1 సమూయేలు 22:6-19

1 సమూయేలు 22:6-19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఒక రోజు దావీదు అతని మనుష్యులు ఎక్కడ ఉన్నారో సౌలుకు తెలిసింది. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచుల వృక్షం క్రింద ఈటె పట్టుకుని కూర్చున్నాడు. అతని సేవకులు అతని చుట్టూ నిలబడి ఉన్నారు. సౌలు వారితో, “బెన్యామీనీయులారా వినండి, యెష్షయి కుమారుడు మీకు పొలాలు ద్రాక్షతోటలు ఇస్తాడా? మిమ్మల్ని వేలమంది మీద వందలమంది మీద అధిపతులుగా చేస్తాడా? అందుకని మీరు నా మీద కుట్ర చేస్తున్నారా? నా కుమారుడు యెష్షయి కుమారునితో నిబంధన చేసుకున్న సంగతి మీరెవరు నాకు చెప్పలేదు. ఈ రోజు జరుగుతున్నట్లుగా నా కోసం పొంచి ఉండేలా నా కుమారుడు నా సేవకుని ప్రేరేపించినా, నా గురించి మీలో ఎవరికి చింతలేదు” అన్నాడు. అప్పుడు సౌలు సేవకుల దగ్గర నిలబడి ఉన్న ఎదోమీయుడైన దోయేగు, “యెష్షయి కుమారుడు నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రావడం నేను చూశాను. అహీమెలెకు అతని తరపున యెహోవా దగ్గర విచారణ చేసి, ఆహారాన్ని ఫిలిష్తీయుడైన గొల్యాతు కత్తిని అతనికి ఇచ్చాడు” అని చెప్పాడు. అప్పుడు రాజు, యాజకుడును అహీటూబు కుమారుడునైన అహీమెలెకును నోబులో ఉన్న అతని తండ్రి ఇంటివారైన యాజకులందరిని పిలుచుకురమ్మని పంపించాడు. వారు రాజు దగ్గరకు వచ్చినప్పుడు, సౌలు, “అహీటూబు కుమారుడా, విను” అని అన్నాడు. అందుకతడు, “చిత్తం ప్రభువా” అని జవాబిచ్చాడు. సౌలు అతనితో, “నీవూ యెష్షయి కుమారుడు కలిసి ఎందుకు నా మీద కుట్ర చేశారు? నీవు అతనికి ఆహారాన్ని ఖడ్గాన్ని ఇచ్చి అతని తరపున దేవుని దగ్గర విచారణ చేశావు, అందుకు అతడు నా మీద తిరుగుబాటు చేస్తూ ఇలా ఈ రోజు నా కోసం పొంచి ఉన్నాడు” అని అన్నాడు. అందుకు అహీమెలెకు, “రాజా, దావీదువంటి నమ్మకమైనవాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతడు రాజుకు అల్లుడు, నీ అంగరక్షకుల నాయకుడు, నీ కుటుంబంలో ఎంతో గౌరవం ఉన్నవాడు. అతని తరపున నేను దేవుని దగ్గర విచారణ చేయడం ఈ రోజే ప్రారంభించానా? కాదు కదా! ఈ విషయం గురించి నీ సేవకుడనైన నాకు ఏమాత్రం తెలియదు కాబట్టి రాజు తన సేవకుని మీద గాని అతని తండ్రి ఇంటివారి మీద నేరం మోపకూడదు” అన్నాడు. అయితే రాజు, “అహీమెలెకూ, నీవు నీ తండ్రి ఇంటివారందరు తప్పక చస్తారు” అన్నాడు. తర్వాత, “యెహోవా యాజకులైన వీరు దావీదు పక్షం ఉన్నారు. అతడు పారిపోయిన విషయం తెలిసినా నాకు చెప్పలేదు కాబట్టి మీరు వెళ్లి వీరందరిని చంపండి” అని తన చుట్టూ నిలబడి ఉన్న సైనికులకు ఆజ్ఞాపించాడు. అయితే రాజు అధికారులు యెహోవా యాజకులను చంపడానికి ఒప్పుకోలేదు. కాబట్టి రాజు దోయేగుతో, “నీవు ఈ యాజకుల మీద పడి చంపు” అన్నాడు. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకుల మీద పడి నార ఏఫోదు ధరించి ఉన్న ఎనభై అయిదుగురిని ఆ రోజున చంపాడు. అతడు యాజకుల పట్టణమైన నోబులో ఉంటున్న వారందరిని అనగా మగవారిని ఆడవారిని పిల్లలను చంటి పిల్లలను పశువులను గాడిదలను గొర్రెలను కత్తితో చంపాడు.

1 సమూయేలు 22:6-19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

దావీదు, అతని అనుచరులు ఫలానా చోట ఉన్నారని సౌలుకు తెలిసింది. అప్పుడు సౌలు గిబియా దగ్గర రమాలో ఒక కర్పూర వృక్షం కింద చేతిలో ఈటె పట్టుకుని నిలబడి ఉన్నాడు. అతని సేవకులు అతని చుట్టూ నిలబడి ఉన్నారు. సౌలు తన చుట్టూ నిలబడి ఉన్న సేవకులతో ఇలా అన్నాడు “బెన్యామీనీయులారా, వినండి. యెష్షయి కొడుకు మీకు పొలాలు, ద్రాక్షతోటలు ఇస్తాడా? మిమ్మల్ని వందమంది, వెయ్యిమంది సైనికులపై అధిపతులుగా చేస్తాడా? మీరెందుకు నా మీద కుట్ర పన్నుతున్నారు? నా కొడుకు యెష్షయి కొడుకుతో ఒప్పందం చేసుకున్నాడని మీలో ఎవరూ నాతో చెప్పలేదే. ఈ రోజు జరుగుతున్నట్టు నా కోసం కాపు కాసేలా నా కొడుకు నా సేవకుడు, దావీదును రెచ్చగొట్టినా, నా విషయంలో మీలో ఎవరికీ విచారం లేదు” అన్నాడు. అప్పుడు ఎదోమీయుడు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలబడి “యెష్షయి కొడుకు పారిపోయి నోబులో ఉంటున్న అహీటూబు కొడుకు అహీమెలెకు దగ్గరికి వచ్చినప్పుడు నేను చూశాను. అహీమెలెకు అతని తరపున యెహోవా దగ్గర విచారణ చేసి, ఆహారం, ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గం అతనికి ఇచ్చాడు” అని చెప్పాడు. రాజు, యాజకుడూ అహీటూబు కొడుకు అయిన అహీమెలెకును, నోబులో ఉన్న అతని తండ్రి యింటివారైన యాజకులనందరినీ పిలిపించాడు. వారు రాజు దగ్గరికి వచ్చినప్పుడు, సౌలు “అహీటూబు కొడుకా, విను” అన్నప్పుడు, అతడు “నా యజమానీ, చెప్పండి” అన్నాడు. సౌలు “నువ్వు, యెష్షయి కొడుకు నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారేంటి? నీవు అతనికి భోజనం, కత్తి ఇచ్చి అతనికి సహాయ పడమని దేవుని దగ్గర విన్నపం చేసావు. నేడు జరుగుతూ ఉన్నట్టు అతడు నానుండి దాక్కుని, రేపు నాపై తిరగబడతాడు గదా?” అన్నాడు. అహీమెలెకు “రాజా, నీకు దావీదు కంటే నమ్మకమైనవాడు నీ సేవకులందరిలో ఎవరు ఉన్నారు? పైగా అతడు నీ అల్లుడు. రాజు సైన్యపు బాధ్యతలు నేరవేరుస్తూ నీ నగరంలో పేరుగాంచిన దావీదు వంటి గౌరవనీయుడు ఎవరున్నారు? ఈ సంగతి గూర్చి కొంచెం కూడా నాకు తెలియదు. అతని తరపున నేను దేవుని దగ్గర విచారణ చేయడం ఇప్పుడే మొదలుపెట్టానా? రాజు అలా భావించకూడదు. రాజు తమ దాసుడనైన నా మీదా నా తండ్రి ఇంటి వారందరిమీదా ఈ నేరం మోపకూడదు” అని రాజుకు జవాబిచ్చాడు. రాజు “అహీమెలెకూ, నీకూ, నీ తండ్రి ఇంటివారికందరికీ చావు తప్పదు” అన్నాడు. “వీరు దావీదుతో చేతులు కలిపారు. అతడు పారిపోయిన సంగతి తెలిసినప్పటికీ నాకు చెప్ప లేదు. కాబట్టి యెహోవా యాజకులైన వీరిని వధించండి” అని తన చుట్టూ నిలబడి ఉన్న సైనికులను ఆజ్ఞాపించాడు. సైనికులు యెహోవా యాజకులను చంపడానికి వెనకడుగు వేశారు. రాజు దోయేగును చూసి “నువ్వు ఈ యాజకుల మీద పడి చంపు” అని చెప్పాడు. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు, యాజకుల పై దాడిచేసి ఏఫోదు ధరించుకుని ఉన్న 85 మందిని చంపాడు. ఇంకా యాజకుల పట్టణమైన నోబులొ కాపురం ఉంటున్నవారిని కత్తితో చంపేశాడు. మగవాళ్ళను, ఆడవాళ్ళను, చిన్నపిల్లలను, పసిపిల్లలను, ఎద్దులను, గాడిదలను, అన్నిటినీ కత్తితో చంపేశాడు.

1 సమూయేలు 22:6-19 పవిత్ర బైబిల్ (TERV)

దావీదు, అతని మనుష్యులను గూర్చి తన మనుష్యులకు తెలిసినట్లు సౌలు విన్నాడు. గిబియా వద్ద కొండ మీద ఉన్న ఒక వృక్షం క్రింద సౌలు కూర్చున్నాడు. సౌలు క్రింది అధికారులంతా అతని చుట్టూ నిలబడ్డారు. సౌలు చేతిలో ఒక ఈటె వుంది. సౌలు తన చుట్టూవున్న అధికారులనుద్దేశంచి, “బెన్యామీను మనుష్యులారా వినండి! యెష్షయి కుమారుడు దావీదు మీ అందరికీ భూములు, ద్రాక్షతోటలు ఇస్తాడని మీరనుకుంటున్నారా? మీ అందరినీ దావీదు సహస్ర సైన్యాధిపతులుగా, శత దళాధిపతులుగా చేస్తాడని మీరు అనుకుంటున్నారా? అని అడిగాడు. మీరంతా నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు! మీరు రహస్య పథకాలు వేసారు. నా కుమారుడు యోనాతాను యెష్షయి కుమారునితో ఒడంబడిక చేసుకున్నట్లు మీలో ఎవ్వడూ నాకు చెప్పలేదు! నా గురించి మీలో ఒక్కనికీ శ్రద్ధలేదు! దావీదును నా కుమారుడు యోనాతాను ప్రోత్సహించినట్టు మీలో ఒక్కడూ నాకు చెప్పలేదు. నా సేవకుడు దావీదును దాగుకొనుమని, నన్ను ఎదురుదెబ్బ తీయుమని యోనాతాను చెప్పాడు. దావీదు ఇప్పుడు అదే పని చేస్తున్నాడు” అని అన్నాడు. ఎదోమీయుడగు దోయేగు అక్కడ సౌలు అధికారులతో పాటు నిలబడివున్నాడు. “యెష్షయి కుమారుడైన దావీదు అహీటూబు కుమారుడైన అహీమెలెకును నోబులో చూడటానికి వచ్చినపుడు, అతనిని నేను చూసాను. దావీదు కొరకు అహీమెలెకు ప్రార్థన చేయటం, అహీమెలెకు అతనికి ఆహారం ఇవ్వటం, పైగా ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గాన్ని అహీమెలెకు దావీదుకు ఇవ్వటం నేను చూసాను” అని దోయేగు వివరంగా చెప్పాడు. అది విన్న సౌలు అహీటూబు కుమారుడు, యాజకుడైన అహీమెలెకును, అతని బంధువుల నందరినీ తన దగ్గరకు తీసుకుని రమ్మన్నాడు. అహీమెలెకు బంధువులంతా నోబులో యాజకులు. వారంతా రాజువద్దకు వచ్చారు. “అహీటూబు కుమారుడా, విను” అని సౌలు అహీమెలెకుతో అన్నాడు. “చెప్పండి ప్రభూ,” అన్నాడు అహీమెలెకు. “నీవూ, యెష్షయి కుమారుడైన దావీదూ కలిసి నామీద ఎందుకు రహస్య పథకాలు వేసారు? నీవు దావీదుకు రొట్టె, ఖడ్గం ఇచ్చావు. వాని కోసం నీవు దేవునికి ప్రార్థన చేసావు. ఇప్పుడు దావీదు నన్ను ఎదుర్కోటానికి వేచియున్నాడు.” అన్నాడు అహీమెలెకుతో సౌలు. అహీమెలెకు, “దావీదు నీ పట్ల చాలా విశ్వసంగా ఉన్నాడు. దావీదు అంతటి నమ్మకస్థుడు నీ అధికారులలో మరెవ్వరూ లేరు. దావీదు నీ సొంత అల్లుడు. పైగా నీ అంగరక్షకులందరికీ అతడు అధిపతి. నీ సొంత కుటుంబమంతా దావీదును గౌరవిస్తూ ఉంది. నేను దావీదు కొరకు ప్రార్థన చేయటం అది మొదటి సారికాదు. ఎన్నటికీ కాదు. నన్నుగాని, నా బంధువులనుగాని నిందించవద్దు. మేము నీ సేవకులము. ఇప్పుడు ఏమి జరుగుతూ ఉందనేది నాకేమీ తెలియదు” అని జవాబిచ్చాడు. కానీ రాజు, “అహీమెలెకూ! నీవూ, నీ బంధువులు అంతా చావాల్సిందే!” అన్నాడు. అప్పుడు రాజు తన పక్కనవున్న భటులతో, “వెళ్లి, యెహోవా యాజకులందరినీ చంపండి. వారు దావీదు పక్షంగా ఉన్నారు. దావీదు పారిపోతున్నాడని వారికి తెలుసు. అయినా వారు నాకు ఆ విషయం చెప్పలేదు” అని చెప్పాడు. రాజభటులు యెహోవా యాజకులకు హాని చేసేందుకు నిరాకరించారు. అప్పుడు రాజు దోయేగును పిలిచి, “నీవు వెళ్లి ఆ యాజకులను చంపు” అని ఆజ్ఞాపించాడు. దానితో ఎదోనీయుడైన దోయేగు వెళ్లి యాజకులందరినీ చంపేసాడు. ఆ రోజు ఎనభై అయిదు మంది యాజకులను దోయేగు చంపేసాడు. నోబు యాజకుల యొక్క పట్టణం. నోబు పట్టణంలోని వారందరినీ దోయేగు చంపేసాడు. పురుషులు, స్త్రీలు, పిల్లలు, పసివాళ్లు అందరినీ దోయేగు చంపేసాడు. వారి పశువులు, గాడిదలు, గొర్రెలు అన్నిటినీ దోయేగు చంపేసాడు.

