1 సమూయేలు 19:1-6

1 సమూయేలు 19:1-6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

సౌలు దావీదును చంపమని తన కుమారుడైన యోనాతానుతో తన సేవకులందరితో చెప్పాడు. అయితే యోనాతానుకు దావీదు అంటే ఎంతో ఇష్టము. కాబట్టి యోనాతాను దావీదును హెచ్చరిస్తూ, “నా తండ్రియైన సౌలు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నీవు ఉదయానే జాగ్రత్తపడి రహస్య స్ధలంలో దాక్కొని ఉండు. నేను బయటకు వెళ్లి నీవు ఉన్న పొలంలో మా నాన్నతో పాటు నిలబడి అతనితో నీ గురించి మాట్లాడిన తర్వాత నేను తెలుసుకున్న వాటిని నీకు చెప్తాను” అని అన్నాడు. యోనాతాను తన తండ్రియైన సౌలుతో దావీదు గురించి మంచిగా మాట్లాడి, “నీ సేవకుడైన దావీదు నీ పట్ల ఏ తప్పు చేయలేదు గాని ఎంతో మేలు చేశాడు. కాబట్టి రాజా, నీవు అతనికి ఏ హాని చేయవద్దు. అతడు తన ప్రాణాలకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపినప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులందరికి గొప్ప విజయాన్ని ఇచ్చారు; అది చూసి నీవు కూడా సంతోషించావు. అకారణంగా దావీదువంటి నిరపరాధిని చంపిన పాపం నీకెందుకు?” అని అన్నాడు. సౌలు యోనాతాను మాటలు విని, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, అతనికి మరణశిక్ష విధించను” అని చెప్పాడు.

1 సమూయేలు 19:1-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మీరు దావీదును చంపేయాలని సౌలు తన కొడుకు యోనాతానుతో, సేవకులందరితో చెప్పాడు. అయితే, సౌలు కొడుకు యోనాతానుకు దావీదు అంటే ఎంతో ఇష్టం. కాబట్టి యోనాతాను, దావీదుతో ఇలా అన్నాడు “నా తండ్రి సౌలు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఉదయాన్నే జాగ్రత్తపడి రహస్య స్థలం లో దాక్కో. నేను నా తండ్రి దగ్గర నిలబడి నిన్ను గూర్చిన సమాచారం ఏదైనా తెలిసినప్పుడు పొలంలోకి వచ్చి నీకు తెలియచేస్తాను” అన్నాడు. యోనాతాను తన తండ్రి సౌలుతో దావీదును గూర్చి సానుభూతిగా మాట్లాడి “నీ సేవకుడైన దావీదు నీపట్ల ఎలాంటి తప్పూ చేయలేదు, పైగా ఎంతో మేలు చేశాడు. కాబట్టి రాజా, నువ్వు అతనికి ఎలాంటి కీడూ తలపెట్టవద్దు. అతడు తన ప్రాణానికి తెగించి ఆ ఫిలిష్తీయుని చంపినప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులకందరికీ గొప్ప విజయం కలుగజేశాడు. అది నీకు కూడా సంతోషం కలిగించింది కదా, కారణం లేకుండా దావీదును చంపి నిరపరాధి ప్రాణం తీసిన పాపం నీకు ఎందుకు?” అని చెప్పినప్పుడు, సౌలు యోనాతాను చెప్పింది విని “యెహోవా మీద ఒట్టు, అతనికి మరణ శిక్ష విధించను” అని ప్రమాణం చేశాడు.

1 సమూయేలు 19:1-6 పవిత్ర బైబిల్ (TERV)

దావీదును చంపి వేయుమని సౌలు తన కుమారుడైన యోనాతానుకు, మిగిలిన అధికారులకు చెప్పాడు. కానీ యోనాతాను దావీదును చాలా ప్రేమించాడు. యోనాతాను దావీదును హెచ్చరించాడు. “జాగ్రత్తగా ఉండు. సౌలు నిన్ను చంపాలని అవకాశం కోసం చూస్తున్నాడు. ఉదయం పొలానికి వెళ్లి అక్కడ దాగి వుండు. నేను నా తండ్రితో ఆ పొలానికి వస్తాను. నీవు దాగియున్న పొలాల వద్ద మేము నిలబడతాము. నీ విషయంలో నా తండ్రితో నేను మాట్లాడతాను. తరువాత నేను తెలుసుకున్నదంతా నీకు చెబ తాను” అని యోనాతాను దావీదుతో చెప్పాడు. యోనాతాను తన తండ్రి సౌలుతో మాట్లాడుతూ దావీదు గుణగణాలను కొనియాడాడు. “నీవు రాజువు. దావీదు నీ సేవకుడు. దావీదు నీకు ఏమీ కీడు చేయలేదు. కనుక అతనికి ఏమీ కీడు చేయకు. దావీదు ఎల్లప్పుడూ నీ ఎడల మేలునే చేసాడు. దావీదు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఫిలిష్తీయుడైన గొల్యాతును చంపాడు. దాని ద్వారా యెహోవా ఇశ్రాయేలు అంతటికీ ఘనవిజయం సమకూర్చి పెట్టాడు. అదంతా నీవు చూశావు, ఆనందించావు. పైగా అటువంటి దావీదుకు నీవు ఎందుకు కీడు తలస్తున్నావు? అతడు అమాయకుడు. అతనిని చంపటానికి తగిన కారణమే లేదు” అని అన్నాడు. యోనాతాను చెప్పినదంతా విని సౌలు ఒక ప్రమాణం చేసాడు. “యెహోవా సజీవంగా ఉన్నాడు అన్నంత నిజంగా, దావీదు చంపబడడు” అని చెప్పాడు సౌలు.

1 సమూయేలు 19:1-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అంతట సౌలు–మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోను తన సేవకులందరితోను చెప్పగా సౌలు కుమారుడైన యోనాతాను దావీదుయందు బహు ఇష్టముగలవాడైయుండి దావీదుతో ఇట్లనెను–నా తండ్రియైన సౌలు నిన్ను చంపవలెనన్న ప్రయత్నముమీదనున్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగియుండుము. నేను వచ్చి నీవు ఉన్న చేనిలో నా తండ్రియొద్ద నిలిచి నిన్నుగూర్చి అతనితో మాటలాడిన తరువాత నిన్నుగూర్చి నాకేమైన తెలిసినయెడల దానిని నీతో తెలియజెప్పుదుననెను. యోనాతాను తన తండ్రియైన సౌలుతో దావీదునుగూర్చిదయగా మాటలాడి–నీ సేవకుడైన దావీదు నీ విషయములో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహు మేలుచేసెను గనుక, రాజా నీవు అతని విషయములో ఏ పాపము చేయకుందువుగాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులకందరికి గొప్ప రక్షణ కలుగజేసెను; అది నీవే చూచి సంతోషించితివి గదా; నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధియొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదువని మనవిచేయగా సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి–యెహోవా జీవముతోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణముచేసెను.