1 సమూయేలు 16:1-23
1 సమూయేలు 16:1-23 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా సమూయేలుతో, “ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను తిరస్కరించిన సౌలు గురించి నీవెంత కాలం దుఃఖపడతావు? నీ కొమ్మును నూనెతో నింపి నీవు బయలుదేరు; బేత్లెహేమీయుడైన యెష్షయి దగ్గరకు నేను నిన్ను పంపిస్తున్నాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా ఏర్పరచుకున్నాను” అన్నారు. అయితే సమూయేలు, “నేను ఎలా వెళ్లను? నేను వెళ్లిన సంగతి సౌలు వింటే అతడు నన్ను చంపేస్తాడు” అన్నాడు. అందుకు యెహోవా, “నీతో పాటు ఒక లేగదూడను తీసుకెళ్లి, ‘యెహోవాకు బలివ్వడానికి వచ్చాను’ అని చెప్పు. ఆ బలికి యెష్షయిని రమ్మను, అప్పుడు నీవు ఏం చేయాలో నేను నీకు చెప్తాను. నేను సూచించే వాన్ని నీవు అభిషేకించాలి” అని చెప్పారు. యెహోవా చెప్పిన ప్రకారం సమూయేలు చేశాడు. అతడు బేత్లెహేముకు చేరుకున్నప్పుడు, ఆ పట్టణ పెద్దలు అతడు రావడం చూసి భయపడి, “సమాధానంగా వస్తున్నావా?” అని అడిగారు. అందుకు సమూయేలు, “అవును, సమాధానంగానే వచ్చాను, యెహోవాకు బలి అర్పించడానికి వచ్చాను. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని నాతోకూడ బలి ఇవ్వడానికి రండి” అని చెప్పి, యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలివ్వడానికి వారిని పిలిచాడు. వారు వచ్చినప్పుడు సమూయేలు ఏలీయాబును చూసి, “ఖచ్చితంగా యెహోవా అభిషేకించినవాడు యెహోవా ఎదుట నిలబడ్డాడు” అనుకున్నాడు. అయితే యెహోవా సమూయేలుతో, “అతని రూపాన్ని ఎత్తును చూసి అలా అనుకోవద్దు, నేను అతన్ని తిరస్కరించాను. మనుష్యులు చూసే వాటిని యెహోవా చూడరు. మనుష్యులు పైరూపాన్ని చూస్తారు కాని యెహోవా హదృయాన్ని చూస్తారు” అన్నారు. యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుట నిలబెట్టాడు కాని సమూయేలు, “యెహోవా ఇతన్ని ఎంచుకోలేదు” అన్నాడు. అప్పుడు యెష్షయి షమ్మాను పిలిచాడు కాని సమూయేలు, “ఇతన్ని కూడా యెహోవా ఎంచుకోలేదు” అన్నాడు. అలా యెష్షయి తన ఏడుగురు కుమారులను సమూయేలు ఎదుట నిలబెట్టాడు కాని సమూయేలు, “యెహోవా వీరెవరిని ఎంచుకోలేదు” అని చెప్పి, నీ కుమారులంతా వీరేనా? అని యెష్షయిని అడిగాడు. అందుకు యెష్షయి, ఇంకా చివరివాడున్నాడు. అయితే వాడు గొర్రెలు కాస్తున్నాడని చెప్పాడు. అందుకు సమూయేలు, “అతన్ని పిలిపించు; అతడు వచ్చేవరకు మనం భోజనం చేయము” అన్నాడు. కాబట్టి యెష్షయి అతన్ని పిలిపించి లోపలికి తీసుకువచ్చాడు. అతడు ఎర్రగా అందమైన కళ్లతో మంచి రూపంతో ఉన్నాడు. అప్పుడు యెహోవా, “నేను ఎన్నుకున్నది ఇతన్నే, నీవు లేచి అతన్ని అభిషేకించు” అన్నారు. కాబట్టి సమూయేలు నూనె కొమ్మును తీసుకుని అతని సోదరుల ఎదుట అతన్ని అభిషేకించాడు. ఆ రోజు నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చేది. ఆ తర్వాత సమూయేలు రామాకు వెళ్లిపోయాడు. యెహోవా ఆత్మ సౌలును విడిచివెళ్లి, యెహోవా దగ్గర నుండి వచ్చిన దురాత్మ అతన్ని బాధించింది. అప్పుడు సౌలు సేవకులు, “యెహోవా దగ్గర నుండి వచ్చిన దురాత్మ నిన్ను బాధిస్తుంది. మా ప్రభువైన నీవు నీ సేవకులకు ఆజ్ఞ ఇస్తే సితారా చక్కగా వాయించగల ఒకనిని వెదికి తీసుకువస్తాము. దేవుని దగ్గర నుండి వచ్చిన దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్ల అతడు సితారా వాయించడం వలన నీకు బాగవుతుంది” అన్నారు. కాబట్టి సౌలు తన సేవకులతో, “బాగా వాయించే వానిని వెదికి నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పాడు. అప్పుడు సౌలు సేవకులలో ఒకడు, “బేత్లెహేమీయుడైన యెష్షయి కుమారులలో ఒకనిని చూశాను. అతడు వీణ వాయిస్తాడు. అతడు ధైర్యవంతుడు యుద్ధవీరుడు వివేకం గలవాడు, అందగాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు” అని చెప్పాడు. సౌలు యెష్షయి దగ్గరకు దూతలను పంపి, “గొర్రెల దగ్గర ఉన్న నీ కుమారుడైన దావీదును నా దగ్గరకు పంపు” అని కబురు పంపాడు. అప్పుడు యెష్షయి ఒక గాడిద మీద రొట్టెలు ద్రాక్షరసపు తిత్తిని ఒక మేకపిల్లను ఉంచి వాటిని తన కుమారుడైన దావీదుతో పాటు సౌలు దగ్గరకు పంపించాడు. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలబడగా సౌలు అతన్ని చాలా ఇష్టపడ్డాడు. దావీదు సౌలు ఆయుధాలను మోసేవారిలో ఒకనిగా నియమించబడ్డాడు. తర్వాత సౌలు, “దావీదు అంటే నాకు ఇష్టం ఏర్పడింది కాబట్టి అతడు నా దగ్గర ఉండి సేవ చేయడానికి ఒప్పుకో” అని యెష్షయికి కబురు పంపాడు. దేవుని దగ్గర నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చినప్పుడెల్లా దావీదు సితారా పట్టుకుని వాయించేవాడు, అప్పుడు దురాత్మ సౌలును విడిచివెళ్లి అతనికి నెమ్మది కలిగేది.
1 సమూయేలు 16:1-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా సమూయేలుతో ఇలా చెప్పాడు “ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను తిరస్కరించిన సౌలును గూర్చి నువ్వు ఎంతకాలం దుఃఖిస్తావు? నీ కొమ్మును నూనెతో నింపు, బేత్లెహేముకు చెందిన యెష్షయి దగ్గరకి నిన్ను పంపిస్తున్నాను. అతని కొడుకుల్లో ఒకడిని నేను రాజుగా ఎంపిక చేశాను.” అందుకు సమూయేలు “నేనెలా వెళ్ళగలను? నేను వెళ్లిన సంగతి సౌలుకు తెలిస్తే అతడు నన్ను చంపేస్తాడు” అన్నాడు. యెహోవా “నువ్వు ఒక లేగ దూడను తీసుకువెళ్ళి యెహోవాకు బలి అర్పించడానికి వచ్చానని చెప్పి, యెష్షయిని బలి అర్పణ చేసే చోటికి పిలిపించు. అప్పుడు నువ్వు ఏమి చేయాలో నీకు చెబుతాను. ఎవరి పేరు నేను నీకు సూచిస్తానో అతణ్ణి నువ్వు అభిషేకించాలి” అని చెప్పాడు. సమూయేలు యెహోవా సెలవిచ్చినట్టు బేత్లెహేముకు బయలుదేరాడు. ఆ ఊరి పెద్దలు అతడు రావడం చూసి భయపడి “నువ్వు శాంతంగానే వస్తున్నావా?” అని అడిగినప్పుడు, అతడు “శాంతంగానే వచ్చాను. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని నాతో కలసి బలికి రండి” అని చెప్పి యెష్షయిని, అతని కొడుకులను శుద్ధి చేసి బలి అర్పించాడు. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూసి “నిజంగా యెహోవా అభిషేకించేవాడు ఆయన ఎదురుగా నిలబడి ఉన్నాడు” అని అనుకున్నాడు. అయితే యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు. “అతడి అందాన్నీ ఎత్తునూ చూడవద్దు. మనుషులు లక్ష్యపెట్టే వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతణ్ణి నిరాకరించాను. మనుషులు పైరూపాన్ని చూస్తారు గానీ యెహోవా అయితే హృదయాన్ని చూస్తాడు.” యెష్షయి అబీనాదాబును పిలిచి అతణ్ణి సమూయేలు ముందు నిలబెట్టగా, అతడు “యెహోవా ఇతణ్ణి ఎన్నుకోలేదు” అన్నాడు. అప్పుడు యెష్షయి షమ్మాను పిలిచి నిలబెట్టినప్పుడు సమూయేలు “యెహోవా ఇతణ్ణి ఎన్నుకోలేదు” అన్నాడు. యెష్షయి తన ఏడుగురు కొడుకులనూ సమూయేలు ముందుకి రప్పించాడు. సమూయేలు “యెహోవా వీరిలో ఎవరినీ ఎన్నుకోలేదు” అని చెప్పి, “నీ కొడుకులందరూ ఇక్కడే ఉన్నారా?” అని యెష్షయిని అడిగాడు. అతడు “ఇంకా చివరివాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను మేపడానికి వెళ్ళాడు” అని చెప్పాడు. అందుకు సమూయేలు “నువ్వు అతనికి కబురు పంపి ఇక్కడికి రప్పించు. అతడు వచ్చేదాకా మనం కూర్చోలేం కదా” అని యెష్షయితో చెప్పాడు. యెష్షయి అతణ్ణి పిలిపించి లోపలికి తీసుకువచ్చాడు. అతడు రూపంలో ఎర్రని వాడు, చక్కని కళ్ళు కలిగి చూపులకు అందమైనవాడు. అతడు రాగానే “నేను కోరుకొన్నది ఇతడే, నీవు లేచి అతణ్ణి అభిషేకించు” అని యెహోవా చెప్పగానే, సమూయేలు నూనె కొమ్మును తీసి అతని తలపై నూనె పోసి అతని అన్నల ముందు అతణ్ణి అభిషేకించాడు. ఆ రోజు నుండి యెహోవా ఆత్మ దావీదును తీవ్రంగా ఆవహించాడు. తరువాత సమూయేలు లేచి రమాకు వెళ్లిపోయాడు. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయిన తరువాత యెహోవా దగ్గర నుండి ఒక దురాత్మ అతణ్ణి భయపెట్టి, వేధించడం మొదలుపెట్టింది, సౌలు సేవకులు “దేవుని దగ్గర నుండి వచ్చిన దురాత్మ నిన్ను భయపెడుతున్నది. నీ సేవకులమైన మాతో చెప్పు, దేవుని దగ్గర నుండి దురాత్మ నిన్ను వేధిస్తూ ఉన్నప్పుడు దాని నుండి ఉపశమనం పొందడానికి తంతివాద్యం చక్కగా వాయించగల ఒకణ్ణి వెదుకుతాం. దురాత్మ వచ్చి నిన్ను వేధించినప్పుడల్లా అతడు తంతివాద్యం వాయించడం వల్ల నువ్వు బాగుపడతావు” అని సౌలుతో అన్నారు. అప్పుడు సౌలు “బాగా వాయించగల ఒకణ్ణి వెతికి నా దగ్గరికి తీసికురండి” అని వారితో చెప్పాడు. వారిలో ఒకడు “బేత్లెహేము వాడైన యెష్షయి కొడుకుల్లో ఒకణ్ణి చూశాను, అతడు చక్కగా వాయించగలడు, అతడు ధైర్యవంతుడు, యుద్ధవీరుడు, మాటకారి, అందగాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కూడా” అని చెప్పాడు. సౌలు యెష్షయి దగ్గరకి తన సేవకులను పంపి “గొర్రెలు కాస్తున్న నీ కొడుకు దావీదును నా దగ్గరకి పంపించు” అని కబురు చేశాడు. అప్పుడు యెష్షయి ఒక గాడిదపై రొట్టెలు, ద్రాక్షారసపు తిత్తి, ఒక మేకపిల్లను ఉంచి దావీదు ద్వారా సౌలుకు పంపించాడు. దావీదు సౌలు దగ్గరకి వచ్చి అతని ముందు నిలబడినపుడు అతడు సౌలుకు బాగా నచ్చాడు. అతణ్ణి సౌలు ఆయుధాలు మోసే పనిలో పెట్టారు. అప్పుడు సౌలు “దావీదు నాకు బాగా నచ్చాడు కాబట్టి అతణ్ణి నా సముఖంలో నిలిచి ఉండడానికి ఒప్పుకో” అని యెష్షయికి కబురు పంపాడు. దేవుని నుండి దురాత్మ వచ్చి సౌలును వేధించినప్పుడల్లా దావీదు తంతి వాద్యం వాయించేవాడు. అప్పుడు దురాత్మ అతణ్ణి విడిచిపోయేది. అతడు కోలుకుని నెమ్మది పొందేవాడు.
1 సమూయేలు 16:1-23 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా, “ఎంతకాలం ఇలా సౌలుకోసం చింతిస్తావు? ఇశ్రాయేలు రాజుగా సౌలును నేను నిరాకరించాను. నీ కొమ్ములనునూనెతో నింపుకొని వెళ్లు. యెష్షయి అనే మనిషి దగ్గరకు నేను నిన్ను పంపిస్తున్నాను. యెష్షయి బేత్లెహేములో నివసిస్తున్నాడు. అతని కుమారులలో ఒకనిని నేను రాజుగా ఎంపిక చేసాను” అని సమూయేలుతో చెప్పాడు. కానీ, “నేను వెళితే ఈ వార్త సౌలు విని నన్ను చంపటానికి ప్రయత్నం చేస్తాడు” అని సమూయేలు అన్నాడు. “నీవు ఒక కోడెదూడను తీసుకుని బెత్లెహేముకు వెళ్లు. ‘యెహోవాకు నేను ఒక బలి అర్పించటానికి వచ్చాను’ అని చెప్పు. బలి కార్యక్రమానికి యెష్షయిని రమ్మని ఆహ్వానించు. అప్పుడు ఏమి చేయాలో నేను నీకు తెలియచేస్తాను. నేను నీకు చూపిన మనిషిని నీవు తప్పక అభిషేకించాలి” అని యెహోవా చెప్పాడు. యెహోవా చెప్పినట్లు సమూయేలు చేసాడు. సమూయేలు బెత్లెహేముకు వెళ్లాడు. బెత్లెహేము పెద్దలు భయంతో వణకిపోయారు. వారు సమూయేలును కలుసుకొని, “నీవు సమాధానంగానే వచ్చావా?” అని అడిగారు. “అవును నేను సమాధానంగానే వచ్చాను. యెహోవాకు ఒక బలి అర్పించటానికి నేను వచ్చాను. మీరంతా తయారై బలి కార్యక్రమానికి నాతోకూడ రావటానికి సిద్ధపడండి” అని సమూయేలు జవాబు చెప్పాడు. సమూయేలు యెష్షయిని, అతని కుమారులను సిద్ధంచేశాడు. బలి అర్పణలో పాలుపుచ్చుకోమని సమూయేలు వారిని ఆహ్వానించాడు. యెష్షయి, అతని కుమారులు వచ్చినపుడు సమూయేలు ఏలీయాబును చూసాడు. “నిజంగా యెహోవా ఎంపిక చేసిన మనిషి ఇతడే” అని సమూయేలు తలంచాడు. అయితే యెహోవా, “ఏలీయాబు ఎంతో అందంగా ఎత్తుగా ఉన్నాడు. కానీ ఆ విషయాలు లక్ష్యపెట్టకు. మనుష్యులు చూసే విషయాలను కాదు దేవుడు చూసేదు. ప్రజలు బాహ్య సౌందర్యం చూస్తారు కానీ యెహోవా హృదయం చూస్తాడు. ఏలీయాబు తగిన వాడు కాడు” అని తెలియజేసాడు. అప్పుడు యెష్షయి తన కుమారుడైన అబీనాదాబును పిలిచాడు. అబీనాదాబు సమూయేలు ఎదుటనడిచాడు. కానీ సమూయేలు, “లేదు యెహోవా ఎంపిక చేసినవాడు ఇతడు కాదు” అన్నాడు. తరువాత షమ్మాను సమూయేలు ఎదుట నడువుమని యెష్షయి చెప్పాడు. కానీ సమూయేలు, “లేదు, ఇతనినికూడ యెహోవా ఎంపిక చేయలేదు” అన్నాడు. తన కుమారులు ఏడుగురిని యెష్షయి సమూయేలుకు చూపించాడు. కానీ, “వీరిలో ఎవ్వరినీ యెహోవా ఎంపిక చేయలేదని” సమూయేలు యెష్షయితో చెప్పాడు. అప్పుడు, “నీ కుమారులంతా వీరేనా?” అని సమూయేలు యెష్షయిని అడిగాడు. “అందరికంటె చిన్నవాడు ఇంకొకడు ఉన్నాడు. కానీ వాడు గొర్రెలను మేపుతున్నాడు” అని యెష్షయి జవాబిచ్చాడు. సమూయేలు, “అతనికి కబురు చేయి. అతన్ని ఇక్కడకు తీసుకునిరా. అతడొచ్చేవరకూ మనం భోజనానికి కూర్చోము” అని చెప్పాడు. యెష్షయి తన చిన్న కుమారుని తీసుకుని వచ్చేందుకు ఒకరిని పంపించాడు. ఈ కుమారుడు ఎర్రని తల వెంట్రుకలతో చక్కగా కనబడేవాడు. అతడు ఎర్రటివాడు మరియు చాలా అందగాడు. “లేచి అతనిని అభిషేకించు. అతడే సుమా!” అని యెహోవా సమూయేలుతో చెప్పాడు. ప్రత్యేక నూనెతో ఉన్న కొమ్మును సమూయేలు తీసుకుని యెష్షయి చిన్న కుమారుని సోదరులందరి ఎదుటనే అతని మీద పోసాడు. ఆ రోజునుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి మహా శక్తివంతంగా వచ్చింది. తరువాత సమూయేలు రామాకు వెళ్లి పోయాడు. యెహోవా ఆత్మ సౌలును విడిచి పెట్టేసాడు. యెహోవా సౌలు మీదికి ఒక దుష్టాత్మను పంపించాడు. అది అతనికి చాలా ఇబ్బంది కలిగించింది. సౌలు సేవకులు అతనితో ఇలా అన్నారు: “దేవుని వద్దనుండి వచ్చిన ఒక దుష్ట ఆత్మ వచ్చి నిన్ను బాధ పెడుతోంది. మాకు ఆజ్ఞ ఇవ్వుము. సితారాను వాయించగలవాని కోసం వెదుకుతాము. యెహోవా దగ్గరనుండి ఆ దుష్ట శక్తి నీ మీదికి వస్తే ఇతడు సితారా వాయిస్తాడు. అప్పుడు ఆ దుష్ట ఆత్మ నిన్ను విడిచిపెట్టేస్తుంది. నీకు ఊరట కలుగుతుంది.” “ఒక మంచి సితార వాయించువానిని చూసి నా దగ్గరకు తీసుకుని రండి” అని సౌలు తన సేవకులతో చెప్పాడు. అప్పుడు నౌకర్లలో ఒకడు, “బేత్లెహేములో యెష్షయి అని ఒక మనిషి ఉన్నాడు. యెష్షయి కొడుకును నేను చూసాను. సితార వాయించటం అతనికివచ్చు. అతడు ధైర్యవంతుడు. బాగా పోరాడగలవాడు. కూడా. అతడు చాతుర్యంగలవాడు. అతడు అందగాడు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు” అని చెప్పాడు. కనుక సౌలు కొందరు మనుష్యులను యెష్షయి దగ్గరకు పంపించాడు. “నీకు దావీదు అనే కొడుకు ఉన్నాడు. అతడు గొర్రెలను కాస్తున్నాడు. అతనిని నా దగ్గరకు పంపించు” అని సౌలు చెప్పినదానిని వారు యెష్షయికి చెప్పారు. కనుక యెష్షయి సౌలుకు కానుకలుగా కొన్ని వస్తువులు సిద్ధం చేసాడు. ఒక గాడిదను, కొంత రొట్టె, ఒక ద్రాక్షారసపు తిత్తి, ఒక మెక పిల్లను యెష్షయి సిద్ధం చేసాడు. యెష్షయి వాటిని దావీదుకు ఇచ్చి అతనిని సౌలు వద్దకు పంపించాడు. కనుక దావీదు సౌలు దగ్గరకు వెళ్లి అతని ఎదుట నిలిచాడు. సౌలు దావీదును చాలా ప్రేమించాడు. దావీదు సౌలుకు ఆయుధాలు మోసే సహాయకుడయ్యాడు. “దావీదును నాతో ఉండనియ్యి. నా సేవ చేయనియ్యి. అతడంటే నాకు చాలా ఇష్టం” అని యెష్షయికి ఒక సందేశం పంపాడు సౌలు. దేవుడు పంపిన దురాత్మ సౌలు మీదికి వచ్చినపుడు దావీదు తన సితార తీసుకుని వాయించేవాడు. ఆ దుష్ట ఆత్మ సౌలును వదిలిపోయేది, అతనికి హాయిగా ఉండేది.
1 సమూయేలు 16:1-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను – ఇశ్రాయేలీయులమీద రాజుగా ఉండకుండ నేను విసర్జించిన సౌలునుగూర్చి నీ వెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బేత్లెహేమీయుడైన యెష్షయియొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. సమూయేలు–నేనెట్లు వెళ్లుదును? నేను వెళ్లిన సంగతి సౌలు వినినయెడల అతడు నన్ను చంపుననగా యెహోవా –నీవు ఒక పెయ్యను తీసికొనిపోయి యెహోవాకు బలిపశువును వధించుటకై వచ్చితినని చెప్పి యెష్షయిని బల్యర్పణమునకు పిలువుము; అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును; ఎవనిపేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలెనని సెలవియ్యగా సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవుచొప్పున బేత్లెహేమునకు వెళ్లెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి–సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు–సమాధానముగానే వచ్చితిని; మీరు శుద్ధులై నాతోకూడ బలికి రండని చెప్పి, యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి–నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన యెదుట నిలిచియున్నాడని అనుకొనెను అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను–అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసి యున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడు–యెహోవా ఇతని కోరుకొన లేదనెను. అప్పుడు యెష్షయి షమ్మాను పిలువగా అతడు –యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. యెష్షయి తన యేడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు–యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరు ఇక్కడనున్నారా అని యెష్షయిని అడుగగా అతడు–ఇంకను కడసారివాడున్నాడు. అయితే వాడు గొఱ్ఱెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు–నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చువరకు మనము కూర్చుందమని యెష్షయితో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొనివచ్చెను. అతడు ఎఱ్ఱనివాడును చక్కని నేత్రములుగలవాడును చూచుటకు సుందరమైనవాడునై యుండెను. అతడు రాగానే–నేను కోరుకొన్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవియ్యగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల యెదుట వానికి అభిషేకము చేసెను. నాటనుండి యెహోవా ఆత్మ దావీదుమీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్లిపోయెను. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్దనుండి దురాత్మయొకటి వచ్చి అతని వెరపింపగా సౌలు సేవకులు–దేవునియొద్దనుండి వచ్చిన దురాత్మయొకటి నిన్ను వెరపించియున్నది; మా యేలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా నున్నాము. సితారా చమత్కారముగా వాయింపగల యొకని విచారించుటకై మాకు సెలవిమ్ము దేవుని యొద్దనుండి దురాత్మ వచ్చి నిన్ను పెట్టినప్పుడెల్ల అతడు సితారా చేతపట్టుకొని వాయించుటచేత నీవు బాగుపడుదువని అతనితో ననిరి సౌలు–బాగుగా వాయింపగల యొకని విచారించి నా యొద్దకు తీసికొని రండని తన సేవకులకు సెలవియ్యగా వారిలో ఒకడు –చిత్తగించుము, బేత్లెహేమీయుడైన యెష్షయియొక్క కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహు శూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసియునై యున్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా నున్నాడనగా సౌలు–యెష్షయియొద్దకు దూతలను పంపి, గొఱ్ఱెలయొద్దనున్న నీ కుమారుడైన దావీదును నాయొద్దకు పంపుమనెను. అప్పుడు యెష్షయి ఒక గార్దభముమీద రొట్టెలను ద్రాక్షారసపు తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదుచేత సౌలునొద్దకు పంపెను. దావీదు సౌలు దగ్గరకువచ్చి అతనియెదుట నిలువబడగా అతనియందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను, అతడు సౌలు ఆయుధములను మోయువాడాయెను. అంతట సౌలు–దావీదు నా అనుగ్రహము పొందెను గనుక అతడు నా సముఖమందు సేవచేయుటకు ఒప్పుకొనుమని యెష్ష యికి వర్తమానము పంపెను. దేవునియొద్దనుండి దురాత్మ వచ్చి సౌలును పెట్టినప్పుడెల్ల దావీదు సితారా చేతపట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను, అతడు సేదదీరి బాగాయెను.