1 సమూయేలు 22:6-19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

దావీదును అతని జనులును ఫలానిచోట ఉన్నారని సౌలునకు వర్తమానమాయెను. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచులవృక్షముక్రింద దిగి యీటె చేతపట్టుకొని యుండెను. అతని సేవకులు అతనిచుట్టు నిలిచియుండగా సౌలు తనచుట్టు నిలిచియున్న సేవకులతో ఇట్లనెను – బెన్యామీనీయులారా ఆలకించుడి. యెష్షయి కుమారుడు మీకు పొలములను ద్రాక్షతోటలను ఇచ్చునా? మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయునా? మీరెందుకు నామీద కుట్రచేయుచున్నారు? నా కుమారుడు యెష్షయి కుమారునితో నిబంధనచేసిన సంగతి మీలో ఎవడును నాకు తెలియ జేయలేదే. నేడు జరుగునట్లు నా కొరకు పొంచి యుండునట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొలిపి నను నా నిమిత్తము మీలో ఎవనికిని చింతలేదే. అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి యుండి–యెష్షయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకురాగా నేను చూచితిని. అహీమెలెకు అతని పక్షముగా యెహోవాయొద్ద విచారణచేసి, ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతని కిచ్చెనని చెప్పగా రాజు యాజకుడును అహీటూబు కుమారుడునగు అహీమెలెకును నోబులోనున్న అతని తండ్రి యింటివారైన యాజకులనందరిని పిలువనంపించెను. వారు రాజునొద్దకు రాగా సౌలు–అహీటూబు కుమారుడా, ఆలకించుమనగా అతడు–చిత్తము నా యేలినవాడా అనెను. సౌలు–నీవు యెష్షయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవునియొద్ద విచారణచేసి, అతడు నామీదికి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచి యుండుటకై అతడును నీవును జతకూడితిరేమని యడుగగా అహీమెలెకు–రాజా, రాజునకు అల్లుడై నమ్మకస్థుడై, ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనతవహించిన దావీదువంటివాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతని పక్షముగా నేను దేవునియొద్ద విచారణచేయుట నేడే ఆరంభించితినా? అది నాకు దూరమగునుగాక; రాజు తమ దాసుడనైన నామీదను నా తండ్రి ఇంటి వారందరిమీదను ఈ నేరము మోపకుండును గాక. ఈ సంగతినిగూర్చి కొద్ది గొప్ప యేమియు నీ దాసుడనైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవిచేయగా రాజు–అహీమెలెకూ, నీకును నీ తండ్రి ఇంటివారికందరికిని మరణము నిశ్చయము అని చెప్పి యెహోవా యాజకులగు వీరు దావీదుతో కలిసినందునను, అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయక పోయినందునను మీరు వారిమీదపడి చంపుడని తనచుట్టు నిలిచియున్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లక యుండగా రాజు దోయేగుతో–నీవు ఈ యాజకులమీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకులమీదపడి ఏఫోదు ధరించుకొనినయెనుబది యయిదుగురిని ఆ దినమున హతముచేసెను. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్థులను కత్తివాత హతము చేసెను; మగ వారినేమి ఆడువారినేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెడ్లనేమి గార్దభములనేమి గొఱ్ఱెలనేమి అన్నిటిని కత్తివాత హతముచేసెను.