారు లేచి సౌలుకంటె ముందు జీఫునకు తిరిగి వెళ్లిరి. దావీదును అతని జనులును యెషీమోనుకు దక్షి ణపు వైపుననున్న మైదానములోని మాయోను అరణ్యములో ఉండగా సౌలును అతని జనులును తన్ను వెద కుటకై బయలుదేరిన మాట దావీదు విని, కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసము చేసెను. సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరుమ బోయెను. అయితే సౌలు పర్వతము ఈతట్టునను దావీదును అతని జనులును పర్వతము ఆతట్టునను పోవుచుండగా దావీదు సౌలుదగ్గరనుండి తప్పించుకొని పోవలెనని త్వరపడుచుండెను. సౌలును అతని జనులును దావీదును అతని జనులను పట్టుకొనవలెనని వారిని చుట్టుకొనుచుండిరి. ఇట్లుండగా దూత యొకడు సౌలునొద్దకు వచ్చి–నీవు త్వరగా రమ్ము, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశములో చొరబడియున్నారని చెప్పగా సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయెను. కాబట్టి సెలహమ్మలెకోతు అని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. తరువాత దావీదు అక్కడనుండి పోయి ఏన్గెదీకి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను.